నా బ్లాగుకు ఏడాది!
చూస్తూ చూస్తుండగానే ఓ ఏడు దొర్లి పోయింది. బ్లాగు మొదలెట్టి సంవత్సరం అయింది. అసలు మొదట బ్లాగు మొదలు పెట్టాలని అనుకోలేదు. మా పిల్లలకు తెలుగు నేర్పించాలంటే తెలుగులో ఏమైనా మంచి ఆటాపాటలు వున్నాయా అని గూగుల్ చేయడం మొదలెట్టాను. ఆ ప్రయత్నంలో చావాగారి బ్లాగు తగలడం, ఆయన బ్లాగు తీగ పట్టుకు లాగితే బ్లాగురుల గుంపు డొంక తగలడం జరిగింది. అప్పటికే మనసులో పేరుకుపోతున్న, మాయమవుతున్న రకరకాల భావనలను బ్లాగుపెట్టెలో పేరిస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. ఇంచుమించు నా డిగ్రీ పూర్తయ్యేదాకా నాకు డైరీ రాసే అలవాటుకూడా వుండేది. అయితే ఆ తర్వాత గోప్యంగా వుంచడంలో సమస్యలవల్ల అది రాయడం మానేసా. అయితే ఆన్‌లైన్‌లో డైరీ వ్రాసి దాచుకొనే సదుపాయం వుంటే ఎలా వుంటుంది అని బ్లాగు పుట్టకముందునుంచే అనుకొనేవాన్ని. తీరా బ్లాగు పుట్టాక ఆంగ్ల బ్లాగులను చూసాక నా కోరిక కొంత తీరినట్టనిపించినా ఆగ్లంపై నాకు పట్టులేని కారణాన బ్లాగు మొదలెట్టాలనే ఆసక్తి రాలేదు. ఇక చావా గారి బ్లాగు చూశాక నాక్కావలిసిందేదో దొరికినట్టయింది. దానికి తోడు అదే సమయంలో Verizonలో మానేసి DOTలో చేరడంతో నాకు సమయసౌలభ్యమూ ఏర్పడింది. ఇంకేముంది మూసుకుపోతున్న మనసు ద్వారాలు తెరుచుకొని భావాల లావా చిమ్మడం మొదలయ్యింది. ఆరోజు జూన్ 2, 2006. నా మొదటి పోస్టు “గాంధి గారి సత్యంతో ప్రయోగాలు — నా సందేహాలు:“. ఇది blogspotలో “స్పందన” పేరుతో రాయడం జరిగింది. మొదట అనామక పేరుతో అదృశ్యంగా వుండి రాయాలనుకున్నా గానీ ఎందుకో ఆ తర్వాత అవసరం లేదు అనిపించింది. ముఖ్యమైన కారణం అనామకంగా వుండటంలోని శ్రమ.
blogspotలో బ్లాగు మొదలెట్టిన వారంలోపలే అందులో కొన్ని సమస్యలు రావడంతో wordpressకు నా బ్లాగును మార్చేశాను. అందులో ఐదు నెలలు మకాం పెట్టాక సొంత డొమైన్ కొనుక్కోవడం అందులో సొంత బ్లాగు ఏర్పాటు చేసుకోవడం జరిగాయి.
బ్లాగు మొదలు పెట్టిన కొత్త రోజుల్లో ఎడాపెడా రాసేశాను. బహుశా కొత్త బిచ్చగాడు పొద్దెరగడనేమొ! లేక మనసులో గూడుకట్టుకున్న భావాల వెల్లువ వురకడం వల్లనేమొ! లేక సమయం దొరకడం వల్లనేమొ! ఎందువల్లైతేనేం మొత్తం మీద ఇప్పటికి 170 దాకా బ్లాగాను. అవీ ఇవీ అని గాకుండా ఏది తోస్తే అది బ్లాగాను. అశ్రువులూ, ఆనంద బాష్పాలూ, నవ్వులూ, ఏడుపులూ, తిట్లూ, పొగడ్తలూ అన్నీ బ్లాగాను. కొన్ని కొందరిని అలరిస్తే, కొన్ని కొందరిని భాదిస్తే, మరికొన్ని వివాదాస్పదం అయ్యాయి. ఏవి ఎవరికి నచ్చినా, కోపం తెప్పించినా అవన్నీ కూడా నేనే! నా గురించి నా బ్లాగులు చెప్పినంతగా నా శ్రీమతి కూడా చెప్పలేదేమొ! నేను ఛాదస్తున్నో, కోపిష్టినో, ఆస్తికున్నో, నాస్తికున్నో, దయగలవాన్నో, దుష్టున్నో నా బ్లాగులే చెబుతాయి. నన్నింతగా వ్యక్తం చేసుకొనే అవకాశం కల్పించిన బ్లాగంటే నాకెంతో ఇష్టం కాదు కాదు వ్యసనం అయిపోయింది.
ఈ ఏడాదిలో నాకు నచ్చిన నా బ్లాగులు కొన్ని
నేనెందుకు మాంసాహారము మానేశాను?
అన్నయ్యకో లేఖ – a letter to my brother
ఉత్తమ జీవితమా X వ్యర్థ జీవితమా?
దేవుడు అని ఎవరిని చూపించాలి? (Who is God?)
రిజర్వేషన్ హక్కు – దేశం తుక్కు తుక్కు
తలసేమియా (జన్యు పరమైన జబ్బు):Thalassemia
To Make a Difference (MAD) ఏం చేస్తోంది?
తల్లుల్ని తయారుచెయ్యాలి
నా బ్లాగుపై వచ్చిన సమీక్షలు
సూటిగా, వాడిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా – చరసాల ప్రసాద్
నా బ్లాగును రావుగారు సమీక్షించారు.
నా పాత బ్లాగులు చూద్దామని ఒకసారి వెళితే charasala.wordpress.comలో సందర్శకుల సంఖ్య నన్నాకర్షించింది. అందులోంచి నేను అక్టోబరు 2006లో నిష్క్రమించాను. ఇప్పటికి అక్కడికి వచ్చిన సందర్షకుల సంఖ్య 7160.
నా బ్లాగుకు ఏడాదినుండీ వస్తూ మీ అమూల్యమయిన అభిప్రాయాలను ఇస్తూ వస్తున్న పాఠకులందరికీ నా వందనాలు. మీ విమర్షలే నన్ను నేను మార్చుకోవడానికి, మలచుకోవడానికి పనికి వస్తాయి. అన్నిటినీ మించి ఎందరినీ మితృలను చూపించాయి.
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: June 4, 2007 సమయము: 11:55 am
మీకు మొదటి వార్షిక మహొత్సవ శుభాకాక్ష లు.
మీరు చాలానే వ్రాసేశారు.
– విహారి
తేది: June 4, 2007 సమయము: 12:17 pm
అమ్మో మీరు బ్లాగ్ధోనీ అన్నమాట
మీ బ్లాగ్వర్షానికి మొదటి వార్షిక మహోత్సవ సందర్భంగా శుభాభివందనాలు
తేది: June 4, 2007 సమయము: 12:28 pm
బ్ల్లాగాభివందనాలు…
తేది: June 4, 2007 సమయము: 1:49 pm
ఏడాది పండగ శుభాకాంక్షలు. 170 రాసేసారా అప్పుడే!!
రిజర్వేషాలు నాటి మీ దూకుడు నిదానంగా తగ్గుతూ వచ్చిందేమోనని మొన్నటి దాకా అనుకునేవాణ్ణి.
మీ బ్లాగు తెలుగు బ్లాగుల్లోకెల్లా ఉత్తమమైన వాటిల్లో ఒకటి. ఆ ఉత్తమత్వాన్ని అలాగే నిలుపుకుంటూ కొనసాగాలని కోరుకుంటున్నాను.
కొనసాగించండి..
తేది: June 4, 2007 సమయము: 2:10 pm
అవును. చరసాలగారి బ్లాగ్ అంటే నాక్కూడా “రిజర్వేషాలు” గుర్తొస్తూ ఉంటుంది.
తేది: June 4, 2007 సమయము: 2:59 pm
మీ బ్లాగు మొదటి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంషలు. మీ బ్లాగుపై నా సమీక్షలంకె కింద ఇస్తున్నాను.
http://tinyurl.com/2r7ygd
ఉపయోగం అనుకుంటే, మీ బ్లాగులో ఈ సమీక్షకు లంకె ఇవ్వండి; త్రివిక్రం తన అవీ -ఇవీ బ్లాగులో,నా సమీక్షకు లంకె ఇచ్చినట్లుగా.
తేది: June 4, 2007 సమయము: 4:02 pm
మీ బ్లాగు కు జన్మ దిన సుభాకాంక్షాలు.
రాస్తూనె ఉండండి
తేది: June 4, 2007 సమయము: 4:25 pm
సంవత్సరం నిండిందంటే, ఇక నడక వచ్చేసినట్టే! మెల్లగా పరుగులు తీయవచ్చుననుకుంటాను!!
తేది: June 4, 2007 సమయము: 4:27 pm
మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు.ఇలానే మరిన్ని మంచి వ్యాసాలు రాస్తూ మరింతమందికి అభిమాన బ్లాగరు అయిపోండి.
తేది: June 4, 2007 సమయము: 9:46 pm
సూటిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా మరిన్ని వ్యాసాలు మీ నుండి ఆశిస్తూ మీ బ్లాగుకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు.
తేది: June 4, 2007 సమయము: 9:53 pm
మీ బ్లాగ్ కు ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలు!!
తేది: June 4, 2007 సమయము: 11:04 pm
మీ బ్లాగు మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
తేది: June 5, 2007 సమయము: 12:02 am
ఇప్పుడంటే చాలా బ్లాగ్ లు వచ్చాయి కాని మొదట్లో ఉన్న అతి కొద్ది తెలుగు బ్లాగ్ లలో నేను తప్పకుండా చూసే బ్లాగ్ మీది. మాంసాహరం పోస్ట్ నుంచి ఆ అభిమానం అలా కొనసాగుతుంది.
తేది: June 5, 2007 సమయము: 4:23 am
పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరన్నది సరైనది. మన బ్లాగు మన ప్రతిబింబం- మనగురించి మనకి అతిదగ్గరవాళ్ళుకూడా మనగురించి బ్లాగుకన్నా మిన్నగా చెప్పలేరు. మీ అభిప్రాయాలని ఖండించేవాళ్ళు కూడా మిమ్మల్ని అభిమానించకుండా ఉండలేరని నా అంచనా. మీరు మా అందరి బ్లాగులపైనా- ముఖ్యంగా నా బ్లాగుమీద – అభిమానంగా రాసే వ్యాఖ్యలు ఎంతో ప్రోత్సాహకంగా ఉంటాయి. మీవి, రాధికగారివి వ్యాఖ్యలు లేక పోతే వ్రాసిన బ్లాగు వేస్టయి పోయిందన్న అనుభూతి కలుగుతుందంటే అతిశయోక్తి కాదు.
ఎక్కడైనా అన్యాయం, అణచివేతలు, బాధలు, కనిపిస్తే మీ గొంతు వినిపించకుండా లేదు. మీది భిన్న స్వరం. గుడ్డిగా ఆమోదించే వాళ్ళ కన్నాభిన్న స్వరం వినిపించగలవాళ్ళే ఎక్కువ విలువైన వాళ్ళు, ఉపయోగకరమైన వాళ్ళు. మీరిలాగే మీ బ్లాగులని, బ్లాగర్లకి అందింఏ స్నేహహస్తాన్ని, ముఖ్యంగా సామజిక స్పృహని నిత్యోత్సాహంతో కొనసాగించగలరని ఆశిస్తూ- భవదీయుడు సత్యసాయి
తేది: June 5, 2007 సమయము: 5:46 am
పుట్టినరోజు శుభాకాంక్షలు. నిజమే మీ బ్లాగు మీ అంతరంగాన్ని విభిన్న కోణాలలో చూడగలిగాము. మీ బ్లాగు రచనలు, ఇతర బ్లాగర్లకు చేసే వ్యాఖ్యలు బాగుంటాయి. అందుకే మీరు దాదాపు అందరి బ్లాగులలో కొలువై ఉన్నారు. ఇలాగే కొనసాగించండి.
తేది: June 5, 2007 సమయము: 7:31 am
మీ అభిమానానికి కృతజ్ఞతాభివందనములు.
–ప్రసాద్
తేది: June 5, 2007 సమయము: 7:45 am
అభినందనలు.
రచ్చబండ నుండి పొద్దు పరిచయం అయ్యింది. పొద్దు ద్వారా మీ బ్లాగు పరిచయమ్ అయ్యింది. మీ బ్లాగు ద్వారా TMAD పరిచయమ్ అయ్యింది. తద్వారా నా బ్లాగు మీ సహాయంతో మొదలయ్యింది.
నాకు మీ బ్లాగులో అన్నిటికంటే నచ్చేది తెలుగులో ఇక్కడే వ్యాఖ్యలు రాయగలగడం.
చాలా బ్లాగులు ఆ బ్లాగరులని ఒక కోణం నుండి చూపిస్తాయి. మీ బ్లాగు మటుకు మిమ్మల్ని పలు కోణాలనుంచి పరిచయం చేస్తుందనిపిస్తుంది నాకు. వివిధ వర్గాలలో మీరు రాసిన టపాలు చాలా చదివి కానీ మీలాంటి వారి మీద అభిప్రాయమ్ ఏర్పరుచుకోకూడదని నాకు అనిపించింది. ఇలా నాకు మాత్రమే అనిపించిందేమో మరి తెలియదు.
తేది: June 7, 2007 సమయము: 11:16 am
అప్పుడెప్పుడో మీరు నవీన బ్లాగులో అసమర్ధుని జీవయాత్ర గురించి అభిప్రాయాలు బ్లాగుతానని శలవిచ్చారు – బ్లాగారా?
తేది: July 23, 2007 సమయము: 8:53 pm
నేను ఇప్పుడు చూస్తున్నా అండి ఈ టపా ని. మీ బ్లాగుకి మొదటి జన్మదిన శుభాకాంక్షలు…