వైరం వర్ధిల్లు గాక!
ఈనాడు, కాంగ్రెస్‌ల మద్య ఇంచుమించు యుద్ద వాతావరణం నెలకొన్నట్లే వుంది. దాడులు, ప్రతి దాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఈ వినోదం మనకు చూడటానికి బాగానూ వుంది. నాకైతే ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి ఆరోగ్యకరం అనిపిస్తోంది.
ఇంతకు మునుపు పత్రికల్లో ఏవైనా ఆరోపణలొస్తే అధికార పక్షం వారు ఆత్మాశ్రయ ధోరణిలో పడిపోయేవారు. అదే పార్టీ వారైనా ఇదే అవకాశం అని వారిని పదవికి కొన్నాళ్ళు దూరంగా వుంచేవారు (లోలోపల ఏవో తంటాలు పడి ఒప్పించి). అయితే మన రాజన్న అలాంటి ముసుగులో గుద్దులాట ఆడేరకం కాదు. చూసేవాళ్ళు ఏమనుకుంటారో అన్న వెరపు లేకుండా ఆచరణీయమైన ఏ ట్రిక్కుటమార విద్యనైనా తన అనుయూయుల లభ్దే పరమావధి అన్నట్లు ఆచరించడంలో ఆయనకు ఆయనే సాటి. అందువల్లనే “ఆయన్ను నమ్ముకుంటే ఎప్పటికీ అన్యాయం చేయడు” అన్నది ఆయన అనుచరుల్లో పాదుకొల్పబడిన సిద్దాంతం. అది నిజం కూడా! కావాలంటే యావజ్జీవ కారగారవాస శిక్ష పడినా ఒక్క సంతకంతో తప్పిద్దామని పరితపించిన ఆయన ఆతృతను చూడండి. నాకు పేర్లు గుర్తులేవు కానీ అప్పటి శాసనసభ ఎన్నికల్లో తన అనుచరుడికి టికెట్టు రాకుంటే ఆయన్ని స్వంతంత్ర అభ్యర్థిగా నిలిపి, గెలిపించి ఆనక పార్టీ ముక్కు పిండి పార్టీలో చేర్చుకున్న వైనం జ్ఞప్తికి తెచ్చుకోండి. రాయచోటి శాసనసభా ఎన్నికల్లో పులివెందుల నుండీ తెప్పిచ్చిన మనుషులకు బురఖాలు వేయించి దొంగ వోట్లు వేయించినపుడు స్థానికులు “ఔరా” అని ముక్కుమీద వేలేసుకున్న విధానం అబ్బురమని గుర్తుంచుకోండి. స్వంత పార్టీ ముఖ్యమంత్రులతో ఎన్ని చెరువుల నీళ్ళు తాగించాడో బతికుంటే చెప్పులతో కొట్టించుకున్న కోట్ల చెప్పేవారు. లేదా పాతబస్తీ అల్లర్ల సృష్టి వెనుక ఎవరున్నారో చెన్నారెడ్డి చెప్పేవారు. కాదూ లేదంటే జ(ధ)నార్ధ(ర్జ)నరెడ్డి ఇప్పుడంటే ఆయనతో డీకొనలేక ఆయనతో చేరిపొయ్యారుగానీ లేకుంటే చెప్పేవారే! రాజన్నకు ప్రజాస్వామ్యం మీద కంటే అనుచరగణం మీద నమ్మకం. మాయోపాయాల మీద నమ్మకం.
కాకుంటే ఇవన్నీ అధికారం బయట వున్నప్పుడు బాగానే వున్నాయి కానీ అధికార పీఠం మీద కూర్చున్నాకా ఆలాగే అయితే ఎలా? తప్పు చేసున్నా, చేస్తున్నా ఒకరు చెబితే వినాలి. మన తప్పును తప్పయితే తప్పని చెప్పడానికి అవతలివాడు ఈనాడు అయితే ఏంటి? వార్త అయితే ఏంటి? కానీ ఈయన సిద్దాంతం ఒక చెంపమీద కొడితే రెండు చెంపలూ వాయించి, ముక్కు కూడా పగలగొట్టాలి అన్నదిలా వుంది. “నన్నంటావా? అయితే చూడు నిన్నేం చేస్తానో? నీ భండారం బయట పెడతా. నీకున్న అసైండు భూముల వివరాలు బయట పెడతా. నీ మార్గదర్షిలోకి డబ్బులెలా వస్తున్నాయో నాకు తెలుసు. నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతా. నీ భరతం పడతా.” అంటూ అసెంబ్లీ లోపలా, బయటా చెలరేగిపోతే “అమ్మో ఈ రాయలసీమ రౌడీతో మనకెందుకులే” అని ఈనాడు రాజీకి వచ్చివుంటే మనకింత వినోదం దొరికేదా? ఒక రాజయ్య భూముల విషయం, బొత్స గారి కోట్ల విషయం, రాజన్న తోటల విషయం ఇప్పుడు వట్టిగారి రొయ్యల విషయం తెలిసేదా? పోనీ “ఈ ఈనాడుతో చెలగాటం, పీతిలో రాయి వెయ్యడం లాంటిది మనకెందుకు” అని మిగిలిన పార్టీల్లాగే మిన్నకుండినట్లయితే మార్గదర్షిలో చట్టవిరుద్ద డిపాజిట్ సేకరణల విషయం, ఫిల్మ్‌సిటీ అసైండు(?) భూముల విషయం తెలిసేవా?
మనలని అవతలివాడు వుతికి ఆరేయడానికి సదా కనిపెట్టి వున్నాడు అన్న చింత మనిషిని కనీసంగానైనా మంచిదారిలో పెట్టదా? అయితే ఇది అంతిమంగా మనకే మంచిది.
కనుక ఈ వైరం వర్ధిల్లు గాక.
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








(7 ఓట్లు, సగటు: 5 కు 4.14)
తేది: August 1, 2007 సమయము: 2:53 pm
అవునవును. హహ్హహ్హా…
తేది: August 2, 2007 సమయము: 10:20 am
ప్రసాద్ – ఈ మధ్యకాలంలో మీ టపాలు చదవలేదు – చాలా బాగా రాస్తున్నారు.
తేది: August 2, 2007 సమయము: 10:21 am
ప్రసాద్ – ఈ మధ్యకాలంలో మీ టపాలు చదవలేదు – చాలా బాగా రాస్తున్నారు.
keep up the good work
తేది: August 3, 2007 సమయము: 8:46 am
కొత్తపాళీ గారూ,
ఈ మద్య నేను రాయడమూ కాస్తా తగ్గింది లెండి. మీ అభిమానానికి కృతజ్నతలు.
–ప్రసాద్
తేది: August 6, 2007 సమయము: 10:07 am
మీరు రాసింది అక్షరాలా నిజం.
“కనుక ఈ వైరం వర్ధిల్లు గాక”.. చక్కగా చెప్పారు.