ఇది కాంగ్రెస్ స్వంత వ్యవహారమా?

తేది:September 30, 2009 వర్గం:వర్తమానం రచన:చరసాల 3,668 views

 ఒక నల్లవాడు అమెరికా అధ్యక్షుడైనా, అకస్మాత్తుగా వైస్సార్ గల్లంతైనా చలించని నేను ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ తంతు చూస్తుంటే మాత్రం స్పందించకుండా అదే నా ఏడుపు ఏడవకుండా వుండలేకున్నాను.

నేను కాంగ్రెసు పక్షపాతినసలే కాదు. అయితే మాత్రం ఈ రాజ్యాంగభంగాన్ని సహించాల్సిందేనా? తెలుగువాడికి జరిగే అవమానాన్ని భరించాల్సిందేనా? ఎవరెన్ని చెప్పినా రాజశేఖర రెడ్డి లేనిదే కేవలం సోనియా బొమ్మ చూసి రాష్ట్ర ఓటర్లు కాంగ్రెసును మళ్ళీ అధికారంలోకి తెచ్చారంటే నేను నమ్మను. తను ఒంటిచేత్తో అటు మూకుమ్మడిగా కట్టగట్టిన మహాకూటమిని ఇటు స్వంత పక్షంలోని అస్మదీయులనీ ఎదుర్కొని విజయం సాధించాడు. అలాగని ఆయన కొడుకు ముఖ్యమంత్రి పదవికి అర్హుడని నేననను. ఇందిరా గాంధీ చనిపోతే రాజీవ్‌కున్న అర్హతే జగన్‌కూ వుంది. అందుకో, ఇందుకో ఎందుకో అధిక శాసనసభ్యుల మద్దతూ వుంది. అది చాలు కదా రాంజ్యాంగ నిభందనలను సంతృప్తి పరచడానికి.

మన ప్రజాస్వామ్యంలో మెజారిటీ భావన నేతిబీరకాయలో నెయ్యి లాంటిదేనని అందరికీ తెలిసిందే. ఇక కాంగ్రెసులోనయితే మరీను. అక్కడ పైవాడి ఒక్క ఓటు ప్రజలందరి ఓటుతో సమానం. మన్మోహన్ సింగ్ ఆ ఒక్క ఓటుతోనే ప్రధాని అయ్యుండవచ్చు. రాజసేఖర రెడ్డీ అలానే అయ్యుండవచ్చు. అయితే కనీసం రాజ్యాంగ బద్దం అనిపించడానికి “మమ” అనే తంతు జరగాలిగా, మనందరికీ అది తంతేనని తెలిసినా! రాష్ట్రపతికి సోనియా మద్దతు లేఖ ఒకటే సరిపోతుందా మన్మోహన్ ప్రధాని కావడానికి? మెజారిటీ MPల మద్దతు వుందని చూపక్కరలేదా? అలానే ఎంత రోశయ్యను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నా, శంఖంలో పోసిందే తీర్థమయినట్లు మెజారిటీ ఎమ్మెల్యేలతో చెప్పిస్తేనేగదా ముఖ్యమంత్రి అయ్యేది.

 ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూస్తే “ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు?” అన్న ప్రశ్నకి “సోనియా గాంధీ” అని విధ్యార్థులు సమాధానం రాసినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే మన కాంగ్రెసోళ్ళు ఉపాద్యాయులైతే అదే సత్యమంటారు.

ఇంతకు ముందు అధిష్టానం నుండి ఓ దూత రహస్య సందేశం తెచ్చేవాడు. ఆ సందేశం ప్రకారం ఇక్కడ ఎమ్మెల్యేలు తమ నాయకున్ని ఎన్నుకునేవారు. ఛ ఛ అంత రహస్యం ఎందుకనుకున్నారో ఏమో గానీ ఇప్పుడదే సంప్రదాయమయిపోయింది. ముంఖ్యమంత్రి చనిపోయి నెలవుతున్నా CLP సమావేశం గానీ దాని వూసు గానీ లేకుండా రోశయ్యే CLP నాయకుడని చెప్పేవాళ్ళకి బుర్రలో గుజ్జు వుందా? లేకుంటే మనమేం చెప్పినా వినే తెగులున్నవాళ్ళే తెలుగువాళ్ళు అన్న నిశ్చయానికి డిల్లీ పెద్దలు వచ్చారా?

ఏదేమయినా ఇది కాంగ్రెసు స్వంత వ్యవహారం కాదు. రాజ్యాంగ సూత్రాలకు అవమానం. పదవిలో వుండి మరణించిన తెలుగు నాయకుడికీ, ప్రజలకూ అవమానం.

నటనైనా అవసరం

తేది:September 30, 2009 వర్గం:అనుభవాలు రచన:చరసాల 4,131 views

బ్లాగ్లోకానికి దూరమై ఏడాదిపైన అయింది. మొన్న జరిగిన ఓ ఘటన మదిలో తొలిచేస్తూ ఏదోవిధంగా బయటపడాలని చూస్తోంది. కనీసం బ్లాగితేనయినా ఆ బాధ తగ్గుతుందేమోనని ఇలా కీబోర్డు పట్టాను.

గత శుక్రవారం (సెప్టంబరు 25) ఇక్కడ గాయని సునీత కార్యక్రమం వుండింది. అందుకు సంబందించిన ప్రకటన ఇక్కడ చూడండి. అందులో “శ్రియ” కనిపిస్తుందని పెద్దగానే ప్రకటించారు.  

Sunitha

నాకు సునీత పాటలను వినాలనే ఆశ కొంతైంతే శ్రియనూ చూడాలన్నదీ కొంత. మా ఇంటినుండీ ఈ కార్యక్రమం జరిగే ప్రదేశం గంటకు పైనే దూరం. అయినా టైర్లీడ్చుకుంటూ అంతాదాకా వెళ్ళి గంటన్నర ఆలస్యంగా మొదలైన ప్రోగ్రాంని కళ్ళూ, చెవులూ అప్పగించి చూస్తే తీరా శ్రియ గురించిన వూసే లేదు.

కార్యక్రమం మధ్యలో విరామ సమయంలో ఆయనెవరో నిర్వాహకుడు గాయకులనీ, వాద్యకారులనీ పరిచయం చేస్తుంటే “శ్రియ” “శ్రియ” అని జనాలు కేకలేస్తుంటే, ఆ నిర్వాహకుడు పొరపాటున కూడా శ్రియ గురించి మాట్లాడలేదు. పైగా “మా మాట నమ్మి వచ్చిన మీరంతా వెర్రి వెధవాయిలు” అనుకుంటున్నట్లు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

శ్రియ వస్తుందని ప్రకటనలో చెప్పిన నేరానికి కనీసం ప్రేక్షకులకి క్షమాపణో, సంజాయిషీనో ఇవ్వాల్సిన అవసరం వున్నట్లు ఆ పెద్ద మనిషికి గానీ ఇతర పెద్ద మనుషులకుగానీ తోచలేదు. తోచే వుంటుంది, వచ్చిన వారు వాళ్ళకి వెధవల్లా కనపడ్డప్పుడు బాధ పడుతున్నట్లు నటించడం కూడా శుద్ద దండగ అనుకుని వుంటారు.