నరక ద్వారం

తేది:April 25, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 2,878 views

నిన్నో బాలిక ఈ రోజింకో బాలుడు! (http://www.eenadu.net/story.asp?qry1=15reccount=30)
హతవిధీ ఇంకెంతమంది పిల్లలు ఛస్తే ఈ ప్రజలు మేలుకుంటారో! మన ముఖ్యమంత్రి ఇప్పుడు మేలుకున్నారు. కానీ ప్రతిదీ ప్రభుత్వం పట్టించు కోవలిసిందేనా? ఇంకెన్ని వార్తలు చూడాలి? ఇంకెంతమందిని నిర్లక్షంగా వదిలేసిన గుంతలకు బలిచ్చుకోవాలి? ఇన్ని వార్తలు చూస్తున్నా కనీసం పిల్లలున్న తల్లిదండ్రులైనా ఆ వూరిలో వున్న గుంతలను పూడిస్తే ఇంత అనర్థం జరగదు కదా! ఇంత కడుపు కోత, శోకం వుండదు కదా!
ఓ ప్రాణం రూపుదిద్దుకోవాలంటే ఓ తల్లి పడే కష్టం ఎంత? తొమ్మిది నెలలూ రోజొక యుగంగా ఎదురు చూసి చూసి, ప్రతి క్షణమూ తన ప్రాణంలో ప్రాణంగా, తన పొట్టలో తన వాడుగా పెరిగే పసికందుపై ఎన్ని ఆశల పందిళ్ళు అల్లుకుంటుంది తల్లి! ఆ తర్వాత ఎన్ని మురిపాలు, ఎన్ని జోలపాటలు!
అన్నీ ఓ చిన్న తప్పిదంతో, కనురెప్పపాటులో జరిగే ప్రమాదంతో అంతరించడానికేనా? ఏమవుతాయి తల్లిదండ్రుల ఆశల, అనురాగాల దీపాలు?
చేతులు కాలాక ఆకులు పట్టుకోకుంటే ఆ గోతులు పూడ్చడం అంత కష్టమైన పనా? పసిపిల్లల ప్రాణాలకు మించిన పనా?

ఇంతకుముందిలాగే వరస మృతులతో తల్లడిల్లినపుడు రాసిన బ్లాగు
http://www.charasala.com/blog/?p=55

–ప్రసాద్

సంజయ మేనియా

తేది:April 12, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 2,920 views

ఈ 17 ఏళ్ళ భారతీయ సంతతి కుర్రాడు అమెరికన్ ఐడల్ పోటీలో తారాజువ్వలా దూసుకుపోతున్నాడు. నిన్న జరిగిన పోటీలో చివరి 7 మందిలో స్థానం పదిలం చేసుకున్నాడు. అమెరికాలో ఇండియన్ ముఖం చూస్తే ఇప్పుడు సంజయ గుర్తొస్తున్నాడు చాలామందికి. సంజయ తండ్రి భారతీయ సంగీత కళాకారుడు. ఈ విధంగా సంగీతం ఇతనికి ఉగ్గుపాలతోనే అబ్బింది. మొదట సంజయతో పాటు ఇతని అక్క శ్యామలి కూడా ఈ పోటీల్లో పాల్గొన్నా తర్వాతి రౌండ్లలో ఆమె ముందుకు పోలేదు.
సంజయ్ నవ్వు పెద్ద ఆకర్షణ అని కొందరంటే అతని జుట్టు కొందరికి ఆకర్షణ. ప్రతి పోటీకి అతను ఎన్నుకునే వేషధారణ, జుట్టు శైలి అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈక్కడ వున్న ఒక విడియోలో చూడండి, ఒక అమ్మాయి ఆనందంతో ఎంతలా ఏడ్చేస్తుందో! గతంలో ఒకసారి ఈనాడులో సంజయ గురించి వచ్చిన దగ్గరినుంచీ ఈ పోటీ మీద నాకు కొంచం అభిరుచి కలిగింది. అయినా ఇప్పటివరకు ఒక్క షో కూడా చూడలేకపోయాను. అయితే ఏం థ్యాంక్స్ టు యూట్యూబ్. మామూలుగా అయితే నాకు ఏ ఇంగ్లీషు పాటా అర్థమవ్వదు. కానీ ఈ సంజయ పాడిన ప్రతిపాటా నాకు అర్థమవుతోంది అంతో ఇంతో.
సంజయకి అభిమానులున్నట్లే అసుయాపరులు, అతని విజయాన్ని జీర్ణించుకోలేనివారూ వున్నారు. అతని విజయానికి కారణం భారతీయుల వోట్లే అని నమ్మేవారూ వున్నారు. (నాకు తెలిసి భారతీయులు ఇంటర్‌నెట్ మీద ఓట్లేయమంటే వేస్తారుగానీ సులభంగా ఫోన్లు చేసి ఓట్లేస్తున్నారంటే నమ్మలేను).
మీరు ఈ వీడియోలు చూసి చెప్పండి అతని ప్రతిభ ఎలా వుంది అనేది.

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

YouTube Preview Image

 

సంజయ గెలవాలని ఈమె ఉపవాసవ్రతం చూడండి. 

YouTube Preview Image

 

సంజయను ఎగతాళి చేస్తూ… 

YouTube Preview Image

 

హొవార్డ్ స్టెర్న్ సంజయకు ఓటేయమని ప్రోత్సహిస్తున్నడంటూ అతనిమీద సివిల్ దావా వేస్తానంటున్న లాయరు..

YouTube Preview Image

ఇంకా ఎన్నో సంజయకు అనుకూలంగా, ప్రోత్సహిస్తూ, ఆరాధిస్తూ…వ్యతిరేకంగా, ఎగతాళి చేస్తూ, ద్వేషిస్తూ… ఎలాగైనా ఇప్పటి అమెరికా సెన్సేషన్ …సంజయ మాలేకర్.
–ప్రసాద్

జరిగిన కథ

తేది:April 6, 2007 వర్గం:నా ఏడుపు, వర్తమానం రచన:చరసాల 3,838 views

అది వేసవి కాలం. పాలిటెక్నిక్ ప్రొద్దుటూరులో చదువుతూ వేసవి సెలవులకు నేను మా వూరొచ్చాను. ఇంట్లో పడుకొని ఏదో చదువుకుంటున్నాను. మధ్యాహ్న సమయమనుకుంటాను. వేసవి అనగానే మా వూర్లో నాకు గుర్తొచ్చేది చెట్లకింద, పందిళ్ళ కిందా మంచాలు వేసుకొని సేద తీరే జనమే! బోలెడన్ని విషయాలు వాళ్ళ మద్య దొర్లిపోతూ వుంటాయి. గొడవలకు కూడా అవి ఒక్కోసారి కారణభూత మవుతూ వుంటాయి.
బయటేదో ఎవరో అరుస్తున్నట్లు, తిడుతున్నట్లు వినిపించటంతో బయటకు వచ్చాను. మా యింటి ఎదురుగా వున్న ఇంటి బయట పందిరి కింద పిచ్చాపాటీ మాట్లూడుతూ వుండిన పెద్దలు అటుగా వెలుతున్న ఖానా గాడిని (అసలు పేరేంటో నాకూ తెలియదు) నేనిక్కడ రాయలేని విధంగా “నీ యమ్మ…” నీ యక్క…” అని తిడుతూ అరుస్తున్నారు. ఈ “ఖానా గాడికీ” ఇంచుమించు నా వయసే. వాళ్ళు నలుగురన్నదమ్ములు. మిగతావారిలా కూలీ నాలీ చేసుకుని వూరిని నమ్ముకొని వుండకుండా వీడు కొంత పట్నపు వాసన చూసిన వాడు. పల్లెటూరి అమాయకత్వం కాకుండా అంతో ఇంతో మిడిమిడి లోకజ్ఞానం తెలుసుకున్న వాడు. వాన్ని వీళ్ళు తిడుతున్నారు. కారణమేంటయ్యా అని కనుక్కుంటే ఈ ఖానాగాడి నాన్నో లేక ఈ ఖానాగాడో అప్పు తీసుకొని ఇంకా ఇవ్వలేదట! అది తీర్చమని అడిగితే…”ఇదిగో అదిగో తీరుస్తామని..” చెబుతున్నాడట! అది కోపకారణమయింది. మాదిగోడే కదా ఏమి తిడితే ఏమవుతుందిలే అని నోటికొచ్చిన బూతులన్నీ వాడిమీద ప్రయోగించారు. అదే వూర్లోనే బతుకుతున్న మాదిగలైతే “మా రైతే గదా…” (మా అమ్మే గదా అనుకున్నట్లు) అనుకొని దులుపుకొని పోయేవారే, కానీ వాడు పట్నం వాసన తగిలిన వాడు కదా, కోపం పట్టలేక తిరిగి వాళ్ళను తిట్టాడు.
కథ అక్కడితో అయిపోయిందనుకుని నా పాటికి నేను చదువుకోవడానికి లోపలికి వెళ్ళి పోయాను. అయితే ఓ మాదిగోడు రైతును తిట్టిన వింత(రైతు తిట్టడం సహజం కదా మాదిగోడు తిట్టడమే వింతల్లోకెల్లా వింత) ఆనోటా ఈనోటా పడి పనుల్లేక పందిళ్ళకింద ముచ్చట్లు పెట్టుకున్న ప్రజలందరికీ తెలిసి పోయింది.
రామయ్య ఇలా అన్నాడు “నా చిన్నప్పటి నుండీ చూస్తూనే వున్నా మా కాలంలో మాదిగోళ్ళు ఎలా వున్నారు? ఇప్పుడెలా వున్నారు? కండకావరం పెరిగి పోయింది. పెద్దా చిన్నా అనే తేడా లేకుండా పోయింది.”
సోమయ్య (అసలు పేర్లు కావు):”ఇదిగో ఈ గవర్నమెంటుకు వాళ్ళు దేవుడి బిడ్డలట! ఇళ్ళు కట్టించిరి, ఎనుములు (గేదెలు) కొనిచ్చిరి. వాళ్ళ పనులు వాళ్ళకుండె ఇక మనకు పనికేం వస్తారు? మనలను ఏం లెక్కపెడతారు?”
ఇలా తలా ఒకరు మాట్లాడి ఒకళ్ళలో ఒకరికి పౌరుషాలు ఎగదన్ని వీన్ని ఉపేక్షిస్తే ఇంకొందరు ఇలాగే తయారవుతారని…ఖానా గాన్ని శిక్షించడానికి బయలు దేరారు. వాన్ని మందీమార్బలంతో వెళ్ళి పట్టుకొని తెచ్చి గుంజకు కట్టేసి కొట్టారు.
ఆ సాయంత్రం పనులకు వెళ్ళి ఇంటికొచ్చిన హరిజనవాడ వారందరికీ జరిగిన అన్యాయం తెలిసిపోయింది.
“తెలిసో తెలియకో ఉడుకు రక్తంలో వాడు ఒక మాట తిడితే మాత్రం పెద్ద మనుషులందరూ పట్టుకొని పిల్లగాన్ని కొడతారా?” అని ఒకరికి ఒకరు చెప్పుకొన్నారు. పోలీసు రిపోర్టు ఇద్దామని కూడా బయలుదేరారని వినికిడి. (కానీ ఇవ్వలేదు). తప్పు చేసిన పిల్లోన్ని దండించకుండా (వీళ్ళ దండన చాల్లేదని) పోలీసు రిపోర్టు అంటారా అని “తమ వూర్లో నుండీ గానీ, తమ పొలాల్లో నుండీ గానీ మాదిగోళ్ళు నడవకూడదు” అని పెద్దలంతా తీర్మానించారు. వూరూ, వూరు చుట్టు పక్కల పొలాలన్నీ రైతులవే అయినప్పుడు ఈ మాదిగలు దాసోహమనక ఏమి చేస్తారనే పట్టుదల పెద్దలది.
కానీ మరుసటిరోజు మాదిగోళ్ళంతా పోలీసు రిపోర్టిస్తే చాలా కథ జరుగుతుందని భయపడి రైతులంతా ఓ రెడ్డి దగ్గరకు పంచాయితీ చెప్పమని వెళ్ళారు. ఈ రెడ్డి పులివెందుల నుంచీ వచ్చి మా వూరి దగ్గర “కంకర మిషన్” పెట్టాడు. దానికి కావలిసిన కూలీలంతా మా వూరు, హరిజన వాడ నుంచే వెళతారు. ఆయన మీద ఆధారపడిన వారు గనక ఆయన చెబితే వింటారని రైతులు వెళ్ళి ఆయనను పిలుచుకొచ్చి ఆ మరునాటి రాత్రి పంచాయితీ పెట్టించారు.
ఆ పంచాయితీకి నేనూ వెళ్ళాను. మా వూర్లో గానీ, పొలాల్లో గానీ అడుగు పెట్టొద్దన్నారని మాదిగోళ్ళెవరూ ఈ పంచాయితీకి రాలేదు. ఇంకేమి పంచాయితీ అంతా ఒకే పక్షం అయ్యారు. ఒక్కొకరు మాదిగోళ్ళ చేతిలో పడ్డ భాధలు చెబుతున్నారు.
“ఆ కర్రోడు మొన్న ఎద్దుల బండిలో ఎదురు పన్నాడు. కనీసం దిగనూ లేదు. కలియుగం నాయనా కలియుగం.”
“మొన్న కూలీలను పిలుద్దామని వెలితే ఆ లచ్చిగాడు మంచంమీద కూర్చుని సద్దన్నం తింటాండు. చూసినా చూడనట్టే (చూసే వుండడు అనుకోరాదూ)లేవకుండా తింటున్నాడు. ఆ పక్కకు వెళ్ళాలంటేనే మొహం చెల్లట్లేదు.”
“ఈ మాదిగోళ్ళకు ఏమి కొమ్ములొచ్చినాయని!! ఈ పిచ్చి గవర్నమెంటు కొంపలిచ్చె, కోళ్ళిచ్చె, భూములిచ్చె. ఇక వాళ్ళు మనకేం పలుకుతారు? అప్పుడెప్పుడో బ్రంహ్మం గారు చెప్పలా మాదిగోడు రాజ్యమేలతాడని…అక్షరాలా జరుగుతోంది.”

ఇలా తలో మాటా విసురుతున్నారు. అందరి మద్యలో మంచం మీద కూర్చున్న రెడ్డి “ఇది తప్పే, మాదిగోడు రైతును తిట్టడం తప్పే” అన్నాడు.
నాకు ఆవేశం వచ్చింది. అంత ఆవేశం ఇంతకు ముందు మా వూరి పోలింగ్ బూతులో అన్నకు (తెలుగుదేశానికి) ఓటు వేయనీకుండా కాంగిరేసు గూండాలు వచ్చి రిగ్గింగ్ చేస్తుంటే వచ్చింది. “ఖానాగాన్ని వీళ్ళు తిట్టినందుకే గదా వాడు వీళ్ళని తిట్టాడు? అంతటితో పోనియ్యక మళ్ళీ వాన్ని పట్టుకొచ్చి ఎందుకు కొట్టినట్లు? ఎద్దుల బండిలో వాడి దారిన వాడు పోతున్నప్పుడు ఈయనొచ్చాడని ఎందుకు బండి దిగాలి?” ఇలా ఎదురు ప్రశ్నిస్తే అందరూ వీడేంటి ఇలా అపసవ్యంగా మాట్లాడుతున్నాడని బుగ్గలు నొక్కుకున్నారు.
“చదవేస్తే వున్నమతి పోయిందట” అంది ఓ అక్క.
“చదువుకున్నోడి కంటే చాకలోడు మేలనేది ఇందుకే” అంది ఓ పెద్దమ్మ.
“ఇంటికి వెళ్ళనీ… నా కొడుకుని..రెండురోజులు అన్నం పెట్టకుండా మాడిస్తే…” అంది మా అమ్మ. (అందే గానీ మాడ్చలేదనుకోండి.)
–ప్రసాద్