“మీ లే” ఊచకోత
ప్రశాంతి పంపిన “ఒక దళారి పశ్చాత్తాపము” పుస్తకం చదువుతూ అందులో వివరించబడిన అమెరికా కుట్రల గురించి మరింత వివరంగా చదువుదామని వికీ పేజీలు తిరగేయడం మొదలెట్టాను. ఒక లంకెను పట్టుకొని మరో లంకెకు అలా గెంతుతూ గెతుంతూ వుంటే నాకు ఈ దురంతాలు కన్నీళ్ళు తెప్పించాయి. నేను చదివిన ఇలాంటి అన్ని దుర్మార్గాలలోకి ఇది విభిన్నమైంది.
ఉత్తర వియత్నాం గొరిల్లాలతో పోరాటం చేస్తూ వాళ్ళు దాక్కున్నారనే సాకుతో ఉదయాన్నే గ్రామాలమీద పడి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మహిళలనూ, ముసలి వాళ్ళనూ, పసిపిల్లలనూ వధించారు.
జనవరి 1968 లో ఉత్తర వియత్నాం గొరిల్లాలు కాంగ్ నై(Quang Ngai) మీద దాడి చేసి దక్షిణ వియత్నాం మిలటరీ ఆఫీసర్ల ఇళ్ళమీద పడ్డారు. వాళ్ళ కుటుంబాలను చంపారు. మిలటరీ గూడాచారులు గొరిల్లాలు వెళ్ళి సాంగ్ మీ అనే వూరులో దాక్కున్నారని సమాచారం ఇచ్చారు. సాంగ్ మీ అనే వూరులో నాలుగిళ్ళను గుర్తించి అందులో దాక్కున్నారని చెప్పారు. అంతకు ముందు వియత్నం గొరిల్లాల దాడిలో నష్టపోయిన అమెరికా సైనికులు ఆ గుడెసెలమీద దాడిచేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 7 గంటల తర్వాత అందరూ బయటకు పనులకు వెల్తారనీ ఆ తర్వాత గుడిసెల్లో ఎవరున్నా వారు గొరిల్లాలో లేక వారి సానుభూతిపరులో అయివుంటారనీ వాళ్ళ నాయకుడు వూహించి 7 గంటల తర్వాత దాడి చేసి కనిపించిన అందరినీ చంపేయమన్నాడు. మరెందుకో ఆయనకు పసిపిల్లలు, వృద్దుల మాట గుర్తుకు రాలేదు.
మర్నాటి వుదయమే మార్చి16, 1968న అమెరికన్ సైనికులు ఆ వూరిమీద విరుచుకు పడ్డారు. అక్కడ వీరికి గొరిల్లాలు ఎవరూ కనిపించలేదు. అయినా వాళ్ళు గొరిల్లాల అచూకి చెప్పమని వేధించి కాల్చి చంపారు. ఆడవారు, పిల్లలూ, వృద్దులు అందరినీ వూరిబయట గోతుల వద్దకు నడిపించి ఆటోమాటిక్ గన్స్‌తో కాల్చి చంపారు. ఇది ఇంకా కొనసాగేదే ఒక ధైర్యవంతుడైన హెలికాప్టర్ పైలట్ దీన్ని చూడకపోయివుంటే!