ఆడబాప

తేది: October 25, 2006 వర్గం: నా ఏడుపు, పుస్తకాలు రచన: charasala 3,851 views

సౌమ్య గారి సమీక్షలతో ఉక్కిరి బిక్కిరయ్యి నేను కూడా అంపశయ్య నవీన్ పుస్తకాలు (http://www.avkf.org ద్వారా) తెప్పించుకొని చదివాను. తెలంగాణ మీద సర్వత్రా చర్చ జరుగుతున్న ఈ రోజుల్లా దాని చరిత్ర చదవాలనే వుత్సాహము కూడా నాకుంది. అయితే నవీన్ నవలాత్రయం(కాల రేఖలు, చెదిరిన స్వప్నాలు, బాందవ్యాలు) అంతగా తెలంగాణా చిత్రాన్ని చిత్రించలేకపోయిందనేది నా అభిప్రాయము. ఈ నవలాత్రయములో మొదటి నవల కాలరేఖలు చదువుతూ వుంటే చాలా చోట్ల చదవకుండా పేజీలు తిప్పేద్దామనే బోర్ కొట్టింది. రచయిత తనకు గుర్తున్న బాల్యాంశాలతోనే పెద్దగా కృషి చేయకుండా వ్రాశాడనిపించింది. చెప్పిందే పదే పదే చెప్పడం చిరాకు తెప్పించింది. “ఊరు మీద ఊరు పడేయడం” ఎన్నిసార్లు వుంటుందో లెక్క లేదు. ఇంకా కాలరేఖలులో హీరో “రాజు” చిన్నపిల్లవాడు గనుక, నవల అంతా అతని దృక్కోణము నుండీ చిత్రీకరించడం వల్ల లోతైన విషయాలు చెప్పలేకపోయారు (పిల్ల వాళ్ళకు పెద్ద విషయాలు ఏమి తెలుస్తాయి). అలాగే పిల్లాడికి బస్సును చూడటం ఒక అద్భుతం, రైలు చూడటం ఇంకో అద్భుతం. కానీ ఇవన్నీ ఇప్పుడు చిరపరిచయాలయిపోయాక వాటిని గురించి ఏమి చదవాలనిపిస్తుంది? ఇక మాట్లాడితే ఎద్దులబండి సవారీ, ఇది కూడా పలుమార్లు అదేవరసలో వివరించడం. ఇంకా కొన్నిసార్లయితే నవలలో ఇంతకుముందే చర్చించిన విషయాన్ని చర్చించామన్నది గుర్తుకు లేక మళ్ళీ రాసినట్లు వుంది. రజాకార్ల ఆగడాలు, కమ్యూనిస్టు వుద్యమము, ఫ్యూడల్ కట్టుబాట్లు వీటిగురించి ఇవ్వాల్సినంత సమాచారము ఇవ్వలేదనిపిస్తుంది.
ఇక నాకు నచ్చిన విషయం ఏంటంటే నవలంతా అసలైన తెలంగాణా మాండలికంలో సాగడం. ఆ నవల చదువుతున్నన్ని రోజులూ నేను ఇంట్లో కూడా ఆ యాసలోనే మాట్లాడటం నాలుకపైకి వచ్చేసేది.
నన్ను కదిలించిన నేను కొత్తగా ఈ నవలనుంచి తెలుసుకొన్న అంశము “ఆడబాప” గురించి. అప్పుడెప్పుడొ రాజుల కాలంలో రాజకుమారితో పాటు ఆమె చెలికత్తెలను కూడా అత్తగారింటికి పంపేవారని తెలుసు. కానీ నిన్నమొన్నటి దాకా తెలంగాణలో వున్నదని తెలిసి మూగపోయాను. జోగిణి ఊరి ఆస్తి అయితే ఈమె ఇంటి ఆస్తి. ఇంటికొచ్చిన అథిధుల కోర్కెలు, ఇంటి పెద్ద కోర్కెలు (ఇల్లాలు బహిష్టు అయినప్పుడట) తీర్చాలట. ఈమెకు పుట్టిన ఆడపిల్లలు ఇంకో ఇంటికి ఆడబాపలుగా వెళ్తారట! మగవాళ్ళైతే జీవితకాలం పాలేరుగా పనిచేస్తాడట! ఎంత అన్యాయమని రాజు వాళ్ళ అత్తయ్య దగ్గర ఘోషిస్తే, ఆడబాప అలాగాక ఇంటిముత్తైదువలా వుంటుందా అంటూ తెగ ఆశ్చర్యపడిపోతుంది. ఆమె కర్మ అలావుంది, లేదా ఆమె రాత అలా వుంది అని సరిపెట్టుకుంటే, ఆచారం యొక్క బలం మామూలు విచక్షణా జ్ఞానానే హరించివేస్తుందంటే, ఈ ఆచారాలు ఎక్కడ సృష్టింపబడ్డాయో గానీ ఎంత బలంగా పాదుకొనబడ్డాయి!!
ఈ ఆడబాప గురించి బుర్రంతా తెగ బాధపడిపోతున్నప్పుడు తీవ్రంగా ఆలోచిస్తే ఈ సాంప్రదాయపు పెళ్ళిల్లు కూడా అలాంటివేనా? సాంప్రదాయపు కోరల్లో చిక్కుబడి రాజు అత్తయ్య అమాయకంగా ప్రశ్నించినట్లే పెళ్ళి చేసుకున్నాక అతనితో గాక ఇంకెవరితో సంసారము చేస్తుంది అని మనం సాప్రదాయపు పెళ్ళి ఉచ్చులో చిక్కుబడ్డ అబల గూర్చి ఆలోచిస్తున్నామా అని పిస్తుంది. లేకపోతే ఒక్కసారి పెళ్ళయిందంటే ఇక అతనే నీ మొగుడు అని కానీ లేదా ఆమే నీ పెళ్ళాం అని గానీ అనడం సంస్కారం కాదేమొ అనిపిస్తోంది. ఆడబాపగా పుట్టినందుకు నీకిక అదే జీవితం అనడానికి ఇష్టమున్నా లేకపోయినా అతడే/ఆమే నీ మొగుడు/పెళ్ళాం అనడానికి నాకట్టే తేడా కనిపించలేదు. అలాగని పశ్చిమ దేశాల్లోలాగా ఎప్పుడంటే అప్పుడు విడిపోవడం వ్యక్తి స్వేక్ష వరకూ బాగానే వుందిగానీ, అటు తల్లో ఇటు తండ్రో పిల్లలకు దక్కకుండా పోతున్న వైనం సమాజశ్రేయస్సుకు ఉపయుక్తంగా లేదు. వ్యక్తి శ్రేయస్సు ముఖ్యమా? సమాజ శ్రేయస్సా అంటే సమాజ శ్రేయస్సేనేమొ!
ఇక మిగతా రెండు నవలలు (చెదిరిన స్వప్నాలు, బాందవ్యాలు) ఫరవాలేదని పించాయి. అదికూడా కుటుంబసంబదాల కోణంలో చిత్రీకరణ బాగా వున్నా చరిత్ర కోణంలో అంత బాగాలేదనే చెప్పాలి. ఇందులో వున్న చరిత్ర సాంఘిక శాస్త్రము చదివిన ఏ హైస్కూలు కుర్రాడికయినా తెలిసిందే. అసలు చైనాకు ఇండియాకు జరిగిన యుద్దానికి ముందు దానికి దారితీసిన పరిస్థితులి ఏమిటి? లేదా పాకిస్తానుతో యుద్దాలకు దారితీసిన పరిస్థితులేమిటి ఇత్యాది వివరాలేమీ లేవు. పోనీ ఈ నవలాత్రయము తెలంగాణా చరిత్రకే పరిమతమనుకున్నా, ముల్కీ రూల్స్ చరిత్ర గానీ, వాటిని కోర్టు రద్దు చేసిన దాని వెనుక భిన్న వాదనలు గానీ ఈ నవలలు చూపించవు.
ఇక ఈయన రచనలు కూడా నిండుగా, గంబీరంగా సాగుతాయే కానీ మచ్చుకు కూడా ఒక సరదా సన్నివేశము కనపడదు. పోనీ సీరియస్ విషయమైనా గుండెలు కరిగేలా చెబుతారా అంటే అదీ కనపడదు. మాదిగ వాడలో చొరబడి ఒకరిని మానబంగము చేసి ఇంకిద్దరిని చంపి గుడిసె తగలబెట్టిన విషయాన్ని కూడా చాలా మామూలుగా చెబుతారు.
వీటికి ముందే ఈయనకు పేరు తెచ్చిన అంపశయ్య చదివాను. అది ఒక 14 గంటల విషయము కాబట్టి చాలా చిక్కగా వుందనిపించింది. గడగడా చదివేలా చేసింది. సగటు విధ్యార్థి జీవితంలో ఒకరోజు ఎలా గడుస్తుందో ఇది సరిగ్గా అలానే గడిచింది. అందువల్ల చదివే ప్రతి ఒక్కరూ దానిలో తన జీవితాన్ని చూసుకొని లీనమయిపోతారు. కాకపోతే కాలేజీ జీవితంలో అనుకునే పచ్చి శృంగార భావనలని కూడా అలాగే ముద్రించడంతో కొంత సెన్సార్‌షిప్ అవసరమేమొ అనిపించింది.
–ప్రసాద్

ఈ-మెయిల్ చెయ్యండి ఈ-మెయిల్ చెయ్యండి ముద్రించు ముద్రించు
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (రేటింగు లేదు)
Loading ... Loading ...

'ఆడబాప' పై 6 అభిప్రాయాలు

'ఆడబాప'పై అభిప్రాయాల RSS మరియు TrackBack.

 1. cbrao అభిప్రాయం,

  తేది: October 25, 2006 సమయము: 10:58 pm

  ఆడబాప గురించి మీరు రాసినవి ఆసక్తికరంగా ఉన్నాయి.

 2. విహారి అభిప్రాయం,

  తేది: October 27, 2006 సమయము: 10:15 am

  చాలా మంచి విషయము చెప్పారు.

 3. Sowmya అభిప్రాయం,

  తేది: October 27, 2006 సమయము: 10:45 pm

  నవీన్ రచనల్లో పూర్తిగా హాస్యం లోపించినట్లు నేనూ అనుకున్నాను.
  సెన్సార్ విషయం నేనూ ఏకీభవిస్తున్నా. చాలా చోట్ల ఇబ్బంది పడ్డాను.
  ఇంతకీ కాలరేఖలు త్రయం తెలంగాణా జీవితచిత్రణ … చరిత్ర చిత్రణ కాదు అనుకుంటా. జీవిత చిత్రణ లో భాగంగా అవసరమైనంత చరిత్ర వరకూ చెప్పారు అంతే. ప్రధాన పాత్రలు ఎక్కువ లేకుంటే – మొత్తం చరిత్రంతా చెబితే – మనకు వింటూంటే నే కల్పన లా అనిపించేసే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి అన్నీ ఎలా చూసాడు అని. :)
  ఇక – నాకు తెలిసినంత వరకు ఈ నవలా త్రయం కొంత వరకూ ఆత్మకథ. కాబట్టి మనం చరిత్ర చిత్రణ కోసం చూడ్డం లో అర్థం లేదు అనిపిస్తుంది.

 4. Sowmya అభిప్రాయం,

  తేది: October 27, 2006 సమయము: 10:49 pm

  నేను గమనించిన ఇన్కో విషయం – as a matter of fact అన్నట్లు చెప్పెస్తారు చాలా వరకు. మనకు అందులో ఆవేశం కనబడదు చాలా చోట్ల. అలా నిగ్రహంగా ఏదో ఓ వైపు కి తిరక్కుండా నిష్పాక్షికంగా చెప్పడం చాలా కష్టం.

 5. charasala అభిప్రాయం,

  తేది: October 30, 2006 సమయము: 10:45 am

  సౌమ్య గారూ,
  నేననేదేమంటే నిష్పాక్షికంగానే చెప్పినా హృదయవిదారక విషయాల్ని విదారకంగానేనయినా చెప్పాలి గదా! మనకు బయట కనిపించే మామూలు విషయమే అయినా సినిమాలో చూస్తే కన్నీళ్ళు వస్తాయి. కారణం దాన్ని దర్శకుడు ప్రతిభావంతంగా మలవడం. నవీన్ విషయంలో అలాంటి ప్రతిభ కనిపించదు. చెడు వార్త చదువుతున్నప్పుడు వార్తలు చదివే వ్యక్తికయినా ముఖంలో మార్పులు వస్తాయేమొ గానీ నవీన్ నవలలో అలాంటి బావం కనిపించదు.
  నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే విషయాన్ని పాత్రల మద్య సంబాషణల ద్వారా చెప్పించడం కంటే ఒకే పాత్ర యొక్క (రాజు) యొక్క స్వగతంగానో లేక కథకుడి ద్వారానో చెప్పబూనటం కథ చెప్తున్నట్లుందేగానీ నవలలా లేదు. అలా చెప్పడం కూడా చాలా చోట్ల కథను ముగించే సమయంలో ఇక ఆదరాబాదరాగా చెప్తున్నట్లుంది. నిజానికి ఎక్కడికక్కడ ముగిస్తున్నట్లే వుంటుంది గానీ ముగింపు కాదది.
  అయితే “చెదిరిన స్వప్నాలు”, “బాందవ్యాలు” మొదటి “కాల రేఖల” కంటే చాలా వుత్తమం.

  –ప్రసాద్
  http://blog.charasala.com


 6. తేది: June 5, 2007 సమయము: 7:37 am

  [...] ఆడబాప [...]

మీ అభిప్రాయం తెలియచేయండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో