అశ్వమేధయాగమట!

తేది:March 21, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 2,310 views

అదేం పోయేకాలమో గానీ! యాగాలూ, యజ్ఞాలూ వర్షాలు కురిపిస్తాయనే నమ్మేవారు ఇప్పుడూ తగలడ్డారు. తెలియని రోజుల్లో నెయ్యి, ఇతర భక్ష్యాలూ అగ్నిలో వేసి అగ్నిని తృప్తి పరిస్తే శుభం కలుగుతుందనుకునేవారు. ఇప్పుడూ అదే తంతా!
అప్పుడు ఒక మేలుజాతి శ్వేతాశ్వాన్ని ఊర్లమీదికి వదిలి అది తిరిగినంత మేరా నా రాజ్యం అని ప్రకటించుకోవడానికి వీలయ్యేది. మరిప్పుడు ఆ గుర్రం పాకిస్తాను వైపు వెళితే అక్కడి సైనికులు దాన్ని ఆపేస్తారా? కాల్చి చంపేస్తారా? ఈ యాగం చేసే ప్రభుద్దులు యాగ ధర్మం ప్రకారం వారిపై యుద్దం చేస్తారా?
సరే ఎలాగోలా ఆ గుర్రం మన ప్రాంతాలలోనే తిరిగి వచ్చిందనుకుందాం. యాగానికి ముందురాత్రి ఆ గుర్రంతో గడపాల్సిన వనిత ఎవ్వరు? సరే ఎవ్వరో ఒకరు గడిపారే అనుకుందాం… ఆ మరుసటి రోజు యాగంలో ఆ గుర్రపు ఒక్కో అవయవమే వేద మంత్రాల సాక్షిగా అగ్నికి ఆహుతి చేస్తారా? ఇది క్షుద్రదేవతలకు, గ్రామ దేవతలకు బలి ఇవ్వడం కన్నా హేయం కాదా? బలి చట్ట వ్యతిరేకమయితే యాగం కాదా? ఒకవేళ ఇవన్నీ జరగలేదనుకుంటే ఇక యాగమెందుకు?

ఎటు వెళుతున్నాం మనం? మళ్ళీ వేద కాలానికా?

–ప్రసాద్

అన్నీ వేదాల్లో వున్నాయిష

తేది:March 16, 2007 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 4,368 views

మన సంస్కృతి గురించి, వేదాలు, ఉపనిషత్తుల గురించి చెప్పేవాళ్ళు అన్నీ పూర్వం మన ఋషులకే తెలుసనీ, వేదాలే అన్ని జ్ఞానాలకూ మూలమనీ వాదించేస్తారు.
వేదాలు లభ్యమవుతున్న అతిపురాతన సాహిత్యమని అందరు అంగీకరిస్తున్నదే. అలాగే మన ఋషుల తాత్విక చింతన అమోఘమైనదే అయితే ఇప్పటి శాస్త్ర విజ్ఞానమంతా నాడే ఋషులకంతా తెలుసనడం అతిశయోక్తే!
మొన్న ఈమాటలో అసంబద్ద భాషావాదాల గూర్చి సురేష్ కొలిచాల గారు చక్కటి వ్యాసం రాశారు. అలాగే వేదాలలో అన్నీ వున్నాయనే అసంబద్ద వాదనలు ఖండిస్తూ కూడా మంచి వ్యాసాలు వస్తే బాగుండును.
కొన్ని వాదనలు చూస్తే…
“రామాయణ కాలంలోనే విమానం నిర్మించడం, వాడటం తెలుసు.”
ఈనాడు  గ్రహాంతరయానాలు చేస్తున్నట్లు, మనిషి తయారు చేసిన రోబోట్లు మనిషినే నియంత్రిస్తున్నట్లు సినిమాలు వస్తున్నాయి అంత మాత్రాన మనమిప్పుడు గ్రయాంతరయానము చేస్తున్నట్లా? కాకపోతే అవి ఇంకొన్ని రోజులకు నిజాలు అవ్వచ్చు. ప్రకృతిని జయించాలన్న మానవుడి వాంఛ రకరకాల వూహలను ప్రేరేపించింది. ఆకాశయానం చేసినట్లు, జలస్తంబన విద్యతో నీటిలో రోజుల తరబడి వున్నట్లు కలగన్నారు. మహిమాన్విత శక్తులున్న దేవుడికి అన్నీ సాద్యమే గనుక తమ వూహలని దేవుడి పాత్ర రూపంలో తీర్చుకున్నారు. అంత మాత్రానికే అప్పట్లో పుష్పక విమాన ముండేదని ఈ 21వ శతాబ్దములో కూడా నమ్మేస్తే అంతకన్నా పిచ్చి ఇంకేమయినా వుందా? పోనీ రామాయణంలో విశయాలు నిజమే అనుకుంటే కోతులు రాజ్యాలు చేయడం, ఒక కోతి ఇటు నుంచీ అటు లంకకు గెంతడం కుడా ఆ రోజుల్లో సంభవాల కిందే లెక్కెయ్యాల్సి వస్తుంది.

“రామ సేతు”
లంకకూ మనకూ మద్య ఆరోజుల్లోనే వారధి కట్టారట! అదే నీళ్ళపై తేలే వారధి! దాని అవశేషమే ఇప్పుడు సముద్ర గర్భంలోని వారధి అంటారు.
మొన్నేదో ఓ పుస్తకంలో ఒక చైనా కథ గురించి చదివాను. ఆ కథ ప్రకారం పూర్వం 9 మంది సూర్యులు వుండేవారట! ఆ వేడికి ప్రతిదీ దగ్దమైపోతుండేదట! వేడిని భరించలేని ప్రజలు రాజును ఏదో ఒకటి చేయమని వేడుకుంటే ఆయన ఒక సాహసవంతున్ని పిలిచి సూర్యులనందరినీ కూల్చేయమన్నాడట! ఆ సాహస వీరుడు ఒక్కొక్కటే సూర్యున్ని కిందపడేస్తూ చివరి సూర్యున్ని వదిలేశాడట, అది లేకపోతే లోకం చీకటైపోతుందని.
ఇప్పుడు తొమ్మిదిమంది సూర్యులు లేనిది, ఒకడే సూర్యుడు వున్నదీ నిజమే కనుక ఈ కథ నిజమే అనుకోవాలా మనం?
మనకున్న ఎన్నో స్థల పురాణాలు ఇటువంటివే! కనిపించే ప్రతి వింతకూ ఒక పురాణాన్ని కనిపెట్టి సమాధాన పడ్డారు ప్రజలు.

“భారత కాలంలోనే test tube baby విధానం తెలుసు”
ఇది నవ్వులాటకు కూడా నమ్మలేని విశయం. ఆనాడే ఇంత విజ్ఞానం వుంటే విల్లులూ, బాణాలూ, గదలతో యుద్దం చేసుకోవలసిన ఖర్మం ఏమొచ్చింది వాళ్ళకి, శుబ్రంగా ఇప్పటిలా అణ్వాయుధాలతోనే చేసివుందురు. ఇంకా భారతంలో అక్షయ పాత్ర వుంది, ఎంత తోడినా ఇంకా పుట్టుకొని వస్తుందట అందులో. ఇది సాద్యమేనా? జరాసంధున్ని రెండుగా చీల్చినా మళ్ళీ అతుక్కుంటాడట! అవ్వ! ఎంత విజ్ఞానముడేది ఆ రోజుల్లో!

ఈ మద్యన ఏదో తెలుగు బ్లాగులో చూశాను “నాగలోకానికి అదేదో రెండు పర్వతాల మద్యనుండీ దారి వుందట!”. ఇలాంటి శుశ్క వాదాలను నమ్మేవాళ్ళు వున్నారంటే ఎంతో ఆశ్చర్యమేసింది. ఆ బ్లాగులో ఇప్పుడా పోస్టులు లేవు. నా చిన్నప్పుడు మా అవ్వ ఓ కథ చెప్పేది. అక్కడెక్కడో బావి తవ్వుతూ వుంటే, తవ్వగా తవ్వగా ఎంతో లోతుకు తవ్వాక వాళ్ళకు కోడికూతా, రోకటి పోటూ వినబడ్డాయట భూమి లోంచీ! అప్పుడు తవ్వడం ఆపేశారట! (నాగలోకానికి జడిసి ఆపేశారా? ఏమో నాకు తెలియదు.)
–ప్రసాద్

బాల్య వివాహాలు

తేది:March 8, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 3,391 views

http://groups.google.com/group/telugublog/browse_thread/thread/320aa082313d7cb తెలుగు బ్లాగు గుంపులో జరిగిన చర్చకు తరువాయి… 

తాడేపల్లి గారు కూడా పిన్న అవయసులో వివాహాల వైపు మొగ్గేసరికి ఇక నేను నా అభిప్రాయమూ చెబుదామనుకుంటున్నా! అజిత్ గారూ,
మళ్ళీ వెనక్కు వెళ్ళి ఒకసారి మీ వాదన చదివా. మీరంటున్న దాన్ని బట్టి ఆహార అవసరాలు ఎలాగో దాంపత్య/సంపర్క అవసరాలూ అంతేనంటున్నట్లుంది.
ప్రకృతి మనుషులకి పది పన్నెండేళ్ళ వయసుకే పునరుత్పత్తి శక్తి ఇచ్చింది. లేదంటే పద్నాలుగేళ్ళనుకుందాం. అందుకని మనం నిగ్రహించుకొని సంతోష సమయాన్ని నానా విధాల కట్టుబాట్లతో ముప్పై ఏళ్ళ వరకూ వాయిదా వేసుకుంటున్నామంటారా? ఎందుకొరకు మనం ఎనిమిదేళ్ళకే పెళ్ళిల్లు చేసుకోవాలి?
సరే ప్రకృతి ధర్మం కొద్దీ మనం పోవాలంటారా? మరయితే మానవ ధర్మం ఏమి కావాలి? మనం మనుషులమయినందుకు మిగతా ప్రాణికోటిలా కాకుండా ఏది ప్రకృతిగుణంగా పోవాలో ఎక్కడ మనవంటూ పద్దతులు పాటించాలో నిర్ణయించుకొని అందుకోసం కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం.
పళ్ళురాని పసివాడు గుంతులో చిక్కుకుంటేదోనన్న తెలివి లేకుండా కనపడిందాన్నల్లా నోట్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వాడికి నోరుంది, మింగడానికి గొంతుంది అని మనం చూస్తూ వూరుకుంటామా? గొంతులో చిక్కుకుంటే ఏమవుతుందో మన అనుభవ పరంపర మనకు చెప్పటం లేదా? నోరుండటం, గొంతుండటం అన్నీ తినటానికి ఎలా అర్హత అవ్వదో, ఫలదీకరణకు, పునరుత్పత్తికి సిద్దంగా వున్నా ఆ వయసులో ఆ అపని చేయదగ్గది కాదనే కదా మన ఇన్ని సంవత్సరాల నాగరికత నేర్పింది?
అదేగాక మానవుడు ప్రతి దాని విశయంలోనూ ప్రకృతితో కలిసి నడవలేడు. అందుకే కదా మనం వావి వరసలు సృష్టించుకున్నది. నిన్న బిబిసిలో అన్నా చెళ్ళెల్ల మద్య జరిగిన వివాహం గురించి శ్రోతలు పంపిన అభిప్రాయాలు చదువుతుంటే వింటున్నాను. కొందరు వారికి శిక్ష వేయాలి అంటే కొందరు అది శిక్ష వేయదగ్గ నేరము కాదంటే…. ఇలా వివిధ అభిప్రాయాలు చెప్పారు. మీరేమంటారు?

ప్రతిదానికి ప్రభుత్వ ఆంక్షలా అంటూ రవి వైజాసత్య వ్యతిరేకతతో కూడా నేను ఏకీభవించను. అయితే ప్రభుత్వం వ్యక్తిగత విషయాలలో జోక్యం ఒక పరిమితికి మించి చేసుకోకూడదు. వ్యక్తి యొక్క స్వవిషయమైనా సమాజం మీద ప్రభావం చూపిస్తుంది అంటే దాన్ని ప్రభుత్వం (ఆంటే సమాజం) అడ్డుకొని తీరాలి. నా తిండి నా ఇష్టమని నా ఇష్టం వచ్చింది తింటే మా అమ్మ వూరుకోనట్లే, నా ఇష్టం నా చెవి నేను కోసుకుంటా అంటే నా తండ్రి ఒప్పుకోనట్లే, స్వవిషయాలైనా సమాజానికి ముప్పు అనిపిస్తే ప్రభుత్వరూపంలో సమాజం వాటిని అడ్డుకొనే హక్కు వుంటుంది.

నా అబిప్రాయము ప్రకారము నిర్బంద విద్య, 18 ఏళ్ళ తర్వాత వివాహము వ్యక్తిగత విషయాలైనా కూడా ప్రభుత్వము నిర్బందంగా అమలు జరపాల్సిందే.

–ప్రసాద్

ఒక చలి రాత్రి

తేది:March 6, 2007 వర్గం:నా ఏడుపు, వర్తమానం రచన:చరసాల 2,565 views

చదివింది ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ అయినా Y2K హోరు గాలిలో నా జీవితాన్నీ చక్కబెట్టుకుందామని హైదరాబాదులో Y2K శిక్షణ పూర్తి చేసి ఏదో దేసీ కంపెనీ వీసా సంపాదించి అమెరికా గడ్డ మీద కాలు పెట్టాను.
అదేదో ఐరన్ లెగ్ అంటారే అలాగా నేను కాలు పెట్టిన మూడు నెలలకే నన్ను ఈ గడ్డ మీదికి తెచ్చిన కంపెనీ జెండా ఎత్తేసి, నా దారి నన్ను చూసుకోమంది.
Main frames మీద real time experience లేదు. చేసిన దాని కంటె చదివి నేర్చుకున్నదే ఎక్కువ. ఆంగ్ల భాషా ఉచ్చారణ అంతంత మాత్రమే! అబద్దాలు అతికినట్టు చెప్పడమూ రాదు. మూడేళ్ళ అనుభవముందని చెప్పిన క్షణానే నా మొహం చూసి ఎవరైనా నేను అబద్దం చెబుతున్నానని చెప్పగలరు. మరింత రెట్టించారంటే నేనే ఒప్పుకున్నా ఒప్పుకుంటాను. ఇలా కిందా మీదా రమ్మన్న ప్రతి కంపెనీ గుమ్మమూ తొక్కుతూ వుద్యోగ వేట ముమ్మరంగా చేస్తున్నాను.

మొత్తానికి న్యూయార్క్ మహా నగరంలో ఏదో ఒక ఫైనాన్సియల్ కంపెనీలో వుద్యోగం వచ్చింది.
వాళ్ళు వుదయాన్నే 7గంటలకే అక్కడ వుండాలనే వాళ్ళు. నేనప్పుడు వున్నది నాకు ఆశ్రయమిచ్చిన ఒకానొక తెలుగోళ్ళ కంపెనీ అథిది గృహంలో. నాతో పాటు అక్కడ ఇంకో ముగ్గురు వుండేవాళ్ళు. ఆ గృహమున్నది న్యూజెర్సీ ఎడిసన్‌లో. వుదయాన్నే 5 గంటలకు లేచి స్నానాదిపాదులన్నీ అరగంటలో ముగించుకొని మైలు దూరంలోనున్న మెట్రోపార్కు రైలు స్టేషనుకు పరుగెత్తేవాన్ని. ఈ దేశపు చలికి అలవాటుపడని దేహం. శరీరాన్ని సరిగ్గా కప్పని ఇండియా నుంచీ తెచ్చుకొన్న జాకెట్టు. చేతులకు గానీ తలకు గానీ తొడుగుల్లేవు. నిజానికి నా పరుగుకు, ఆయాసానికి విపరీతమైన వేడి పుట్టి చలి అనిపించేది కాదు. అలా పరుగెట్టి మెట్రో పార్కులో NJ Transit రైలు పట్టుకొని న్యూయార్క్ పెన్ స్టేషన్‌లో దిగి రెండు వీధుల అవతలనున్న ఆఫీసుకు పరుగులాంటి నడకతో చేరితేనే ఏడింటికి చేరగలగేది.

అక్కడ TAB కీ Enter కీ లా వుపయోగపడేది. ఎదైనా తప్పుగా టైప్ చేస్తే కీబోర్డ్ లాక్ అయిపోయేది. దాన్ని unlock చేయడం తెలిసేది కాదు. ఎలాగోలా తంటాలు పడి సాయంత్రం వరకూ కష్టపడి తిరుగు ముఖం పట్టేవాడిని.

అలా ఓరోజు మెట్రోపార్క్‌లో దిగి నడిచి ఇంటికి వస్తే ఇంట్లో ఎవరూ లేరు. నా దగ్గర విడిగా తాళంచెవి లేదు. జనవరి దినాల చలి. దగ్గరలో వున్న షాపింగ్ కాంప్లెక్స్‌కి వెళ్ళాను ఏ షాపులో కైనా దూరి వెచ్చ కాగుదామని. మ్… ఒక్క షాపు తెరిచి లేదు. చెబితే నమ్మరు గానీ అక్కడ పబ్లిక్ కాయిన్ ఫోను కూడా లేదు, ఆఫీసుకు ఫోన్ చేసి మా వాళ్ళకు నా పరిస్థితి వివరించి త్వరగా రమ్మందామటే! ఇక కాళ్ళీడ్చుకుంటూ మళ్ళీ తిరిగి మా అపార్ట్‌మెంట్ సముదాయంలోకి వచ్చి నిలుచున్నాను.
ఇండియా నుండీ తెచ్చుకున్న జాకెట్టు ఇక్కడీ వాషింగ్ మెషీన్‌లో వేయడంతో లోపలున్న దూదంతా వుండలు కట్టింది. చలి అంతా నా మీదే దాడి చేస్తోందా అనిపిస్తోంది. అర మైలుకు తక్కువగా ఎక్కడా నాకు తెలిసి గ్యాస్ స్టేషను లాంటిది ఏదీ లేదు. మళ్ళీ కాళ్ళీడ్చుకుంటూ మైలు దూరం రైల్వే స్టేషనుకు నడిచే ఓపికా సత్తువా లేవు.

ఒక ఆలోచన వచ్చింది. ఎవరైనా కనిపిస్తే ఒక ఫోను చేసుకోవాలని అబ్యర్థిస్తే నన్ను వాళ్ళింటిలోకి అనుమతించక పోతారా అని. ఫోను చేయడం ముఖ్యమే అయినా ఇప్పుడు వళ్ళును వేడి చేసుకోవడం అతి ముఖ్యమైంది. ఫోను మీది నెపంతో కాసేపైనా లోపల గడిపితే మళ్ళీ గంట సేపు బయట గడపడానికి శక్తి వస్తుంది. ఇలా అనుకుంటూ ఎదురు చూస్తూ వుండగా ఓ కారులోంచీ ఓ పెద్దాయన దిగాడు. భయంగా, వినయంగా ఒత్తి ఒత్తి పలికి నా బాధ చెప్పుకున్నాను. ఒక్కసారి ఫోను చేసుకుంటాను అన్నాను. చలి విషయం చెప్పలేదు. తన జేబులోంచి సెల్‌ఫోను తీసి ఇస్తాడని నేను వూహించలేదు. ఇప్పుడున్నట్లుగా అమెరికాలో కూడా సెల్‌ఫోన్ల వాడకం అంతగా లేదు. నా ఆశ అంతా జావగారి పోయింది. సరే ఇదైనా చాలు అనుకొని నా సహనివాసులకు సమాచారం అందించాను.

వెనుక మెట్లమీదుగా పైనున్న డెక్ మీదికి చేరుకొని వెనుక ద్వారానికి చేరగిలబడి డొక్కలో కాళ్ళు పెట్టుకొని అలా ఎంతసేపున్నానో తెలీదు. రూంమేట్లు వచ్చి లోపల చేసిన శబ్దాలకు మేలుకొని లోపలకు అడుగు పెట్టాను.

–ప్రసాద్

నా ధీరత్వము

తేది:March 5, 2007 వర్గం:నా ఏడుపు, వర్గీకరింపబడనివి రచన:చరసాల 3,759 views

వేరుశనగ పంట వర్షాధార పంటగా జూలై, ఆగష్టు నెలల్లో వేస్తారు. అయితే చాలా మంది రైతులు ఈ పంటకు కావలసిన విత్తనానికై అప్పులు చేస్తారు. రైతు అవసరమున్న ప్రతిసారీ ధరలు కొండెక్కడం తెలిసిన విషయమే అయినా రైతులు చేయగలిగింది తక్కువ. విత్తనాల కొరకై అప్పులు, ఆ తర్వాత రసాయన ఎరువుల వాడకానికి అప్పులు, ఆ తర్వాత కలుపు తవ్వడానికి, పీక డానికి, వలవ డానికి అన్నిటికి అప్పులే… పైగా ఈ మద్యకాలంలో తిండీ తిప్పలకూ, పండుగ పబ్బాలకూ కూడా ఈ పంట చూపించే షావుకారుల దగ్గర మామూలు రైతు అప్పు చేస్తాడు. తీరా వర్షాలు సవ్యంగా పడి, గొంగళి పురుగు, వేరు పురుగు క్షమిస్తే రైతుకు పండిన పంట ఈ అప్పులు కట్టడానికే సరిపోతుంది. సరిపోయింది అంటేనే గొప్ప విషయం. చాలా సార్లు సరిపోదు. ఇప్పటి అప్పు వారసత్వంగా తర్వాతి సంవత్సరానికి బదిలీ అవుతుంది. ఇలా ఎన్ని పర్యాయాలు పంట సరిగ్గా పండకపోతే రైతు అంతగా చితికి పోతాడు.
అయితే ఇలాంటి విషవలయంలో పడకుండా మా నాన్న మాత్రం ఎలాగోలా తన తెలివినీ, భూమినీ, నీటినీ, పశువులనూ, కొడుకులనూ ఆమాటకొస్తే అందుబాటులోని ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకొని బయట పడ్డారు.
మాకున్న “గద్దగుండ్ల బావి” ఒక ఒయాసిస్సు! ఎంత కరువులోనైనా కనీసం రోజుకు మట్టు (నిలువెత్తు అనుకోవచ్చు) నీళ్ళు వూరుతుంది. కనీసం ఎకరా ఆరుదడి పంటకు ఆ నీళ్ళు సరిపోతాయి. అయితే ఆ బావికి మాతో పాటు ఇంకొకరికి కూడా భాగముంది. అంటే ఆ బావి నీళ్ళు తోడుకోవడానికి మాకు రోజుమార్చి రోజు హక్కుంటుంది.
మా తాత, అమ్మ జీవితాలు.. మా బాల్య జీవితాలు ఈ బావితో ఎంతగా పెనవేసుకొన్నాయంటే, అదీ మా కుటుంబ సబ్యుడే అన్నంతగా! ఈ బావి గురించి మరోసారి చెప్పుకుందాం.
మాకున్న ఆ వనరుతో మా నాన్న నానా ప్రయోగాలూ చేసేవారు. మా వూరిలో ఎవరూ సాహసించని విధంగా ఎండాకాలంలో ఆ బావి కింద టమోటా వేసే వారు. చెరకు పండించే వారు. దోసకాయలు (cantaloupes), పుచ్చ కాయలు (Watermelons) పండించేవారు. అలాగే వర్షాధారపు పంటగా వేసే వేరుశనగ ప్రధాన పంటకు కావలిసిన విత్తనం కూడా పండించేవారు. దీనివల్ల అధిక ధరలకు అదునులో విత్తనం కొనే బాధ తప్పేది. పైగా ఈ బావి కింద పండే టమోటా లాంటి కూరగాయల పంటల ద్వారా, చెరకు లాంటి వాణిజ్య పంటల ద్వారా ఇల్లు గడవడానికి కావలిసిన రాబడి సమకూరేది.

మాకున్న ఆవులు, ఎనుములు (బర్రెలు) ద్వారా చాలా మట్టుకు పొలానికి అవసరమయ్యే సేంద్రీయ ఎరువు, మాక్కావలిసిన పాలు, పెరుగు లభ్యమయ్యేవి. ఇదే గాక ఎండాకాలంలో పనులు తక్కువ వున్న రోజుల్లో చెరువు మట్టిని చేలకు తోలేవాళ్ళం. వీటన్నింటితో బాటు రసాయన ఎరువులూ అంతో ఇంతో వాడేవాళ్ళం. ఇందువల్ల అప్పులు చేయాల్సిన అవసరం తగ్గి అంతో ఇంతో పంట మిగుల్చుకోవడమే గాక కొన్ని సార్లు మా నాన్నే ఇతరులకు విత్తనం, అప్పులూ ఇచ్చేవారు. అయితే వసూలు చేయడంలో ఇబ్బందులవల్ల అది తర్వాత మానేశారు.

అప్పుడు నేను బహుశా పన్నెండు పదిహేనేళ్ళ మద్య వుండి వుంటాను. ఆ రోజు వర్షం ఎడతెగకుండా కురుస్తోంది. వేరుశనగ మంచి కాపుమీద వుంది. ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో పీకవలసి వుంటుంది. మాకు అడవి పందులతో బెడద ఎక్కువ. అప్పట్లో వాటి కొరకు నాటు బాంబులు కూడా పెట్టేవారు. అవి వాటిని కొరికి చచ్చి పడేవి. ఆ తెల్లవారుఝామునే వెళ్ళి తెచ్చుకొని తినేవారు. అయితే అలాంటి పద్దతుల జోలికి మా నాన్న వెళ్ళేవారు కాదు. అక్కడో గుడిసె వేసుకొని రాత్రిళ్ళు కాపలా గాసేవారు. సర్వ సాధారణంగా ఆయనకు తోడుగా నేను వెళ్ళేవాడిని. తోడంటే మాట తోడే. తీరా అక్కడకు వేళ్ళాక నేను వళ్ళు తెలియకుండా నిద్ర పోయేవాడిని. తెల్లవారుఝామునే ఆయన లేచి “నేను వెళుతున్నాను. నీవు పొద్దుపొడిచాక దుప్పటి తీసుకొని ఇంటికి వచ్చెయ్” అని వెళ్ళిపోయేవారు. నాకు దయ్యాలూ, భూతాలూ అంటే భయం లేదని, నేను చాలా ధైర్యవంతున్ననీ మా అమ్మా, అవ్వా అందరితో చెబుతూ వుండేవాల్లు. స్వయంగా అంత భయస్తున్ని కాకపోవడం, వాళ్ళమాటను నిజం చేయాలన్న తలంపుతో తెగింస్తూండేవాన్ని. మా వూరికి పొలానికీ మద్యలో వున్న శ్మశానానికి దగ్గరగా వచ్చినపుడు ఎంత లేదన్నా ఒళ్ళు జలదరిస్తూ వుండేది. చిన్న ఆకు చప్పుడుకు కూడా ఒళ్ళు నిక్కబొడుచుకునేది. అయితే ఆ రోజు వర్షం బాగా కురుస్తోంది. ఆ పక్కనే పిడుగు పడ్డట్టగా అప్పుడప్పుడూ భయంకరంగా మేఘాలు వురుముతున్నాయి. క్షణకాలం మెరిసే మెరపులు దడ పుట్టిస్తున్నాయి. వసారా కింద అరుగుమీద పడుకొని వున్న నేను “అర్జుణా, ఫల్గుణా” అనుకుంటున్నా! లోపల మా నాన్న కాపలా గురించి బాధపడుతున్నాడు. ఆయనకు ఆ వర్షంలోనే కాపలా వేల్తానంటున్నా మా అమ్మ వెళ్ళొద్దంటోంది. వెళ్ళకపోతే ఆ వర్షంలో పందులు చేయగల భీభత్సం గురించీ, అన్ని రోజులూ బిడ్డలా కాపాడుకొన్న పంట పందుల పాలయితే తదనంతర పర్యవసానాల గురించీ అమ్మానాన్నలు వేదన పడుతున్నారు. వాళ్ళకూ నిద్ర రాలేదు, ఆ మాటలు వింటున్నందునా, వర్ష భీభత్సానికీ నాకూ నిద్ర రాలేదు.

ఏమి చేయాలో కర్తవ్యం భోధపడ్డట్టు ఓ గోనె సంచిని కప్పుకొని బయలుదేరాను ఆ వర్షం లోనే! చెబితే అమ్మ వెళ్ళ నివ్వదు. వెళ్ళకపోతే పంట పందులపాలవుతుంది. కనుక చెప్పకుండానే గోనె సంచీ కప్పుకొని పొలం వైపు సాగాను. చిమ్మ చీకటిలో అప్పుడప్పుడూ మెరిసే మెరుపుల్లోనే దారి కనిపిస్తోంది. మిగిలిన సమయమంతా తెలిసిన దారి అనే వుజ్జాయింపుతోనే నడక. వూరు దాటి వచ్చాక స్మశానం దగ్గరి నుండీ ఈత చెట్ల మద్య నుండీ నడుస్తుంటే నా నడకే నన్ను భయపెడుతోంది. నా అడుగుల శబ్దానికే నిమిశానికోసారి వెనుదిరిగి చూసుకుంటున్నా! ఎలాగయితేనేం పొలం చేరుకున్నా “హ్హు హ్హు” అని అరుస్తూ నా అరుపే నాకు రక్షలాగా అరుచుకుంటూ పొలమంతా తిరిగా! అక్కడక్కడా దూరంగా కొన్ని పొలాల రైతులు చేస్తున్న శబ్డాలు కూడా వినవస్తున్నాయి. అలా అరుస్తూ అరుస్తూ చుట్టూ తిరుగుతూ ఓపినంత సేపు వుండి తిరిగి వచ్చి ఎవరికీ తెలియకుండా అరుగుమీద పడుకొని నిద్రపోయా! మా అమ్మ తిడుతుందన్న భయంతో ఆ మరుసటి రోజు కూడా నేను ఇంట్లో చెప్పలేదు. ఆ తర్వాతెప్పుడూ చెప్పలేదు. ఇప్పటికీ వాళ్ళకు నా సాహస గాధ గురించి తెలీదు!
ఇప్పుడెందుకు ఈ సోదంటే… ఈ మద్య బ్లాగటం లేదు కాదా ఏదో బ్లాగుదా మనిపించింది. సరే ఈ విషయమేదో బ్లాగితే నా ధీరత్వము అందరికీ తెలుస్తుంది కదా అని బ్లాగేసా!

–ప్రసాద్