“నేను” అనగా…

తేది:February 21, 2007 వర్గం:ఆధ్యాత్మికం రచన:చరసాల 16,205 views

కాలేజీ రోజుల్లో ఎందుకో గానీ అధ్యాత్మిక ధ్యాస మరీ ఎక్కువై పోయింది. హైస్కూలు రోజుల్లోనే ఒకానొక క్రిస్టియన్ ఉపాధ్యాయుడు వల్ల బైబిల్ చదివే అవకాశం కలిగింది. చిన్నప్పుడు ఘంటసాల నోటినుండి వచ్చిన గీతే కాకుండా ఎవరెవరో రాసిన గీత వాఖ్యానాలు చదవడమూ అయ్యింది. ఇంచుమించు నాలుగవ తరగతిలో వున్నప్పుడే మా వూరి ఒక ముసలామె (రాసమ్మ గారామె) తన దగ్గర వున్న బ్రహ్మం గారి జీవిత చరిత్ర తెచ్చి నాతో చదివించుకొనేది. అందులో సిద్దయ్య వేసిన యోగాసన చిత్రాలు చూసి నేనూ అలా చేయడానికి ప్రయత్నించేవాన్ని.
ఇక కాలేజీ రోజుల్లో తెలుగులో వున్న ఖురాను దొరకబుచ్చుకోవడానికి నా ప్రయత్నం చాలానే చేశాను గానీ ఫలించలేదు. ఇప్పటికీ చదవాలన్న కోరిక వుంది. కానీ తెలుగులొ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. బ్రహ్మకుమారీ సమాజానికీ వెళ్ళాను. అక్కడ వారు దేవునికి రూపం కల్పించడం నాకు నచ్చలేదు. ఇక గణపతి సచ్చిదానంద సమావేశాలకు వెళ్ళాను. ఆయన చేసే యజ్ఞాలమీద నాకసలు నమ్మకం కలుగలేదు. ఎంతో భక్తితో మిత్రులతో కలిసి ప్రతి శనివారం సాయంత్రం వేంకటేశ్వరుని గుడికి వెళ్ళేవాన్ని..రాతి విగ్రహం కనిపించేదే గానీ, దేవుడు కనిపించేవాడు కాదు.

ఎన్ని చోట్లకు వెళ్ళినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎందరి వుపన్యాసాలు విన్నా దేనిమీదా గురి కలగలేదు. కానీ, నిన్నా మొన్నటి వరకూ (నాలుగేళ్ళ క్రితం వరకూ) ఆత్మ, పరమాత్మ వున్నాయని నమ్మకముండేది. ఎంతు లోతుకు వెళ్ళినా “ఎలా” జరుగుతున్నదో చెప్పే సైన్సు, “ఎందుకు” జరుగుతుందో చెప్పలేక పోయినప్పుడు అదే పరమాత్మ లీల అనుకునే వాన్ని. అయితే ఒకానొక దుస్సంఘటన వల్ల నాలోని నమ్మకాలు పటాపంచలు అయ్యాయి. కొందరు సనాతన వాదులు, ఆస్తిక వాదులు ఏమంటారంటే అలాంటి దుర్ఘటనలు మనిషిని దేవుడిమీద నమ్మకాన్ని పోగొడతాయి అంటారు. అయితే కానివ్వు, చీకటిలో నడుస్తున్నప్పుడు కాలికి రాయి తగులుతుంది. అది తగిలినప్పుడే కదా అక్కడ రాయి వుందని భోధపడుతుంది? రాయి తగలడం వల్ల నిజం (జ్ఞానమ్) తెలుస్తుంటే రాయినెందుకు తప్పుపట్టాలి? నిజం అలా తెలుసుకోవడం బాధాకరమైందే అయినా లోపభూయిష్టమయిందైతే కాదు కదా? నాకూ ఈ ఆత్మ, పరమాత్మ, పూర్వ జన్మ, మలి జన్మ అన్న సిద్దాంతాలన్నీ కారుమబ్బుల్లా విడిపోయి స్పష్టంగా నిజం (సత్యం) (నేను నిజమనుకున్నది మీకు కాకపోవచ్చు) భోధపడింది. నేనీ సత్యాన్ని తెలుసుకోవడం నా సొంత జిజ్ఞాస ద్వారానే కానీ, హేతు వాద పుస్తకాలు గానీ, వాదనలు కానీ చదవడం వల్ల కాదు. అయితే ఈ మద్య కొడవగంటి రోహిణీ ప్రసాద్ బ్లాగు చూశాక నా నమ్మకానికి మరింత బలం వచ్చింది.

ఇంతకీ “నేను” అంటే ఎవరు? ఇదే ప్రశ్న ఈశ్వరీయ బ్రహ్మకుమారీలు కుడా మొదటిరోజు అడిగారు. సనాతనుల దృష్టిలో “నేను” అంటే “ఆత్మ”. అది జరామరణములు లేనిది, ఆద్యంతాలు లేనిది. దాన్ని నీరు తడుప జాలదు, అగ్ని మండింపజాలదు. నేనూ దీనిని నమ్మేరోజులలో ఆలోచనలు, జాగృతి లాంటివి ఆత్మ కలుగజేస్తున్నది అనుకున్నాను. భయం, ప్రీతి ఇలాంటివివి మనసుకు అంటే ఆత్మకు సంబందించినవి అనుకున్నాను. ఆత్మకు, మనసుకు తేడా వుంటుందేమొ, అయితే నేను చెప్పదలుచుకున్నది ఏమంటే మన ఆలోచనలు, చేష్టలు, అనుభవాలు అన్నీకూడా భౌతికమైన ఈ దేహానివే కానీ, ఆత్మ గీత్మ అనే మరో అభేద్యమయిన అర్థం కాని దానివి కాదు అని.

నాకీ మద్య ఎలాంటి విషాద వార్త చూసినా నా ప్రమేయం లేకుండానే కళ్ళంబట నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ఒక పసివాడి గుండె రంధ్రాన్నో, దిక్కులేని ముసలమ్మ యాతనో చూస్తే ఎక్కడ లేని బాధ కలుగుతుంది. ఒక్కోసారి వెక్కిళ్ళు కూడా వస్తాయి (నమ్మండి నమ్మకపొండి నిజం). చిన్నప్పటినుండి నన్ను సున్నితమనస్కుడనే అంటారు కానీ ఇప్పటి సున్నితత్వం మరీ ఎక్కువగా వుందని అనిపించింది. దానికి తోడు బరువు తగ్గడం లాంటి సమస్యలుంటే ఏమవుతుందో నాకని డాక్టరు దగ్గరికెళ్ళా. తేలిందేమిటంటే నాకు థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్‌ను ఎక్కువగా విడుదల చేస్తున్నది. దానివల్ల మెటబాలిజం ఎక్కువయి బరువు తగ్గడం, స్నో పడుతున్న వేళలో కూడా చెమటలు రావడం … ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. థైరాయిడ్ ఎక్కువయితే కోపం, చిరాకు కూడా వుంటాయిట! ఎందుకో నాకు లేవు.

ఇప్పుడు నా అనుమానము ఏమిటంటే ఈ థైరాయిడ్ వల్ల నా హృదయం ద్రవించి నేనేదైయినా సహాయం చేస్తే ఆ పుణ్యం నా ఆత్మకు దక్కాలా? థైరాయిడ్ గ్రంధికి దక్కాలా? దాని ప్రభావం వల్ల కోపంలో నేను ఏదైనా చేయరాని పని చేస్తే ఆ కర్మఫలం నా ఆత్మనంటిపెట్టుకొని మరు జన్మకు ప్రయాణిస్తుందా? నా ఆత్మ ప్రమేయము లేకుండా నా దేహంలో జరుగుతున్న రసాయినక ద్రవాల వల్ల జరిగే అనర్థాలకు నేనెలా (నా ఆత్మ) కారణం? పుట్టిన బిడ్డమీద తల్లి చూపే అవ్యాజప్రేమకు, యువతీయువకుల మద్య జనించే వ్యామోహానికి కారణం దేహములోని కొన్ని రసాయనాల వల్ల అయితే, దేహాన్ని ఆశ్రయించుకొన్న ఆత్మకు ఏ విధంగా సంబందం?

ఇప్పుడు చెప్పండి నేనంటే నా దేహమా? నా ఆత్మా?

–ప్రసాద్

ఏ బిడ్డ కోరుకుంటుందీ పరిస్థితి?

తేది:February 16, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 2,647 views

అందంతో ఆకట్టుకొంది. ఎన్నో షోలతో ప్రజల్లో నిలిచిపోయింది. ఓ కోటీశ్వరుడిని పెళ్ళి చేసుకొంది. తను చనిపోయాక ఆ ఆస్తి కోసం పోరాడింది. గెలుపు దక్కిందో లేదో ఇంతలో అనుమానాస్పదంగా మరణించింది.
ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న తంతు చూడండి. ఆస్తి పంచేదాకా పాడె ఎత్తనివ్వం అనే పల్లె తంతుల్లానే ఇక్కడా జరుగుతోంది. తన కొడుకు చనిపోయాడు ఏదో ప్రమాదంలో(అదృష్టవంతుడు). ఇప్పుడు తనకో ఆరునెలల పాప వుంది. తన లాయర్ నేనే ఆ పిల్లకు తండ్రిని అంటున్నాడు. ఇంకొకడు కాదు నేను తండ్రిని అన్నాడు. కాదు కాదు నేనన్నాడు ఇంకొకడు. ఇప్పుడా ముగ్గురినీ కాదని తన పూర్వ బాడీ గార్డు నాకూ ఆమెకూ సంబందం వుండేది గనుక నేనూ తండ్రిని అయ్యుండొచ్చు, ఎందుకైనా మంచిది DNA పరీక్ష చేయండి అంటున్నాడు.
అకటా! ఎంతటి సంకట స్థితి? బోసి నవ్వులు చిందే ఆ పసిపాపకు ఈ వివాదం అంతా తెలిసే, అర్థమయ్యే సౌకర్యముంటే నేనూ నా అన్నలా ఎందుకు చావలేదా అనుకుంటుందేమొ?

–ప్రసాద్

ఈ వింత చూడండి

తేది:February 14, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 2,965 views

ఇప్పుడే ఈనాడులో చదివిన వార్త. అతనెవరో మాంసం ప్రతిరోజూ తినాలనుకున్నాడు. ఖరీదయిన కోడిమాంసమో, వేట మాంసమో కొనలేక విరివిగా కనిపించే కాకిమాంసమే ముద్దనుకున్నాడు. కాకులను వేటాడే చవకైన మార్గమూ కనుగొన్నాడు. జిల్లేడు పాలు కలిపి అన్నం పెడితే కాకులన్నీ కావు కావు మని తిని గుంపులు గుంపులుగా చావడం, ఈయన వీటిని సంచీలో కుక్కుకొని వెళ్ళి వండుకొని భంక్షించడం మొదలెట్టాడు. ఇందులో మీకేమయినా తప్పు కనపడిందా? వేస్తే అసహ్యం వేసుండొచ్చు. ఎందుకంటే అధిక శాతం ప్రజలు కోళ్ళని, గొర్రెలనీ, ఎద్దులనీ తింటారు గనుక. కానీ ఆయనేదో నేరం చేసినట్లు (పోనీ కృష్న జింకలనో, నెమ్మళ్ళనో తిన్నాడన్నా, లేదా వాడెవడో తిన్నట్లు మనుషులనో తిన్నా అది వేరు) ఆ కాకులకు శవ పంచనామా చేసి ఆయన మీద కేసు పెట్టారట! అవ్వ ఇంతకన్నా ఘోరం ఇంకోటి వుందా? కాకులేమీ వైల్డ్ బర్డ్స్ కాదు కదా? అవి తామర తంపరగా వూరూరా వున్నవే కదా? కొందరన్నా కాకి మాంసానికి ఎగబడితే, అలవాటు పడితే అంతకంటే కావలిసిందేముంది? అందుకు ఆయన్ని అభినందించవలసింది పోయి నీవూ మాలాగే పెంచుకున్న కోడినెందుకు తినలేదు? మురిపంగా కనపడే గొర్రెపిల్లనెందుకు కోసుకొని తినలేదు? లేదా కనీసం ముద్దుగా కనపడే కోడెదూడనన్నా తినాల్సింది కానీ నల్లగా వున్న కాకిపిల్లనెందుకు తిన్నావు అని కేసు వేస్తే ఒక మాంసవిప్లవానికి దారితీద్దామనుకున్న ఆయన ఏమని చెబుతాడు?
పోనీ ఏ మాంసభక్షణా చేయని వారు కేసుపెట్టారంటే అర్థం వుంది. కానీ పెంపుడు కోళ్ళనీ, గొర్రెలనీ, దూడలనీ తినే వాళ్ళు. తమ కోర్కెల సాధన కోసం దేవుళ్ళకు కర్కశంగా బలిచ్చే వాళ్ళు, వీళ్ళా ఆయన్ని నేరస్తుడనేది? ఏం, కోడి ప్రాణం కంటే కాకి ప్రాణం విలువెక్కువా? కాకి మాంసం తినడం నేరమెట్లా అయింది?

kaki.jpg

–ప్రసాద్

ఇహలోక నరకం

తేది:February 1, 2007 వర్గం:వర్తమానం రచన:చరసాల 2,739 views

నిన్నటి వార్తలైనా, ఈనాటి వార్తలైనా, రేపటి వార్తలైనా అందులో క్రమంగా తప్పకుండా వుంటున్నది ఇరాకీల మరణాలు. అది షియా కావచ్చు, సున్నీ కావచ్చు. చనిపోతున్నది మాత్రం ఒక అమ్మ, ఒక చెల్లి, తమ్ముడు, అన్న, అక్క.
ఈ దారుణ మారణ హోమం ఎవరు రగిల్చారన్నది ఇప్పుడంత ముఖ్యం కాదు, ఇప్పుడు దాన్నెలా ఆపాలన్నది అర్థం కాని ప్రశ్న. మంట పెట్టడం ఎంతో సుళువు. కానీ ఆర్పడం?
ఆర్పడమెలాగో తెలియక తల పట్టుకున్న భూషయ్యకి సరైన సలహాలు కాదు కదా, సహాయమూ అందటం లేదిప్పుడు. కొత్తగా 21000 మంది సైనికులని పంపుతాను అంటే డెమోక్రాట్లు మెజారిటీగా వున్న కాంగ్రెస్ ఒంటికాలిమీద లేస్తోంది. అయితే గియితే భవిష్యత్తులో అధ్యక్షురాలయ్యే హిల్లరీ కానీ మొరాకో ఒబామా కానీ దీనికి అంగీకరించడం లేదు.
ఇప్పుడు అమెరికా పరిస్థితి పీక్కోలేక, లాక్కోలేక అన్నట్లు వుంది. ఎందరికో నచ్చని అమెరికా ఇలాంటి పరిస్థితిలో వున్నందుకు ఎంతోమందికి ఆనందమేసినా, ఇరాకీ సమస్యకు పరిష్కారం ఆలోచించటంలేదు. చేయిచేసుకున్న వాడు బుష్ కదా మనకెందుకు వాడే పీక్కొని చస్తాడు అన్నట్లుంది చాలా మంది పరిస్థితి.
స్థానిక అరబ్ రాజకీయాల్లో సిరియాకు, ఇరాన్‌కు చాలా పాత్ర వుంది. వీటి వత్తాసు లేనిదే సున్నీలైనా షియాలైనా ఇంతగా బరితెగించడం సాద్యం కాదు. ఇప్పటికే పీకల్లోతు కూరుకుపోయిన అమెరికా ఇంకా సిరియాను, ఇరాన్‌ను భయపెట్టి పనులు చేపించుకోగల స్థితిలో లేదు. ఇప్పటికే బోనులో వున్న సింహాన్ని చూసి ఎలుక గెంతులేసినట్లు అమెదినెజాద్, కిం జాంగ్ ఎగురుతున్నారు. వారిని భయపెట్టే ఎత్తులు మాని ఇప్పటికైనా సామరస్యంగా ఇరాక్ విషయంలో ఇరాన్‌ని, సిరియాని అవసరమైన ఇతర పార్టీలను కలిపి చర్చలు జరపడం మేలు.
అమెరికా సైన్యాలని వెనక్కి పిలవాలంటున్న నేతలు పిలిస్తే ఆ తర్వాత ఇరాక్ పరిస్థితి ఏంటనేది వూహించడం లేదు. లక్షా ముప్పైవేల పైచిలుకు అమెరికా సైన్యాలు ఇంకా మిగతా మిత్రరాజ్య సైన్యాలు వుండగానే రోజుకిన్ని ప్రాణాలు అనంత వాయువుల్లో కలుస్తుంటే అవి కాస్తా వెళ్ళిపోతే ఆ శూన్యతని ఎవరు భర్తీ చేస్తారు? కాంగ్రెసు మరింత సైన్యం పంపడం జాతీయ శ్రేయస్సు కాదంటోంది. అమెరికా జాతీయ శ్రేయస్సు సరే మరి ఇరాక్ శ్రేయస్సు సంగతేంటి?
ఇప్పటికే సున్నీ, షియాలుగా లోతుగా విడిపోయిన ఇరాకీలకు షియా బాహుళ్యమున్న ఇరాకీ సైన్యమ్మీద నమ్మకం లేదు. ఒక్కోచోట తమ భద్రత కోసం సున్నీలు అమెరికా సైన్యాన్నే వేడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎలా ఎప్పుడు మెరుగుపడుతుందో గానీ ఇది ఆరని గ్యాసు మంటలా తయారయింది.
ఒకరిని ఒకరు నిందించుకోవడం, సహాయ నిరాకరణ చేయటం మాని ఇరాక్‌ని మళ్ళీ మామూలు స్థితికి ఎలా తేవాలో అందరూ ఆలోచించాల్సిన సమయమిది.
–ప్రసాద్