అంతా మన ఖర్మ!
ఇది కర్మో, ఖర్మో గానీ మొత్తానికి ఇది మన జాతిని వేల ఏళ్ళ నుండి పీల్చి పిప్పి చేస్తున్నది. ఇది వినబడని రోజు వుండదంటే అతిశయోక్తి గాదేమొ!
పండితులనుండీ పామరుల దాకా ఈ కర్మ సిద్దాంతాన్ని మరో ప్రశ్నకు తావులేకుండా నమ్మేస్తున్నారు. అసలు పూర్వజన్మ అనేది వుందా, కర్మ పలితాలు ఒక జన్మనుండి మరో జన్మకి అతుక్కొనివస్తాయా అన్నదాన్ని ఎవరి కర్మకు దాన్ని వదిలేస్తే, అసలు ఈ సిద్దాంతం మన జీవితాలని ఈ జన్మలో మాత్రం నరకప్రాయం చేసేస్తోంది.
ఒకడు ఆకలితో చనిపోయాడనుకుందాం. అది చనిపోయిన వాడి కర్మే గానీ, వాడికి పట్టెడన్నం పెట్టలేని సమాజానిదిగానీ, రాజ్యానిదిగానీ తప్పేం లేదు.
ఒక వీధిలో ఒక బీదవాడు, ఒక సంపన్నుడూ వుంటే, బీదవాడి మీద జాలి అవసరమే లేదు. అది వాడి పూర్వజన్మ కర్మ ఫలితం. వాడెన్నెన్ని పాపాలు చేసుంటే ఇప్పుడిలా కష్టాలు పడతాడు? కాబట్టి అసహ్యంచుకోండి. అదే పక్కనున్న సంపన్నున్ని చూడండి. వాడి పూర్వజన్మ పుణ్యఫలమే కదా ఈ భోగభాగ్యాలు. ఇంకేం వాడిని నెత్తికెత్తుకోండి.
ఒక క్షయరోగి ఎదురొస్తే అయ్యో పాపం అనకండి. ఎన్ని పాపాలు చేస్తే ఈ జన్మకి ఈ శిక్ష అని మనసులో అనుకొని వీలయితే వాడి మొహాన వుమ్మేయండి.
ఎవరికున్న కష్టానికి వారి కర్మే కారణం. మరిక పాలకున్ని ప్రశ్నించడం మూర్ఖత్వం. రోడ్డు ప్రమాదాల్లో వేల మంది చనిపోతున్నారా, అది చనిపోయిన వారి కర్మ! వాళ్ళకి అంతే రాసిపెట్టివుంది.
ఆయిదేళ్ళలో ఓ డిల్లీ ప్రభుత్వాసుపత్రిలో చనిపోయిన పిల్లల సంఖ్య పది వేలట! బహుశా ఈ పిల్లలది భీష్ముని ముందటి సోదరులు వసువుల కథ అయ్యుంటుంది. వారికి ఏదో అలా భూమ్మీదపడి ఇలా దేవున్ని చేరుకొనే వరమేదో వుండివుంటుంది. వారి చావుకు, అల్పాయుష్షుకి ప్రభుత్వాన్నీ, సౌకర్యాల లేమిని నిందించడం ఇహలోక మాయలో చిక్కుకోవడమే! కర్మ గురించి తెలియని వారి వాదన అది.
ఇలా ఏ సమస్యకైనా, ఏ అన్యాయనికైనా, ఏ విపత్తుకైనా ఒకే సమాధానం. కర్మ! ఓహ్! కనిపెట్టినోడెవరోగానీ, సర్వరోగనివారిణి. దీన్ని విశ్వవ్యాపితం చేస్తే ప్రపంచసమస్యలన్నిటినీ చిటికెలో పరిష్కరిస్తుంది.


తేది: November 19, 2012 సమయము: 12:05 am
నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మీరు వ్రాశారు. ఇంత సులభమైన ఫార్ములా గౌతమ బుద్ధునికి తెలీలేదు పాపం, శవాన్నీ రోగగ్రస్తుణ్ణీ, ముసలి వాణ్ణి చూసి, మనసు విరిగి ఇంటి నుండి వెళ్ళిపోయాడు.