- అంతరంగం - http://www.charasala.com/blog -

“నేను” అనగా…

Posted By చరసాల On February 21, 2007 @ 1:18 pm In ఆధ్యాత్మికం | 15 Comments

కాలేజీ రోజుల్లో ఎందుకో గానీ అధ్యాత్మిక ధ్యాస మరీ ఎక్కువై పోయింది. హైస్కూలు రోజుల్లోనే ఒకానొక క్రిస్టియన్ ఉపాధ్యాయుడు వల్ల బైబిల్ చదివే అవకాశం కలిగింది. చిన్నప్పుడు ఘంటసాల నోటినుండి వచ్చిన గీతే కాకుండా ఎవరెవరో రాసిన గీత వాఖ్యానాలు చదవడమూ అయ్యింది. ఇంచుమించు నాలుగవ తరగతిలో వున్నప్పుడే మా వూరి ఒక ముసలామె (రాసమ్మ గారామె) తన దగ్గర వున్న బ్రహ్మం గారి జీవిత చరిత్ర తెచ్చి నాతో చదివించుకొనేది. అందులో సిద్దయ్య వేసిన యోగాసన చిత్రాలు చూసి నేనూ అలా చేయడానికి ప్రయత్నించేవాన్ని.
ఇక కాలేజీ రోజుల్లో తెలుగులో వున్న ఖురాను దొరకబుచ్చుకోవడానికి నా ప్రయత్నం చాలానే చేశాను గానీ ఫలించలేదు. ఇప్పటికీ చదవాలన్న కోరిక వుంది. కానీ తెలుగులొ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. బ్రహ్మకుమారీ సమాజానికీ వెళ్ళాను. అక్కడ వారు దేవునికి రూపం కల్పించడం నాకు నచ్చలేదు. ఇక గణపతి సచ్చిదానంద సమావేశాలకు వెళ్ళాను. ఆయన చేసే యజ్ఞాలమీద నాకసలు నమ్మకం కలుగలేదు. ఎంతో భక్తితో మిత్రులతో కలిసి ప్రతి శనివారం సాయంత్రం వేంకటేశ్వరుని గుడికి వెళ్ళేవాన్ని..రాతి విగ్రహం కనిపించేదే గానీ, దేవుడు కనిపించేవాడు కాదు.

ఎన్ని చోట్లకు వెళ్ళినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎందరి వుపన్యాసాలు విన్నా దేనిమీదా గురి కలగలేదు. కానీ, నిన్నా మొన్నటి వరకూ (నాలుగేళ్ళ క్రితం వరకూ) ఆత్మ, పరమాత్మ వున్నాయని నమ్మకముండేది. ఎంతు లోతుకు వెళ్ళినా “ఎలా” జరుగుతున్నదో చెప్పే సైన్సు, “ఎందుకు” జరుగుతుందో చెప్పలేక పోయినప్పుడు అదే పరమాత్మ లీల అనుకునే వాన్ని. అయితే ఒకానొక దుస్సంఘటన వల్ల నాలోని నమ్మకాలు పటాపంచలు అయ్యాయి. కొందరు సనాతన వాదులు, ఆస్తిక వాదులు ఏమంటారంటే అలాంటి దుర్ఘటనలు మనిషిని దేవుడిమీద నమ్మకాన్ని పోగొడతాయి అంటారు. అయితే కానివ్వు, చీకటిలో నడుస్తున్నప్పుడు కాలికి రాయి తగులుతుంది. అది తగిలినప్పుడే కదా అక్కడ రాయి వుందని భోధపడుతుంది? రాయి తగలడం వల్ల నిజం (జ్ఞానమ్) తెలుస్తుంటే రాయినెందుకు తప్పుపట్టాలి? నిజం అలా తెలుసుకోవడం బాధాకరమైందే అయినా లోపభూయిష్టమయిందైతే కాదు కదా? నాకూ ఈ ఆత్మ, పరమాత్మ, పూర్వ జన్మ, మలి జన్మ అన్న సిద్దాంతాలన్నీ కారుమబ్బుల్లా విడిపోయి స్పష్టంగా నిజం (సత్యం) (నేను నిజమనుకున్నది మీకు కాకపోవచ్చు) భోధపడింది. నేనీ సత్యాన్ని తెలుసుకోవడం నా సొంత జిజ్ఞాస ద్వారానే కానీ, హేతు వాద పుస్తకాలు గానీ, వాదనలు కానీ చదవడం వల్ల కాదు. అయితే ఈ మద్య కొడవగంటి రోహిణీ ప్రసాద్ బ్లాగు చూశాక నా నమ్మకానికి మరింత బలం వచ్చింది.

ఇంతకీ “నేను” అంటే ఎవరు? ఇదే ప్రశ్న ఈశ్వరీయ బ్రహ్మకుమారీలు కుడా మొదటిరోజు అడిగారు. సనాతనుల దృష్టిలో “నేను” అంటే “ఆత్మ”. అది జరామరణములు లేనిది, ఆద్యంతాలు లేనిది. దాన్ని నీరు తడుప జాలదు, అగ్ని మండింపజాలదు. నేనూ దీనిని నమ్మేరోజులలో ఆలోచనలు, జాగృతి లాంటివి ఆత్మ కలుగజేస్తున్నది అనుకున్నాను. భయం, ప్రీతి ఇలాంటివివి మనసుకు అంటే ఆత్మకు సంబందించినవి అనుకున్నాను. ఆత్మకు, మనసుకు తేడా వుంటుందేమొ, అయితే నేను చెప్పదలుచుకున్నది ఏమంటే మన ఆలోచనలు, చేష్టలు, అనుభవాలు అన్నీకూడా భౌతికమైన ఈ దేహానివే కానీ, ఆత్మ గీత్మ అనే మరో అభేద్యమయిన అర్థం కాని దానివి కాదు అని.

నాకీ మద్య ఎలాంటి విషాద వార్త చూసినా నా ప్రమేయం లేకుండానే కళ్ళంబట నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ఒక పసివాడి గుండె రంధ్రాన్నో, దిక్కులేని ముసలమ్మ యాతనో చూస్తే ఎక్కడ లేని బాధ కలుగుతుంది. ఒక్కోసారి వెక్కిళ్ళు కూడా వస్తాయి (నమ్మండి నమ్మకపొండి నిజం). చిన్నప్పటినుండి నన్ను సున్నితమనస్కుడనే అంటారు కానీ ఇప్పటి సున్నితత్వం మరీ ఎక్కువగా వుందని అనిపించింది. దానికి తోడు బరువు తగ్గడం లాంటి సమస్యలుంటే ఏమవుతుందో నాకని డాక్టరు దగ్గరికెళ్ళా. తేలిందేమిటంటే నాకు థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్‌ను ఎక్కువగా విడుదల చేస్తున్నది. దానివల్ల మెటబాలిజం ఎక్కువయి బరువు తగ్గడం, స్నో పడుతున్న వేళలో కూడా చెమటలు రావడం … ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. థైరాయిడ్ ఎక్కువయితే కోపం, చిరాకు కూడా వుంటాయిట! ఎందుకో నాకు లేవు.

ఇప్పుడు నా అనుమానము ఏమిటంటే ఈ థైరాయిడ్ వల్ల నా హృదయం ద్రవించి నేనేదైయినా సహాయం చేస్తే ఆ పుణ్యం నా ఆత్మకు దక్కాలా? థైరాయిడ్ గ్రంధికి దక్కాలా? దాని ప్రభావం వల్ల కోపంలో నేను ఏదైనా చేయరాని పని చేస్తే ఆ కర్మఫలం నా ఆత్మనంటిపెట్టుకొని మరు జన్మకు ప్రయాణిస్తుందా? నా ఆత్మ ప్రమేయము లేకుండా నా దేహంలో జరుగుతున్న రసాయినక ద్రవాల వల్ల జరిగే అనర్థాలకు నేనెలా (నా ఆత్మ) కారణం? పుట్టిన బిడ్డమీద తల్లి చూపే అవ్యాజప్రేమకు, యువతీయువకుల మద్య జనించే వ్యామోహానికి కారణం దేహములోని కొన్ని రసాయనాల వల్ల అయితే, దేహాన్ని ఆశ్రయించుకొన్న ఆత్మకు ఏ విధంగా సంబందం?

ఇప్పుడు చెప్పండి నేనంటే నా దేహమా? నా ఆత్మా?

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=150