- అంతరంగం - http://www.charasala.com/blog -

ఒక చలి రాత్రి

Posted By చరసాల On March 6, 2007 @ 5:18 pm In నా ఏడుపు, వర్తమానం | 10 Comments

చదివింది ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ అయినా Y2K హోరు గాలిలో నా జీవితాన్నీ చక్కబెట్టుకుందామని హైదరాబాదులో Y2K శిక్షణ పూర్తి చేసి ఏదో దేసీ కంపెనీ వీసా సంపాదించి అమెరికా గడ్డ మీద కాలు పెట్టాను.
అదేదో ఐరన్ లెగ్ అంటారే అలాగా నేను కాలు పెట్టిన మూడు నెలలకే నన్ను ఈ గడ్డ మీదికి తెచ్చిన కంపెనీ జెండా ఎత్తేసి, నా దారి నన్ను చూసుకోమంది.
Main frames మీద real time experience లేదు. చేసిన దాని కంటె చదివి నేర్చుకున్నదే ఎక్కువ. ఆంగ్ల భాషా ఉచ్చారణ అంతంత మాత్రమే! అబద్దాలు అతికినట్టు చెప్పడమూ రాదు. మూడేళ్ళ అనుభవముందని చెప్పిన క్షణానే నా మొహం చూసి ఎవరైనా నేను అబద్దం చెబుతున్నానని చెప్పగలరు. మరింత రెట్టించారంటే నేనే ఒప్పుకున్నా ఒప్పుకుంటాను. ఇలా కిందా మీదా రమ్మన్న ప్రతి కంపెనీ గుమ్మమూ తొక్కుతూ వుద్యోగ వేట ముమ్మరంగా చేస్తున్నాను.

మొత్తానికి న్యూయార్క్ మహా నగరంలో ఏదో ఒక ఫైనాన్సియల్ కంపెనీలో వుద్యోగం వచ్చింది.
వాళ్ళు వుదయాన్నే 7గంటలకే అక్కడ వుండాలనే వాళ్ళు. నేనప్పుడు వున్నది నాకు ఆశ్రయమిచ్చిన ఒకానొక తెలుగోళ్ళ కంపెనీ అథిది గృహంలో. నాతో పాటు అక్కడ ఇంకో ముగ్గురు వుండేవాళ్ళు. ఆ గృహమున్నది న్యూజెర్సీ ఎడిసన్‌లో. వుదయాన్నే 5 గంటలకు లేచి స్నానాదిపాదులన్నీ అరగంటలో ముగించుకొని మైలు దూరంలోనున్న మెట్రోపార్కు రైలు స్టేషనుకు పరుగెత్తేవాన్ని. ఈ దేశపు చలికి అలవాటుపడని దేహం. శరీరాన్ని సరిగ్గా కప్పని ఇండియా నుంచీ తెచ్చుకొన్న జాకెట్టు. చేతులకు గానీ తలకు గానీ తొడుగుల్లేవు. నిజానికి నా పరుగుకు, ఆయాసానికి విపరీతమైన వేడి పుట్టి చలి అనిపించేది కాదు. అలా పరుగెట్టి మెట్రో పార్కులో NJ Transit రైలు పట్టుకొని న్యూయార్క్ పెన్ స్టేషన్‌లో దిగి రెండు వీధుల అవతలనున్న ఆఫీసుకు పరుగులాంటి నడకతో చేరితేనే ఏడింటికి చేరగలగేది.

అక్కడ TAB కీ Enter కీ లా వుపయోగపడేది. ఎదైనా తప్పుగా టైప్ చేస్తే కీబోర్డ్ లాక్ అయిపోయేది. దాన్ని unlock చేయడం తెలిసేది కాదు. ఎలాగోలా తంటాలు పడి సాయంత్రం వరకూ కష్టపడి తిరుగు ముఖం పట్టేవాడిని.

అలా ఓరోజు మెట్రోపార్క్‌లో దిగి నడిచి ఇంటికి వస్తే ఇంట్లో ఎవరూ లేరు. నా దగ్గర విడిగా తాళంచెవి లేదు. జనవరి దినాల చలి. దగ్గరలో వున్న షాపింగ్ కాంప్లెక్స్‌కి వెళ్ళాను ఏ షాపులో కైనా దూరి వెచ్చ కాగుదామని. మ్… ఒక్క షాపు తెరిచి లేదు. చెబితే నమ్మరు గానీ అక్కడ పబ్లిక్ కాయిన్ ఫోను కూడా లేదు, ఆఫీసుకు ఫోన్ చేసి మా వాళ్ళకు నా పరిస్థితి వివరించి త్వరగా రమ్మందామటే! ఇక కాళ్ళీడ్చుకుంటూ మళ్ళీ తిరిగి మా అపార్ట్‌మెంట్ సముదాయంలోకి వచ్చి నిలుచున్నాను.
ఇండియా నుండీ తెచ్చుకున్న జాకెట్టు ఇక్కడీ వాషింగ్ మెషీన్‌లో వేయడంతో లోపలున్న దూదంతా వుండలు కట్టింది. చలి అంతా నా మీదే దాడి చేస్తోందా అనిపిస్తోంది. అర మైలుకు తక్కువగా ఎక్కడా నాకు తెలిసి గ్యాస్ స్టేషను లాంటిది ఏదీ లేదు. మళ్ళీ కాళ్ళీడ్చుకుంటూ మైలు దూరం రైల్వే స్టేషనుకు నడిచే ఓపికా సత్తువా లేవు.

ఒక ఆలోచన వచ్చింది. ఎవరైనా కనిపిస్తే ఒక ఫోను చేసుకోవాలని అబ్యర్థిస్తే నన్ను వాళ్ళింటిలోకి అనుమతించక పోతారా అని. ఫోను చేయడం ముఖ్యమే అయినా ఇప్పుడు వళ్ళును వేడి చేసుకోవడం అతి ముఖ్యమైంది. ఫోను మీది నెపంతో కాసేపైనా లోపల గడిపితే మళ్ళీ గంట సేపు బయట గడపడానికి శక్తి వస్తుంది. ఇలా అనుకుంటూ ఎదురు చూస్తూ వుండగా ఓ కారులోంచీ ఓ పెద్దాయన దిగాడు. భయంగా, వినయంగా ఒత్తి ఒత్తి పలికి నా బాధ చెప్పుకున్నాను. ఒక్కసారి ఫోను చేసుకుంటాను అన్నాను. చలి విషయం చెప్పలేదు. తన జేబులోంచి సెల్‌ఫోను తీసి ఇస్తాడని నేను వూహించలేదు. ఇప్పుడున్నట్లుగా అమెరికాలో కూడా సెల్‌ఫోన్ల వాడకం అంతగా లేదు. నా ఆశ అంతా జావగారి పోయింది. సరే ఇదైనా చాలు అనుకొని నా సహనివాసులకు సమాచారం అందించాను.

వెనుక మెట్లమీదుగా పైనున్న డెక్ మీదికి చేరుకొని వెనుక ద్వారానికి చేరగిలబడి డొక్కలో కాళ్ళు పెట్టుకొని అలా ఎంతసేపున్నానో తెలీదు. రూంమేట్లు వచ్చి లోపల చేసిన శబ్దాలకు మేలుకొని లోపలకు అడుగు పెట్టాను.

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=152