- అంతరంగం - http://www.charasala.com/blog -

To Make a Difference

Posted By charasala On October 5, 2006 @ 3:02 pm In సేవ | 3 Comments

 

 

Click here to join tomakeadifference
Click to join tomakeadifference
వ్యవస్థను తిడుతూ కూర్చొనే వాళ్ళు ఎంతోమంది, దాన్ని మారుద్దామని ప్రయత్నించే వాళ్ళు కొద్దిమంది. ఉప్పలపాటి ప్రశాంతి వాళ్ళలో ఒకరు. నా మట్టుకు నేను కూడా రోజూ చింతించేవాన్నే, వ్యవస్థను నిందించేవాన్నే. ఈనాడులో వచ్చే “ఈ చిన్నారి గుండెను ఆగనివ్వకండి”, “ఈ సరస్వతీ పుత్రికకు సాయం చెయ్యండి” లాంటివి చదివి కంటనీరు పెట్టుకొని పదో, పరకో డబ్బు పంపి అంతటిదో నా పని అయిపోయింది అని తృప్తి పడేవాన్నే.   

కానీ ఈ అమ్మాయిని చూసి సిగ్గుపడాలి. ఈమె To Make a Difference యాహూ గ్రూప్ తో అవసరంలో వున్నవారిని ఆదుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికి ఈ గుంపులో 104 మంది సభ్యులున్నారు. ఒక్కొక్కరు తమకు తోచినంత, చేతనయినంత సహాయము చేస్తున్నారు. గుండె ఆపరేషన్లకు, పిల్లల చదువులకు సహాయ పడుతున్నారు. తను చేయడమే గాక మరికొందరిని పురిగొల్పడం అంటే మాటలు కాదు కదా!

సహాయం చేయాలని చాలామందికి వుంటుంది. కానీ కొందరికి దారి తెలియదు, ఎవరిని నమ్మాలో  తెలియదు. చెక్కు రాసి చిరునామా కనుక్కొని పొస్టు చేయాలంటే కొందరికి బద్దకము.
ఇంకొంతమంది అంతా మోసమని, అవసరమయిన వాడికి అందించక మద్యలో దళారులు తినేస్తారని సాకులు చెప్తారు. పోనీ ఆ అందించే బాద్యతను తీసుకుంటారా, అదీ లేదు. ఇది పలాయనవాదం. మన చుట్టూ వున్న వ్యవస్థను మనమే మార్చాలి దానికి మనమే కారణం. మనం చేసే దానంలో అవినీతికీ, మోసానికి బలయినా కొంత మొత్తమయినా అందవల్సిన వాళ్ళకు అందదా?
ఆ మద్యన మా మిత్రుడొకాయనకు ఇలా స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సహాయం గురించి చెప్పితే, “అదంతా మోసమండీ, మద్యలో వాళ్ళే అంతా తినేస్తారు” అని తేల్చి పారేశారు. పోనీ మీకు తెలిసిన మిత్రుల ద్వారానో, బందువుల ద్వారానే చెయ్యొచ్చు కదా అంటే “ఎందుకండీ మనమే ఇండియా వెళ్ళినప్పుడు పాత చొక్కాలు, పాంటులు ఇస్తే సరిపోతుంది” అన్నాడు. దానం అనేది మనకు పనికిరాని వస్తువును ఇవ్వడం కాదు, వాడికి పనికి వచ్చేది ఇవ్వడం. ఇది ఒక option కాకూడదు, ఒక ద్యేయం కావాలి. ఇంకా ఆయనే అన్నాడు “మేము న్యూజెర్సీలో కట్టిన టెంపుల్ కి బాగానే సహాయం చేశాము, అది రేపు మన పిల్లలకి వుపయోగపడుతుందని”. మనం కూడబెట్టేదీ పిల్లల కోసమే, దానమిచ్చేదీ పిల్లల కోసమేనా? ప్రతిదీ స్వార్థంతో ఆలోచించడమేనా? దేవుడికి కొట్టే కొబ్బరికాయ నుంచీ ఏదో రావాలి, పిల్లల పెంపకము నుండీ ఏదో రావాలి, దానం నుండీ కూడా ఏదో రావాలి.

పేపర్ నిండా తిరుమల గుడిలో పాము కనబడింది ఈ విషయాన్ని 100 పేపర్లు రాసి పంచితే లాటరీ తగిలింది అని రాస్తే వెంటానే ఏ పుట్టలో ఏ పాముందో అని చేసేస్తాం. అదే ముగ్గురికి సహాయం చేయి అంటే నాకంత సమయమెక్కడిదీ అంటాం.

మనసుండాలే గానీ మార్గముండకపోతుందా? ఎన్నో స్వంత పనులకు దొరికిన సమయం దురదృష్టవంతులకు, అభాగ్యులకు, విధి వంచితులకూ కేటాయించలేమా? మానవత్వపు పరిమళాన్ని పంచలేమా?

కాస్తా మీ సమయాన్ని సేవకై వుపయోగించండి, మీరు కూడా మార్పుకై వుద్యమించండి. మీరూ To Make a  Difference లో సభ్యులై మార్పును తెండి.

Subscribe to tomakeadifference

–ప్రసాద్


Article printed from అంతరంగం: http://www.charasala.com/blog

URL to article: http://www.charasala.com/blog/?p=101