- అంతరంగం - http://www.charasala.com/blog -

ఈ వింత చూడండి

Posted By చరసాల On February 14, 2007 @ 10:28 am In వర్తమానం | 13 Comments

ఇప్పుడే ఈనాడులో చదివిన వార్త. అతనెవరో మాంసం ప్రతిరోజూ తినాలనుకున్నాడు. ఖరీదయిన కోడిమాంసమో, వేట మాంసమో కొనలేక విరివిగా కనిపించే కాకిమాంసమే ముద్దనుకున్నాడు. కాకులను వేటాడే చవకైన మార్గమూ కనుగొన్నాడు. జిల్లేడు పాలు కలిపి అన్నం పెడితే కాకులన్నీ కావు కావు మని తిని గుంపులు గుంపులుగా చావడం, ఈయన వీటిని సంచీలో కుక్కుకొని వెళ్ళి వండుకొని భంక్షించడం మొదలెట్టాడు. ఇందులో మీకేమయినా తప్పు కనపడిందా? వేస్తే అసహ్యం వేసుండొచ్చు. ఎందుకంటే అధిక శాతం ప్రజలు కోళ్ళని, గొర్రెలనీ, ఎద్దులనీ తింటారు గనుక. కానీ ఆయనేదో నేరం చేసినట్లు (పోనీ కృష్న జింకలనో, నెమ్మళ్ళనో తిన్నాడన్నా, లేదా వాడెవడో తిన్నట్లు మనుషులనో తిన్నా అది వేరు) ఆ కాకులకు శవ పంచనామా చేసి ఆయన మీద కేసు పెట్టారట! అవ్వ ఇంతకన్నా ఘోరం ఇంకోటి వుందా? కాకులేమీ వైల్డ్ బర్డ్స్ కాదు కదా? అవి తామర తంపరగా వూరూరా వున్నవే కదా? కొందరన్నా కాకి మాంసానికి ఎగబడితే, అలవాటు పడితే అంతకంటే కావలిసిందేముంది? అందుకు ఆయన్ని అభినందించవలసింది పోయి నీవూ మాలాగే పెంచుకున్న కోడినెందుకు తినలేదు? మురిపంగా కనపడే గొర్రెపిల్లనెందుకు కోసుకొని తినలేదు? లేదా కనీసం ముద్దుగా కనపడే కోడెదూడనన్నా తినాల్సింది కానీ నల్లగా వున్న కాకిపిల్లనెందుకు తిన్నావు అని కేసు వేస్తే ఒక మాంసవిప్లవానికి దారితీద్దామనుకున్న ఆయన ఏమని చెబుతాడు?
పోనీ ఏ మాంసభక్షణా చేయని వారు కేసుపెట్టారంటే అర్థం వుంది. కానీ పెంపుడు కోళ్ళనీ, గొర్రెలనీ, దూడలనీ తినే వాళ్ళు. తమ కోర్కెల సాధన కోసం దేవుళ్ళకు కర్కశంగా బలిచ్చే వాళ్ళు, వీళ్ళా ఆయన్ని నేరస్తుడనేది? ఏం, కోడి ప్రాణం కంటే కాకి ప్రాణం విలువెక్కువా? కాకి మాంసం తినడం నేరమెట్లా అయింది?

kaki.jpg

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=147