రామయ్య గారి పెద్దమ్మ

తేది:May 23, 2008 వర్గం:అనుభవాలు రచన:చరసాల 3,327 views

ఆమె అసలు పేరేంటో నాకు తెలియదు. నా చిన్నప్పటి నుండీ ఇతరులు “రామయ్యగారామె” అంటుంటే విన్నాను, నేను “పెద్దమ్మా” అని పిలిచాను. మా అమ్మ మేనమామ భార్య ఈమె. మొదట్నుంచీ ఈమె నాకు విలక్షణంగానే కనిపించేది. ఎక్కడా వూరి గొడవల్లో తలదూర్చగా నేను చూడలేదు, దూర్చిందని ఎవరైనా చెప్పగా నేను విననూ లేదు. ఆమె పనేదో ఆమె చూసుకొనేది. కొందరికామె తల పొగరుది గానో, గర్విష్టిగానో కనపడ్డా నాకామె తల వంచనిదిగా, ఆత్మబలం కలదిగా అనిపిస్తూ వచ్చింది.

మా రామయ్య పెద్దమ్మకి ఒక కూతురూ, ఒక కొడుకూ వుండేవారు. కూతురు కొంచం కచ్చదానిలా వుండేది. ఆమెని నాగయ్య అనే అతనికి ఇస్తే, అతను నాటుబాంబులు చుడుతూ, పొరపాట్న అవి పేలి ఆసుపత్రి పాలయి, ఆ తర్వాత జైలు పాలయ్యాడు. అందువల్ల కూతురు నాకు తెలిసి ఎప్పుడూ వీళ్ళ దగ్గరే వుండేది. ఆ కూతురికి ఒకే కూతురు, పేరు నాగ రత్నం. నాకంటే మూడు నాలుగేళ్ళు పెద్దదేమొ. చిన్నప్పుడు వీధుల్లో వెన్నెల్ల్లో ఆదుకునే పిల్లల గుంపులకు ఆమే నాయకత్వం వహించేది. మాట కొంచం కరుకు, రంగు బాగా నలుపు. అయినా మంచి మెరుపు వుండేది. వున్నంతలో నాగరత్నం అల్లారుముద్దుగానే పెరిగింది. నాగరత్నాన్ని ములకల చెరువు దగ్గర ఎవరికో ఇచ్చి పెళ్ళి చేశారు.

రామయ్య పెద్దమ్మ కూతురు (పేరు గుర్తు లేదు) ఒకరోజు పందిరికింద కూర్చుని బియ్యంలో రాళ్ళేరుతుంటే పందిరి వాసం ఒకటి జారి తలమీద పడి చచ్చిపోయింది. వాళ్ళమ్మ చచ్చిపోయాక నాగరత్నం మా వూరికి ఎప్పుడొగానీ రాలేదనుకుంటా! నాగరత్నం నాన్న జైలు నుంఛీ వచ్చాక ఎక్కడ వుండేవాడో గానీ మా వూరికి ఎప్పుడూ వచ్చినట్లు నేను వినలేదు.

ఇక రామయ్య పెద్దమ్మ కొడుకు, నరసయ్య విషయానికి వస్తే, చిన్నప్పటినుంచీ పెద్దగా కష్టపడిన రకం గాదు. పెద్దయ్యాక కొంచం తాగుడు అలవాటయ్యింది. తాగుడు ముదిరో, తాగింది వికటించో పెళ్ళయిన రెండేళ్ళకే చనిపోయాడు. నరసయ్య భార్య కొద్ది రోజులు ఏడ్చి, పెద్దలు మరో పెళ్ళికి వప్పిస్తే చేసుకొని వెళ్ళిపోయింది.

ఇలా కొడుకూ, కూతురూ తమ కళ్ళ ముందే చనిపోయినా ఎలాగో తమ బ్రతుకు బ్రతుకుతున్న పెద్దమ్మ భర్త వయసు మీదపడి, ఆయనా పోయాడు. తను ఒక్కర్తే అయ్యింది. మనుమరాలు నాగరత్నం దగ్గరికీ ఈమె వెళ్ళలేదు. ఎంత ముదిమి మీదపడ్డా ఎవరిదగ్గరా దేహీ అనలేదు. ధైర్యం సడలిపోలేదు. తనేం సంపాదించేదో, ఎలా వండుకొనేదో గానీ ఆ పూరింట్లో తనొక్కతే జీవించేది. ఎవరైనా దయతల్చి ఆమెకింత కూర ఇస్తే సరే, ఆమె మాత్రం కూర కావాలనో, అన్నం కావాలనో ఎవరింటికీ వచ్చి అడిగేది కాదు. ముఖ్యంగా మా యింటికయితే వచ్చేది గాదు.

ఈమెది మరీ ఛాదస్తం అనుకునే వాళ్ళం. మా అమ్మాయి పుట్టిన రోజు వేడుక వూర్లో జరుపుతూ వచ్చి భోజనం చేసివెళ్ళమంటే రాలేదు. అయితే మనం తీసికెళ్ళి ఇస్తే మట్టుకు తీసుకొనేది. నేను గానీ, అన్నయ్య గానీ, తమ్ముడు గానీ వూరికెళ్ళినపుడు పదో పాతికో చేతికిస్తే తీసుకొనేది.

నాకయితే ఇద్దరు పిల్లలని కని పెళ్ళిళ్ళు చేసి, మనవరాలిని పెంచి పెద్దచేసి పెళ్ళి చేసి, ఒక్కరొక్కరే తనకళ్ళ ముందే రాలిపోతుంటే, ఆమె మానసిక స్థితిని, ఒంటరితనాన్ని తలచుకొంటే బాధతో మనసు విలవిల్లాడుతుంది. తలచుకొనే నాకే ఆ స్థితి అంత దుర్భరమైతే ఆమెకు ఎలా వుంటుందో కదా అని ఎప్పుడూ నాకనిపిస్తూ వుంటుంది. ఇంటికి ఎప్పుడు ఫోను చేసినా ఆమె గురించి వాకబు చేసేవాన్ని.

కొద్ది రోజుల క్రితం మా తమ్ముడితో మాట్లాడుతూ రామయ్య గారి పెద్దమ్మ గురించి వాకబు చేస్తే గుండెను పిండే విషయం తెలిసింది. కొన్నాళ్ళ క్రితమే ఆమె మనుమరాలు నాగరత్నం కూడా ఏదో జబ్బు చేసి చనిపోయిందట! తనచేతుల మీద పెరిగిన తన కొడుకు, కూతురు చివరికి మనుమరాలు కూడా చనిపోయాక చిట్ట చివరిరోజువరకు అత్యంత ఆత్మనిబ్బరంతో స్వశక్తితో, ఎవరి సహాయం యాచించకుండా, ఆశించకుండా బతికిన మా రామయ్యగారి పెద్దమ్మ ఈ మధ్యనే చనిపోయిందని తెలిసి ఉద్వేగానికి లోనయ్యాను.

అంత ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో బతకడం ఎందరికి చేతనవుతుంది? పెద్దమ్మకి వందనాలు.
 

మా వూరి బస్సు = మార్క్(MARC) ట్రైను

తేది:May 9, 2008 వర్గం:వర్తమానం రచన:చరసాల 2,921 views

నేను ఏడవ తరగతిలోనో ఎనిమిదిలోనో వున్నప్పుడు మా వూరి మీదుగా కడప నుండీ వేంపల్లెకు వయా లక్కిరెడ్డిపల్లె బస్సును వేశారు. పిల్లలకూ పెద్దలకూ బస్సు వస్తోందంటే అదేదో ఓ వుబలాటం, ఆనందం కలిగేవి. స్కూలుకు వెళుతున్నపుడో, తిరిగి వస్తున్నప్పుడో బస్సు ఎదురుపడితే బస్సు డ్రైవర్‌కు టాటా చెప్పకుండా వుండేవాళ్ళం కాదు. తిరిగి డ్రైవర్ చెయ్యి వూపితే కొండెక్కినంత సంతోషం.
ఈ బస్సు మధ్యాహ్నం 11గం. సమయంలో కడపలో బయలుదేరి, వేంపల్లె వెళ్ళి వచ్చి, మళ్ళీ సాయంత్రం ఆరుగంటలప్పుడు రెండో సారి కడప నుంచి బయలు దేరేది.
నేను కడపలో చదువుతున్నప్పుడు, ఆ తర్వాత ప్రొద్దుటూరు, భీమవరంలో చదువుతున్నప్పుడూ, హైదరాబాదులో పనిచేస్తున్నప్పుడూ మా వూరికెళ్ళాలంటే కడపదాకా వచ్చాక ఈ ఆరు గంటల బస్సే దిక్కు.
దేవుడా ఈ పూటకి బస్సు మిస్సు కాకుండా చూడు అని మనస్సులో మొక్కుకుంటూనే కడపలో బస్సు దిగాక లక్ష్మీరంగా థియేటరు ఎదురుగా పూలమ్మే ఆయన్ని “అయ్యా, వేంపల్లె బస్సు వెళ్ళిందా?” అని అడిగి “వెళ్ళలేదు” అంటే హమ్మయ్య అనుకొని ఇక అది వచ్చేవరకూ అక్కడ తచ్చాడటం. అది వచ్చాక ఇక ఎప్పటికైనా వూరు చేరుస్తుందన్న ధీమాతో ఓ సీటు చూసుకొని కూర్చోవడం. బస్సు దొరికిందన్న ఆనందంలో అది ఎంత ఆలస్యంగా వచ్చిందన్న స్పృహే వుండేది కాదు. వచ్చిందా లేదా న్నదే ముఖ్యం గానీ ఆలస్యం అన్నది ఎవరికీ పట్టింపు గానే గాదు. బస్సు దొరికి బస్సులో కూర్చున్నపుడే ఇల్లు చేరినంత తీయగా వుండేది ఆ అనుభూతి.

ఇప్పుడు ఇక్కడ నాకలాంటి అనుభూతిని వాషింగ్టన్ డీసి యూనియన్ స్టేషన్, బాల్టిమోర్ పెన్ స్టేషన్ మద్య తిరిగే మార్క్ రైలు ఇవ్వడమే గాక మావూరి ఎర్ర బస్సుని గుర్తు చేస్తుంది. నేను కాపిటల్ దగ్గరనుండీ మెట్రోలో ప్రయాణం చేసి, న్యూ కరాల్టన్ దగ్గర మార్క్ రైలు కోసం ఎదురు చూస్తాను. మెట్రో ఏ కారణం చేతొ కొద్దిగా ఆలస్యమయితే ఆ పూటకి మార్క్ మిస్సు. మళ్ళీ తర్వాతి ట్రైను గంట తర్వాతే! ఎనబై నుంచీ తొంబై శాతం ట్రైను ఖచ్చితమైన సమయానికే వస్తుంది కానీ అప్పుడప్పుడూ తెగ ఇబ్బంది పెడుతుంది.
మొన్నోరోజు పరుగెట్టి పరుగెట్టి మెట్రో రైలందుకొని, డోరు దగ్గర అందరికంటే ముందు నిలుచుని, తెరవగానే తుపాకీ నుండీ వెలువడ్డ తూటాలా పరుగెత్తి మార్క్ స్టేటస్ చూస్తే అది రద్దయిందట! తర్వాతి రైలు గంట తర్వాత. అయితే ఆ తర్వాతి రైలు కూడా 40నిమిషాల ఆలస్యం! అంటే వెరసి ఆరుగంటలకి ఆఫీసులో బయలుదేరితే ఇంటికి తొమ్మిదింటికి చేరాను.
అయినా ట్రైను దొరికి అందులో కూర్చున్నాక ఇల్లు చేరినంత అనుభూతి. మావూరి బస్సెక్కిన ఆనందం.
–ప్రసాద్

అంతర్జాలంలో తెలుగు వెలుగు: తెలుగునాడి సంపాదకీయం

తేది:May 3, 2008 వర్గం:నా భాష రచన:చరసాల 3,326 views

        ( ఏప్రిల్ నెల తెలుగునాడి సంపాదకీయం సంపాదకుల అనుమతితో ఇక్కడ పునర్ముద్రించడం జరిగింది. )

         1993లో మొదటిసారి నేను ఇంటర్‌నెట్‌లో (ఇప్పుడు అంతర్జాలం అని కొంతమంది తెలుగులో పిలుస్తున్నారు) తెలుగుని మొదటిసారిగా soc.culture.indian.telugu (SCIT) అనే యూజ్‌నెట్ గ్రూపులో చూశాను. అంతకు ఏడాది ముందే మొదలైన ఈ బృందం అప్పటికే మూడు పూవులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతూ ఉంది. యూనివర్సిటీలు, కంప్యూటర్ కంపెనీలతో సంభంధాలు వున్నవాళ్ళే ఎక్కువగా సభ్యులుగా ఉండేవారు. యూజ్‌నెట్ చూడలేని వారికోసం ప్రతిరోజు పోస్టులన్నీ కలిపి వరల్డ్ తెలుగు డైజెస్ట్ అనే పేరుతో ఒక ఈమెయిల్ ముందు కేటీ నారాయణ. ఆ తరువాత సీతంరాజు ఉదయభస్కర శర్మ సంపాదకత్వంలో వచ్చేది. అప్పుడు రైస్ యూనివర్సిటీలో కంప్యూటర్ డిపార్ట్‌మెంట్ విధ్యార్థులుగా వున్న కన్నెగంటి రామారావు, ఆనందకిశోర్ తెలుగుని ఇంగ్లీషులో మామూలు కీబోర్డుతో టైపుచేసే పద్దతి (RTS-Rice Transliteration Scheme) ప్రవేశపెట్టి ప్రాచుర్యంలోకి తెచ్చారు. అట్లా టైపు చేసి ఇంగ్లీషు తెలుగుని ప్రొఫెసర్ హార్డ్, ముక్కవల్లిలు తయారుచేసిన తెలుగు ఫాంట్లతో ముద్రించి తెలుగులో చూసుకొని చదువుకొనే సదుపాయం కూడా కలిగించడంతో వాళ్ళు ఆ గ్రూప్‌లో పెద్ద హీరోలైపోయారు.

        ఆ రోజుల్లో వివిధ విషయాల మీద ఘాటు ఘాటు చర్చలు వేడివేడిగా (అప్పుడప్పుడూ ఆకాశరామన్నలు వాడిన అచ్చమైన సంస్కృతంతో సహా) జరుగుతూ వుండేవి. నన్నెచోడుడి తెలుగు దగ్గర నుంచి నాగార్జున సినిమాల వరకూ, కూచిపూడి నృత్యం నుండీ పెసర పప్పు పాయసం వరకూ కాదేదీ చర్చ కనర్హం అన్నట్లుగా వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి. రాజకీయాలు, సినిమాల విశేషాలు ఏరోజు కారోజే- కొండొకచో వెనువెంటనే- తెలుసుకోగలగడం మంచి థ్రిల్లింగ్‌గా వుండేది. ఆ తరువాత వచ్చిన తెలుసా, రచ్చబండ చర్చావేదికలకు మూలాలు SCITలోనే నేను తెలుసుకున్నాను. అమెరికాలోనూ, యూరప్‌లోనూ ఉన్న తెలుగు సాహిత్యాభిమానులు చాలామంది నాకు ఆ రోజుల్లో SCITలోనే పరిచయమై మంచి మితృలయ్యారు.


        ఆ తర్వాత కొన్నాళ్ళకు వరల్డ్‌వైడ్‌వెబ్, మొజాయిక్, నెట్‌స్కేప్ బ్రౌజర్లు ప్రాచుర్యంలోకి రావడంతో మిగతా ఇంటర్‌నెట్ స్వభావంతో పాటు, తెలుగు కూడళ్ళ స్వరూ స్వభావాలు కూడా మారిపోయాయి. శ్రీనివాస్ శిరిగిన, పద్మ ఇంద్రగంటి, మరిద్దరు కలిసి మొదటి ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైటు సృష్టించడం ఆ రోజుల్లో గొప్ప కలకలం. సిటి కేబుల్‌వారు (ప్రస్తుతం టీవీ9లో వున్న) రవి ప్రకాశ్ నిర్వహణలో మొదటి తెలుగు పోర్టల్‌ని తీసుకువచ్చారు. ఆ తరువాత కొన్ని వార్తా పత్రికలు తమ పత్రికలకు వెబ్ ఎడిషన్లు మొదలు పెట్టాయి. తెలుగు సినిమా డాట్‌కామ్‌తో మొదలైన చలన చిత్రాల సైట్లు, ఈమాటతో మొదలైన తెలుగు వెబ్‌జీన్లూ ఇంటర్‌నెట్‌లో తెలుగు వాడకాన్ని విస్తృతంగా పెంఛాయి. ఇప్పుడు అమెరికాలో చాలా తెలుగు ఇళ్ళలోనూ, దాదాపు అన్ని కంప్యూటర్ కంపెనీల్లోనూ, యూనివర్సిటీలలోనూ, వ్యాపారసంస్థల్లోనూ తెలుగు వార్తాపత్రికల వెబ్‌సైట్లు తెరవకుండా రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు.

        ఇవన్నీ కూడా గతకాలపు కబుర్లు. ఇప్పుడు ఇంతర్‌నెట్‌లో మరెన్నో కొత్త పోకడలొచ్చేశాయి. బ్లాగులు, యూట్యూబ్ వైరల్ వీడియోలు, వికీపీడియాలు ఇంటర్‌నెట్‌ని కొత్త దిశకు తీసుకుపోతున్నాయి. యూనికోడ్ విస్తృతంగా వాడటం మొదలుపెడితే కానీ ఈ ఫలితాన్ని తెలుగులో పూర్తిగా అనుభవించలేమని గుర్తించిన ఒక కొత్త తరం, దీనిని ఒక ఉద్యమంగా చేపట్టి, చొరవగా సాంకేతిక ఇబ్బందుల్ని అధిగమించి, కొత్త శిఖరాలను అధిష్టిస్తోంది. భారత భాషలన్నింటిలోకీ వికీపీడియాలో తెలుగుదే అగ్రస్థానం కావటం వెనుక ఈ తరం కృషి, దీక్ష వున్నాయి.

        తెలుగు కంప్యూటరీకరణ కొత్త మార్గాలను తొక్కినప్పుడల్లా, దాన్ని నడిపించింది ప్రభుత్వ సంస్థలూ, విశ్వవిద్యాలయాలూ, అకాడెమీలూ, తెలుగు సంస్థలూ కాదు. భాష మీద ప్రేమతో, సంస్కృతి చరిత్రలపై మక్కువతో నిస్వార్థంగా తమ మేధనీ, శ్రమనీ, సమయాన్నీ, సంపాదననీ లెక్క పెట్టకుండా ఖర్చు చేస్తున్న స్వచ్చంద సేవకులే. వారికి వందన సూచకంగా, మా కృతజ్ఞలతో ఈ నేల ప్రత్యేక వ్యాసం ప్రచురిస్తున్నాము.


        తెలుగు చలన చిత్ర జగత్తులో కొన్ని దశాబ్దాల పాటు బహు శోభనంగా ప్రకాశించిన సోగ్గాడు శోభన్‌బాబు అకస్మాత్తుగా మరణించడం విషాదం. ఆయన కుటుంబానికి, అభిమానులకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ ఈ సంచికలో నివాళి అర్పిస్తున్నాము.


        ఈ సర్వధారి నామ సంవత్సరం మీకు సర్వ శుభాలూ కలుగజేయాలని ఈ ఉగాది సందర్భంగా ఆశిస్తూ…

జంపాల చౌదరి