- అంతరంగం - http://www.charasala.com/blog -

అమెరికా ప్రజాస్వామ్యం — మన రిగ్గింగుకు సామ్యం

Posted By చరసాల On January 4, 2008 @ 11:25 am In చరిత్ర | 11 Comments

అమెరికాలో ప్రత్యక్షంగా అధ్యక్ష ఎన్నికలు గమనించే వరకూ దీని విధివిధానాలు నాకంతగా తెలియవు. అధ్యక్షుడిని ప్రజలే నేరుగా మనం శాసనసభ్యుడిని ఎన్నుకున్నట్లు ఎన్నుకుంటారనుకొనేవాడిని.
కానీ తర్వాత అర్థమయ్యింది ఏమిటంటే అత్యధికుల ప్రజల వోట్లు వచ్చినా అధ్యక్షుడు కానక్కరలేదు అని. ప్రస్తుత అధ్యక్షుల వారు భూషయ్య కూడా అలా అత్యధిక ప్రజాభీష్టం లేకుండానే ఎన్నికయ్యారు 2000 సంవత్సరంలో.

వీళ్ళ ఎన్నిక తతంగం చూస్తే మా రాయలసీమలో చాలా పల్లెల్లో జరిగే ఎన్నికల తంతుకీ దీనికీ పెద్ద తేడా లేదేమో అనిపించింది. అదెలా అంటే…

నాకు తెలిసి చాలా రాయలసీమ పల్లెల్లో వోటింగు ప్రశాంతంగా జరిగినా చట్టబద్దంగా జరగదు. పోలింగుకు ముందే రాజకీయ నాయకులు ఆ వూరిలో పెద్ద తలకాయలతో ఒడంబడికలు చేసుకుంటారు. ఎవరిది ధనబలమూ, కండబలమూ లేక కొండకచో ప్రజాబలమూ వుంటుందో వారు వూరి మొత్తం వోట్లు ఏ అభ్యర్థికి వేయాలో నిర్ణయిస్తారు. ఇక పోలింగురోజు అలా నిర్ణయింపబడిన అభ్యర్థికి అన్ని వోట్లనూ వేసేస్తారు. బయటి వారికి అనుమానం రాకుండా వుండటం కోసం, తర్వాత్తరువాత ఏదైనా విచారణలో దొరక్కుండా వుండటం కోసం ఓ పదో పదిహేనో శాతం వోట్లను అవతలి అభ్యర్థికి వేస్తారు. ఇది అన్యాయమని గొంతు చించుకోనక్కరలేదు. ఎందుకంటే ఇంచుమించు ఇదే పద్దతిలో అమెరికా అధ్యక్ష ఎన్నికా జరుగుతుంది.

అదెలాగంటే…

సరిగ్గా చెప్పాలంటే అమెరికాలో అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. మనం శాసనసభ్యులను ఎన్నుకుంటే వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నుకున్నట్లు,  అమెరికాలో ప్రజలు ఎలెక్టోరల్ కాలేజీ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ సభ్యులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అయితే మనకూ వీళ్ళకూ పోలిక అంతవరకే! ప్రతి రాష్ట్రానికీ నిర్దేశింపబడిన ఎలెక్టోరల్ సభ్యులుంటారు. ఆ రాష్ట్ర జనాభాను బట్టి ఇంకా ఏవో చారిత్రక ఆంశాలను బట్టి (నాకు తెలియదు) కొన్ని రాష్ట్రాలకు తక్కువ మంది, కొన్ని రాష్ట్రాలకు ఎక్కువమంది సభ్యులున్నారు. ఇక్కడ కీలకం ఏమిటంటే ఏ రాష్ట్రంలోనైనా ఎక్కువ ప్రజల వోట్లు వచ్చిన అభ్యర్థికే ఆ రాష్ట్రం యొక్క మొత్తం ఎలక్టోరల్ సభ్యుల వోట్లు వస్తాయి. అంటే మన పల్లెల్లో ఎవరి మాట చెల్లుతుందో వూరి మోత్తం వోట్లు ఒకే అభ్యర్థికి రిగ్గింగ్ చేసినట్లు!

అందువల్ల ఒక రాష్ట్రంలో చాలా కొద్ది తేడాతో గెలిచినా ఆ రాష్ట్రం యొక్క మొత్తం ఎలక్టోరల్ సభ్యుల వోట్లన్నీ ఆ అభ్యర్థికే వస్తుండడం వల్ల, ఒక్కోసారి దేశ అత్యధిక వోటర్లు కోరుకున్న అభ్యర్థి అధ్యక్షుడు కాలేక పోవచ్చు. వుదాహరణకు, 2000ల అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి అల్ గోర్‌కు 48.4 శాతం ప్రజల వోట్లు, రిపబ్లికన్ అభ్యర్థి బుష్‌కు 47.9 శాతం ప్రజల వోట్లు వచ్చినా, అల్ గోర్‌కు 266 ఎలక్టోరల్ సభ్యుల వోట్లు, బుష్‌కు 271 ఎలక్టోరల్ సభ్యుల వోట్లు రావడంతో బూషయ్యే గెలిచాడు.

అలా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచిన బుష్ గెలవకుండా వుండినట్లయితే ఈ ప్రపంచ చరిత్ర ఇంకోలా వుండేదేమొ!

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=211