జగన్ చేసిందే సరైన పని!

తేది:December 8, 2010 వర్గం:వర్గీకరింపబడనివి రచన:చరసాల 4,315 views

జగన్ ఎలాంటివాడు అనేదాని మీద ఆధారపడి అతని చర్యలని అంచనా వేయకుండా, అతను చేసింది సరైందేనా (అదే కాంగ్రెసు నుండి విడివడి సొంత ఖాతా తెరవడం) అంటే ముమ్మాటికీ సరైందే అని నేనంటాను.

మన దేశంలో ప్రజాస్వామ్యం తలకిందులుగా నడుస్తుందెందుకో! ఇక్కడ అమెరికాలో “టీ పార్టీ” అంటూ రిపబ్లికన్లకు ముచ్చెమటలు పట్టింఛారు ప్రజలు. అలాగని ఇక్కడ ప్రజాస్వామ్యం నీటారుగా రెండు కాళ్ళ మీద నడుస్తోందని కాదు గానీ, మన దగ్గర మాత్రం పూర్తిగా తలకిందులయ్యింది.

ఇప్పుడు చూడండి, ఆ కికురె ముఖ్యమంత్రి అయ్యాక, పదవులు రాలేదనీ, వచ్చినా సరైన శాఖలు దక్కలేదని ఆ ఏడుపులు చూడండి. వెదవలు వీళ్ళు మాత్రమే వాళ్ళ వాళ్ళ వర్గానికీ, కులానికీ అసలు సిసలు ప్రతినిధులైనట్లు, మంత్రి అయితే సరే లేకుంటే తను కాదు తన కులాన్ని మొత్తం అవమానించినట్లు అంటాడు.

పదవి రానివాడూ, రావాలనుకున్న వాడూ “అమ్మా” అని తప్పితే “ఓటరూ” అని ఎవడైనా కేకేస్తున్నాడా? వోటరుదేముందీ కాసిన్ని డబ్బులు వెనకేసుకుంటే ఇంత విదిల్చి గెలవొచ్చు, కానీ పదవి ప్రాప్తించాలంటే అమ్మ కరుణే కావాలి. పదవి కావాలంటే అమ్మ, పైకి రావాలంటే అమ్మ. అమ్మ దయ వుంటే ముఖ్యమంత్రే ఏం ఖర్మ రాష్త్రపతీ, ప్రధాన మంత్రే అయిపోవచ్చు. వెధవది ప్రజలని నమ్ముకుంటే ఏముంది మహా అయితే ఎమ్మెల్యే కావచ్చు.

ఈ కిటుకు తెలుసును గనుకే ప్రజా ప్రతినిధులమన్న మాటను మరచి అమ్మ ప్రతినిధులయిపోయారు. అందరూ దిగుమతి అయి ప్రజల మీద రుద్దబడుతున్నారే కానీ, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వాలనీ, దాని చేతలనీ ప్రభావితం చేయలేకున్నారు.

అదే జగన్‌ను చూడండి. మీ అత్త పోతే ఏ హక్కుతో ఆ కుర్చీని మీ ఆయన కిచ్చారో, ఆర్నెళ్ళ ప్రాధమిక సబ్యత్వంతోనే వందేళ్ళ కాంగ్రెసు అధ్యక్ష పదవి మీఎలా వచ్చిందో, మీ తర్వాత మీ వారసుడిగా రాహుల్ ఎదగ్గా లేంది, మా నాయన కాళ్ళరిగేలా తిరిగి సంపాదించిన కుర్చీని నేనడిగితే తప్పేంటి అన్నాడు.

తను అడగాలి, ఈయన వినాలి గానీ, ఈయన ఆమెను, అమ్మను, రెండుసార్లు ప్రధాని పదవిని త్యజించిన త్యాగమయిని అడగడమేంటి? అవ్వ ఎంత అప్రజాస్వామికం? “ఇలా అడగడమే నీకున్న అనర్హత. గుమ్మం దగ్గర కాచుకొని ఎదురుచూడగల ఓపిక వుండాలి. కుక్కకున్న విశ్వాసముండాలి. కుక్కలా ప్రశ్నించకుండా ఎంతకాలమైనా ముద్ద కోసం ఎదురుచూడాలే గానీ, అరవకూడదు.” అంది అమ్మ.

కానీ జగన్ కుక్కలా ఎదురు చూడదల్చుకోలేదు. తనకు ప్రజల దగ్గర పలుకుబడి వుందనుకున్నాడు. (తోడు నాన్న హయాంలో సంపాదించిన సంపదలూ వున్నాయి). నాకు అమ్మ దయ కాదు, మీ దయ చాలన్నాడు. పార్టీ పెడుతున్నాడు. నిజానికి ప్రజాస్వామ్యంలో ఇదే జరగాలి. తనకు అన్యాయం జరిగిందనుకుంటే ప్రజల దగ్గరికే వేళ్ళాలి కానీ అమ్మ దగ్గరికి కాదు. ఆ విధంగా ప్రజలకే అంత్యధికారం ఇచ్చినట్లవుతుంది.

ఇది ఒక కాంగ్రెసులో వున్నదే కాదు. ఏ పార్టీ అయినా అంతే! ఇక్కడ అమ్మ అయితే అక్కడ మరో అమ్మ లేదా అయ్య.

వికీలీక్స్ చర్యలు ఆమోదనీయమేనా?

తేది:December 8, 2010 వర్గం:వర్గీకరింపబడనివి రచన:చరసాల 3,333 views

వారం పైగా ప్రతి నిత్యం వికీలీక్స్ మరియు దాని అధినేత అసాంజీ వార్తల్లో నానుతున్నారు. ప్రభుత్వాల మధ్య, ప్రభుత్వ విభాగాల మధ్య జరిగిన సున్నిత సమాచార మార్పిడిని ఈ సంస్థ అంతర్జాల మీడియా ద్వారా బహిరంగ పరుస్తోంది.

ఈ విశయం చిలికి చిలికి గాలి వాన కాగానే వికీలీక్స్ మద్దతుదారులకు, వ్యతిరేకులకు సైబర్‌వార్ నడుస్తోంది. మొదట వికిలీక్స్ వెబ్‌సైట్‌ను హోస్ట్ చేసిన EveryDNS.net చేతులెత్తేసి, తమమీద సైబర్ దాడులు జరిగే అవకాశముందంటూ వికీలీక్స్‌ను తమ సర్వర్ల నుండి తొలగించింది. అదే దారిలో నడుస్తూ Amazon, Paypal తమ సేవలు నిరాకరించాయి. ఇప్పుడు VISA మరియు Master Card కంపెనీలు విలీలీక్స్‌కు తమ సేవలను నిరాకరించాయి.

ఈ నిరాకరణతో మరింత రెచ్చిపోయిన వికీలీక్స్ మద్దతుదారులు ఆయా కంపెనీల మీద సైబర్ దాదులతో విరుచుకు పడ్డారు. వారి దెబ్బకు ఈ వుదయం Master Card కార్యకలాపాలు స్థంబించాయని వార్త!

ఈ తతంగమంతా చూస్తుంటే అసలు సమాచార స్వేచ్చ పేరుతో వికీలీక్స్ చేస్తున్న పనులు సమ్మతమేనా అన్న అనుమానం వచ్చింది. ఓ మనిషికి వ్యక్తిగతం వున్నట్లే దేశాలకీ, ప్రభుత్వాలకీ వుంటుంది. దేశాల మధ్య మితృత్వాలూ, శతృత్వాలూ, రహస్యాలు, ప్రణాళికలు, తంత్రాలు వుంటాయి. ఈ సున్నిత సమాచారం బహిర్గితం కావడమంటే దేశాల సార్వభౌమత్వ హక్కుకు భంగం కలగడమే కాకుండా, ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెరిగి అవ్యవస్థ తయారుగావచ్చు. ఇలాంటి సమాచరం బయటకు తేవడం వల్ల సామాన్యుడికి కలిగే వుపయోగమేమిటో నాకెంతకూ తోచడం లేదు.

అలాగని వికీలీక్స్‌ను న్యాయబద్దంగా ఎదుర్కోకుండా, ఇలా ఈ సైబర్ యుగంలో అత్యవసరాలనదగ్గ సర్వీసులని నిరాకరించడం ప్రజాస్వమ్యబద్దంగా లేదు. ఈ వుదంతంతో ఈ కంపెనీలు చివరగా తమ విధేయతను ఎవరికి చూపిస్తాయో తెలిసిపోతోంది.