- అంతరంగం - http://www.charasala.com/blog -

అన్నీ వేదాల్లో వున్నాయిష

Posted By చరసాల On March 16, 2007 @ 10:29 am In నా ఏడుపు | 8 Comments

మన సంస్కృతి గురించి, వేదాలు, ఉపనిషత్తుల గురించి చెప్పేవాళ్ళు అన్నీ పూర్వం మన ఋషులకే తెలుసనీ, వేదాలే అన్ని జ్ఞానాలకూ మూలమనీ వాదించేస్తారు.
వేదాలు లభ్యమవుతున్న అతిపురాతన సాహిత్యమని అందరు అంగీకరిస్తున్నదే. అలాగే మన ఋషుల తాత్విక చింతన అమోఘమైనదే అయితే ఇప్పటి శాస్త్ర విజ్ఞానమంతా నాడే ఋషులకంతా తెలుసనడం అతిశయోక్తే!
మొన్న ఈమాటలో అసంబద్ద భాషావాదాల గూర్చి సురేష్ కొలిచాల గారు చక్కటి వ్యాసం [1] రాశారు. అలాగే వేదాలలో అన్నీ వున్నాయనే అసంబద్ద వాదనలు ఖండిస్తూ కూడా మంచి వ్యాసాలు వస్తే బాగుండును.
కొన్ని వాదనలు చూస్తే…
“రామాయణ కాలంలోనే విమానం నిర్మించడం, వాడటం తెలుసు.”
ఈనాడు  గ్రహాంతరయానాలు చేస్తున్నట్లు, మనిషి తయారు చేసిన రోబోట్లు మనిషినే నియంత్రిస్తున్నట్లు సినిమాలు వస్తున్నాయి అంత మాత్రాన మనమిప్పుడు గ్రయాంతరయానము చేస్తున్నట్లా? కాకపోతే అవి ఇంకొన్ని రోజులకు నిజాలు అవ్వచ్చు. ప్రకృతిని జయించాలన్న మానవుడి వాంఛ రకరకాల వూహలను ప్రేరేపించింది. ఆకాశయానం చేసినట్లు, జలస్తంబన విద్యతో నీటిలో రోజుల తరబడి వున్నట్లు కలగన్నారు. మహిమాన్విత శక్తులున్న దేవుడికి అన్నీ సాద్యమే గనుక తమ వూహలని దేవుడి పాత్ర రూపంలో తీర్చుకున్నారు. అంత మాత్రానికే అప్పట్లో పుష్పక విమాన ముండేదని ఈ 21వ శతాబ్దములో కూడా నమ్మేస్తే అంతకన్నా పిచ్చి ఇంకేమయినా వుందా? పోనీ రామాయణంలో విశయాలు నిజమే అనుకుంటే కోతులు రాజ్యాలు చేయడం, ఒక కోతి ఇటు నుంచీ అటు లంకకు గెంతడం కుడా ఆ రోజుల్లో సంభవాల కిందే లెక్కెయ్యాల్సి వస్తుంది.

“రామ సేతు”
లంకకూ మనకూ మద్య ఆరోజుల్లోనే వారధి కట్టారట! అదే నీళ్ళపై తేలే వారధి! దాని అవశేషమే ఇప్పుడు సముద్ర గర్భంలోని వారధి అంటారు.
మొన్నేదో ఓ పుస్తకంలో ఒక చైనా కథ గురించి చదివాను. ఆ కథ ప్రకారం పూర్వం 9 మంది సూర్యులు వుండేవారట! ఆ వేడికి ప్రతిదీ దగ్దమైపోతుండేదట! వేడిని భరించలేని ప్రజలు రాజును ఏదో ఒకటి చేయమని వేడుకుంటే ఆయన ఒక సాహసవంతున్ని పిలిచి సూర్యులనందరినీ కూల్చేయమన్నాడట! ఆ సాహస వీరుడు ఒక్కొక్కటే సూర్యున్ని కిందపడేస్తూ చివరి సూర్యున్ని వదిలేశాడట, అది లేకపోతే లోకం చీకటైపోతుందని.
ఇప్పుడు తొమ్మిదిమంది సూర్యులు లేనిది, ఒకడే సూర్యుడు వున్నదీ నిజమే కనుక ఈ కథ నిజమే అనుకోవాలా మనం?
మనకున్న ఎన్నో స్థల పురాణాలు ఇటువంటివే! కనిపించే ప్రతి వింతకూ ఒక పురాణాన్ని కనిపెట్టి సమాధాన పడ్డారు ప్రజలు.

“భారత కాలంలోనే test tube baby విధానం తెలుసు”
ఇది నవ్వులాటకు కూడా నమ్మలేని విశయం. ఆనాడే ఇంత విజ్ఞానం వుంటే విల్లులూ, బాణాలూ, గదలతో యుద్దం చేసుకోవలసిన ఖర్మం ఏమొచ్చింది వాళ్ళకి, శుబ్రంగా ఇప్పటిలా అణ్వాయుధాలతోనే చేసివుందురు. ఇంకా భారతంలో అక్షయ పాత్ర వుంది, ఎంత తోడినా ఇంకా పుట్టుకొని వస్తుందట అందులో. ఇది సాద్యమేనా? జరాసంధున్ని రెండుగా చీల్చినా మళ్ళీ అతుక్కుంటాడట! అవ్వ! ఎంత విజ్ఞానముడేది ఆ రోజుల్లో!

ఈ మద్యన ఏదో తెలుగు బ్లాగులో చూశాను “నాగలోకానికి అదేదో రెండు పర్వతాల మద్యనుండీ దారి వుందట!”. ఇలాంటి శుశ్క వాదాలను నమ్మేవాళ్ళు వున్నారంటే ఎంతో ఆశ్చర్యమేసింది. ఆ బ్లాగులో ఇప్పుడా పోస్టులు లేవు. నా చిన్నప్పుడు మా అవ్వ ఓ కథ చెప్పేది. అక్కడెక్కడో బావి తవ్వుతూ వుంటే, తవ్వగా తవ్వగా ఎంతో లోతుకు తవ్వాక వాళ్ళకు కోడికూతా, రోకటి పోటూ వినబడ్డాయట భూమి లోంచీ! అప్పుడు తవ్వడం ఆపేశారట! (నాగలోకానికి జడిసి ఆపేశారా? ఏమో నాకు తెలియదు.)
–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=154

URLs in this post:

[1] చక్కటి వ్యాసం: http://eemaata.com/em/issues/200701/1049.html