ఒక చలి రాత్రి

తేది: March 6, 2007 వర్గం: నా ఏడుపు, వర్తమానం రచన: చరసాల 2,579 views

చదివింది ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ అయినా Y2K హోరు గాలిలో నా జీవితాన్నీ చక్కబెట్టుకుందామని హైదరాబాదులో Y2K శిక్షణ పూర్తి చేసి ఏదో దేసీ కంపెనీ వీసా సంపాదించి అమెరికా గడ్డ మీద కాలు పెట్టాను.
అదేదో ఐరన్ లెగ్ అంటారే అలాగా నేను కాలు పెట్టిన మూడు నెలలకే నన్ను ఈ గడ్డ మీదికి తెచ్చిన కంపెనీ జెండా ఎత్తేసి, నా దారి నన్ను చూసుకోమంది.
Main frames మీద real time experience లేదు. చేసిన దాని కంటె చదివి నేర్చుకున్నదే ఎక్కువ. ఆంగ్ల భాషా ఉచ్చారణ అంతంత మాత్రమే! అబద్దాలు అతికినట్టు చెప్పడమూ రాదు. మూడేళ్ళ అనుభవముందని చెప్పిన క్షణానే నా మొహం చూసి ఎవరైనా నేను అబద్దం చెబుతున్నానని చెప్పగలరు. మరింత రెట్టించారంటే నేనే ఒప్పుకున్నా ఒప్పుకుంటాను. ఇలా కిందా మీదా రమ్మన్న ప్రతి కంపెనీ గుమ్మమూ తొక్కుతూ వుద్యోగ వేట ముమ్మరంగా చేస్తున్నాను.

మొత్తానికి న్యూయార్క్ మహా నగరంలో ఏదో ఒక ఫైనాన్సియల్ కంపెనీలో వుద్యోగం వచ్చింది.
వాళ్ళు వుదయాన్నే 7గంటలకే అక్కడ వుండాలనే వాళ్ళు. నేనప్పుడు వున్నది నాకు ఆశ్రయమిచ్చిన ఒకానొక తెలుగోళ్ళ కంపెనీ అథిది గృహంలో. నాతో పాటు అక్కడ ఇంకో ముగ్గురు వుండేవాళ్ళు. ఆ గృహమున్నది న్యూజెర్సీ ఎడిసన్‌లో. వుదయాన్నే 5 గంటలకు లేచి స్నానాదిపాదులన్నీ అరగంటలో ముగించుకొని మైలు దూరంలోనున్న మెట్రోపార్కు రైలు స్టేషనుకు పరుగెత్తేవాన్ని. ఈ దేశపు చలికి అలవాటుపడని దేహం. శరీరాన్ని సరిగ్గా కప్పని ఇండియా నుంచీ తెచ్చుకొన్న జాకెట్టు. చేతులకు గానీ తలకు గానీ తొడుగుల్లేవు. నిజానికి నా పరుగుకు, ఆయాసానికి విపరీతమైన వేడి పుట్టి చలి అనిపించేది కాదు. అలా పరుగెట్టి మెట్రో పార్కులో NJ Transit రైలు పట్టుకొని న్యూయార్క్ పెన్ స్టేషన్‌లో దిగి రెండు వీధుల అవతలనున్న ఆఫీసుకు పరుగులాంటి నడకతో చేరితేనే ఏడింటికి చేరగలగేది.

అక్కడ TAB కీ Enter కీ లా వుపయోగపడేది. ఎదైనా తప్పుగా టైప్ చేస్తే కీబోర్డ్ లాక్ అయిపోయేది. దాన్ని unlock చేయడం తెలిసేది కాదు. ఎలాగోలా తంటాలు పడి సాయంత్రం వరకూ కష్టపడి తిరుగు ముఖం పట్టేవాడిని.

అలా ఓరోజు మెట్రోపార్క్‌లో దిగి నడిచి ఇంటికి వస్తే ఇంట్లో ఎవరూ లేరు. నా దగ్గర విడిగా తాళంచెవి లేదు. జనవరి దినాల చలి. దగ్గరలో వున్న షాపింగ్ కాంప్లెక్స్‌కి వెళ్ళాను ఏ షాపులో కైనా దూరి వెచ్చ కాగుదామని. మ్… ఒక్క షాపు తెరిచి లేదు. చెబితే నమ్మరు గానీ అక్కడ పబ్లిక్ కాయిన్ ఫోను కూడా లేదు, ఆఫీసుకు ఫోన్ చేసి మా వాళ్ళకు నా పరిస్థితి వివరించి త్వరగా రమ్మందామటే! ఇక కాళ్ళీడ్చుకుంటూ మళ్ళీ తిరిగి మా అపార్ట్‌మెంట్ సముదాయంలోకి వచ్చి నిలుచున్నాను.
ఇండియా నుండీ తెచ్చుకున్న జాకెట్టు ఇక్కడీ వాషింగ్ మెషీన్‌లో వేయడంతో లోపలున్న దూదంతా వుండలు కట్టింది. చలి అంతా నా మీదే దాడి చేస్తోందా అనిపిస్తోంది. అర మైలుకు తక్కువగా ఎక్కడా నాకు తెలిసి గ్యాస్ స్టేషను లాంటిది ఏదీ లేదు. మళ్ళీ కాళ్ళీడ్చుకుంటూ మైలు దూరం రైల్వే స్టేషనుకు నడిచే ఓపికా సత్తువా లేవు.

ఒక ఆలోచన వచ్చింది. ఎవరైనా కనిపిస్తే ఒక ఫోను చేసుకోవాలని అబ్యర్థిస్తే నన్ను వాళ్ళింటిలోకి అనుమతించక పోతారా అని. ఫోను చేయడం ముఖ్యమే అయినా ఇప్పుడు వళ్ళును వేడి చేసుకోవడం అతి ముఖ్యమైంది. ఫోను మీది నెపంతో కాసేపైనా లోపల గడిపితే మళ్ళీ గంట సేపు బయట గడపడానికి శక్తి వస్తుంది. ఇలా అనుకుంటూ ఎదురు చూస్తూ వుండగా ఓ కారులోంచీ ఓ పెద్దాయన దిగాడు. భయంగా, వినయంగా ఒత్తి ఒత్తి పలికి నా బాధ చెప్పుకున్నాను. ఒక్కసారి ఫోను చేసుకుంటాను అన్నాను. చలి విషయం చెప్పలేదు. తన జేబులోంచి సెల్‌ఫోను తీసి ఇస్తాడని నేను వూహించలేదు. ఇప్పుడున్నట్లుగా అమెరికాలో కూడా సెల్‌ఫోన్ల వాడకం అంతగా లేదు. నా ఆశ అంతా జావగారి పోయింది. సరే ఇదైనా చాలు అనుకొని నా సహనివాసులకు సమాచారం అందించాను.

వెనుక మెట్లమీదుగా పైనున్న డెక్ మీదికి చేరుకొని వెనుక ద్వారానికి చేరగిలబడి డొక్కలో కాళ్ళు పెట్టుకొని అలా ఎంతసేపున్నానో తెలీదు. రూంమేట్లు వచ్చి లోపల చేసిన శబ్దాలకు మేలుకొని లోపలకు అడుగు పెట్టాను.

–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'ఒక చలి రాత్రి' పై 10 అభిప్రాయాలు

'ఒక చలి రాత్రి'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. cbrao అభిప్రాయం,

  తేది: March 6, 2007 సమయము: 11:16 pm

  1998 ప్రాంతంలో అమెరికాలో సెల్ ఫోన్స్ తక్కువంటే ఆశ్చర్యంగా ఉంది. 1996 కే మదరాసు పట్టణంలో సెల్ ఫోన్స్ వాడకంలో ఉన్నాయి. మీ అనుభవం ‘చలితో ఎలా వేగాలి?’, చెప్పిన తీరు బాగుంది.

 2. radhika అభిప్రాయం,

  తేది: March 6, 2007 సమయము: 11:25 pm

  అసలు ఎలా వున్నారండీబాబు అంత చలిలో.వింటుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతుంది.మాకూ ఇలాంటి అనుభవమే అయింది ఇక్కడికి వచ్చిన కొత్తలో.అప్పటికి మెము ఇక్కడికి వచ్చిన కొత్త.హోటల్ లో వుండేవాళ్ళం.ఇల్లు అద్దెకు తీసుకుందామని సాయత్రం ఆఫీసు అయ్యాక ఒక అపార్ట్ మెంట్ ఆఫీసుకి వెళ్ళాము టాక్సి మీద మావారు నేను.అక్కడ దిగి కార్ పంపించేసి ద్వారం దగ్గరకెళ్ళి చూస్తే లాక్ చేసి వుంది.బయట చూస్తే చచ్చే చలి.మా దగ్గర కోట్ తప్ప ఏమీలేవు.టాక్సి కి కాల్ చేసి పిలవడానికి అప్పట్లో ఇంక సెల్ తీసుకోలేదు.ఎవరినన్నా అడుగుదామంటే ఎవరూ తెలీదు….అసలు ఎవరన్న కనపడితే కదా అడగడానికి.ఇక చూసుకోండి మా పని.చివరికి అలాగే ఒక గంట కూర్చున్నాకా మేము ముందే బుక్ చేసుకున్న టాక్సి వచ్చింది.ఈలోపు మావారిని ఎన్ని కష్టాలు పెట్టానో.

 3. జ్యోతి అభిప్రాయం,

  తేది: March 7, 2007 సమయము: 6:22 am

  ఎందుకండీ అన్ని కష్టాలు పడుతూ అక్కడ వుంటారు.మీ ప్రతిభకు,చదువుకు,అనుభవానికి తగిన ఉద్యోగ0 ఇక్కడ దొరకదా! ఇంటికొచ్చేయండి………………….

 4. valluri అభిప్రాయం,

  తేది: March 7, 2007 సమయము: 12:12 pm

  జ్యోతి గారే రైటు. పరదేశాన ఎందుకన్ని కష్టాలు పడటం. అదే మనదేశంలోనైతే, ఎంచక్క ఏ ఫ్రెండ్ ఇంటికో చెక్కేయచ్చు. చలికాలంలో వేడి వేడి మిర్చిలు, ఇరాని టీ అడుగడగునా అందుబాటులో ఉంటాయి.

 5. lalitha అభిప్రాయం,

  తేది: March 8, 2007 సమయము: 10:49 am

  ఎక్కడ ఉండే కష్టాలు అక్కడ ఉంటాయండీ.
  దూరపు కొండాలు నునుపు అంటారు కదా.
  ఇది ఒకప్పటి కథ. చలిని ఎలా నెగ్గుకు రావాలో
  ఇప్పటికి బాగా అలవాటైపోయుంటుంది.

  ఏ కారణంగానైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అలవాటు పడే లోపల కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఒకే దేశంలోనైనా, వేరే దేశంలోనైనా. తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని హాయిగా నవ్వుకోవచ్చు.

  మనకి ఏమి కావాలనుకొని ఇక్కడకు వచ్చామో ఎందుకు ఇక్కడే
  ఇంకా ఉంటున్నామో ఆ కారణాలుమనలోనే వెతుక్కోవాలని అనిపిస్తుంటుంది నాకు.

  విదేశాలలో స్థిరపడి స్వదేశాన్ని మిస్ అవుతూ, ఉన్న దేశంలో మనసు నిలవక, కన్న దేశం వైపు కాలు కదలక మనసు పడే ఆవేదన గురించి ఎప్పుడో నా బ్లాగులో రాస్తాను. అంతవరకూ పై అభిప్రాయం చెప్పకుండా ఆగలేకపోయాను. అది నా అభిప్రాయం మాత్రమే.

  లలిత.

 6. జయ ప్రకాశ్ అభిప్రాయం,

  తేది: March 8, 2007 సమయము: 6:05 pm

  విదేశాలకు వచ్చిన కొత్తల ప్రతి ఒక్కరికి కొద్దో గొప్పో ఇలాంటివి తప్పకుంట జరిగే ఉంటయి అనుకుంటున్న. మీ పోస్ట్ నాలోపల కూడ కొన్ని అలాంటి రోజులనే గుర్తుచేసి మల్ల ఒక్క సారి వణుకు పుట్టిచ్చింది… ఆ రొజుల్లొ పడ్డ కష్టాలు, త్యాగాలు (అవి ఎంత చిన్నవయిన) మర్చిపోకుండా ఉంటే అదే మంచిది. :) బహుశ ఒక 20-30 ఏళ్ళ తరువాత మన తాతలు తండ్రులు “మా రోజుల్లో మేము స్ట్రీట్ లైట్ల కింద చదువుకొని ఇంత వాల్లమయినము..” అని చెప్పుకున్నట్టు మనముకూడ చెప్పుకుంటమేమో…. ?

 7. స్వాతి అభిప్రాయం,

  తేది: March 16, 2007 సమయము: 9:26 am

  ఉన్న వూరి నుంచి అయిన వాళ్ళ నుంచి దూరం గా సిటీ కి వస్తేనే ఎంతో బాధ గా ఉంటుంది. పారయి దేశమ లో పాట్లు వేరే చెప్పాలా.. ఎవరైనా అనుభవజ్నులు చెప్పండి జీవితమ లో సమన్వయమ ఎలా డబ్బు, ఉద్యోగం, కూటుంబం అన్నిటికీ ఒకే సమయమ లో న్యాయం చెయ్యటం ఎలా?

 8. రానారె అభిప్రాయం,

  తేది: March 16, 2007 సమయము: 9:58 am

  ప్రసాద్ గారూ, ఎప్పుడో జరిగింది ఇంకా గుర్తుందంటే మీరు పడిన బాధ అర్థం ఔతోంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. విమానాశ్రయంనుండి ఇంటికి తీసుకొచ్చి, వేడివేడి అన్నం, వంకాయకూర, టొమాటో చారులతో భోజనం పెట్టడం దగ్గరనుంచి, అన్నీ చూసుకొని, ఇలాంటి బాధలేవీ తెలీకుండా చేశారు. వచ్చిన వెంటనే నేను చేసినపని మొబైల్‌ఫోను కొనుక్కోవడం.
  “స్నానాదిపాదులన్నీ” కాకుండా “స్నానపానాదులన్నీ” అనడం సరైనదనుకుంటా.

 9. charasala అభిప్రాయం,

  తేది: March 20, 2007 సమయము: 11:07 am

  రావు గారూ,
  ఎంతయినా ఇప్పుడున్న సెల్‌ఫోన్ బూం అప్పుడు లేదండీ.

  రాధిక గారూ,
  నాలాంటి వారు ఇంకెందరున్నారో!

  జ్యోతి గారూ,
  నిర్మొహమాటంగా చెబుతున్నాను. ఇతరుల సంగతేమొ గానీ నాకు ఇండియాలో ఉద్యోగం దొరక్కే పొట్ట పట్టుకొని ఇక్కడ చేరానండీ.
  ఇప్పడయినా రావాలనే వుంది… కానీ ఇప్పుడు ఇంకోవిధంగా ఇండియా చేతికందనంత ఎత్తుకు పోయిందేమొ అనిపిస్తోంది.

  వల్లూరి గారు,
  మీరు మరీ నోరూరించక్కర లేదండీ. రావాలనే వుంది.. వస్తే ఎలా బతగ్గలమూ అనే అందోళనా వుంది.

  లలిత గారూ,
  మీరూ ఇక్కడ వున్నవారే గనుక అర్థం చేసుకున్నారు. ఆ బ్క్లాగేదో త్వరగా బ్లాగండి చదవాలనుంది.

  జయ ప్రకాశ్ గారూ,
  అంతేనండీ. అవి చేదు అనుభవాలయినా తర్వాత చెప్పుకుంటుంటే అదేదో ఆనందం!

  స్వాతి గారూ,
  “జీవితమ లో సమన్వయమ ఎలా డబ్బు, ఉద్యోగం, కూటుంబం అన్నిటికీ ఒకే సమయమ లో న్యాయం చెయ్యటం ఎలా?” — పెద్ద ప్రశ్న అడిగారు మీ బ్లాగులో అడగండి ఎవరైనా అనుభవజ్ఞులు సమాధానమిస్తారేమొ!

  రానారె,
  మాతో పోల్చుకుంటే మా తర్వాత వచ్చిన మీవి సుఖాలు. మాకంటే ముందు వచ్చిన వారి కంటే మావి సుఖాలు. మాకంటే పదేళ్ళు ముందొచ్చినాయన చెబుతూండేవాడు వాళ్ళ అనుభవాలు. స్నోలో మైలు పైనే నడవడం, ప్రతిరోజూ బ్రెడ్డు లేదా పిజ్జా తినడం లాంటివి.

  “స్నానాదిపాదులను” లో సరిచేసినందులకు కృతజ్ఞతలు.

  –ప్రసాద్

 10. lalitha అభిప్రాయం,

  తేది: March 22, 2007 సమయము: 10:15 am

  ప్రసాదు గారూ,

  నా బ్లాగులో “మనిషి ఇక్కడ, మనసు అక్కడ” అని ప్రవాసాంధ్రుల మనఃస్థితి గురించి రాశాను. అలాగే నా స్వంత అభిప్రాయాలు ఆధునిక విజ్ఞానం, ఆధ్యాత్మికతల గురించి “ఈశ్వరుడు” అని రాశాను.

  ఈ రెండు విషయాల మీదా రాయ దల్చుకున్నది ఇంకా ఉంది. రెండవ విషయంలోనైతే నేర్చుకునేదే ఎంతో ఉంది.

  వ్యాఖ్య చెయ్యగలరు.

  లలిత.

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో