- అంతరంగం - http://www.charasala.com/blog -

చదువుల్లో పోటీ, బాల్యం లూటీ

Posted By charasala On October 18, 2006 @ 9:58 am In నా ఏడుపు | 4 Comments

చదువు, చదువు, చదువు ఎవ్వరి నోట విన్నా ఇదే మాట. మంచిదే అందరూ చదువుకుంటే అంతకన్నా మంచేముంది. కాకపోతే అత్యాశ పనికిరాదు. అందరూ కలెక్టర్లో, డాక్టర్లో, ఇంజనీర్లో అవ్వలేరు కదా! కానీ ప్రతి తల్లిదండ్రుల ఆశా తమ పిల్లలు మాత్రం అలా ఏదో ఒకటి కావాలనే. ఒక మంచి సమాజసేవకుడుగా, సత్‌ప్రవర్తన కలవాడుగా, బాద్యతగల పౌరుడుగా తమ పిల్లలని తయారుచేయడం కంటె గూడా బాగా సంపాదన ఆర్జించగలవాడిగా, లంచాలు బాగా వచ్చే పోస్టు తెచ్చుకోగలిగే వాడిగా, అధికారం, దర్పం వుండే ఉద్యోగం చేయగల్గే వాడిగా తమ పిల్లలు తయారుకావాలని ఆశిస్తున్నారు. మంచిగా, నిజాయితీతో బతికేవాన్ని తల్లో నాలుకలేని వాడని, చేతకాని వాడని ఎద్దేవా చేస్తున్నారు. అదే లంచాలు మరిగిన కొడుకును చూసి “రెండు చేతులా ఆర్జిస్తున్నాడని” గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ విధంగా సంపాదనే లక్ష్యంగా మన చదువులు వుంటున్నాయి తప్పితే, విలువల లక్ష్యంగా లేవు.
పిల్లల కిష్టమయిన చదువులు కాక భవిష్యత్తులో బాగా సంపాదించడానికి వుపయోగపడే చదువులు చదివిస్తున్నాం.
భవిష్యత్తు పేరుతో పిల్లల వర్తమానాన్ని పాడు చేస్తున్నాం. ఎంతో అమూల్యమయిన బాల్యాన్ని చదువుల పేరుతో చెరబడుతున్నాం. అసలు అయిదేళ్ళు వచ్చేవరకు బడిలో చేర్పించడాన్ని నిశేదించాలి. పాలుతాగే వయసులో పుస్తకాలు తినడం ఏంటి. ఎదురింటి, పక్కంటి పిల్లలతో పోల్చి వాళ్ళలో అసూయ, స్పర్థ బీజాలు నాటడమెందుకు?
ఏ పిల్లాడికయినా తనకంటూ కొన్ని పరిమితులు వుంటాయి. వాటిని మించి వాళ్ళను చదివి ర్యాంకులు సాధించమంటే అది చివరికి బెడిసికొట్టి ఆ ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులకు ఎదురు తిరగుతారు లేక పోతే ఆత్మహత్యలు చేసుకుంటారు. (http://www.prajasakti.com/headlines_14.htm [1])
ఇంటర్ చదువుతున్న మా వదిన కూతురుని అడిగితే వారమంతా పాఠాలట, శనివారం, ఆదివారం పరీక్షలట! వారమంతా చదువే అయితే ఇక బయటి విషయాలు వాళ్ళకెలా తెలుస్తాయి. ఆటలు లేవు, పాటలు లేవు, ఓ నవల చదివేది లేదు, సాహిత్యమంటే ఏంటో తెలియదు. ఇదేనా జీవితం!
–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=107

URLs in this post:

[1] http://www.prajasakti.com/headlines_14.htm: http://www.prajasakti.com/headlines_14.htm