ఇదేం రోగం?
నేను గత ఏడాది బ్లాగు మొదలెట్టినపుడు తెలుగు బ్లాగులు క్రియాశీలకంగా వ్రాస్తూ తెలుగు బ్లాగుల గుంపులో పాల్గొనే వాళ్ళు పట్టుమని పదిమందో, ఇరబై మందో వుండే వాళ్ళు. ఆ బ్లాగులంటినీ క్రమం తప్పక చదివే వాన్ని. కూడలి వచ్చాక ప్రతి బ్లాగుకూ వెళ్ళే బెడద తప్పింది. అయితే మాటిమాటికీ కూడలిని refresh చేయడం, కొత్త పోస్టు లేకుంటే నిరాశ పడటం జరిగేది. వుంటే కళ్ళు ఆనందంతో వెలిగేవేమొ ఆ సమయంలో మా ఆవిడ చూసివుంటే చెప్పుండేది. చదివాక అదెలా వున్నా ఓ వాఖ్య తప్పక రాసేవాన్ని.
అమ్మో ఇప్పుడో! బ్లాగులు వందల్లోకి చేరాక ఏది చదవాలో ఏది వద్దో నిర్ణయించుకోవాల్సి వస్తోంది. ఆ నిర్ణయంలో నాకు తెలీకుండానే ఇంతకు ముందు పరిచయం అయిన బ్లాగులకే వెళుతున్నాను అని గమనించాను. ఇంతకుముందు ఎవరైనా కొత్త బ్లాగు మొదలెట్టి ఆహ్వానిస్తే శుభాకాంక్షలు, సుస్వాగతాలు చెప్పేవాన్ని. కానీ ఇప్పుడెవరైనా కొత్త బ్లాగు లంకె ఇచ్చినా, కొత్త బ్లాగు మొదలెట్టినా అది చూడాలనే వుత్సాహం అంతగా లేదు. ఏ టపా వేడివేడిగా వుందో తెలుసుకోవడానికి నేను కూడలి వాఖ్యల విభాగం చూస్తాను. అక్కడ వున్న వాఖ్యలను బట్టి ఆ బ్లాగును చదవడమో మానడమో చేస్తున్నాను.
ఇక ఇంకో పరిణామం మనసులో మాట నిర్మొహమాటంగా చెప్పాలంటే కాస్తా తడబడటం. ఆ మద్య జరిగిన బ్లాగ్యుద్దాల తరువాత మనసులో సంఘర్షణని నిర్మొహమాటంగా చెప్పాలంటే భయమేస్తోంది. బ్లాగరులు ఎక్కువయ్యే కొద్దీ ఇంతకుముడటి స్నేహసౌహార్దాలు తగ్గుతున్నాయి. ఇద్దరి మద్య ఒక అభిప్రాయంలో తేడా వస్తే ఆ తర్వాత ఆ యిద్దరి మద్యా ఆ అంతరం మిగతా అన్ని అభిప్రాయాల్లోనూ అలానే వుంటోంది. లేదా ఒకరినొకరు అనుమాన చూపులతో చూసుకుంటున్నారు.
నేనీమద్య నాకు బాగా నచ్చిన బ్లాగులో ఓ కామెంటు చూశాను. “మీరే చెత్త కవిత రాసినా, బాగుందహో అనడానికి జనాలు లైను కడతారు.” (ఇది కాపీ & పేస్టు చేసింది కాదు గనుక అచ్చంగా ఇలానే రాసుండకపోయినా అర్థం ఇదే) ఈ కామెంటు చూశాక బ్లాగరుల హుందాతనం తగ్గిపోతోందా అనిపించింది. అదేగాక ఆ కామెంటు చూశాక బ్లాగు బాగున్నా బాగుంది అని ఓ వాఖ్య రాయడానికి సందేహించాల్సి వస్తోంది.
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు









తేది: July 16, 2007 సమయము: 7:23 pm
ఈ టపాకు ‘ఇదేం రోగం’ అన్న శీర్షిక ఎందుకు పెట్టారు? మీకు నచ్చిన బ్లాగ్ లో మీకు నచ్చని కామెంటుని గురించా ‘ఇదేం రోగం?’ అన్న ప్రశ్న?
ఆ కామెంటు నేనూ చదివాను. మొదటిసారి అలాంటి కామెంటును తెలుగు బ్లాగుల్లో నేను చూడ్డం! అందరూ అన్నీ పొగడాలని లేదు. అలాగని పని గట్టుకుని తెగడాలనీ లేదు.
ఏదైనా బాగుందని చెప్పడానికి, పొగడడానికి పెద్దగా కారణాలు చూపించనక్కరలేదు. కానీ నచ్చలేదని, బాగోలేదని చెప్పేటప్పుడు కారణాలు కూడా చెపితే అందరికీ ఉపయోగమని, ఆ కామెంట్లకి విలువ పెరుగుతుందని నా అభిప్రాయం.
ఏమిటో మీ బ్లాగ్లో మరొకరి బ్లాగ్ లోని కామెంటు గురించి కామెంటు రాస్తున్నా! ఇలా ఇక్కడ నేను రాయడం మీకు తప్పుగా అనిపిస్తే సారీ.
తేది: July 16, 2007 సమయము: 9:37 pm
పిల్లల కోసం Vomit envelops, Travel Toilet తప్పనిసరి అవసరాలు.ఈసారి ప్రయాణానికి మీకు దగ్గరలో ఉన్న departmental stores లో కొనేసుకుంటే, మీ ప్రయాణం సౌఖ్యవంతంగా ఉండగలదు. Happy travel.
తేది: July 16, 2007 సమయము: 11:52 pm
ఈ టపాకింద రావుగారి వ్యాఖ్య భలే నవ్వుతెప్పించింది.
తేది: July 16, 2007 సమయము: 11:55 pm
దర్శనాలు అని ఉండాలి. దర్షనాలుకాదు. అలాగే, విషయం అనాలి, విశయం కాదు. ఎప్పటినుంచో చెబుదామనుకొంటూ వాయిదావేస్తున్నాను. మీకు చెప్పేచొరవ నాకుందా!? ఉందనే అనుకుంటున్నాను.
తేది: July 17, 2007 సమయము: 2:56 am
నాకు కూడ ఈ టపాకి “ఇదేం రోగం” అనే టైటిల్ ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు
ఇంతకి రోగం ఎవరికో చెప్పలేదు మీరు
తేది: July 17, 2007 సమయము: 3:12 am
కొందరు అభిప్రాయాలు, ఆలోచనలు తెగడడం పోయి, తెలిసో తెలియకో సదరు బ్లాగరి మీద పడటం వలన ఇలాంటివి జరగుతున్నాయి. మనమింకా ఎదగాలి. సుధాకర్ గారి బ్లాగులోనూ మరియు ఈ బ్లాగులోనూ ఉన్న రేటింగు పద్ధతి నాకు బాగా నచ్చింది. కొన్ని సార్లు టపా బాగుంది అనిపించినా ప్రత్యేకంగా వ్యాఖ్య చేసేంత విషయమేమీ లేని సందర్భాలు చాలా ఎదురవుతాయి. వాటికి ఇది చాలా ఉత్తమమైన మార్గం. అందరు బ్లాగర్లు అవలంబిస్తే బాగుంటుంది.
తేది: July 17, 2007 సమయము: 10:01 am
ఈ పరిస్థితి దాదాపు అందరి బ్లాగరులది. చదవడంలోనే ఓపిక తగ్గిపోయి కామెంటులు రాయరు. మరి ఇంకా రాయండని ఎలా ప్రోత్సహించాలి జనాలని.. కొందరు తలమాసిన వెధవలు అలాంటి చెత్తవి,వాంతులొస్తాయనే వ్యాఖ్యలు రాస్తుంటారు. కొందరు తమ పేరు పేరు రాసే ధైర్యం ఉండదు కాని వీర లెవెల్లో వ్యాఖ్యలు రాస్తుంటారు. ఇలాంటి వాళ్ళను అలా వదిలేయడమే మేలు. ఎవరికో భయపడి, మన అభిప్రాయలను, వ్యాఖ్యలను ఎందుకు మానుకోవాలి. వ్యాఖ్యలను ఆహ్వానించినపుడు అన్నింటికి సిద్ధంగా ఉండాలి..
తేది: July 17, 2007 సమయము: 10:40 am
అక్కయ్యా, ఆ తలమాసిన వెధవల్లో నేను ఒకడినే! భలే తిట్టావు కదా!
–ప్రసాద్
తేది: July 17, 2007 సమయము: 10:59 am
అదేమిటో ఆరాసిన వాళ్ళు నన్ను,నా కవితలని తిట్టి వెళ్ళిపోక కామెంటులు రాసేవాళ్ళని కూడా కలిపేసారు.పొగిడినవి మాత్రమే వుంచి తిట్టినియ్యి తీసేస్తే బాగోదేమో అని అలానే వుంచేసా.[నా బ్లాగుకి వచ్చేవాల్లే తక్కువ.కామెంట్లు రాసేవాళ్ళు మరీ తక్కువ.ఇలా వచ్చేవాళ్ళని కూడా రాకుండా తిడితే ఎలా?]ఇక్కడ ఎలానూ మాటలు జరుగుతున్నాయి కాబట్టి సభాముఖం గా చెప్పేదేమిటంటే తిట్టాలనుకుంటే నన్ను,నా కవితలను మాత్రమే తిట్టండి.నా అతిధులను ఏమీ అనొద్దు ప్లీజ్ ….
తేది: August 2, 2007 సమయము: 10:16 am
ఇది బ్లాగుల్లో మీకు కొత్తగా కనబడుతోందేమో గానీ అంతర్జాల వేదికల్లో ఇదివరకు జరిగినదే. మొదట్లో ఎవరు ఎవరో తెలీక బానే నిర్మొహమాటంగా ఉంటాం. పరిచయాలు పెరిగాక, కొద్దిపాటి స్నేహాలు ఏర్పడ్డాక “మనకి తెలిసినవాళ్ళని” విమర్శించాలంటే జంకుతాం. విషయాన్ని విమర్శించడానికీ వ్యక్తిని విమర్శించడానికీ తేడా తెలీక పోవడంతో వచ్చిన సమస్య ఇది. బ్లాగుల్లో ఉన్న సౌలభ్యమే – ఇతర మాధ్యమాల్లో వేదికల్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకోలేని విషయాలకి ఇది చక్కని వేదిక. అంచేత నిర్మొహమాటంగా రాయాల్సిందే – ఐతే అది వ్యక్తి దూషణ కారాదు.