మా వూరి సంగతులు – ఎవరికి పిచ్చి?
ఆ అమ్మాయి నా కంటే నాలుగైదేళ్ళు చిన్నదేమొ. పేరు మల్లినో, నాగమల్లినో సరిగ్గా నాకు తెలియదు. ప్రస్తుతానికి మల్లి అంటాను. వరసకి అత్త కూతురవుతుంది. ఆమెకు ఓ అక్క, ఓ సోమరిపోతు అన్న వున్నారు. అప్పుడే ఆ అన్న వూర్లో వుండక పట్టణాలు పట్టుకు తిరిగేవాడు. ఇప్పుడూ అంతే. అక్కకు పెళ్ళై మరో వూరెళ్ళిపోయింది. చిన్నప్పుడు ఈమె సిగ్గరి, అక్కలా ఎదుటపడి మాట్లాడేది కాదు. వీళ్ళమ్మకు మేమంటే చాలా అభిమానం. నేనెప్పుడు వూరొచ్చినా నన్ను చూడటానికి తప్పక ఇంటికి వచ్చేది అవసానదశలో మంచం మీద వున్నప్పుడు తప్ప.
మల్లికి పెళ్ళయింది కానీ కొన్ని రోజులకే ఏ కారణం వల్లనో భర్త వదిలేశాడు. వూరికయితే వచ్చింది గానీ, అమ్మ లేదు, నాన్న లేడు. అక్కదీ, అన్నదీ ఎవరి దారి వారిది. వూరిలో ఆ పనీ ఈ పనీ చేసుకొని పొట్ట నింపుకొని, ఏ చూరుకిందో, అరుగు మిదో పడుకొని కాలం వెళ్ళదీస్తుండేది. సరైన తిండిలేక నీరసించిన మల్లికి ఎయిడ్స్ వుందేమోనన్న అనుమానం ఎవరికో వచ్చింది. ఇంకేం ఎవరూ గడప దొక్కనీయలేదు. బక్క ప్రాణం మరింత బక్కదయింది. ఈమె దుస్థితి చూసి చలించిన మా తమ్ముడు దిలీప్ ఆమెను కడపకు తీసుకెళ్ళి వైద్యులకు చూపించి, రక్త హీనతకు మందులిప్పించి, తన స్నేహితులతో రక్తం ఇప్పించి ఆమెను మళ్ళీ మమూలు స్థితికి తెచ్చాడు. ఆ పరీక్షల్లో ఆమెకు ఎయిడ్సూ లేదు ఏ రోగమూ లేదు పోషకాహార లోపం తప్ప అని తేలింది.
బహుశా అప్పటికే ఆమెకు మతి చలించిందనుకుంటాను. ఎప్పుడూ సరిగ్గా మాట్లాడని ఆమె గలగలా మాట్లాడటం, ఏదేదో గొణగడం మొదలెట్టింది. ఇప్పుడు తను శారీరకంగా ఆరోగ్యంగా వున్నా మానసికంగా పిచ్చిదయింది. తనకు పెట్టిన అన్నాన్ని కుక్కలకు వేస్తుందిట. ఎందుకలా వేస్తున్నావు అంటే “నాకూ పుణ్యం రావాలిగా” అంటుందట. తనకు కట్టుకోమని బట్టలిస్తే అవి ఎవరికైనా ఇచ్చేస్తుందట. ఇంక వేదాంతం మాట్లాడటం, ఏదో దీర్ఘాలోచనలో వుండటం ఇలా వుంది వరస.
నేనూ, దిలీప్ వూరిలో తిరుగుతుంటే ఓ చోట గోడను ఆనుకొని అటేటో చూస్తూ వుంది. “ఏమ్మ్యా ఎలా వున్నావ్? నేనెవరో గుర్తు పట్టావా?” అని పలకరించా. అప్పుడు మా వైపు తిరిగి “దిలీపు సామీ నువ్వా!” అని రెండు చేతులెత్తి దండం పెట్టింది. “దిలీపు సరేగానీ నేనెవరో చెప్పు” అన్నా. “ఎవరో సామీ.. నేనింకా దొగలేమోనని, ఎట్ట సేయాల బగవంతుడా అని, ఇట్ట మల్లుకోనున్నా..” అన్నది. దిలీపును గుర్తు పట్టావే, దిలీపు అన్నలెవరు అంటే చెప్పింది. ఆ ప్రసాదును నేనే అంటే “ఎన్నెన్ని రోజులకు చూస్తిని సామీ” అంటూ తెగ సంతోషం ప్రకటించింది. ఆ ముందురాత్రి పడిన వర్షంలో బట్టలన్నీ తడిసిపోయాయట. ఎవరూ తమ తమ పంచల్లో పడుకోనివ్వలేదట! రాముడి గుడిలో పడుకుంటోందని గుడికి తాళాలు వేశారట! తడిసిన బట్టల్తో రాత్రంతా అలానే వున్నానని చెబుతుంటే గుండె చెరువయి కళ్ళల్లో ధార కడుతుంటే ఆపుకోవడానికి నానా కష్టాలూ పడ్డా. ఎప్పుడయినా సరే మా యింటికి వచ్చి తిను, అక్కడే పడుకో అని చెప్పి ఓ వందరూపాయలు చేతిలో పెట్టి అక్కడినుండీ భారంగా కదిలా.
ఆ మరుసటి వుదయం అన్నం కోసం ఇంటికి వచ్చినపుడు చెబుతోంది, “సామీ దొంగలున్నారంటే మీరు వింటిరా.. రాత్రి నా తలమీద గుండేస్తానని వాడెవడో దొంగ వచ్చి నీవిచ్చిన నూర్రూపాయాలూ లాక్కెళ్ళాడు.” అని.
ఇంతకూ నాకు తేలనిది ఏమిటంటే పిచ్చి ఆమెకా? వర్షం రాత్రి ఓ ఆడబిడ్డని ఏ పంచనా పడుకోనివ్వని వూరికా? చివరికి తన ఆలయంలోనూ చోటివ్వని దేవుడికా? అమాయకురాలి చేతిలోని డబ్బు భయపెట్టి లాక్కున్న మనిషికా? పిచ్చెవరికి?
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు









తేది: July 16, 2008 సమయము: 12:59 pm
చాలా బాగ ఉనన్ది.
తేది: July 18, 2008 సమయము: 12:26 pm
ప్రసాద్ గారు,
మీ ప్రశ్నలోనే సమాధానమూ ఉందనుకుంటున్నాను.
ఇంత చేసిన మీరు కాని, మీ తమ్ముడు కాని ఆమెను ఆదరించగల సంస్థ ఏదైనా చూసి ఆమెను చేర్పించగలరంటారా?అక్కడా ఏమైనా సమస్యలు తలెత్తుతాయా?
తేది: July 18, 2008 సమయము: 10:45 pm
లలిత గారూ, ఆ ఆలోచనే మాకూ వుంది. కానీ తను వూరు విడిచి వెళ్ళనంటోంది.
– ప్రసాద్
తేది: July 19, 2008 సమయము: 9:21 am
ప్చ్…!
తేది: July 19, 2008 సమయము: 10:38 am
పిచ్చి..సాటిమనిషిని ఆదరించని మనుషులదే
తేది: September 12, 2008 సమయము: 11:50 pm
ప్రసాదు గారు, మీ సున్నిత మనసు ను అభినందిస్తున్నాను. కాని మానసిక వైద్యశాల నఃఃదు చూపవలెనని ఎ0దుకనిపి0చలేదు. ప్రయత్ని0చి చూడ0దడి. తను బాగుంటె మీతొ పాతు మాకూ ఆన0దమె కదా.
తేది: February 24, 2009 సమయము: 11:11 pm
వింటుంటేనే కళ్ళళ్ళో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇక ప్రత్యక్ష సాక్షి అయిన మీ పరిస్థితి ఏమిటో ??
తేది: July 2, 2009 సమయము: 4:27 am
మీ ప్రశ్నలోనే ఉంది సమాధానం. ఒక మనిషి దుస్థితిని అర్థం చేస్కోలేని, మానవత్వం లేని అందరూ ఆమెను మోసం చేయాలనే చూస్తారు. తప్పని సరిగా ఆమెను మార్చడానికి పూర్తి మానవత్వం కలిగిన వ్యక్తి మీరే ఎందుకు కాకూడదు?
తేది: October 2, 2009 సమయము: 10:59 am
ప్రసాద్ గారూ, నిజంగా పిచ్చి మనిషికే అని స్పష్టమ్గా తెలుస్తోంది. ఇక్కడ దేవుడి తరువాత దేవుడైనటు వంటి పూజారికి కూడా పిచ్చి బాగా………….. ముదిరింది. ఏదో విదంగా సరిలేని మనిషిని, సరి చేసేందుకే అన్ని విధాలా సరి అయిన మనిషిని దేవుడు స్రుష్టించాడని నమ్ముతా. ఏదో ఒకటి చేద్దామ్ మనమ్ . చెప్పండి. ముందయినా, వెనకయినా సరే మేముంటామ్.
తేది: October 5, 2009 సమయము: 1:24 am
ప్రతిదానికీ దేవుణ్ణీ, ఆయన సేవకుల్ని దూషించడం సమంజసం కాదు. వారి స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం ? అని కూడా ఆలోచించాలి. ఆలయాలు ఒక ప్రత్యేక ప్రయోజనం కలిగిన భవనాలు. అక్కడ ఎవరికి పడితే వారికి, ఎప్పుడు పడితే అప్పుడు ఆశ్రయం ఇవ్వడం సాధ్యపడదు. అలాంటివాటికి సమాజం వేఱే ఏర్పాట్లు చేసుకోవాలి. మనుషులన్నాక అనేక అవసరాలుంటాయి. అవన్నీ గుళ్ళో తీర్చుకోవడం అభ్యంతరకరం. ఆ గుళ్ళో అలాంటి అనాథలకి జఱగరానిదేదైనా జఱిగితే మళ్లీ ఆ దేవుణ్ణి, ఆ దైవసేవకుల్నే ఆడిపోసుకుంటారు.
తేది: March 8, 2010 సమయము: 10:00 am
పిచ్చి మనందరిదీ…దేవుడు, నేను మీలోనే ఉన్నాన్నర్రా అని మొత్తుకున్నా పట్టించుకోకుండా…రాయికీ రప్పకీ నైవేద్యం పెట్టి, గోపురాలు కట్టి, ఆ నిజమైన దేవుడిని మాత్రం గాలికొదిలేస్తున్నాం…వైద్యం చేయించిన మీ తమ్ముడికి అభినందనలు…ప్రసాద్ గారు, ఆ చదువులేని స్పందించని మనుషులను నిందిస్తున్న మీరు మాత్రం స్పందించి ఏం చేసారు…బ్లాగు రాసి కళ్ళు తుడుచుకోవడం తప్పించి…మతిస్తిమితం లేని మనిషికి 100 రూపాయలు ఇస్తే consequences ఎలా ఉంటాయో మీరు ఊహించకపోవడం శోచనీయం…మీ ఇంట్లో ఒప్పించి, ఆ అమ్మాయిని పనిమనిషిగా అయినా పెట్టుకోవచ్చు కదా…చిన్న చిన్న పనులు చెబితే తన మీద తనకి నమ్మకం, కొంచెం ఆత్మవిశ్వాసం కలుగుతాయేమో…కొంచెం సహనంతో, ఆమెకి మనుషుల మీద నమ్మకం కుదిరేలా చేసి అప్పుడు ఏదైనా institutionలో చేర్పించవచ్చు…అంతవరకూ,ఆమె ఆకలినీ, అవసరాలనీ గమనించే మనుషులు…నెత్తి మీద కాస్త నీడ అయినా దొరికేవి…స్పందన లేని మనిషి కన్నా స్పందించి ఏమి చేయని మనిషే నిందార్హుడు కాదంటారా..
తేది: March 15, 2010 సమయము: 5:33 am
మీరు చాలా Correct రమణ గారు .,
ప్రసాద్ గారు మీరు ఒక్కసారి రమణ గారు చెప్పినట్లు చేసి చూడండి . అలా చెస్తే ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకుంటారని ఆలొచించొద్దని నామనవి. ఎందుకంటే ఒకల్ని ఆదరించే ఆలోచన లేనివాల్లకి, ఒకల్ని నిందించే హక్కు లేదు.
దయచేసి ఆమె కు దారి చూపించండి.
- can u post your village address (or) your Phone No Pls
- సిధ్ధార్ధ
తేది: July 11, 2010 సమయము: 7:50 am
ప్ర్ సా దు గా రి కి,
అభిన0దనలు,మ0చి పనిచెసారు.డబ్బుచెడ్డ్దది,ఎదయినాదారి చూపిస్తె య0కా మ0చిది కదా.