మా వూరి సంగతులు – ఎవరికి పిచ్చి?

తేది:July 15, 2008 వర్గం:అనుభవాలు, నా ఏడుపు రచన:చరసాల 5,449 views

పిచ్చిఆ అమ్మాయి నా కంటే నాలుగైదేళ్ళు చిన్నదేమొ. పేరు మల్లినో, నాగమల్లినో సరిగ్గా నాకు తెలియదు. ప్రస్తుతానికి మల్లి అంటాను. వరసకి అత్త కూతురవుతుంది. ఆమెకు ఓ అక్క, ఓ సోమరిపోతు అన్న వున్నారు. అప్పుడే ఆ అన్న వూర్లో వుండక పట్టణాలు పట్టుకు తిరిగేవాడు. ఇప్పుడూ అంతే. అక్కకు పెళ్ళై మరో వూరెళ్ళిపోయింది. చిన్నప్పుడు ఈమె సిగ్గరి, అక్కలా ఎదుటపడి మాట్లాడేది కాదు. వీళ్ళమ్మకు మేమంటే చాలా అభిమానం. నేనెప్పుడు వూరొచ్చినా నన్ను చూడటానికి తప్పక ఇంటికి వచ్చేది అవసానదశలో మంచం మీద వున్నప్పుడు తప్ప.

మల్లికి పెళ్ళయింది కానీ కొన్ని రోజులకే ఏ కారణం వల్లనో భర్త వదిలేశాడు. వూరికయితే వచ్చింది గానీ, అమ్మ లేదు, నాన్న లేడు. అక్కదీ, అన్నదీ ఎవరి దారి వారిది. వూరిలో ఆ పనీ ఈ పనీ చేసుకొని పొట్ట నింపుకొని, ఏ చూరుకిందో, అరుగు మిదో పడుకొని కాలం వెళ్ళదీస్తుండేది. సరైన తిండిలేక నీరసించిన మల్లికి ఎయిడ్స్ వుందేమోనన్న అనుమానం ఎవరికో వచ్చింది. ఇంకేం ఎవరూ గడప దొక్కనీయలేదు. బక్క ప్రాణం మరింత బక్కదయింది. ఈమె దుస్థితి చూసి చలించిన మా తమ్ముడు దిలీప్ ఆమెను కడపకు తీసుకెళ్ళి వైద్యులకు చూపించి, రక్త హీనతకు మందులిప్పించి, తన స్నేహితులతో రక్తం ఇప్పించి ఆమెను మళ్ళీ మమూలు స్థితికి తెచ్చాడు. ఆ పరీక్షల్లో ఆమెకు ఎయిడ్సూ లేదు ఏ రోగమూ లేదు పోషకాహార లోపం తప్ప అని తేలింది.

బహుశా అప్పటికే ఆమెకు మతి చలించిందనుకుంటాను. ఎప్పుడూ సరిగ్గా మాట్లాడని ఆమె గలగలా మాట్లాడటం, ఏదేదో గొణగడం మొదలెట్టింది. ఇప్పుడు తను శారీరకంగా ఆరోగ్యంగా వున్నా మానసికంగా పిచ్చిదయింది. తనకు పెట్టిన అన్నాన్ని కుక్కలకు వేస్తుందిట. ఎందుకలా వేస్తున్నావు అంటే “నాకూ పుణ్యం రావాలిగా” అంటుందట. తనకు కట్టుకోమని బట్టలిస్తే అవి ఎవరికైనా ఇచ్చేస్తుందట. ఇంక వేదాంతం మాట్లాడటం, ఏదో దీర్ఘాలోచనలో వుండటం ఇలా వుంది వరస.

నేనూ, దిలీప్ వూరిలో తిరుగుతుంటే ఓ చోట గోడను ఆనుకొని అటేటో చూస్తూ వుంది. “ఏమ్మ్యా ఎలా వున్నావ్? నేనెవరో గుర్తు పట్టావా?” అని పలకరించా. అప్పుడు మా వైపు తిరిగి “దిలీపు సామీ నువ్వా!” అని రెండు చేతులెత్తి దండం పెట్టింది. “దిలీపు సరేగానీ నేనెవరో చెప్పు” అన్నా. “ఎవరో సామీ.. నేనింకా దొగలేమోనని, ఎట్ట సేయాల బగవంతుడా అని, ఇట్ట మల్లుకోనున్నా..” అన్నది. దిలీపును గుర్తు పట్టావే, దిలీపు అన్నలెవరు అంటే చెప్పింది. ఆ ప్రసాదును నేనే అంటే “ఎన్నెన్ని రోజులకు చూస్తిని సామీ” అంటూ తెగ సంతోషం ప్రకటించింది. ఆ ముందురాత్రి పడిన వర్షంలో బట్టలన్నీ తడిసిపోయాయట. ఎవరూ తమ తమ పంచల్లో పడుకోనివ్వలేదట! రాముడి గుడిలో పడుకుంటోందని గుడికి తాళాలు వేశారట! తడిసిన బట్టల్తో రాత్రంతా అలానే వున్నానని చెబుతుంటే గుండె చెరువయి కళ్ళల్లో ధార కడుతుంటే ఆపుకోవడానికి నానా కష్టాలూ పడ్డా. ఎప్పుడయినా సరే మా యింటికి వచ్చి తిను, అక్కడే పడుకో అని చెప్పి ఓ వందరూపాయలు చేతిలో పెట్టి అక్కడినుండీ భారంగా కదిలా.

ఆ మరుసటి వుదయం అన్నం కోసం ఇంటికి వచ్చినపుడు చెబుతోంది, “సామీ దొంగలున్నారంటే మీరు వింటిరా.. రాత్రి నా తలమీద గుండేస్తానని వాడెవడో దొంగ వచ్చి నీవిచ్చిన నూర్రూపాయాలూ లాక్కెళ్ళాడు.” అని.

ఇంతకూ నాకు తేలనిది ఏమిటంటే పిచ్చి ఆమెకా? వర్షం రాత్రి ఓ ఆడబిడ్డని ఏ పంచనా పడుకోనివ్వని వూరికా? చివరికి తన ఆలయంలోనూ చోటివ్వని దేవుడికా? అమాయకురాలి చేతిలోని డబ్బు భయపెట్టి లాక్కున్న మనిషికా? పిచ్చెవరికి?

–ప్రసాద్

మా వూరి సంగతులు – కస్టమ్స్ కష్టాలు

తేది:July 13, 2008 వర్గం:అనుభవాలు రచన:చరసాల 4,112 views

అమెరికానుండీ ముడి బంగారం తీసుకెళ్ళేవాళ్ళు ఇది తప్పక చదవాలి. గత నాలుగేళ్ళుగా అప్పుడొకటీ ఇప్పుడొకటీ కొన్న ఆరు బంగారం బిళ్ళలు (ఒక్కోటి ఇంచుమించు 31 గ్రాములు) పట్టుకెళ్ళాం ఇండియా వెళ్తూ. ఇక్కడ బంగారం చవక అనీ కాదు అక్కడ ఖరీదు అనీ కాదు గానీ ఒక్కసారే కొనాలంటే కష్టం గనుక అవి అప్పుడొకటీ ఇప్పుడొకటీ కొన్నవి. అన్నిటినీ తీసుకెళ్ళి ఇండియాలో ఏదైనా పాపకు చేయించాలనే వుద్దేశ్యం మా ఆవిడది.

అయితే కస్టమ్స్ వాళ్ళ నింబంధనలేంటో నాకంతగా తెలియదు. పది కిలోల వరకు తీసుకెళ్ళవచ్చు అని మాత్రమే ఎక్కడో చదివాను. వాటిని గాజుల్లా మార్పించుకొని వెళ్ళండి, లేదా అక్కడ దాయండి, ఇక్కడ దాయండి అన్నమాటలన్నీ పెడ చెవిన బెట్టి మామూలుగా మా చేసంచీలోనే (cabin luggage) వుంచుకొని వెళ్ళాం. ఈనాడు వార్తల మాటకేం గానీ శంశాబాద్ విమానాశ్రయపు వుద్యోగుల డేగ కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. నాకూ స్కానింగ్ చేస్తున్నాయనకూ మధ్య సంభాషణ ఇది.

ఆయన:ఈ బ్యాగు ఎవరిది?
నేను: నాదే
(దగ్గరికి పిలిచి చిన్న గొంతుతో)
ఆయన: ఇందులో బంగారు బిస్కెట్స్ వున్నాయా?
నేను: (అదే చిన్న గొంతుతో) వున్నాయి.
ఆ: ఎన్ని?
నే: ఆరు.
ఆ: కస్టమ్స్ కట్టాలే!
నే: అవునా! పది కేజీల వరకు తెచ్చుకోవచ్చని విన్నానే!
ఆ: తెచ్చుకోవచ్చు. కానీ కస్టమ్స్ కట్టాలి.
నే: అలాగా. అయితే సరే కడతాను.

అప్పుడు తను ఏదో స్లిప్పు రాసి నా చేతికిచ్చాడు. ఆ తర్వాత కస్టమ్స్ వాళ్ళు నన్ను తమ బల్ల దగ్గరికి పిలిచారు.

మళ్ళీ పై కుశల ప్రశ్నలన్నీ అయ్యాక బంగారం బిళ్ళలన్నీ బయట పెట్టించి వాటి మీదున్న బరువు వగైరా వివరాలు చూసి ఆ తర్వాత తిరిగిచ్చేశారు. ఒకరికి ముగ్గురు కూడి లెక్కలేసి చివరికి ఇంచుమించు అయిదువేల రూపాయలు అవుతుందని తేల్చారు.

ఇంతవరకూ అంతా బాగానే వుంది. అసలు విషయం ఏమిటంటే ఆ అయిదువేల రూపాయలనీ దానికి సమాన మొత్తాన్ని విదేశీ ద్రవ్యంలో చెల్లించాలట!!! నిజం చెప్పొద్దూ… నా దగ్గర పది డాలర్లకు మించి లేవు. మా ఆవిణ్ణడిగితే ఆమె బ్యాగులో అన్నిమూలలా తడిమి అరవై డాలర్లు వున్నాయంది. నా స్వతంత్ర భారతదేశంలో నాకు రూపాయలతోనే పని గానీ డాలర్లతో పని వుంటుందని నేను కలగన్నానా? డాలర్లలో ఎంతవుతుందీ అంటే ఇంచుమించు $125 అని తేల్చారు. మరి మిగతా డాలర్లు ఎక్కడ పట్టుకురావాలి? ATM రూపాయలే ఇస్తుందాయె. సరే forexలో అడిగితే ఇది విదేశీ ద్రవ్యాన్ని మార్చుకొనెందుకే గానీ స్వదేశీ ద్రవ్యాన్ని మార్చుకొనేందుకు కాదన్నారు.

అన్ని నా ప్రయత్నాలూ విఫలమయ్యాక తిరిగొచ్చి, “అయ్యా, నా దగ్గర డాలర్లు లేవు. నేను రూపాయల్లో మాత్రమే రుసుము కట్టగలను. ఇక మీరు చేసుకోగలిగింది చేసుకోవచ్చును.”  అని చెప్పా. అప్పుడాయన కాస్తంత సౌమ్యంగానే “అలాంటప్పుడు మాకున్న ఒకే ఒక ఆప్షన్ మిమ్మలనీ డిటైన్ చేయడమే!” అన్నాడు. “బాబ్బాబు మీకు పుణ్యం వుంటుంది ఆ పని చేయండి.” అన్నా. వాళ్ళు మాత్రం ఏమి చేయగలరు? వాళ్ళ నిభందనల పత్రం తెచ్చి చూపించారు. వాన్నీ వీన్నీ డాలర్లు వున్నాయా అని నా తరపున అడిగారు. చివరికి ఒకరిదగ్గర 500 దీనార్లు దొరికాయి. “అయ్యా ఇది పట్టుకెళ్ళి మీ రుసుము కట్టేసి మిగిలిన చిల్లరా, మీరు కట్టాల్సిన మొత్తం మాకు రూపాయల్లో ఇచ్చేయండి.” అన్నారు. చివరికి అలా దీనార్లు వచ్చి ఆదుకున్నాయి.

ఈ తతంగం అంతా ముగియడానికి ముప్పావు గంట పైనే పట్టింది. మాకోసం బయట ఎదురు చూస్తున్న వాళ్ళకు లోపలేం జరుగుతున్నదో ఇంకా మేమెందుకు బయటకు రావటం లేదో తెలియక గింజుకుంటున్నారు.

“కస్టమ్స్ రుసుము విదేశీ ద్రవ్యంలోనే చెల్లించాలన్న” నింభందనలో బ్రహ్మ పదార్థం మీకేమన్నా తెలుసా? (బహుశా విదేశీ ద్రవ్యానికి ఇక్కట్లు పడే రోజుల్లో చంద్రశేఖర్ ఏమైనా ఈ రూల్ పెట్టి వుంటాడా?)

–ప్రసాద్

మా వూరి సంగతులు – తెలుగు వాడి ఇక్కట్లు

తేది:July 12, 2008 వర్గం:అనుభవాలు రచన:చరసాల 4,151 views

అమెరికా నుండీ ఇండియాకు మా ప్రయాణం ఈసారి కువైట్ మీదుగా జరిగింది. ఈ ప్రయాణంలో మరియు తిరుగు ప్రయాణంలో నన్ను బాగా వ్యధకు గురిచేసిన అంశం ఒకటుంది.

వాషింగ్టన్ డల్లస్ విమానాశ్రయం నుండీ United Airlinesలో కువైట్‌కు ప్రయాణం. మామూలుగానే విమానంలో సూచనలన్నీ ఆంగ్లం మరియు అరబ్బీలలో చెప్పారు. అలాగే బయలుదేరే ప్రదేశలో మరియు వెళుతున్న ప్రదేశంలో స్థానిక సమయం, ఉష్ణోగ్రతా వివరాలు చెప్పారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిందీ చెప్పుకోదగ్గదీ ఏమీ లేదు.

అయితే అదే కువైట్ నుండీ హైదరాబాదు ప్రయాణం Kuwait Airlinesలో. సంప్రదాయం ప్రకారం అయితే బయలుదేరుతున్న ప్రదేశం మరియు గమ్యస్థానాల భాషలలో (అరబ్బీ మరియూ తెలుగులలో) సూచనలు ఇవ్వాలి. ఇంకో విధంగా చూసినా ఆ విమానంలో 80 శాతం మంది తెలుగు మాతృభాషగా వున్నవారే వున్నారు. ఆ విధంగా చూసినా తెలుగులో సూచనలు వుండాలి. వుహు, నా అంచనాలకు విరుద్దంగా ఆంగ్లం, అరబ్బీ మరియూ హిందీలలో సూచనలు ఇచ్చారు. సరే ఈ కువైటీలకు మన తెలుగు తెలిసి చావదులే అనుకొని సరిపెట్టుకున్నా.

ఇక నా తిరుగు ప్రయాణం కువైట్ మీదుగానే అయినా ఇది హైదరాబాదు నుండీ కువైట్‌కు  Air Indiaలో. ఇప్పుడు మాత్రం సూచనలు తెలుగు, అరబ్బీ, ఆంగ్లాలలో వుంటాయని ఆశించా. వుహు.. నేను పప్పులో కాలేశా. ఇప్పుడు కూడా ఆంగ్లం, హిందీ మరియూ అరబ్బీలలోనే వినిపించారు. నా పక్క సీట్లో ఓ ముసలాయన కూచున్నారు. కర్నూలు దగ్గర ఓ పల్లెట. కువైట్‌లో తన కూతురు దగ్గరకు వెళుతున్నానని చెప్పారు. ఆయనకు బహుశా ఈ విమాన ప్రయాణం మొదటిదిలా వుంది. ఈ మూడు బాషలూ ఆయనకు డబ్బాలో గుళకరాళ్ళ శబ్దంలా వుంది తప్ప ఏదీ అర్థం కావట్లేదు. నేను కాస్తా చొరవచేసి తెలుగులో మాట్లేడేసరికి ఆయన మహదానందపడిపోయి ఎడారిలో ఒయాసిస్సు దొరికినంత సంబరపడ్డాడు.

కువైట్ జనాభా ఇంచుమించు 30 లక్షలు. కువైట్ వైశాల్యం 17,818 sq km. మన రాష్ట్ర జనాభా 8 కోట్ల పైమాటేనా? మన రాష్ట్ర వైశాల్యం 2,76,754 sq km లట! అయినా తెలుగు మాత్రమే తెలిసిన మన తెలుగు వాడికీ దుర్గతి ఏమిటి?

అదేగాక హైదరాబులో దిగే ముందు కస్టమ్స్ వాళ్ళ declaration forms ఇచ్చారు. అవి ఆంగ్లం మరియు హిందీలలోనే వున్నాయి. ప్రయాణీకుల్లో తెలుగు రాయడం, చదవడం వచ్చినా అవి నింపడానికి నాలాంటి వాళ్ళను బ్రతిమాలుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళు నేర్చుకొనే పాఠమేమిటి? తమ పిల్లలకైనా హిందీనో, ఇంగ్లీషో నేర్పిస్తే ఈ యాచించే బాధ తప్పుతుందనేగా!

మరో అన్న మళ్ళీ రావాలి.

–ప్రసాద్

అణు రాజకీయం

తేది:July 11, 2008 వర్గం:వర్తమానం రచన:చరసాల 3,251 views

ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలనూ అందునా అణు ఒప్పందం పేరుతో నడుస్తున్న రాజకీయాలనూ చూస్తే మరింత ఏవగింపు కలుగుతుంది.

ఒప్పందం చేసుకు తీరాలంటున్న కాంగ్రెసునూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వమంటున్న వామ పక్షాలనూ మినహాయిస్తే, ఇక ఏ ఇతర రాజకీయ పక్షానికీ దేశహితం కాక స్వలాభం కోసం తహతహలాడుతున్నాయి.

అణు ఒప్పందం దేశానికి మంచిదా కాదా అన్న చర్చను పక్కన బెడితే రేపు జరగబోయే పాలక పక్షపు బలపరీక్షలో ఏ పక్షం ఎటు మొగ్గుతుందన్నది పూర్తిగా స్వలాభం బేరీజు మీదే అధారపడబోతున్నదని వింటే మనసునిండా ఆవేదన కలుగుతోంది.

అణు ఒప్పందం భాజపా తదితర ఎన్డీయే పక్షాలకు సమ్మతమే అయినా కాంగ్రెసు ప్రభుత్వ పతనాన్ని చూడాలని వువ్విళ్ళూరుతూ తమాషా చూస్తున్నాయి.

అణు ఒప్పందం చేసుకుంటున్నది తన జన్మ విరోధి అయిన కాంగ్రెసు గనుక తెలుగుదేశం వ్యతిరేకిస్తోంది గానీ (ఇంక రాబోయే ఎన్నికల్లో వామపక్షాల మైత్రిని ఆశించీ) మరో పార్టీ అయిటే దానికి అభ్యంతరం వుండి వుండకపోను.

నిన్న మొన్నటి దాకా కాంగ్రెసు మీద కక్ష గట్టిన సమాజవాదీకి ఇప్పుడు కలాం వుద్భోధ పనిచేసిందో, రాబోయే ఎన్నికల్లో మాయావతి మీద దాడికి కావల్సిన ఆయుధాలు అవసరమయ్యో గానీ అణుఒప్పందానికి అనుకూలంగా మారిపోయింది. అదీ తన స్నేహితులతో మాటమాత్రం చెప్పకుండా. అదే మాయావతి గనుక కాంగ్రెసు పంచన ముందే చేరివుంటే ఇదే ఒప్పందం ఈయనకు ముస్లిములకు వ్యతిరేకంగా కనపడి వుండేది.

ఇక తెరాసను చూస్తే సందట్లో సడేమియాగా తన పని అవుతుందేమో అని కాచుక్కూచున్నది. అణు ఒప్పందానికీ, తెలంగాణాకి అసలు సంభందం లేకపోయినా దానికి లంకె పెట్టి కూర్చున్నది. అయితే తెరాస సమస్యను సానుభూతితో అర్థం చేసుకోవచ్చు.

మాయావతి అయితే ములాయం బొమ్మయితే నేను బొరుసు అంటుంది. అతను ఆ పక్షం గనుక నేను ఈ పక్షం. సొంత తీరు, మార్గం అంటూ ఏమీ లేవు. “నువ్వన్నదానికి వ్యతిరేకంగా అనడమే నా సిద్దాంతం” అన్నది ఈమె సిద్దాంతం.

ఇలా ఏ పార్టీని చూసినా దేశ ప్రయోజనాలు గానీ, అణు ఒప్పందంలో ఏమున్నదని గానీ అవసరం లేదు. వారికి కావలిసింది ఎదుటి పక్షాన్ని ఇరకాటంలో పెట్టడం లేదా స్వలాభం చూసుకోవడం.

దేవుడా (వుంటే) కాపాడు నా దేశాన్ని.
–ప్రసాద్

మా వూరి సంగతులు – ఎత్తుకు పోయే వాడొచ్చాడు!

తేది:July 11, 2008 వర్గం:అనుభవాలు రచన:చరసాల 3,274 views

మా వూరిలో జరిగిన ఓ తమాషా సంఘటన ఇది. అయితే ఇది పరస్పర మానవ నమ్మకాల్లో వున్న లోటును చెబుతుంది. ఓ అపరిచిత వ్యక్తి పల్లె పట్టుల్లో సంచరించడం ఎంత ప్రమాదకరమో కూడా చెబుతుంది.

మేము ఇండియా వెళ్ళాక మా తమ్ముడు దిలీపే కారు నడిపేవాడు. నాకు గేర్ల కారును నడిపిన అనుభవం లేదు. పైగా ఆ ట్రాఫిక్కును చూసి నడపాలన్న ఉత్సుకత నాకు లేకుండా పోయింది. అయితే ఓ వారం తర్వాత దిలీప్ చెన్నయ్ వెళ్ళిపోవడంతో కారును నడపడం నాకు తప్పలేదు. అసలు రోడ్లమీద నడిపే ముందు సంచారంలేని రోడ్డుమీద కాస్తా గేర్ల మీద పట్టు సాధిద్దామని కారు తీసుకొని మా పోలాల వైపు మట్టిరోడ్డు మీద వెళ్ళాను.

ఆ రోడ్డు తిన్నగా మా పొలాలని దాటి అడవివైపు దారితీసిందిగానీ, ఎక్కడా కారును సజావుగా వెనక్కి తిప్పుకోగలిగిన అనువైన స్థలం కనిపించలేదు. చివరికి ఓ చోట ఎలాగోలా వెనక్కు తిప్పుకొని వస్తుంటే, దారిలో భుజాన ఓ కర్ర పెట్టుకొని నడుస్తూ వస్తున్న మా వూరి పెద్ద సుబ్బరాయుడు కనబడ్డాడు. సరే ఎలాగూ వూరికే వెళ్తున్నాగదా అని కారు ఆపి, “అయ్యా, కూచో వెళదాం” అన్నా. ఆయన “నాకిక్కడ పనుంది, నేనిటు వెళ్ళాలి” అని చరచరా రోడ్డు దిగి మరోవైపుకి వెళ్ళిపోయాడు. “అబ్బీ నువ్వెవరు?” అనిగానీ, “ఎప్పుడొచ్చావు?” అనిగానీ ఏమీ అనకపోయినా, రాయలసీమ మాటా, మనసు తెలిసిన వాన్ని గనుక, చిన్నబుచ్చుకొన్న మనసును జోకొట్టి మామూలుగానే ఇంటికి వచ్చాను.

ఇంటికి వచ్చిన కాసేపట్లో వూర్లో పుకారు ఏమంటే “ఎవడో మనుషులను ఎత్తుకుపోవడానికి కారేసుకు తిరుగుతున్నాడనీ, పెద్ద సుబ్బరాయుడిని కారెక్కమంటే తనెలాగో తప్పించుకొని పొలాలమీద అడ్డదిడ్డంగా నడిచి వూరు చేరుకొన్నాడనీ.”

హతవిధీ! అది నేను పుట్టిపెరిగిన వూరు కాబట్టి సరిపోయింది. ఇంకా నన్నెరిగిన వాళ్ళు బ్రతికివున్నారు గనుక సరిపోయింది. ఈయన మాటలు విని నన్నెరగని వాళ్ళు నన్ను కిడ్నాపరని చితగ్గొట్టలేదు కాబట్టి బతికిపోయా!

బాబ్బాబూ, మీరెవరూ మీకు తెలియని పల్లెపట్టుల వైపు వెళ్ళకండి. పిల్లల కిడ్నాపర్లంటూ చితగ్గొట్టడమే కాదు చంపినా దిక్కులేదు. (కడప జిల్లా వార్తల్లో ఈ మధ్య ఇలాంటివి ఎక్కువయిపోయాయి.)

–ప్రసాద్