జరిగిన కథ

తేది: April 6, 2007 వర్గం: నా ఏడుపు, వర్తమానం రచన: చరసాల 2,440 views

అది వేసవి కాలం. పాలిటెక్నిక్ ప్రొద్దుటూరులో చదువుతూ వేసవి సెలవులకు నేను మా వూరొచ్చాను. ఇంట్లో పడుకొని ఏదో చదువుకుంటున్నాను. మధ్యాహ్న సమయమనుకుంటాను. వేసవి అనగానే మా వూర్లో నాకు గుర్తొచ్చేది చెట్లకింద, పందిళ్ళ కిందా మంచాలు వేసుకొని సేద తీరే జనమే! బోలెడన్ని విషయాలు వాళ్ళ మద్య దొర్లిపోతూ వుంటాయి. గొడవలకు కూడా అవి ఒక్కోసారి కారణభూత మవుతూ వుంటాయి.
బయటేదో ఎవరో అరుస్తున్నట్లు, తిడుతున్నట్లు వినిపించటంతో బయటకు వచ్చాను. మా యింటి ఎదురుగా వున్న ఇంటి బయట పందిరి కింద పిచ్చాపాటీ మాట్లూడుతూ వుండిన పెద్దలు అటుగా వెలుతున్న ఖానా గాడిని (అసలు పేరేంటో నాకూ తెలియదు) నేనిక్కడ రాయలేని విధంగా “నీ యమ్మ…” నీ యక్క…” అని తిడుతూ అరుస్తున్నారు. ఈ “ఖానా గాడికీ” ఇంచుమించు నా వయసే. వాళ్ళు నలుగురన్నదమ్ములు. మిగతావారిలా కూలీ నాలీ చేసుకుని వూరిని నమ్ముకొని వుండకుండా వీడు కొంత పట్నపు వాసన చూసిన వాడు. పల్లెటూరి అమాయకత్వం కాకుండా అంతో ఇంతో మిడిమిడి లోకజ్ఞానం తెలుసుకున్న వాడు. వాన్ని వీళ్ళు తిడుతున్నారు. కారణమేంటయ్యా అని కనుక్కుంటే ఈ ఖానాగాడి నాన్నో లేక ఈ ఖానాగాడో అప్పు తీసుకొని ఇంకా ఇవ్వలేదట! అది తీర్చమని అడిగితే…”ఇదిగో అదిగో తీరుస్తామని..” చెబుతున్నాడట! అది కోపకారణమయింది. మాదిగోడే కదా ఏమి తిడితే ఏమవుతుందిలే అని నోటికొచ్చిన బూతులన్నీ వాడిమీద ప్రయోగించారు. అదే వూర్లోనే బతుకుతున్న మాదిగలైతే “మా రైతే గదా…” (మా అమ్మే గదా అనుకున్నట్లు) అనుకొని దులుపుకొని పోయేవారే, కానీ వాడు పట్నం వాసన తగిలిన వాడు కదా, కోపం పట్టలేక తిరిగి వాళ్ళను తిట్టాడు.
కథ అక్కడితో అయిపోయిందనుకుని నా పాటికి నేను చదువుకోవడానికి లోపలికి వెళ్ళి పోయాను. అయితే ఓ మాదిగోడు రైతును తిట్టిన వింత(రైతు తిట్టడం సహజం కదా మాదిగోడు తిట్టడమే వింతల్లోకెల్లా వింత) ఆనోటా ఈనోటా పడి పనుల్లేక పందిళ్ళకింద ముచ్చట్లు పెట్టుకున్న ప్రజలందరికీ తెలిసి పోయింది.
రామయ్య ఇలా అన్నాడు “నా చిన్నప్పటి నుండీ చూస్తూనే వున్నా మా కాలంలో మాదిగోళ్ళు ఎలా వున్నారు? ఇప్పుడెలా వున్నారు? కండకావరం పెరిగి పోయింది. పెద్దా చిన్నా అనే తేడా లేకుండా పోయింది.”
సోమయ్య (అసలు పేర్లు కావు):”ఇదిగో ఈ గవర్నమెంటుకు వాళ్ళు దేవుడి బిడ్డలట! ఇళ్ళు కట్టించిరి, ఎనుములు (గేదెలు) కొనిచ్చిరి. వాళ్ళ పనులు వాళ్ళకుండె ఇక మనకు పనికేం వస్తారు? మనలను ఏం లెక్కపెడతారు?”
ఇలా తలా ఒకరు మాట్లాడి ఒకళ్ళలో ఒకరికి పౌరుషాలు ఎగదన్ని వీన్ని ఉపేక్షిస్తే ఇంకొందరు ఇలాగే తయారవుతారని…ఖానా గాన్ని శిక్షించడానికి బయలు దేరారు. వాన్ని మందీమార్బలంతో వెళ్ళి పట్టుకొని తెచ్చి గుంజకు కట్టేసి కొట్టారు.
ఆ సాయంత్రం పనులకు వెళ్ళి ఇంటికొచ్చిన హరిజనవాడ వారందరికీ జరిగిన అన్యాయం తెలిసిపోయింది.
“తెలిసో తెలియకో ఉడుకు రక్తంలో వాడు ఒక మాట తిడితే మాత్రం పెద్ద మనుషులందరూ పట్టుకొని పిల్లగాన్ని కొడతారా?” అని ఒకరికి ఒకరు చెప్పుకొన్నారు. పోలీసు రిపోర్టు ఇద్దామని కూడా బయలుదేరారని వినికిడి. (కానీ ఇవ్వలేదు). తప్పు చేసిన పిల్లోన్ని దండించకుండా (వీళ్ళ దండన చాల్లేదని) పోలీసు రిపోర్టు అంటారా అని “తమ వూర్లో నుండీ గానీ, తమ పొలాల్లో నుండీ గానీ మాదిగోళ్ళు నడవకూడదు” అని పెద్దలంతా తీర్మానించారు. వూరూ, వూరు చుట్టు పక్కల పొలాలన్నీ రైతులవే అయినప్పుడు ఈ మాదిగలు దాసోహమనక ఏమి చేస్తారనే పట్టుదల పెద్దలది.
కానీ మరుసటిరోజు మాదిగోళ్ళంతా పోలీసు రిపోర్టిస్తే చాలా కథ జరుగుతుందని భయపడి రైతులంతా ఓ రెడ్డి దగ్గరకు పంచాయితీ చెప్పమని వెళ్ళారు. ఈ రెడ్డి పులివెందుల నుంచీ వచ్చి మా వూరి దగ్గర “కంకర మిషన్” పెట్టాడు. దానికి కావలిసిన కూలీలంతా మా వూరు, హరిజన వాడ నుంచే వెళతారు. ఆయన మీద ఆధారపడిన వారు గనక ఆయన చెబితే వింటారని రైతులు వెళ్ళి ఆయనను పిలుచుకొచ్చి ఆ మరునాటి రాత్రి పంచాయితీ పెట్టించారు.
ఆ పంచాయితీకి నేనూ వెళ్ళాను. మా వూర్లో గానీ, పొలాల్లో గానీ అడుగు పెట్టొద్దన్నారని మాదిగోళ్ళెవరూ ఈ పంచాయితీకి రాలేదు. ఇంకేమి పంచాయితీ అంతా ఒకే పక్షం అయ్యారు. ఒక్కొకరు మాదిగోళ్ళ చేతిలో పడ్డ భాధలు చెబుతున్నారు.
“ఆ కర్రోడు మొన్న ఎద్దుల బండిలో ఎదురు పన్నాడు. కనీసం దిగనూ లేదు. కలియుగం నాయనా కలియుగం.”
“మొన్న కూలీలను పిలుద్దామని వెలితే ఆ లచ్చిగాడు మంచంమీద కూర్చుని సద్దన్నం తింటాండు. చూసినా చూడనట్టే (చూసే వుండడు అనుకోరాదూ)లేవకుండా తింటున్నాడు. ఆ పక్కకు వెళ్ళాలంటేనే మొహం చెల్లట్లేదు.”
“ఈ మాదిగోళ్ళకు ఏమి కొమ్ములొచ్చినాయని!! ఈ పిచ్చి గవర్నమెంటు కొంపలిచ్చె, కోళ్ళిచ్చె, భూములిచ్చె. ఇక వాళ్ళు మనకేం పలుకుతారు? అప్పుడెప్పుడో బ్రంహ్మం గారు చెప్పలా మాదిగోడు రాజ్యమేలతాడని…అక్షరాలా జరుగుతోంది.”

ఇలా తలో మాటా విసురుతున్నారు. అందరి మద్యలో మంచం మీద కూర్చున్న రెడ్డి “ఇది తప్పే, మాదిగోడు రైతును తిట్టడం తప్పే” అన్నాడు.
నాకు ఆవేశం వచ్చింది. అంత ఆవేశం ఇంతకు ముందు మా వూరి పోలింగ్ బూతులో అన్నకు (తెలుగుదేశానికి) ఓటు వేయనీకుండా కాంగిరేసు గూండాలు వచ్చి రిగ్గింగ్ చేస్తుంటే వచ్చింది. “ఖానాగాన్ని వీళ్ళు తిట్టినందుకే గదా వాడు వీళ్ళని తిట్టాడు? అంతటితో పోనియ్యక మళ్ళీ వాన్ని పట్టుకొచ్చి ఎందుకు కొట్టినట్లు? ఎద్దుల బండిలో వాడి దారిన వాడు పోతున్నప్పుడు ఈయనొచ్చాడని ఎందుకు బండి దిగాలి?” ఇలా ఎదురు ప్రశ్నిస్తే అందరూ వీడేంటి ఇలా అపసవ్యంగా మాట్లాడుతున్నాడని బుగ్గలు నొక్కుకున్నారు.
“చదవేస్తే వున్నమతి పోయిందట” అంది ఓ అక్క.
“చదువుకున్నోడి కంటే చాకలోడు మేలనేది ఇందుకే” అంది ఓ పెద్దమ్మ.
“ఇంటికి వెళ్ళనీ… నా కొడుకుని..రెండురోజులు అన్నం పెట్టకుండా మాడిస్తే…” అంది మా అమ్మ. (అందే గానీ మాడ్చలేదనుకోండి.)
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'జరిగిన కథ' పై 9 అభిప్రాయాలు

'జరిగిన కథ'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. radhika అభిప్రాయం,

  తేది: April 6, 2007 సమయము: 3:23 pm

  మా ఊరిలో అయితే డబ్బులు తీసుకున్నది ఏ కులమోడయినా సరే అన్న టైముకి ఇవ్వక పోతే తిడతారండి.కొట్టిన సందర్భాలు కూడా వున్నాయి[అగ్రకులపోడిని కూడా].అప్పు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వనప్పుడు తిట్టడం పల్లెటూళ్ళలో చాలా సహజం.అసలు ఊర్లలో పలకరింపులే తిట్లలా వుంటాయి.ఇది మీకు తెలీనదా?కనీ అతను కూడా తిట్టాడని ఊర్లోకి రానివ్వకపోవడం అన్నది చాలా దారుణం.మా ఊరిలో బాగా మోతుబరి కొడుకు మాల వాళ్ళ కుర్రాడిని ఏ తప్పూ లేకుండా ఏదో అన్నాడని చెట్టుకు కట్టి చెప్పు పెట్టి కొట్టారు.కాని పెద్దలెవరూ ఏమీ అనలేదే?పైగా ఆ మోతుబరి కొడుక్కి పంచాయితీలో ఫుల్ గా చీవాట్లేసారు.తప్పెవడు చేసినా తప్పేనండి.అన్ని కులాల్లోని మంచోళ్ళు,చెడ్డోళ్ళు వుంటారు.తాతల ముత్తాతల కాలం మాదిగలు,మాలలు అలా ప్రవర్తిస్తే వాళ్ళకి కోపం వచ్చి వుండొచ్చు.అంతకు ముందు వరకు వున్న పరిస్తితులని బట్టి వాళ్ళు ఆ మార్పు భరించలేకపోయారు.అప్పటి వారు విధ్యావంతులు కాకపోవడం వల్ల అలా ప్రవర్తించారు.కానీ మన తండ్రుల కాలం వచ్చేసరికి పరిస్తితి మారింది.వాళ్ళు అడ్డు తప్పుకోవాలి,లేచి నుంచోవాలి లాంటివి దాదాపుగా సమసిపోయాయి.మాదిగల పిల్లలయినా,మాలల పిల్లలయినా విద్యావంతులు అయివుంటే వాళ్ళకీ ఊరిలో చాలా మర్యాద లభిస్తుంది.

 2. సరిగమలు అభిప్రాయం,

  తేది: April 7, 2007 సమయము: 12:31 am

  మీరు చెప్పిన పరిస్థితులు ఇంకా ఇప్పుడు కూడా మీ వూరిలో వున్నాయా? మా వూరిలో అయితే అగ్రకులాలే దళితులకి భయపడతారు. ఇప్పుడే కాదు మా చిన్నప్పటినుండి ఇదే పరిస్ఠితి. పొలాలలో కుప్పలనుండి పనలు తీసుకెళ్ళటం నుండి వాళ్ళు ఏం చేసినా అడగకూడదు. వాళ్ళకి భయపడుతూ బ్రతుకుతారు. అదే అగ్రకులాల వాళ్ళు చేస్తే కులహంకారం, మరి దళితులు చేస్తే? తప్పు అన్నది ఎవరు చేసినా తప్పే కదా? అహ నా బ్లాగంట లో మీ ప్రతిస్పందన ఏక పక్షంగా అనిపించిందండి నాకు.

 3. దిలీప్ అభిప్రాయం,

  తేది: April 8, 2007 సమయము: 4:39 am

  అప్పుడు అమ్మ నీకు “అన్నము పెట్టాకుండా మాడుస్తా” అంది కదా మొన్న ఆ మద్యా ఈ కానా వల్లా అన్న ఇక్కడా మలైసియా వచ్హి ఒకా అజెంట్ చెతిలొ మొసపొయి రొడ్డునా పడ్డాడు, నెను ఇకడె వున్న సంగతి తనకు తెలుసు, నా రుము లొనె ఒక 20 రొజుల పాటు వున్నాడు, ఇది అంతా అమ్మకు తెలుసు కాని ఎమి అనలెదు కాని, ఎలాగొలాగా ఉరు చెర్చను తను ఉరిలొ మాత్రము కచ్హితంగా చెప్పివుంటాడు ఇంకా ఉరికెల్లినపుడు కచ్హితంగా జొకులెస్తారు “ఎమిటి అంతా కలిసిపొయరంటా అని” మన ఉరిలొ ప్రస్తుతము మెలె వాల్లు నీరు కొసము మన ఉరిలొ చెతిపంపుకు వస్తారు , అదె మన పక్క ఉరు లొ అలా లెదు (గొపగూడి పల్లె) రైతు పొలము లొని బావిలొ కుడా వాల్లు దిగ కుడదంటా త్రాగ కూడా దంటా, ఇకా మన అక్క గారి ఊరు (చిన్నరుసు పల్లె) ఇంకా్ చెప్పులెసుకొని ఊరిలొకెల్లాకుడాదంటా. చెతిలొ పటుకొని వెల్లాలాంటా. ఈ ఉరు ఎ కొండ కొన లొ నొ వుందెమొ అనుకొకండి, కడప నుండి బెంగులురు వెల్లె దారిలొ రాయచొటి తరువాత వస్తుంది.

 4. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: April 9, 2007 సమయము: 9:57 am

  రాధిక గారూ,
  విద్యావంతులైన మాల పిల్లలనీ గౌరవ్స్తున్న మీలాంటి వూరులో నేనూ పుట్టింటే బావుండును. ప్చ్ … మావూరిలో కానీ ఆ చుట్టూ పక్కల నాకు తెలిసిన ఏ వూరిలో కానీ ఈ పరిస్థితి లేదు.
  మనం పెరిగిన పరిసరాలు మనలను ప్రాభావితం చేసినట్లే నా అనుభవాలు నాకు తెలిసిన విషయాలు నన్ను దళిత సానుభూతిపరున్ని చేశాయి. ఎక్కడో ఓచోట దళితులు సమాన గౌరవం (నేను నమ్మలేను) పొందుతున్నారేమొ గానీ అధిక శాతం నా వురులాంటి లేదా అంతకంటే హీనమయిన పరిస్థితుల్లోనే నివసిస్తున్నారనేది నా గాడమైన విశ్వాసం.

  సరిగమలు గారూ,
  మా వూరులో ఇప్పటికీ ఈ పరిస్థితులు వున్నాయి. నీళ్ళు పైనుంచీ పోస్తే వాళ్ళు తాగాల్సిందే. అటువైపు వెళ్ళితే లేవాల్సిందే. (లేవకపోతే తిట్టుకోవడం తప్ప ఏమీ చేయరనుకోండి) ఒకరినొకరు ముట్టుకోవడం, ఒకే దిగుడు బావిలో నీళ్ళు తాగడం లాంటివి ఎమ్మటినుండో వున్నాయి కానీ దేవాలయ ప్రవేశం లాంటివి ఇంకా లేవు. అయినా నాకు తెలిసిన మా చుట్టు పక్కల వూర్లకంటే మా వూరే ఎంతో నయం. కొందరు వరసలు పెట్టి కూడా పిలుచుకుంటారు. ఒకరి పెళ్ళిళ్ళకు ఒకరు వెళతారు. కానీ దళితేతరులు దళితుల పెళ్ళీకి వెళ్ళినపుడు తినకుండ పెళ్ళీ చూసి వచ్చేస్తారు. దళితులు దళితేతరుల పెళ్ళికి వచ్చినపుడు కడపటి ఫంక్తిలో నేల మీద కూర్చుని తింటారు.
  మీ వూర్లో దళితులను చూసి భయపడతారంటే ఆ భయం ఒకలాంటి అసహ్యంతోనో కాలాన్ని బట్టి వస్తున్న మార్పును సహించలేకనో అనుకోవచ్చునా? ఎవరు తప్పు చేసినా తప్పే కాదనను, కానీ ఎవరు అధిక తప్పులు చేస్తున్నారు అనేది కూడా వుంది కదా?
  “అహ నా బ్లాగంట”లో నా ప్రతిస్పందన ఏక పక్షంలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే నేను ఏకపక్షమే! ;) నాది ఆణచబడిన ప్రజల పక్షం. తమ స్వంత భూమిపై, తమ స్వంత మతస్తులచే పశువుల కంటే హీనంగా చూడబడుతున్న ప్రజల పక్షం. నీతి X అవినీతి, న్యాయం X అన్యాయం, పీడితులు X పెత్తందారీలు ఈ రెండు పక్షాలలో మీరు ఏదో ఒక పక్షం వైపే వుండగలరు కానీ రెండువైపులా వుండలేరు కదండీ.
  అయినా నేను ఎవరినైనా నొప్పించివుంటే క్షమించండి.

  –ప్రసాద్

 5. Ambanath అభిప్రాయం,

  తేది: April 26, 2007 సమయము: 10:53 am

  ఏ పక్షం న్యాయబద్ధమైంది ? అనేది ఎవరూ నిర్ణయించజాలరు. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన ప్రతివాడూ పుట్టుకతోనే ఏదో ఒక పక్షానికి చెంది తీరాలి గనుక. కనుక “నేను పీడిత తాడిత జనాల పక్షం” అని ఎవరైనా చెప్పినా కూడా ఇతర వర్గాలలో ఆ మాటలకి విశ్వసనీయత దాదాపు శూన్యం. ప్రతి వర్గంలోను పీడితులూ తాడితులూ సమాన సంఖ్యలో ఉన్నారనే వాదాన్ని కూడా తేలికగా త్రోసి పుచ్చలేం. మన ఆంధ్రప్రడేశ్‌లో దళితుల కంటె ఘోరమైన సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని ఎదుర్కుంటున్న వర్గం బ్రాహ్మణులే అని ఒక సర్వే ద్వారా తెలుస్తోంది.అందుచేత మనుషుల్ని వర్గాలుగానో కులాలుగానో చూసి generalize చెయ్యడం మానేసి వ్యక్తులుగా వారి బలాబలాల్ని లెక్కలోకి తీసుకోవాల్సిన రోజులు వచ్చాయని నేననుకుంటున్నాను. మనిషి మీద సమాజం పట్టు సడలిపోయి వ్యక్తి ప్రయోజనాలు సమాజ ప్రయోజనాలు పూర్తిగా ఒకటి కాదన్న రోజులు వచ్చాక మన దృక్పథాల్ని మార్చుకోక తప్పదు.ఒక తెలుగు జాతీయవాదిగా నేను అన్ని రకాల కులపరమైన prejuduces ని వ్యతిరేకిస్తాను.

 6. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: April 27, 2007 సమయము: 8:15 am

  అంభానాధ్ గారూ,
  పుట్టుకతో ఏదో ఒక పక్షానికి చెందితే చెందవచ్చు గాక! కానీ తన అనుభవాలతో, విజ్ఞతతో ఆ తర్వాతైనా అతడు తను ఏ వర్గం వైపు న్యాయం వుందో తెలుసుకోగలుగుతాడు ప్రయత్నిస్తే!
  అలాగే పక్షాలు వున్నాయనే స్పృహ వుంటే అందులో ఏ పక్షంవైపు న్యాయం వుంది అనే స్పృహ కూడా వుంటుంది. అయితే ఫలానా పక్షం వైపు న్యాయం వుంది అని నేను భావిస్తే అదే అందరికీ సమ్మతం అవ్వాలని లేదు! అలా అందరికీ సమ్మతమైన పక్షాన్నే నేను నిలబడాలనీ లేదు. నా న్యాయం, నా వర్గ పక్షపాతం “ఇతరుల విశ్వావిశ్వాసాల” మీద ఖచ్చితంగా ఆధారపడదు. ఆధారపడాలని కూడా నేను కోరుకోను.
  ప్రతి వర్గంలోనూ పీడితులూ, తాడితులూ సమాన సంఖ్యలో వున్నారనే వాదాన్ని నిర్ద్వందంగా ఎందుగు ఖండించలేం? ఒకే సమస్య ప్రాతిపదిక గా చూస్తే ప్రతి వర్గంలోనూ సమాన సంఖ్యలో పీడితులు ఎలా వుంటారు? వుంటే వాళ్ళు వేరు వేరు వర్గాలెలా అవుతారు? వుదాహరణకు వేరు వేరు కులాలనుండీ వేరు వేరు పరిస్థితుల వల్ల వేశ్యలయిన వారంతా ఒకేరకమైన సమస్య ఎదుర్కొంటారు. ఆ సమాస్య కారణంగా వారంతా ఒకే వర్గం అవుతారు. ఆ వర్గంలోని సమస్య ఇంకో వర్గంలో సమాన సంఖ్యలో ఎలా వుంటుంది?
  దళితులూ అంతే! కాకపోతే వీళ్ళ సమస్య వాళ్ళ పుట్టుకతో వచ్చింది. వాళ్ళకున్న అస్పృశ్యతా సమస్య ఎవరికి వున్నా వాళ్ళంతా దళితులే అని పిలవబడతారు. వాళ్ళ సమస్య అన్ని వర్గాలలోనూ వున్న సమస్య ఎలా అవుతుంది?
  దళితుల కంటే ఘోరమైన సామాజిక, ఆర్థిక సమస్యలని ఏ బ్రాహ్మణ వర్గం ఎదుర్కొంటూన్నది? ఎక్కడ ఎదుర్కొంటున్నది? ఏ సర్వే చెప్పింది? బ్రాహ్మణ సంఘ నివేదిక కాదుకదా ఇది? ఇప్పటి పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోయిన బ్రాహ్మణులను చూశాం గానీ, సామాజికంగా వాళ్ళకొచ్చిన లోటేంటి? వాళ్ళెదురుగా వస్తే ఎవరు మొహం చాటుచేసుకుంటున్నారు? వాళ్ళు ముట్టుకున్నారని ఎవరు పాత్రలను ప్రక్షాళన చేసుకుంటున్నారు? సహపంక్తిలో వాళ్ళతో భోజనం చేయడానికి (ఆర్థిక హోదా అడ్డురాకపోతే) ఎవరు, ఎక్కడ అడ్డు చెబుతున్నారు?
  సమాజంలో ఇంకా వ్యక్తి బలాబలాల్ని గాక వాడి పుట్టుకనీ, వంశాన్నీ, తండ్రీ తాతల సుగుణాలనీ చూసి ప్రేమిస్తున్నన్ని/ద్వేషిస్తున్నన్ని రోజులూ అలాంటి పరిస్థితుల మీద తిరుగుబాటూ, ద్వేషమూ, పోరాటము కూడా వుంటాయి. ఒక వర్గం మీద జరుగుతున్న దాడులని ఖండించడం కూడా వర్గాన్నో, కులాన్నో ప్రోత్సహించినట్లు గాదు!

  –ఫ్రసాద్
  http://blog.charasala.com

 7. Ambanath అభిప్రాయం,

  తేది: April 28, 2007 సమయము: 9:06 pm

  నేను ప్రస్తావించినది చాలా సంవత్సరాల క్రితం Indian Express చేసి ప్రచురించిన ప్రైవేటు సర్వే గురించి.అయితే మనకి కాస్త బ్రాహ్మణ కులస్తులతో సంపర్కం ఉంటే చాలు ఏ సర్వేలూ అవసరం లేదు, వారి పరిస్థితి ఏమీ బాగా లేదని తెలుసుకోవడానికి.

  1.బ్రాహ్మణులు తరతరాల పేదఱికంతో సతమతమౌతున్న మాట వాస్తవం. ఆ పేదఱికం ఇటీవలి కాలంలో మరీ దుర్భర పరిస్థితికి చేరుకున్న మాట కూడా వాస్తవం. వారిలో కొందరు రాజులిచ్చిన దానాలు అందుకుని భూస్వాములైనంత మాత్రాన మొత్తం కులమంతా ఖుషీగా బతికారని జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవం.ప్రాచీన సాహిత్యంలో అడుగడుగునా బ్రాహ్మణుల ప్రస్తావన కనిపిస్తుంది.అయితే వారంతా పేద బ్రాహ్మణులే.ఒక్క ధనిక బ్రాహ్మణుడి గురించి కూడా మనం చదవలేం.

  2.బ్రాహ్మణుల్లో స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న ఆ 5-10 శాతం ధనికులు కూడా స్వాతంత్ర్యానంతరం కనుమరుగైపోయారు. కారణం-చాలామంది బ్రాహ్మణులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.ఆ పాల్గొన్నవారి భూములన్నీ బ్రిటిష్ ప్రభుత్వం అప్పట్లో జప్తుచేసింది. వారు జైల్ నుంచి తిరిగొచ్చేసరికి వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆ రోజుల్లోమద్రాస్ గవర్నరు బ్రిటిష్ ప్రభుత్వానికి పంపిన నివేదికలో “మొత్తం 20 లక్షలమందిని రాజకీయ ఖైదీలుగా నిర్బంధించామని వారిలో ఎనిమిది లక్షలమంది బ్రాహ్మణు”లనీ తెలియజేశాడు.

  3. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనని బ్రాహ్మణులు పి.వి.నరసింహారావు అధికారంలోకి వచ్చేదాకా ధనికులుగా ఉండి అటుపిమ్మట దరిద్రులై కూర్చున్నారు. కారణం-భూసంస్కరణల పేరుతో ప్రభుత్వం భూమిని లాగేసుకోవడం. భూసంస్కరణలు అందరికీ వర్తించేవే అయినా ఆచరణలో మాత్రం ఈ లాగేసుకోవడం కేవలం బ్రాహ్మణుల విషయంలో మాత్రమే పకడ్బందీగా అమలుజరిగింది. ఎలాగంటే-అబ్రాహ్మణ కులాలవారు బినామీపేర్లతో తమ భూములు రిజిస్టర్ చేయించి ఆస్తులు కాపాడుకున్నారు.వారిలో కొంతమంది అతితెలివిపరులు భార్యకి విడాకులిచ్చి ఆమె పేరిట వేరుగా ఆస్తి రాసి ఆమెతో యథాపూర్వంగా కలిసి ఉన్నారు. ఈ పనులు ఏ కారణం చేతనో బ్రాహ్మణులు చెయ్యలేక ఆస్తులు పోగొట్టుకున్నారు.

  4. బ్రాహ్మణులు రెండు రకాలైన అణచివేతల్ని ఏకకాలంలో ఎదుర్కుంటున్నారు. మొదటిది-ఒక పక్క పాదాభివందనం చేస్తూ మరో పక్క ఆ పాదాభివందనం చేస్తున్న కాళ్ళనే పట్టుకుని లాగి కింద పడేసే ధోరణిలో తోటి అగ్రవర్ణాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ద్రోహం. రెండోది-బ్రాహ్మణులపై బ్రిటిష్ ఇండియా కాలంలో ప్రచారంలోకి వచ్చిన అసత్యాలు అర్ధసత్యాల ఆధారంగా వారిపై జరుగుతున్న విషప్రచారం-తన్మూలకంగా పెచ్చుమీరుతున్న సామాజిక అణచివేత.

  5.పీడిత వర్గాలు అన్నీ ఒకే విధమైన సామాజిక పరిస్థితుల్ని ఎదుర్కోవు.ఉదాహరణకి-అమెరికాలో blacks సమస్యలు వేరు. దక్షిణాసియాలో దళితుల సమస్యలు వేరు. అలాగే ఒక పీడిత వర్గంగా బ్రాహ్మణుల సమస్యలు వేరు. అవి వారి సామాజిక స్థితిని దళితుల కంటే అధ్వాన్నంగా మార్చిన వైనాన్ని క్లుప్తంగా వివరిస్తాను :

  (అ) అంతులేని పేదఱికంలో ఉన్నప్పటికీ రిజర్వేషన్ కల్పించకపోవడం వారి పరిస్థితిని చాలా దిగజార్చింది.రిజర్వేషన్ లేకపోవడం ద్వారా వారు అనేక ప్రభుత్వ పథకాలకి సైతం దూరమయ్యారు. ఉదాహరణకి హౌసింగ్ బోర్డు ద్వారా ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఇళ్ళన్నింటినీ రిజర్వుడు వర్గాలూ రాజకీయ పలుకుబడి ఉన్న అగ్రవర్ణాలూ నిశ్శేషంగా చేజిక్కించుకుంటూండగా వీటిల్లో దేనికీ చెందని బ్రాహ్మణులు ఇళ్ళు లేకుండానే మిగిలిపోతున్నారు.

  (ఇ) ప్రభుత్వం దేవాలయాలన్నింటినీ స్వాధీనం చేసుకుంది. కాని దేవాలయాల్లో పనిచేసే సిబ్బందిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి ఇతర ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతాలివ్వడానికి నిరాకరిస్తోంది. జీతాలే కాదు భత్యాలు కూడా లేవు. సెలవులు లేవు. పెన్షనూ లేదు.ప్రావిడెంట్ ఫండూ లేదు.గ్రాట్యూయిటీ అంతకంటే లేదు.మెడికల్ సరేసరి.ప్రభుత్వం స్వాధీనం చేసుకోక ముందే తమ పరిస్థితి బావుండేదని చాలా మంది బ్రాహ్మణులు వాపోతున్నారు. ఇది వ్యవస్థాగతంగా జరుగుతున్న అణచివేత.

  (ఉ) ఇతర అగ్రవర్ణాలు బ్రాహ్మణుల్ని శత్రువులుగా చూస్తున్నారు. కారణం-అవి ఇటీవలే చదువుకుని ఉద్యోగాల్లో ప్రవేశిస్తున్న కులాలు. వారికి బ్రాహ్మణులు పోటీదారులుగా కనిపిస్తున్నారు. ఆ అగ్రవర్ణాలకి సొంత కంపెనీలు ఉన్నాయి. కనుక వారికి తమ కులానికి చెందిన కంపెనీలో ఉద్యోగం రావడం సులభం. బ్రాహ్మణులు స్థాపించి నడిపే కంపెనీలు దాదాపుగా శూన్యం. అందుచేత ప్రైవేటులో కూడా బ్రాహ్మణులకి ఉద్యోగం దొరకడం గగనమౌతోంది. ఒకవేళ దొరికినా ప్రమోషన్ మాత్రం తమ కులస్థుడికే ఇస్తున్నాయి యాజమాన్యాలు. ఇది బ్రాహ్మణులకి ప్రైవేటురంగంలో ఎదురవుతున్న అణచివేత.

  (ఎ) బ్రాహ్మణులు రెండు రకాలైన అణచివేతల్ని ఏకకాలంలో ఎదుర్కుంటున్నారు. మొదటిది-ఒక పక్క పాదాభివందనం చేస్తూ మరో పక్క ఆ పాదాభివందనం చేస్తున్న కాళ్ళనే పట్టుకుని లాగి కింద పడేసే ధోరణిలో తోటి అగ్రవర్ణాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ద్రోహం. రెండోది-బ్రాహ్మణులపై బ్రిటిష్ ఇండియా కాలంలో ప్రచారంలోకి వచ్చిన అసత్యాలు అర్ధసత్యాల ఆధారంగా వారిపై జరుగుతున్న విషప్రచారం-తన్మూలకంగా పెచ్చుమీరుతున్న సామాజిక అణచివేత.

  (ఐ) కుటుంబాల్ని పోషించే సామర్థ్యం సన్నగిల్లడంతో బ్రాహ్మణులు పిల్లల్ని కనడం తగ్గించారు. ఇతర కులాలవారు విదేశాలకి వలసపోవడం గత 16-17 సంవత్సరాల నుంచి మొదలుపెట్టారు. కాని స్వదేశంలోని అణచివేత దుర్భర పరిస్థితుల కారణంగా బ్రాహ్మణులు 1965 ప్రాంతం నుంచే ఆ పని ప్రారంభించారు. తద్వారా బ్రాహ్మణ జనాభా శాతం బాగా తగ్గిపోయింది. కాని ఈ చర్య వారి దరిద్రాన్ని పరిష్కరించడంలో విఫలమైంది. ఎందుకంటే అసలు సమస్య జనాభా కాదు గనుక. అసలు సమస్య సామాజిక అణచివేత గనుక. ఇలాంటి అణచివేత సాధారణంగా ఈ క్రింది మార్గంలో
  పురోగమిస్తుంది.

  (సదరు వర్గంతో)సంపర్కలేమి –>సమాచార నిగూఢత్వం–>అపోహలూ అనుమానాలు భయాలు—>ద్వేషం–>దుష్ప్రచారం/అణచివేతకి సైద్ధాంతిక ప్రాతిపదికల్ని కల్పించడం–>వ్యవస్థీకృత అణఛివేత/సదరు వర్గాన్ని బలహీనపఱచడం–>చంపాలనే కోరిక–>మారణ హోమం స్థాయిలో చంపడం

  ప్రస్తుతం బ్రాహ్మణులు 3వ/4వ దశల్లో ఉన్నారు.ఎనిమిదో దశకి ఎప్పటికీ రారనే అనుకుంటున్నాను.ఎందుకంటే ఇతర వర్గాలు ఇతర మార్గాల్లో సంతృప్తిపఱచబడ్డాయి కనుక.

  ఈ మధ్య యూనియన్ మంత్రి అర్జున్ సింగ్ ఒక విలువైన మాట సెలవిచ్చారు.”OBC లకి ముస్లిములకి రిజర్వేషన్లు ఇవ్వడం వారినేదో ఉద్ధరించి పారేస్తామని కాదు. సమాజంలో వారు కూడా ఒక భాగమని గుర్తుతెచ్చుకునేందుకు, అన్ని చోట్లా అందరికీ నామమాత్రపు ప్రాతినిధ్యాన్నయినా కల్పించి సామాజిక న్యాయాన్ని అమలుజరిపేందుకు” అని !

  నా దృష్టిలో ఆ సామాజిక న్యాయాన్ని బ్రాహ్మణులక్కూడా వర్తింపజెయ్యాలి. నా అభిప్రాయాల్ని అందరి నెత్తినా రుద్దదల్చుకోలేదు. కాని బ్రాహ్మణులు రాజకీయ రంగం నుంచి సినిమా రంగం నుంచి విరమించుకున్న తరువాత వాటిల్లో సభ్యతా సంస్కారాలు డిగ్నిటీ అంతరించిపోయాయి. ప్రతి చోటా వారు ఒకరో ఇద్దరో ఉండడం వల్ల మన సామాజిక సంస్కృతి బాగుపడుతుంది.

 8. T.Bala Subrahmanyam అభిప్రాయం,

  తేది: April 30, 2007 సమయము: 8:58 am

  అంబానాథ్ గారూ ! ఎంతో కొంత అణచివేత ఉంది. కాదనడం లేదు. కాని నా అభిప్రాయంలో ఏ వర్గం పైకి రావడం లేదన్నా దాని వెనక ఆ వర్గపు స్వయంకృతాపరాధాలు ఎక్కడో ఖచ్చితంగా ఉండి తీరతాయి. అవి మనం పట్టుకోలేక అణచివేత మొదలైన పదాల్ని ఆశ్రయిస్తాము. బ్రాహ్మణుల విషయంలో వారి స్వయంకృతాపరాధాలు కొన్ని ఉన్నాయి.

  1. బ్రాహ్మణులు low-ambition మనుషులు. అఖండ విజయాల్ని సాధించిన తరువాత కూడా వాటిని అలాగే కొనసాగించాలనే ఆలోచన వారిలో ఉండదు. “సాధించాం ఇక చాల్లే” అనే ధోరణి వల్ల రేసులో వెనకబడ్డారు. దీనికి ఎన్ని వందల ఉదాహరణలైనా ఇవ్వొచ్చు. తెలుగు సినిమా రంగంలో NTR కి ఎన్ని అవకాశాలొచ్చాయో కాంతారావుకీ అన్నే అవకాశాలొచ్చాయి. NTR జాగ్రత్తపడ్డారు.కాంతారావు నిర్లక్ష్యం చేశారు.ఫలితం-NTR దేశాన్ని ఏలారు.కాంతారావు ప్రస్తుతం చందాల మీద ఆధారపడి బతుకుతున్నారు.

  2. చెప్పుకోదగినంత శాతం మంది బ్రాహ్మణులు వ్యసనపరులు. ఎంత సంపాదించినా వారికి చాలదు. తాగుడు, సిగరెట్లు, పేకాట, ఉంచుకున్న ముండలు-ధనిక బ్రాహ్మణుల్లో ఇదొక జీవిత విధానం. ఈ మార్గంలో అనేక బ్రాహ్మణ కుటుంబాలు నాశనమయ్యాయి.

  3. పాత తరం బ్రాహ్మణుల్లో చాలామందికి పిత్రార్జితం మీద ఉన్న నమ్మకం స్వార్జితం మీద లేదు. తత్‌ఫలితంగా వారిలో ఎక్కువమంది కోర్టుపక్షులు తయారయ్యారు. “అగ్రహారం పోతే పోయింది, యాక్టు బాగా తెలిసింది” మొదలైన సామెతలు వీరి మూలానే పుట్టుకొచ్చాయి. ఈ లిటిగేషన్ల ప్రక్రియలో ధనిక బ్రాహ్మణులు కూడా కాలక్రమాన దరిద్రులయ్యారు.

  4. బ్రాహ్మణుల్లో enterprising nature శూన్యం. ఎంతసేపూ ఎవడైనా ఉద్యోగం ఇస్తే వెళ్ళిపోదాం అని చూస్తూంటారు తప్ప తామేదైనా సొంతంగా పెట్టి బాగుపడదామనే ఆలోచన లేనేలేదు. కోట్లాది రూపాయల ఆస్తులుండీ హైటేక్ సిటీలో ఉద్యోగాలు చేస్తున్న బ్రాహ్మణులు నాకు తెలుసు.తండ్రి ఉద్యోగం కోసం రోడ్డెక్కుతాడు.కొడుకు ఉద్యోగం కోసం రోడ్డెక్కుతాడు.మనవడు కూడా ఉద్యోగమంటూ రోడ్డెక్కుతాడు. లోఫం ఎక్కడుంది ? ఈ ధోరణిలో ఉన్న కులానికి సొంత కంపెనీలు ఎక్కణ్ణుంచి వస్తాయి ?

  5. బ్రాహ్మణులు అధిక శాతం మంది దురహంకారులు. దాన్ని వాళ్ళు ఆత్మాభిమానం అనుకుంటారు. బ్రాహ్మణ కులం చాలా కష్టకాలంలో ఉందనీ తాము అనుసరించిన పూర్వప్రమాణాల ప్రకారం ఇప్పుడు బతకడం సాధ్యం కావడం లేదనే ప్రత్యక్ష వాస్తవాల్ని అంగీకరించడానికి వారికి మనసొప్పదు. అందుచేత ఎన్ని కష్టాలైనా మౌనంగా భరిస్తారు తప్ప ఇతర పీడిత వర్గాలతో చేతులు కలపాలనే ప్రాజ్ఞత వారికి ఎంత చెప్పినా ఉదయిచదు. కష్టాలు పడుతున్నామని బయటపడడం అవమానకరంగా భావిస్తారు.

  నేను ఎవరి మనసునైనా నొప్పిస్తే క్షమించండి.

 9. ప్రసాద్ అభిప్రాయం,

  తేది: May 1, 2007 సమయము: 7:12 am

  అంభానాధ్ గారూ,
  నిజమే మీరు చెప్పినట్లు ఈ రోజు బ్రాహ్మణులు దుర్భర ఆర్థిక స్థితిలో వున్నారు. ఇందుకు చాలా మట్టుకు కారణాలు సుబ్రమణ్యం గారు వివరించారు. అయితే ఇంత దుర్భర స్థితిలో వున్నా ఇంకా అది “దళితులంత” దుర్భర స్థితి కాదనే నా విశ్వాసము. ఏ అగ్రకులంలోనైనా పేదలున్నట్లే దళితుల్లోనూ గొప్పవారుండొచ్చు. అలాగే బ్రాహ్మణుల్లోనూ పేదలుండొచ్చు ఇప్పుడాపేదల శాతము పెరుగుతూనూ వుండచ్చు.
  నాకు బ్రాహ్మణ మితృలు ఎంతోమంది వున్నారు. నాకు తెలిసిన అందరూ బాగా వున్నవారే, ఎవ్వరూ ధీన స్థితిలో లేరు. వీళ్ళంతా మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా మారుతున్న వారే! నాకు తెలిసిన ఒకామె ఇళ్ళకు వెళ్ళి facials గట్రా చేస్తుంది. తమాషా ఏమిటంటే ఇక్కడ నాకు ఒక్క దళితుడూ తారసపడలేదు.

  –ప్రసాద్
  http://blog.charasala.com

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో