వూరెళ్ళాక చేయాల్సిన పనులు

తేది:June 8, 2008 వర్గం:వర్తమానం రచన:చరసాల 3,586 views

1. చద్దన్నంలో గడ్డ పెరుగు (గేదె పెరుగు) వేసుకొని, వుల్లిపాయ నంజుకొని తినడం.
2. మధ్యాహ్నం మండుటెండలో చెట్టుకిందో, పందిరి కిందో నులక మంచంపైన కునుకు తీయడం.
3. కానబావిలోనో, గదగుండ్ల బావిలోనో ఈత కొట్టడం.
4. బావిలో అన్నం మెతుకులు వేస్తే అన్నివైపుల నుండీ పరుగెత్తుకు వచ్చే చేప పిల్లల్నీ మా పిల్లలకి చూపించడం.
5. అందరూ ఇళ్ళకెళ్ళాక పెద్ద గుండెక్కి గొంతు చించుకొని పాట పాడటం. (ఇందుకోసం ఏదైనా పాట నేర్చుకోవాలి.)
6. ఆరుబయట వెన్నెల్లో ఈతచాప పరుచుకొని అన్నం తినడం.
7. పచ్చి శెనక్కాయల సమయం కాదు గావున కాల్చిన పచ్చి శెనక్కాయలు తినే యోగం లేదు. వుందేమో కనుక్కోవడం.
8. వర్షాలు పడి దుక్కిళ్ళు చేసే అవకాశం వుంటే మేడి పట్టి కోండ్ర వేయడం.
9. నీళ్ళు తోడే మోటారు పంపుకు మూతి ఆన్చి నీళ్ళు తాగడం.
10. వీలయినన్ని మిగిలి వున్న జ్ఞాపకాలను కెమారాలో పట్టి బందించడం.

–ప్రసాద్

వూరెళ్తున్నానోచ్!

తేది:June 6, 2008 వర్గం:వర్తమానం రచన:చరసాల 3,626 views

ఇదిగో అదిగో అంటూ రోజులూ, నెలలూ, ఏళ్ళూ గడిచి మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత పుట్టినింటి గడప తొక్కబోతున్నాను. అయితే నేనుండబోయేది కేవలం రెండు వారాలు. అయినా ఏదో ముప్పిరిగొనే ఆనందం.
వూరికి పాతిక కిలోమీటర్ల దూరంలోని కడపలో చదివేటప్పుడు వారానికోసారి వూరెళ్ళేవాన్ని. ప్రొద్దుటూరులో చదివేటప్పుడు నెలకో నెలన్నరకో ఓసారి వెళ్ళేవాన్ని. భీమవరంలో చదువుతున్నప్పుడు దసరా, సంక్రాంతి, వేసవి సెలవులకు తప్ప వెళ్ళడం కుదిరేది కాదు.

ఇక అమెరికాకు వచ్చాక నాలుగైదేళ్ళకు ఒకసారి గానీ కుదరడం లేదు. ఇక్కడికి వచ్చిన ఈ పదేళ్ళలో ఒకే ఒకసారి 2003లో వీలయ్యింది. మళ్ళీ ఇప్పుడు. అప్పుడైతే అయిదు వారాలున్నా. కానీ ఇప్పుడు రెండు వారాలకు మించి కుదరడం లేదు.

దూరాలు మారినా, కాలాలు మారినా, నేను మారినా, మా వూరు మారినా … వూరెళ్తున్నాను అంటే మనసు పడే ఆరాటంలో, వుద్వేగంలో, ఆనందంలో మాత్రం మార్పు రాలేదు. వూరెళ్ళే రోజు దగ్గరపడే కొద్దీ రోజులు భారంగా గడుస్తాయి. వూరు దగ్గరపడే కొద్దీ అడుగులు భారంగా పడతాయి. అదో రకమైన ఆనందంతో మనసుకు మాటలు రావు. ఇలాంటి ఆనందం వేసవి సెలవుల తర్వాత కొత్త తరగతికి వెళ్ళేటప్పుడు వుండేది. నాన్న కొత్త బట్టలు కొనుక్కొచ్చినప్పుడుండేది. కొత్త తరగతి పుస్తకాలు తిరగేస్తున్నప్పుడుండేది. అవన్నీ ఒక్కొటొక్కటే కనుమరుగైనా వూరుకెళ్తున్నాననే సంబరం మాత్రం ఇప్పటికీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే వుంది. తీరా వూరిలో ఏముందని ఇంత ఆశ, ఆతృత అంటే ఇదీ అని ఏ ఒక్కదాని మీదా ప్రత్యేకించి లేదు.

నేను బాల్యంలో గడిపిన వూరులా ఇప్పటి వూరు లేదు. వూరి బయట గడ్డి వాముల్లేవు. వూరిలోపల ఆవుల మందలు లేవు. చెరువు గట్టు మీద మామిడి చెట్టు లేదు. మొగలి పొదైనా వుందో లేదో! వెన్నెల్లో చెక్క భజనలూ, జక్కీకలూ లేవు.

అయినా వెళ్ళాలనే వుంది. నడిచిన నేల, పీల్చిన గాలి, తాగిన నీళ్ళూ మళ్ళీ చూడాలనే వుంది.

–ప్రసాద్