- అంతరంగం - http://www.charasala.com/blog -

నా కళ్ళముందర పుట్టింది, పోనూ పోయింది

Posted By చరసాల On May 31, 2007 @ 9:00 am In చరిత్ర, వర్తమానం | 1 Comment

లక్కిరెడ్డి పల్లె [1] శాసనసభా నియోజక వర్గం నాకు వూహ తెలిసాక పుట్టింది. ముందది సమితిగా వుండేది. ఆ తర్వాత తాలూకా కేంద్రంగా, నియోజక కేంద్రంగా అయ్యింది. ముందునుంచీ కూడా రాజగోపాల్ రెడ్డి ఎక్కువ సార్లు గెలిచాడనుకుంటాను. సమితి ప్రెసిడెంటుగా ఒకసారి గెలిచిన గడికోట మోహన్ రెడ్డి ఈ ఒక్కసారే శాసన సభ్యుడుగా గెలిచారు. రామసుబ్బా రెడ్డి, రామసుభ్భా రెడ్డి కొడుకు హరినాధ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కొడుకు రమేశ్ రెడ్డిల యుగం వచ్చింది.
ఇప్పుడిక పునర్విభజనలో లక్కిరెడ్డి పల్లె ముక్కలు చెక్కలయి తలోదిక్కూ పోయింది. లక్కిరెడ్డి పల్లె, రాయచోటి [2] నియోజక వర్గాలు కడప జిల్లాలో భాగమే గానీ నైసర్గికంగా చిత్తూరు జిల్లాతో దగ్గరగా వుండటం మూలాన, వీటిని మిగతా కడప జిల్లాతో అన్ని వైపులా కొండలు వేరు చేస్తున్నందునా కడప ఫాక్షనిస్టు వాసనలు అంతగా తగల్లేదు. కొండకచో ఎన్నికల్లో రాగద్వేషాలు బుసలు కొట్టినా ఆ తర్వాత అందరూ మళ్ళీ సహజీవనం చేస్తుంటారు. సరైన నాయకత్వం లేక పోవడం వల్ల, సరైన కాలువలు గానీ, నదులు గానీ, రైల్వే మార్గాలు గానీ (కడప-బెంగుళూరు జాతీయ రహదారి తప్ప) లేక పోవడం వల్ల ఈ ప్రాంతం అభివృద్దికి దూరంగానే వుంది. ఇప్పుడు కడప జిల్లా నుండి ముఖ్యమంత్రి వున్నా పులివెందుల నుండీ లక్కిరెడ్డి పల్లె కూతవేటు దూరంలో వున్నా జరుగుతున్న అభివృద్ది స్వల్పమే. మంచినీటి, సాగునీటి కొరకు కనీస ప్రయత్నమయితే ఈయన హయాంలోనే జరుగుతుందనుకోవచ్చు.
ఈ రెండు ప్రాంతాలూ రాజంపేట లోకసభా స్థానం కిందకు వస్తాయి. ఇక్కడ నుండీ పలు పర్యాయాలు ఎన్నికయిన సాయి ప్రతాప్ [3] రాజశేకర నీడలో పెరుగుతున్నాడే తప్ప ప్రజల నీడ పట్టించుకున్న పాపాన పోలేదు. ఏనాడైనా ఈ ప్రాంత సమస్యల గురించి పార్లమెంటులో కనీసం ఒక్క ప్రశ్న అడిగినట్లూ నేను చూడలేదు. మందకు లెక్క రావడానికి తప్ప దేనికీ పనికి వస్తున్న జాడ లేదు.
ఇప్పుడు కాస్తా ఆ వున్న నియోజక వర్గమూ మాయమయ్యింది. ఇక ఈ ప్రాంతాలన్నీ ఏదో ఒక నియోజక వర్గపు చిట్ట చివరి ప్రాంతాలవుతాయి.
ఇప్పటికే పట్టని ఈ ప్రాంతపు గోడు ఇక ముందసలు పట్టదనుకుంటా!

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=173

URLs in this post:

[1] లక్కిరెడ్డి పల్లె: http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86&oldid=23154

[2] రాయచోటి: http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%9A%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BF&oldid=23165

[3] సాయి ప్రతాప్: http://www.indianngos.com/mps/rajampet.htm