మా దీపావళి

తేది:October 19, 2017 వర్గం:అనుభవాలు, చరిత్ర రచన:చరసాల 3,093 views

దీపావళి సందర్భంగా మళ్ళీ నా కథ, మా కథ, మా వూరి కథ చెప్పక తప్పదు.

నిజం చెప్పాలంటే దీపావళి అన్నది ఓ పండుగ అనీ, నరకాసురుణ్ణి సత్యభామా దేవి చంపిన రోజు అనీ కేవలం పాఠ్య పుస్తకాల ద్వారా మాత్రమే నేను తెలుసుకున్నా. నేనేం పద్దెనిమిదో శతాబ్దం గురించో, పందొమ్మిదో శతాబ్దం గురించో చెప్పటం లేదు. డెబ్బై, ఎనబైవ దశాబ్దాల గురించి చెబుతున్నా. పోనీ మా వూరేమయినా అడవుల్లోని ఓ గిరిజన తండానా అంటే కాదు, అది కడప పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలోని వూరు. జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల లోపే! మా తాతకు గాంధీ గురించి తెలుసు. సహాయనిరాకరణ వుద్యమంలో (ఆయన చెప్పలేదు గానీ నేను వూహించుకున్నా) భాగంగా అటవీ అధికారులని ధిక్కరించి అడవులనుండీ కలప తెచ్చారట! అయితే ఆయనకు దీపావళీ తెలియదు. నరకాసురుడు అసలే తెలియదు. సత్యభామను కలలో కూడా వూహించి ఎరుగడు.
ఈ పండుగ వచ్చిందంటే నాకు పెద్ద దిగులుండేది. ఎందుకంటే బడి వుండదు గనుక. బడి లేని రోజు ఆవుల మేపడమో, ఎనుముల (గేదెలు/బర్రెలు) మేపడమో, అదీ కాదంటే ఎద్దుల మేపడమో చేయాలి. ఆవులనీ, గేదెలనీ మేపడం కంటే కాడెద్దులను గట్ల వెంబడీ మేపడం మాహా బోరైన పని. వాటి పగ్గాలను పట్టుకొని అవి గట్ల మీదే మేసేలా అదుపు చేస్తూ వుండాలి. ఓ క్షణం మనం ఏమారినామంటే అవి గబుక్కున పక్క పొలంలోని వేరుశనగో, వరినో తినేస్తాయి. అదే జరిగితే పెద్దోళ్ళతో తర్వాత నేను తిట్లు తినాల్సి వుంటుంది. గంటా, రెండుగంటలా.. అలా పూటంతా అవి మేస్తూ వుంటే వాటి పగ్గాలు పట్టుకొని వాటిని చూస్తూ నిలబడి వుండటం.. అంత నరకం మరొకటి లేదు. ఆ బోర్‌డం నుండి తప్పించుకునేందుకు రేడియో పట్టుకెళ్ళేవాన్ని.. నేను పట్టుకెళతానని తెలిసి యింట్లో మా చెల్లి దాన్ని ముందే దాచేసేది. వున్నది ఒక రేడియో.. తనకీ యింట్లో బోరే కదా! ఇక చదవడానికి పుస్తకాలా? గ్రంథాలయం అనేది ఒకటుంటుందనీ అందులో పుస్తకాలుంటాయనీ తెలిసిందే కడపలో కాలేజీ చేరాక. ఎలాగైనా ఓ పుస్తకమో, లేదా రేడియోనో దొరికిందంటే దీపావళే కానక్కర లేదు, ఆ రోజు నిజంగా పండగే! ఇదీ దీపావళి అనబడే పండుగ తెచ్చే తంటా!

ఆ తరువాత వచ్చే దసరా, దాని కోసం వచ్చే దసరా సెలవులు కూడా ఇంకా పెద్ద దిగులును తెచ్చేవి అంటే మీరు నమ్మక తప్పదు. దసరా అంటే నీలకంఠరావు పేటలో కోమట్లు వైభవంగా చేసే కన్యకాపరమేశ్వరి వూరేగింపు అని మాత్రమే తెలుసు. మా వూర్లో చాలామంది ఆ వూరేగింపు చూడటానికి ఆ వూరు వెళ్ళేవాళ్ళు. మా నాన్న చండశాసనుడు ఈ విషయాల్లో. ఆయన పంపడు, మేమెప్పుడూ అడగనూ లేదు.

పండుగంటే మాకు సంక్రాంతే! అసలు దానిపేరు సంక్రాంతి అనికూడా మాకు పుస్తకాల ద్వారానే తెలిసింది. పెద్దోళ్ళంతా దానిని కేవలం “పండుగ” అనేవారు. లేదూ “పెద్ద పండుగ” అనేవారు. “వచ్చే పండుగకు చూద్దాం లేరా” అంటే “వచ్చే సంక్రాంతికి దాని పని చూద్దాంలే” అని అర్థం. పండుగ నెలో, రెండు నెలలో వుందన్నప్పటినుండే జోరు మొదలయ్యేది. అప్పటికే పాడుబడిన పందిరిమీదనుండి ఎండిపోయిన ఈతాకును పీకి చలిమంటలకూ, పొయ్యిలోకీ వాడటం మొదలెట్టేస్తారు. మంచి ఆకున్న ఈతచెట్లను చూసి ఆకు మండలను కోసి, పరచి, మోపులు కట్టి వాటిమీద రాళ్ళను బరువుగా పెట్టేవాళ్ళం. కడప సున్నపు బట్టీలనుండీ సున్నం తెచ్చి పెద్ద తోట్లలో పోసి విరగనిచ్చేవాళ్ళం. ఎద్దులకు కావల్సిన గజ్జెల పట్టాలనూ, కాళ్ళకు కట్టే వెంట్రుకలతో చేసిన నల్లటి తాళ్ళను దుమ్ముదులిపి బాగుచేసుకువాళ్ళం. పండుగ కోసం నాన్న తెచ్చే బట్టలు ఓ పులకింత కలగజేసేవి. వాటిని టైలర్‌కు కుట్టడానికిచ్చి అవి అయ్యేవరకూ రోజులు లెక్కపెట్టుకోవడం! పండుగ దగ్గరయ్యేసరికి గోడలకు సున్నాలు కొట్టడం, ఎర్రమట్టి పూయడం పూర్తవ్వాలి. కోసిన పచ్చటి ఈతాకుతో పందిరి వేయడం అవ్వాలి. అదే సమయంలో కళ్ళంలో వేరుశనగ పనులు పూర్తవ్వాలి. వూరికి కొంచం దూరంలో విశాలమైన చెరువు మైదానంలో గుబురు పొదకింద నాలుగు రాళ్ళతో ఓ గుడి కట్టి, లోపల మరో రాయిని పెట్టి కాటమ రాజును సిద్దం చేయాలి. ఈ కాటమ రాజుకు ఎదురుగా కంపనో, కర్రలనో తెచ్చి పండుగరోజు మంట కోసం ఓ పెద్ద కుప్ప తయారుచేయాలి. ఇక పండుగ మూన్నాళ్ళూ సందడే సందడి. తిండేమి, కొత్త బట్టలేమి, ఎప్పుడోగాని కనపడని వూరి ఆడపడచులూ, అల్లుళ్ళేమి. దేవాలయం ముందున్న అల్లెరాయిని ఎత్తివేయడంలో పందాలేమి…అదీ పండగంటే! చెబుతూబోతే చాంతాడంత చెప్పొచ్చు.

ఈ సంక్రాంతికే పెద్దల సమాధులను చూసి అక్కడ దీపం వెలిగించి వారిని స్మరించుకోవడమూనూ. ఈ సంక్రాంతికే వూరిబయట పాతవూర్లో వున్న చింతచెట్లకింద దాసరోళ్ళు, జంగమోళ్ళు, గంగిరెద్దులోళ్ళు, బుడబుడకలోళ్ళు, మొండోళ్ళు.. వూరు సైజు పెరిగినట్టనిపించేది. వీళ్ళు కథలు చెబుతూ, పాటలు పాడుతూ వూర్లో తిరిగేవాళ్ళు. ఒక్క గంగిరెద్దులోళ్ళు మాత్రమే ఎద్దును రాముడనీ, ఆవును సీతమ్మనీ సంభోదిస్తూ వాటితో నమస్కారాలు పెట్టిస్తూ.. తిరిగేవారు గానీ, దాసరోళ్ళు గానీ, జంగమోళ్ళు గానీ, బుడబుడకలోళ్ళు గానీ రాముడి, కృష్ణుడి కథలనీ, భాగవత గాథల్నీ పాడినట్టు నాకు జ్ఞాపకం లేదు. మా వైపు హరిదాసులు అడుక్కోవడానికి వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ దశకర్మ రోజున హరిదాసును పిలిపించి ఏదైనా కథ చెప్పించేవాళ్ళు. ఇది ఖచ్చితంగా తర్వాతి పరిణామమేనని చెప్పవచ్చు. ఎందుకంటే హరికథ పుట్టిందే మన ఎరుకలో కదా! ఇక దాసరోళ్ళు అంటే నాకు వెంటనే ఒక మధ్యయస్కుడు రంగుల తలపాగా చుట్టి, ఎడమచేతి అయిదువేళ్ళకూ పెద్ద పెద్ద గజ్జెలతో వున్న రింగులు తొడిగి, రంగుల చేతిరుమాళ్ళాంటిది చిటికెనవేలికి వేలాడుతూ వుంటే వీణను పోలిన వాయిద్యం మీటుతూ పాడుతూ వుంటే, తనకు అటొక స్త్రీ, ఇటొక స్త్రీ తంబుర వాయిస్తూ అతనికి సహకరిస్తూ పాడుతూ వుంటారు. మామూలుగా వాళ్ళు అతని భార్యలైయుంటారు. వాళ్ళెప్పుడూ భాగవత కథలు పాడగా వినలేదు. వాళ్ళు యింటిముందుకొస్తే “అమ్మా, మీ నాన్నను పొగుడుతాం. ఓ చాటెడు వడ్లు పెట్టు” అని మా అమ్మను అడిగేవాళ్ళు. మా అమ్మ చాటెడు కాదు గానీ, చాటతో వడ్లు పోసి, పొగడమనేది. వాళ్ళిక ఆ పొగిడే పాట ఎత్తుకునేవాళ్ళు. అది దేవాలయంలో పూజారి మన పేరు గోత్రం అడిగి చేసే పూజలా వుండేది. పూజారి తను దేవుడికి చేసే విన్నపాలలో మన పేరు, గోత్రం చేర్చి అదే మంత్రమే అందరికీ చదివినట్లు, ఆ దాసరి తన పొగడ్త పాటలో మా తాత పేరు చేర్చి మిగిలిందంతా అలాగే పాడేవాడు. అందులో నాకు బాగా గుర్తున్నది “..బంగారు పళ్ళవాడా..” అన్నది. అసలు పళ్ళే లేని మా తాత గుర్తొచ్చి నాకు నవ్వు వస్తే.. చనిపోయిన వాళ్ళ నాన్నను తలచుకుంటూ, తలుపుచాటున మా అమ్మ పైటకొంగుతో కన్నీళ్ళు తుడుచుచుకుంటూ వుండేది. ఈ దాసరోళ్ళే రాత్రికి వూరు మధ్యలో కథ చెప్పడానికి సిద్దమయేవాళ్ళు. ఏ కథ కావాలని వూరి పెద్దలను అడిగితే ఆ కథల చాయిస్‌లో భాగవత కథలో, భారత కథలో వుండేవి కావు. కాటమ రాజు కథో, బాల నాగమ్మ కథో, ఇలాంటివే ఏవో కథలు వుండేవి. ఇక జంగమోళ్ళు అయితే ఏ తెల్లవారుఝామునో వచ్చేవాళ్ళు. ఏ యింటిముందో నిలబడి ఆ యింటికి జరగబోయే వుపద్రవాల గురించి భయపెట్టేవాళ్ళు. వాళ్ళు కూడా ఎప్పుడూ భాగవత, భారత కథలు చెప్పలేదు. ఇక మొండోడు అని వచ్చేవాడు. తనేం పాడేవాడూ తెలియదు కానీ, చేతిలో మొండికత్తి పట్టుకొని చేతికున్న యినుప కంకణం మీద కొట్టూకుంటూ అతను అడిగింది ఇచ్చేవరకూ యింటిముందు కూచుని వెళ్ళేవాడు కాదు. ఒక్కోసారి అడిగింది ఇవ్వకపోతే గాయాలు చేసుకునేవాడు.

ఇవన్నీ ఆ రోజులు గొప్పవనీ, ఆ కళలు గొప్పవనీ చెప్పడానికి ఏకరవు పెట్టటం లేదు. ఆనాటి కళల్లో, ప్రజల్లో ఎక్కడా భాగవతం, భారతం లేవని చెప్పడానికి చెబుతున్నాను. ఈ సంస్కృతీ, ఈ దేవుళ్ళూ, ఈ పండుగలూ మనకు పరాయివి. మళ్ళీ నన్ను దేశ సమగ్రతకు చేటుతెచ్చే మాటలన్నాను అంటే నేనేం చేయలేను గానీ.. ఇవన్నీ ఉత్తరాది నుండీ వచ్చిన పండుగలు. దీపావళి, దసరా, శ్రీరామనవమి, క్రిష్ణాష్టమి, హోళీ, వినాయక చవితి, ఈమధ్యనే అక్షయ తృతీయ.. దక్షణాదికి దిగుమతి అయ్యాయి కదా? కనీసం ఒక్క సంక్రాంతినైనా ఉత్తరాదికి ఎగబాకించకలిగామా! మరి ఐలయ్య అన్నాడు అంటే అనడా?