- అంతరంగం - http://www.charasala.com/blog -

ఉగ్రవాదం – ప్రభుత్వ వాదం

Posted By చరసాల On August 27, 2007 @ 10:25 am In నా ఏడుపు, వర్తమానం | 11 Comments

హైదరాబాదులో లుంబీనీ పార్కు మరియు గోకుల్ చాట్ భండార్‌లలో జరిగిన బాంబు పేలుడులో అసువులు బాసిన ప్రతిఒక్కరికీ అశ్రునయనాలతో అంజలి ఘటిస్తూ…

***                               ***                                  ***
మన ముఖ్యమంత్రిగారి స్పందన చూస్తుంటే రక్తం వుడికిపోతోంది. అసలీయన స్పందించడంలో (ప్రతిపక్షాలన్నట్లు ఎదురుదాడి చేయడంలో) సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. తర్వాతి ప్రభుత్వాలూ ఇదే పంధాలో వెళితే… అమ్మో భయమేస్తోంది.

ప్రశ్న: ఈ సంఘటనకు భాధ్యులెవరు? ఇది ప్రభుత్వ నిఘా వైఫల్యం కాదా?
జవాబు: ఎంతమాత్రం కాదు. దీనికి భాధ్యులు బంగ్లా/పాకిస్తానులో వున్న ఉగ్రవాద మూకలు. ఈ విశయాన్ని ముందుగా మనకు తెలియజేయని బంగ్లా/పాక్ ప్రభుత్వాల అసమర్థత. (మనలో మనమాట. నిజానికి ముందుగా ఎక్కడ బాంబులు పెట్టారో తెలియజేయని కేంద్ర నిఘా సంస్థలదీ వైఫల్యం. కానీ అక్కడా మా ప్రభుత్వమే అధికారంలో వుంది గనుక పైకి ఏమీ అనలేకపోతున్నా.)

ప్రశ్న: ఇది జరిగిన తర్వాతా పోలీస్ కమీషనర్ ఆ పదవిలో కొనసాగడానికి అర్హుడా?
జవాబు: ఏంటి మీరనేది. దీనికీ ఆయనకూ సంభందమేమిటి? ఆయన బాంబు పెట్టాడనా? లేక ఆయనకు తెలిసీ మనకు చెప్పలేదనా? ఆయనకు నామీద, ఆయన మీద నాకూ విశ్వసమున్నంత వరకూ ఆయన పదవిలో వుంటాడు.

ప్రశ్న:మూడు నెలల్లో రెండు సంఘటనలు జరిగాయి కదా? ఇంత అధ్వాన్న స్థితికి ఎవరో ఒకరు భాద్యత వహించాలి గదా?
జవాబు: అరె అడిగిందే మళ్ళీ అడుగుతావు. దీనికి భాద్యులు అంతర్జాతీయ వుగ్రవాద సంస్థలు. కాస్తా అయినా వెసులుబాటు ఇవ్వకుండా మూడు నెలల్లో రెండుసార్లు ఇలాటి పేలుళ్ళు జరపడం వారి తప్పు. పైగా అవి ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో పసిగట్టి చెప్పకపోవడం కేంద్ర నిఘా సంస్థల తప్పు. దానికి మేమేం చేయగలం?

ప్రశ్న: ఇలాంటివాటిని అడ్డుకోవడానికి మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
జవాబు: మేము ఏమి చర్యలు తీసుకున్నామో మీకు తెలుసు. మక్కా పేలుళ్ళ తర్వాత ఏమి చర్యలు తీసుకున్నామో మీకు తెలియదా? వీటి వెనుక గూడు పుఠాణీ అంతా బంగ్లా/పాక్‌లలో జరుగుతుంటే దానికి మేము ఏమి చేయగలం? మాకు అక్కడ నిఘా వ్యవస్థ లేదు కదా? బంగ్లా/పాక్ ప్రభుత్వాలే ఇలాంటి కుట్రలు జరగకుండా ఓ కమిటీని వేస్తే బాగుంటుంది.

ప్రశ్న: కేంద్రంతో సమన్వయం రాష్ట్ర ప్రభుత్వ భాధ్యత కాదా?
జవాబు: కాదని నేనన్నానా? అందుకేగా కేంద్రం నుండీ హుటాహుటిన శివరాజ్ పాటిల్ మొదలగు వారు వచ్చి చూసి వెళ్ళారు. కేంద్ర నిఘా సంస్తలు కూడా సరైన సమాచారం ఇవ్వట్లేదు. అయినా వాటినేమన్నా అందామా అంటే మా మేడమే నా కళ్ళల్లో కనిపిస్తున్నారు.

ప్రశ్న: మీరు కేంద్రాన్ని నిందిస్తున్నారా?
జవాబు: అభ్భే! అంత దమ్ము నాకెక్కడిది? ఇందులో కేంద్రాన్ని నిందించేందుకూ, రాష్ట్రాన్ని నిందించేందుకు ఏమీ లేదు. ఇవన్నీ మామూలుగా ప్రపంచమంతటా జరుగుతున్నవే.

ప్రశ్న: ఈ దుర్ఘటనలో పాకిస్తాన్/బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలు పాల్గొన్నాయనుకుంటున్నారా?
జవాబు: ఇది నన్నడగాలా? దారిన పోయే ఏ దానయ్యనడిగినా అవుననే చెబుతాడు.

ప్రశ్న: స్థానిక మద్దతు లేకుండా ఇది చేయరు. గతంలో ఇది ఋజువైంది కూడా. వీరిని మీరు ఎలా గుర్తిస్తారు?
జవాబు: గుర్తించడం సమస్య కాదు. కానీ అన్ని విషయాలను మీతో పంచుకోవడం కష్టం. ఆశ్రయమిచ్చిన వారూ మనుషులే, వాళ్ళకీ కొన్ని ఓట్లు వుంటాయి అన్న సంగతిని మీరు మరచిపోతున్నారు.

ప్రశ్న: అయితే మరి ప్రజలు చేతులు కట్టుకొని కోర్చోవలిసిందేనా?
జవాబు: మరంతకంటే ఇంకేం వూడబొడుస్తారు? అంత పెద్ద వరల్డ్ త్రేడ్ సెంటరే కూలిపోతే చేతులు ముడుచుకొని కూర్చోక అమెరికా ప్రజలు ఏమి చేశారు? అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ వుంటాయి. దీనికే ఇంత రియాక్టైపోతే ఎలా?

ప్రశ్న: హైదరాబాదులోనే ఇలా ఎందుకు జరుగుతున్నాయి?
జవాబు: మీరు పత్రిక వాళ్ళే అయినా పత్రికలు చదువుతున్నట్లు లేదు. ఎక్కడ జరగట్లేదో అది చెప్పండి. లండన్, న్యూయార్క్, మాడ్రిడ్, బాలె, బెంగళూరు, బాగ్దాద్…
అసలు నన్నడిగితే బాగ్దాద్ కంటే మన హైదరాబాదు ఎంత సురక్షితమైందో తలచుకుంటే గర్వంతో నా గుండె బరువవుతుంది.

ప్రశ్న: మున్ముందు మీరేం చేయబోతున్నారు?
జవాబు: ఎలాగూ ఇవి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల పని గనుక వాటిని నిరోధించేందుకు మనం చేయగలిగిందేం లేదు. కాకపోతే జరిగిన తర్వాత ఏమి చేయాలనే దానిపై మంత్రిమండలి సమావేశమై చర్చించి క్రింది నిర్ణయాలు తీసుకున్నాం.
చనిపోయిన ప్రతి ఒక్కరికీ తలకు ప్రతిపక్షాలు ఎంత డిమాండు చేస్తే అంతా పరిహారం ఇస్తాం. చనిపోయిన వాడు సంపాదనా పరుడైతే ఆ కూటుంబంలో ఒకరికి ప్రభుత్వ వుద్యోగం ఇస్తాం. ఆరడుగుల నేల వుచితంగా కేటాయిస్తాం. దహన సంస్కారాలకు వగైరా ఖర్చుల పద్దులు చూసుకోవడానికి ప్రత్యేక శ్మశాన శాఖను ఏర్పాటు చేసి తంతులన్నీ ఎవరి మతానుసారం వారికి జరిగేట్లుగా ఏర్పాటు చేస్తాం.
అలాగే గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తాం.
దుర్ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి ముంఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులూ వెళ్ళడం తప్పనిసరి చేస్తాం. అంబులెన్సులూ తదితర అత్య్వసర సర్వీసులు మేమెళ్ళి చూసివచ్చాకే వెళ్ళాల్సిందిగా వుత్తర్వులిస్తాం.

ప్రశ్న: ప్రజలకు మీరిచ్చే సందేశం?
జవాబు: ప్రజలారా! మారుతున్న ప్రపంచంలో ఇవన్నీ మామూలే. న్యూయార్క్ ప్రజలకే తప్పలేదు ఇది. కాబట్టి నే చెప్పేదేమంటే, మీరు ప్రశాంతంగా వుండాలి. సహనంతో వుండాలి. వందకోట్ల భారతావనిలో కొద్దిమందిని ఇలా పొట్టనబెట్టుకొని ఉగ్రవాదులు ఏమీ పీకలేరు. ఎన్ని బాంబులు పేల్చినా తదనంతర పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం మన పోలీసులకు దండిగా వుంది. కనుక మిరు నిశ్చింతులై ముందుకు పోవాలని నా విన్నపం.

అలాగే ఉగ్రవాదులకు ఒక విన్నపం:
అయ్యా మిమ్మలని పట్టుకుందామంటే మీరు పరాయి దేశస్తులైపోయారు. మీ కుట్రలు తెలుసుకుందమంటే మీరు పరాయి గడ్డపై కుట్రలు చేస్తున్నారు. మీరెన్ని బాంబులైనా నిభ్యంతరంగా పేల్చుకోండి గానీ గానీ కాస్తా ముందుగా మాకు చెబితే పరిహారం కొరకూ మా తర్వాతి బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయిస్తాం. అంబులెన్సులూ గట్రా అధిక సంఖ్యలో మొహరిస్తాం.
–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=198