Dr. Seuss’ Horton Hears a Who – అనగా అనగా ఓ సినిమా
ఈస్టర్ ఆదివారం మాల్‌కు తీసికెళ్ళి ఈస్టర్ బన్నీ చూపెడతానని మా పిల్లలకు వాగ్దానం చేసివున్నా. ఆయితే తీరా మాల్‌కు వెళితే అది ఈస్టర్ సందర్భంగా మూసి వుంది. ఇకా మా అమ్మాయి గోల ఆపడం కోసం అయితే నేను మిమ్మలని ఓ మూవీకి తీసుకెళతా అన్నా, ఏదో ఒక పిల్లల సినిమా వుండక పోతుందా అని.
తీరా అక్కడికి వెళితే చిన్నపిల్లలు చూడగల సినిమా ఇది (Dr. Seuss’ Horton Hears a Who) ఒక్కటే.
చిన్న విషయాలకు వాగ్దానభంగం చేయటం నాకిష్టం వుండదు. ఆ సినిమా గురించి నాకేమీ తెలియక పోయినా ‘G’ rating చూసి వెళ్ళాం.
సినిమా మా పిల్లలకు అర్థమవకపోయినా ఆ ఏనుగు మాత్రం చాలా నచ్చింది. నాకు మాత్రం అది పిల్లలకంటే గూడా పెద్దలకు ప్రత్యేకించి నాలాంటి అవిశ్వాసకుల కొరకు తీశారా అన్న అనుమానం వచ్చింది.
ఎందుకంటే…
నాకు ఆ ఏనుగు క్రీస్తులా, ఆ కనిపించని బుల్లి జీవులు మానవుల్లా, ఆ బుల్లి ప్రపంచం మేయరు భగవంతుని వునికిని తెలుసుకొన్నవాడిలా … అలా కనిపించారు.
ఈ సినిమాలో విలన్, కంగారూ “కంటికి కనిపించని, చెవులకు వినిపించని జీవి వుండి వుండటం అసంభవం” అంటుంది. ఈ వాదన “దేవుడు లేడనే” అవిశ్వాసుల వాదనను పోలివుంటుంది.
నిజంగా ఆ సినిమా వుద్దేశ్యం అదో కాదో తెలియదు కానీ నాకు మాత్రం ఆ సినిమా అలా క్రైస్తవ ప్రచారంలా అనిపించింది. లేక నేను గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుము కొన్నానో.
చివరి మాట: నిజానికి ఈ సినిమా ఈస్టర్ రోజున చూసిన వెంటనే నాలో రేగిన భావాల మూటనంతటినీ జారిపోకుండా బ్లాగులో సర్దుదామనుకున్నా… అదేమిటో ఇంట్లో గానీ బయట గానీ ఓ క్షణం తీరిక దొరకటం లేదు. ఏదో అరా కొరా సమయం చిక్కుతుంది కానీ నా మట్టుకు నాకు బ్లాగులో నా హృదయాన్ని ఆవిష్కరించాలంటే ఆ సమయం సరిపోదు. మనసులోని భావానికీ, కీబోర్డు మీది వేళ్లకీ మధ్య ఎలాంటి అడ్డంకి లేని ధార కుదిరినప్పుడే రాయగలుగుతాను. ఇదెందుకో ఈ మద్య కరువయ్యింది.
–ప్రసాద్










(4 ఓట్లు, సగటు: 5 కు 4.00)