మరో ఏడు

తేది:December 29, 2006 వర్గం:వర్తమానం రచన:చరసాల 2,716 views

మరో ఏడాది గడిచింది. భూమి మరో ప్రదక్షణం చేసేసింది.
ఈ ఏడు నా జీవితంలో జరిగిన ముఖ్యమైన మార్పులు.
1) బానిసలా పనిచేయించుకొనే Verizon నుండి సుఖవంతమైన DOTకి మరింత మెరుగైన జీతంతో మారడం.
2) బ్లాగడం మొదలు పెట్టడం. బ్లాగరులతో పరిచయాలు.

DOTకే మారకుంటే బ్లాగు మొదలెట్టే సమయమే దొరికేది కాదు. తీరా బ్లాగు కోసమే వెదకకుంటే బ్లాగరుల గుంపు గురించీ తెలిసేది కాదు.
“రెండు విమానాలు” అని అచ్చ తెలుగులో చెప్పినందుకే నా బావమరిది నవ్వాడు. “ఈ పనికిమాలిన కవిత్వాల బదులు ఏదైనా చదివి IAS అవ్వొచ్చుగా” అనే ఈసడింపులు పెద్దల నుంచీ. అసలు తెలుగులో ఏదన్నా రాస్తే ఎవరికీ చూపకుండా దాచుకోవాల్సిన రోజులు కొన్ని, ఎగతాళి చేస్తారేమొ నని! అయినా నాకు తెలుగు మీది వ్యామోహం వదిలేది కాదు. కాలేజీ రోజుల్లో నానా తంటాలూ పడి రాసుకొచ్చి ఆంగ్లంలో అనర్గళంగా కొందరు వుపన్యసిస్తే, రాసుకొచ్చింది చదవడానికీ కొందరు తడబడి.. అయినా ఆంగ్లోపన్యాసమే చేసి అందరి చేతా భేష్ అనిపించుకుంటుంటే నేను మాత్రమూ తెలుగులోనే ఉపన్యసించేవాన్ని. ఇందుకు కారణం నాకంతగా ఇంగ్లీషు రాకపోవడము, వచ్చిన మాతృ బాషలో మాట్లాడటం తప్పు కాదనే బలమైన భావన వుండటమూను.
ఎలాగోలా ఇలానే నా భాషనూ, నా అభిరుచినీ చంపుకుంటూ వస్తున్న రోజుల్లో నేనీ గవర్నమెంటు ప్రాజెక్టులో చేరడమూ, కావల్సినంత సమయం దొరకడంతో దీనికి తెలుగు బ్లాగరుల ప్రోత్సాహం తోడవ్వడంతో మళ్ళీ నా హృదయాన్ని ఆవిష్కరించుకునే అవకాశం కలిగింది.
నా కిష్టమయ్యిందే నా భార్యకు ఇష్టమవ్వాలని లేదు. నాకిష్టమయ్యిందే నా పిల్లలు ఇష్ట పడతారని లేదు. నా చుట్టూ వుండి నాకు తెలిసిన కొద్ది మంది మిత్రుల్లో నాకున్న భావాలే వుండాలనీ లేదు. మరి ప్రపంచమంతటా నా అభిరుచులే వున్న స్నేహితులను వెతుక్కోవాలంటే ఒక జీవితకాలం సరిపోతుందా? పది జీవిత కాలాలు కూడా సరిపోవు. కానీ ఈ ఇంటర్‌నెట్ మాయాజాలం వల్ల మనతో ఏకీభవించే వ్యక్తులు ప్రపంచంలో ఏమూల వున్నా ఇట్టే తెలిసిపోతున్నారు, దగ్గరవుతున్నారు, బాధలనూ, సంతోషాన్నీ పంచుకుంటున్నారు. మిగతా పరిచయాల్లో రూపం చూశాక, మాట విన్నాక మనసు తెలుస్తుంది. ఇదేం చోద్యమో గానీ ఇంటర్‌నెట్ పరిచయాల్లో మనసు తెలిశక మాటా, వీలయితే ఆపై రూపమూ తెలుస్తాయి. మనసులతో ముడిపడే ఈ బందాలే అసలైన బాందవ్యాలేమొ!
బ్లాగు ప్రపంచంతో, బ్లాగరులతో పరిచయం కలిగిన ఈ ఏడాది నాకు అరుదైన అద్బుతమైన కానుకను అందించిందనే చెప్పాలి.
మరి వస్తున్న సంవత్సరం నాకోసం ఏం తెస్తున్నదో!

మీకందరికీ కొత్త సంవత్సరం భోగభాగ్యాలను, సంతోషాలను తేవాలని కోరుకుంటూ…
–ప్రసాద్

నేను X గడియారము

తేది:December 28, 2006 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 2,947 views

గడియారము:తిరిగిన దారిలోనె రోజుకు రెండుసార్లు తిరుగుతుంది.
నేను:నాదైన దారిలో ఆఫీసుకు రావడానికి పోవడానికి రెండుసార్లు తిరుగుతాను. (కాకపోతే ఎదురెదురుగా)

గ:ప్రతిరోజూ ఉదయం 6 గంటలకి చిన్నముల్లు ఆరుమీద పెద్దముల్లు 12 మీద వుంటాయి.
నే:ఉదయం ఆరుగంటలకు ఒడెంటన్ మార్క్ రైల్వే స్టేషన్‌లో వుంటాను.

గ:ఉదయం ఏడింటికి చిన్నముల్లు ఏడు మీద పెద్దముల్లు 12 మీద వుంటుంది.
నే:ఆఫీసులో కూర్చుని కూడలి చూస్తూ వుంటాను.

గ:సాయంత్రం నాలుగింటికి చిన్నముల్లు ఎక్కడ వుంటుందో పెద్దముల్లు ఎక్కడ వుంటుందో మీరిప్పుడు చెప్పగలరు.
నే:మెట్రో స్టేషనులో మెట్రో కోసం చూస్తుంటానని నన్నెరిగిన ఎవరైనా చెప్పగలరు.

గ:బాటరీ శక్తి నశిస్తే నెమ్మదిగా నడుస్తుంది చివరికి ఆగిపోతుంది.
నే:అనారోగ్యం ఎదురయితే ఆఫీసుకు లేటుగా రావడమో లేక ముడుచుకొని పడుకోవడమో!

గ:ఏడాదికి రెండుసార్లు గడియారపు పండుగ వస్తుంది. (అదేనండి Daylight vs Standard time)
నే:ఏడాదికి రెండుసార్లు మా పిల్లల జన్మదిన పండుగలు వస్తాయి.

మ్మ్… గడియారాన్ని చూసి జాలిపడేవాన్ని ఏం బతుకురా నాయనా అని..తీరా చూస్తే నాబతుక్కీ దానికి పేపేపేద్ద తేడా ఏమీ లేదని తెలుస్తూనే వుంది.

జీవితం ఎంత యాంత్రికమైపోయిందిరా తండ్రీ!
–ప్రసాద్

అంతరాత్మ

తేది:December 27, 2006 వర్గం:ఆధ్యాత్మికం రచన:charasala 3,604 views

చాలా మంది అంటుంటారు “అంతరాత్మ చెప్పినట్లు వినాల”ని. అంతరాత్మ మనలో దేవుడు పెట్టిన పోలీసని, ఇలా ఇంకా ఎన్నో! కానీ నిజానికి అంతరాత్మ ఎప్పుడూ ధర్మబద్దంగానే ఆలోచిస్తుందా? అంతరాత్మకు కాలానికి అతీతంగా ధర్మమేంటో తెలుసా?
మనకు తెలియందేదీ అంతరాత్మకూ తెలియదనే చెప్పాలి. మంచేదో చెడేదో మనకే ఎక్కడో మారుమూలల్లో దాగివున్నప్పుడే ఆ అంతరాత్మ అనేది పైకి వస్తుంది.
ఒక జంతువును దేవునికి బలి ఇచ్చే అజ్ఞానికి తను చేస్తుంది తప్పని అంతరాత్మ హెచ్చరించడం కాదు కదా మొక్కిన మొక్కు తీర్చకపోవడం మాత్రమే తప్పని ఘోషిస్తూ వుంటుంది. మనమంతా పొగిడే రామ రాజ్యంలో కూడా నాలుగు వర్ణాలూ వారి వారి ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించడమే నీతి, ధర్మమూ! దానికి విరుద్దంగా నడిచినప్పుడే అంతరాత్మ వాళ్ళకి ఎదురు తిరిగేది.
మనకు తెలిసిన ధర్మమే అంతరాత్మకూ తెలుసు. కాకపోతే మనకు తెలియనట్లు నటిస్తున్నప్పుడు మనకు తెలుసుననే జాగృతి మనల్ని హెచ్చరిస్తూ వుంటుంది, అదే అంతరాత్మ.
–ప్రసాద్

ఉత్తరాలు

తేది:December 12, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:charasala 3,369 views

ఒక జీవితకాలంలోనే ఇన్నిమార్పులు జరగడం బహుశా ఈ తరంలోనే జరిగిందేమొ! మొన్నటికి మొన్న ఓ 7 సంవత్సరాల క్రితం వరకూ కూడా పోస్టుమాన్ వస్తున్నాడంటే ఎంత ఆనందమో! తను తెచ్చిన ఉత్తరాల మీద ఎంత ఆపేక్షో! అందులో మనకోసం ఓ ఉత్తరముంటే ఎంత తుళ్ళింతో! ఇంటికొచ్చిన దినపత్రిక గానీ, వార పత్రిక గానీ, ఓ కొత్త నవల గానీ అంత సంతోషాన్ని ఇస్తుందా?? అందునా మన శ్రేయోభిలాషి, మంచి దోస్తు రాసిన వుత్తరమయితే చదువుతున్నంతసేపూ నవనాడులూ, పంచేంద్రియాలూ ఆ వుత్తరం మీదే కేంద్రీకరించి చదువుతున్నంతసేపూ వచ్చే ఆనందం! హా!!! ఇప్పుడేదీ ఆ ఆనందం?

ఇప్పుడంతా ఫోన్లు, ఎస్సెమ్మెస్సులూ, ఈమెయిల్లూ, చాట్‌రూం సంభాషణలూ. పొదుపైన పదాలూ అందుకోసం ప్రత్యేకంగా.. సమాచారం చేరవేయడం బోలెడంత సుళువైపోయింది. ఎకాఎకిన మా అమ్మకు ఫోన్ చేసి ఎలావున్నావని అడగొచ్చు లేదా అటు ఇటూ కెమారాలుంటే ఇద్దరం ఒకరినొకరు రోజూ ఇరుగు-పొరుగుల్లా చూసుకోవచ్చు. ఈ టెక్నాలజీ తెచ్చిన విప్లవం అంతాఇంతా కాదు. అయితే దీనితో కొన్ని అందమైన అలవాట్లు మరుగున పడిపోతున్నాయి. కాలేజీలో చదివేరోజుల్లో మా నాన్న నాకు వ్రాసిన మొదటి వుత్తరం నాలో ఎదో ఉత్తేజాన్ని కలిగించింది. ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా ఆ అనుభూతి రావట్లేదు.
అప్పట్లో నేను నా మిత్రునికి రాసిన 7 పేజీల లేఖే పెద్దదనుకుంటే దానికి తగ్గట్టుగా శ్రీకాళహస్తి నుంచీ అతను రాసిన పద్నాలుగు పేజీల (అన్నీ ఆ4 సైజు ఠావులే) లేఖ నన్ను ఆశ్చర్యపరచింది. అందులో శ్రీకాళహస్తిలో కూరగాయల రేట్ల దగ్గరనుండీ స్థానిక రాజకీయాల వరకు, తన వివిధానుభవాలనుండి తన మిత్రులతో చర్చల వరకూ అన్నీ వున్నాయి.
నన్నందరూ వుత్తరాలు కవితాత్మకంగా రాస్తాననే వాళ్ళు. కాలేజీ చదివే రోజుల్లో నెలకో వుత్తరమైనా ఇంటికి రాయకపోతే మా చెల్లి కొట్లాడేది. అసలు వాళ్ళు నన్ను గాక నా వుత్తరాలనే ప్రేమిస్తున్నారా అనిపించేది. ఇప్పటికీ మా అమ్మ నువ్వెన్ని సార్లు మాట్లాడినా మాకు తృప్తిలేదురా ఒక్క వుత్త్రం రాశావంటే మాకు నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని చదువుకొని తృప్తి పడతాం అంటుంది.
మా మిత్రత్రయం (రంగా, రెడ్డి, రేణుక) విజయవాడలో ఎంట్రన్స్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు మా స్నేహుతురాలొకామే ఉత్తరాలు రాసేవారు. మేమూ ఆమెకు రాసేవాళ్ళం. మా ప్రతి వుత్తరానికి ప్రత్యుత్తరం వస్తుందని మేమెంత ఆతృతగా ఎదురుచూసేవాళ్ళమంటే .. కొన్నింటికి పదాల్లేవ్.
మీక్కూడా వుత్తరాల జ్ఞాపకాలున్నాయా? పంచుకోండి. దాచుకున్న వుత్తరాలుంటే అభ్యంతరం లేనివైతే ప్రచురించడానికి ప్రయత్నించండి.
–ప్రసాద్

గండికోట సాహసయాత్ర

తేది:December 12, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:charasala 3,359 views

ఆరోజు రిపబ్లిక్ డే, కాలేజీకి సెలవు. ఏమి చేయాలా అని నేను, రూమ్ మేటు మరియు స్నేహితుడు రంగనాయకులు ఆలోచించాము. చివరికి జమ్మలమడుగు తర్వాత 10/20 కిలోమీటర్ల దూరంలో వున్న గండికోట చూచిరావాలని అనుకున్నాం. కానీ అలా బస్సులో వెళ్ళి ఇలా వచ్చేస్తే మజా ఏముంటుందని ఇద్దరం సైకిళ్ళపై వెళ్ళి రావాలని నిర్ణయించుకున్నాం. మా సాహస యాత్ర అలా మొదలయ్యింది.

ఉదయాన్నే లేచి అద్దె సైకిళ్ళు తీసుకుని మా సైకిల్ యాత్ర మొదలు పెట్టాం. ప్రొద్దటూరు నుండీ జమ్మలమడుగుకు మధ్యాహ్నానికల్లా చేరుకున్నాం. అక్కడ భోజనం చేసి మళ్ళీ బయలుదేరి బహుశా రెండింటికల్లా గండికోట చేరాం. దానిపైకి సైకిలు తొక్కడం వల్ల కాలేదు. నడిపించుకుంటూ వెళ్ళాం. పైన ఏదో గుడి వుంది. దేవుళ్ళని మాయం చేశారు. ఇంకా ఎవైనా కట్టడాలకు పనికివస్తాయనుకున్న పెద్ద రాళ్ళనూ బండలనూ కూడా దోచుకెళ్ళారు. గుడి ఆకారమంతా వున్నా లోపలంతా డొల్ల. అక్కడినుంచీ మసీదు దగ్గరకెళ్ళాం. దాని తలుపులు మూసి వుండడంతో పక్కనున్న ఏదో గోడనెక్కి కిటికిలోంచి లోపలికి తొంగిచూసినట్లు జ్ఞాపకం. ఆ పక్కనే రెండు కొండలనూ వరుసుకుంటూ వెళ్తున్న పెన్న. ఇవతలి ఒడ్డుపైనుంచీ చూస్తే ఆవలి తీరం దగ్గరగా వున్నట్లే వుంటుంది గానీ ఎంత శక్తిమంతుడైనా ఆవలి ఒడ్డుకు రాయి విసరలేడని ప్రతీతి.
కొండలో పెన్న చేసిన ఆ గండి వల్లనే దానికి “గండి కోట” అని పేరొచ్చిందట.
ఇక చుట్టూ వున్న కోట గోడ చూడాలని వున్నా అప్పటికే చీకటి ముసురుతూ వుండటం వల్ల ఇక తిరుగు ప్రయాణమయ్యాం.

తిరుగు ప్రయాణంలో కొండమీద నుండి సైకిళ్ళపై చాలా వేగంగా దిగుతున్నాం. కనిపించీ కనిపించని ఆ చిరుచీకటిలో ముళ్ళవల్లో లేక వాడైన రాళ్ళ వల్లో లేక కొండమీదనుండి దూకుతున్న వడి వల్లో మా సైకిళ్ళు పంక్చర్ అయ్యాయి. ఎలాగోలా కొండదిగి నడక మొదలు పెట్టాం. జమ్మలమడుగు చేరేటప్పటికి బహుశా రాత్రి 8 గంటలయ్యిందనుకుంటాను. అక్కడేమయినా తిన్నామో లేదో గుర్తులేదు. సైకిళ్ళకు పంక్చర్ వేసే షాపు ఏదీ కనిపించలేదు. అలాగని సైకిళ్ళపై వెళ్ళి రావాలన్న మా ఆకాంక్షను వదులుకొని బస్సుపై వెళ్ళడానికి మా పట్టుదల అంగీకరించలేదు. (బహుశా బస్సులో వెళ్ళాలని మనుసులో వున్నా ఎవరమూ బింకంతో బయట పడలేదు.) మళ్ళీ నడక మొదలెట్టాం. జమ్మలమడుగు నుండీ ప్రొద్దుటూరు 20 కిలోమీట్ర్లనుకుంటాను. సగం దూరం పౌరుషంగా నడిచినా ఇక కాళ్ళు సహకరించడం మానేశాయి. కానీ బలహీనత చెప్పుకోవడానికి సిగ్గు. మా కాళ్ళ బరువుకు తోడు మాకు సైకిళ్ళు తోయాల్సిన బాధ. దూరంగా ఎక్కడో ప్రొద్దటూరు లైట్ల వెలుతురు….వచ్చినట్లే వుందిగానీ వూరెంతకూ దగ్గరికి రాదు. పది మీటర్ల దూరం లోని మైలురాయి చేరాలన్నా ఎంతో కష్టం. అదెంతో దూరంలో వుండి కవ్విస్తున్నట్లు….. తీరా ఆ మైలురాయి చేరాక ఏదొ సాధించిన తృప్తి. ఇన్ని అడుగులు వేశాం ఇంకొన్నే కదా..అని మనసులోనే అనుకుంటూ ఒకరి కష్టం ఇంకొకరికి కనపడనీయకుండా ఎంతో ఓర్పుతో ఏ అర్ధరాత్రి దాటాకో ఇళ్ళు చేరాం. ఒక అడుగు దూరమే మైలు దూరంలా అనిపించిన ఆనాటి నడక మళ్ళీ ఇంతవరకూ అవసరం రాలేదు.
–ప్రసాద్