అక్రమంలో క్రమం

తేది:November 8, 2006 వర్గం:ఆధ్యాత్మికం రచన:charasala 3,495 views

అద్వితీయ శక్తులున్న భగవంతుడున్నారనే వాళ్ళందరూ ఒక వుదాహరణ తప్పకుండా చూపుతారు. దేవుడే లేకుంటే ఈ భూమి క్రమం తప్పకుండా ఎలా తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది? ఇన్ని గ్రహాలు, నక్షత్ర మండలాలూ దేవుడి నిర్దేశం లేకపోతే ఎలా తమ తమ కక్ష్యల్లో అంత క్రమంగా తిరుగుతాయి?
నిజానికి ఇవన్నీ క్రమంలోనే వున్నాయా? ఈ సూర్యచంద్రులున్నంత వరకూ అని ఎప్పటికీ వుండాటాన్ని పోల్చుతామే ఈ సూర్యచంద్రులు ఎప్పటికీ అవిచ్చన్నంగా వుంటారా? ఈ గ్రహాలన్నీ తమతమ కక్ష్యల్లో క్రమం తప్పకుండానే తిరుగుతున్నాయా? క్రమంలో అక్రమం వుందా? లేక అక్రమంలో క్రమం వుందా?
నాకైతే అక్రమంగా వున్న ఈ అనంత విశ్వంలో తాత్కాలికమైన క్రమమే ఈ సూర్యమండలము అనిపిస్తూంది. నాసా వాళ్ళు రోజుకొకటి చూపే “సూపర్‌నోవా” లను చూసినప్పుడు, కరిగే కొవ్వొత్తిలా తరిగిపోతున్న సూర్యున్ని చూసినప్పుడూ, చెప్పా పెట్టకుండా వచ్చే తుఫానులూ, భూకంపాలూ, సునామీలు చూసినప్పుడూ నాకు ఏది క్రమంగా వుంది అనిపిస్తుంది. నిత్యమూ మార్పు చెందడమొక్కటే సత్యము! రోజురోజుకీ తనను మండిచుకుంటూ నిన్నలేని మారిన సూర్యుడే ఈరోజు వున్నాడు. నిన్నటి సూర్యుడే ఈరోజు సత్యం కానప్పుడు నిన్నటంత కాలమే భూమి ఈరోజు కూడా తిరిగిందంటే ఎలా నమ్మడం! ఈ భూమి వయసు కోటానుకోట్ల సంవత్సరాలైతే, ఈ ఓ చిన్న రోజులో ఏర్పడిన వేగంలోని వ్యత్యాసాన్ని దేనితో కొలవగలం? ప్రతిదీ మార్పు చెందుతూ వుంది, వున్నది మరోదానిగా మరోటి ఇంకో దానిలా! అయితే ఇదైనా క్రమంగా జరుగూతూ వుందా? ఈ మొత్తం మానవ సృష్టిలో ఒకరిని పోలిన మనిషి ఇంకోసారి జన్మించాడా? ప్రతిదీ మార్పు చెందుతూ వుండే క్రమంలో ప్రతిసారీ కొత్తదానిలా మార్పు జరుగుతూ వుందే తప్ప, నిర్మింపబడిన దానిలా మళ్ళీ ఏదీ నిర్మింపబడటం లేదే? మరి ఏది క్రమం? క్రమపద్దతి లేకపోవడమనే క్రమం ఒక్కటే నిజం.
కొన్ని కోట్లకోట్లకోట్ల…సంవత్సరాల ఈ విశ్వంలో ఈ సూర్యుడి వయస్సెంత? ఈ భూమి వయస్సెంత? అందులో మనిషి జీవితమెంత? అదేదో నాలుగు లక్షల సంవత్సరాలు పెద్ద కాలమైనట్లు, మనిషి సృష్టే శాశ్వతమనుకునుటెట్ల? ఆ సుదీర్ఘమైన విశ్వ సృష్టిలో ఈ సూర్యకుటుంబము జీవితమెంత? ఓ నలుసు కాదూ? ఇలాంటి ఎన్ని సూర్యుల్లు ఉద్భవించాయో, ఎన్ని సూర్యుల్లు పతనమయ్యాయో ఈ అనంత విశ్వంలో! ఈ అతి స్వల్ప సూర్యకుటుంబం జీవితంలో అత్యంత అల్పమైన రోజును చూసుకొని అంతా క్రమంగా వుందని అనుకోవడం మన వెర్రి భ్రమ కదా! అదెట్లంటే సెకనుకు 30 మైళ్ళ వేగంతో ప్రయానిస్తున్న భూమి మీద వుండికూడా నిలకడగా వున్నట్లు అనుకోవటంలా! గుండ్రంగా వున్న భూమి మీద నిలబడి అంతా బల్లపరుపుగా వుందనుకోవటంలా!
బొంగరం తిప్పినపుడు అది మొదట్లో బాగానే స్థిరవేగంతో తిరుగుతున్నట్లు అనిపించినా క్రమక్రమంగా దాని వేగాన్ని పోగొట్టుకొని చివరికి పడిపోతుంది. అది తిరిగిన మొత్తం కాలంలో ఒక చిన్న డెల్టాX కాలం లో అది స్థిరవేగంతో తిరిగినట్లే అనిపిస్తుంది అంతమాత్రాన అది ఎప్పటికీ స్థిరవేగంతో తిరిగినట్లు కాదుకదా! అలానే ఓ పెద్ద వృత్తం మీద ఓ అతి చిన్న భాగాన్ని పరిశీలిస్తే అది సరళరేఖలా కనిపిస్తుంది కదా! కానీ అది సరళ రేఖా? పెద్ద సుడిగాలిలో ఓ చిన్న భాగాన్ని పరికిస్తే ఒక్కో అణువు పక్క అణువుతో స్థిర వేగంతో పయనిస్తూ అంతా సవ్యంగా వున్నట్లే అనిపిస్తుంది కానీ సవ్యం కాదు కదా?
మరి అనంత విశ్వంలో చిన్న రేణువైన సూర్యకుటుంబం అందులో మరింత చిన్నదైన భూమి దాని వేగం దాని మీద ఏర్పడే రోజులూ, ఋతువులూ అన్నీ సక్రమంగా వున్నట్లు ఎలా అనుకోవాలి? అతిపెద్దదైన అక్రమంలో ఇది మన కంటికి కనపడే ఓ చిన్న క్రమం.

–ప్రసాద్

ఇస్కాన్ (ISKCON)

తేది:November 7, 2006 వర్గం:ఆధ్యాత్మికం రచన:charasala 2,394 views

భక్తితో కాదు గానీ ప్రకృతి సౌందర్యం చూడటానికి, తల్లిదండ్రులకు ఇక్కడి హిందూ దేవాలయాలు చూపించటానికి వెస్ట్ వర్జీనియాలోని ఇస్కాన్ క్రిష్న దేవాలయం రెండు సార్లు చూడటమయ్యింది. ఎవరి వేదాంతం వాళ్ళది అని వాళ్ళ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను గానీ నాకు మాత్రం నమ్మకం లేదు.
మొన్న శనివారం రోజు ఒక మిత్రుడి ఆహ్వానం మీద ఒక ఇస్కాన్ సత్సంగానికి హాజరయ్యాను. ఒక పండుటాకు లాంటి పెద్దాయన వచ్చారు. భవద్గీత చాప్టరు 9 తో తన ప్రవచనం మొదలుపెట్టారు ఫ్ఫ్ట్ సహాయముతో.
ఒక ఫలము, పుష్పము లేదా పత్రము ఏదైనా నిండు మనస్సుతో నాకు అర్పిస్తే అది నేను స్వీకరిస్తున్నాను” అన్న కృష్నుడి శ్లోకానికి చాలా సేపు భాష్యము చెపుతూ భక్తి శ్రద్దలతో కృష్నున్ని ధ్యానం చేయడం చెప్పారు. దానికి కొనసాగింపుగా ఒక వుదాహరణ ఇలా చెప్పారు.
వృక్షానికి వేర్లమీద పోసేనీరు వృక్షానికంతా ఎలా వుపయోగపడుతుందో మోక్షమార్గానికి కృష్నుడి సేవ అలా వుపయోగపడుతుంది. వృక్షము యొక్క ఇంకే ఇతర భాగాల మీద నీరు పోసినా వృక్షానికి అందనట్లే ఇంకే ఇతర పద్దతుల ద్వారా కూడా వైకుంఠ సిద్ది కలగదు” ఇలా అంతా చెప్పాక ఎవరికైనా ప్రశ్నలుంటే అడగండి అన్నారు.
అప్పుడు వుండబట్టలేక నేనన్నాను “స్వామీ మోక్షమార్గానికి మీరు చెప్పిన అన్ని మార్గాలూ బాగానే వున్నాయి కానీ ‘మానవ సేవే మాధవ సేవ’ అన్నారు కదా! మరి మోక్షమార్గాల్లో పీడితుల, బాధితుల సేవ కూడా ఒక మార్గమని ఎందుకు చెప్పట్లేదు స్వామీ?” అని. దానికి స్వామి ఠక్కున “మానవ సేవే మాధవ సేవ అని గీతలో ఎక్కడ వుంది?” అన్నారు. నాకింకేమనాలో తోచ లేదు, ‘గీతలో లేక పోయినా ఉతృష్కఠమైన ధర్మమని నా నమ్మకం’ అన్నాను. కానీ అందుకు చాలా సేపు స్వామి చెప్పిన తాత్పర్యము ఏమంటే “భక్తి అనేది వృక్షము యొక్క వేరు, మిగతా ధర్మాలన్నీ దాని ఆకులు, కొమ్మల వంటివి వాటి మీద పోసే నీరు వృధా అవుతుంది. అదే నీవు కృష్న భక్తి అనే వేర్ల మీద పోస్తే నీకు తెలియకుండానే మానవసేవ అనే కొమ్మ కూడా అభివృద్ది అవుతుంది” అని.
నాకైతే మానవ సేవ ఆకుల మీద పోసే నీరు లాంటిది అని చెప్పడం ససేమిరా నచ్చలేదు.
ఆ తర్వాత స్వామి గీతలో వున్న శ్లోకాలకయితేనే సమాధానం చెబుతారేమొననుకొని, “స్వామీ, కృష్నుడు నిష్కామ కర్మ చెయ్య మన్నాడు కదా!  కానీ చివరిలో మనిషికి కలిగే వైకుంఠ భోగాన్ని ఎరగా వేస్తున్నారే! అదికూడా ‘కోరికే’ కదా?“అన్నాను. దీనికి స్వామి “కృష్నుడు చెప్పిన ‘కామ’ అనేది స్వార్థ చింతన,  వైకుంఠ ప్రాప్తి కావాలనుకోవడం పరమాత్మ చింతన, అది భగవంతుడి కోరిక , మన కోరిక కాదు” అన్నారు. ఇది నాకు నిజమే అనిపించింది.
ఇక కార్యక్రమం తర్వాత స్వామి భక్తులు నా అజ్ఞానానికి జాలిపడుతూ నా వివరాలడగడం ప్రారంభించారు. ఒకాయన అన్నారు “ఒక పిల్లవాడు జాతరలో తప్పిపోయాడనుకుందాం. ఒకతను ఆ పిల్లవాన్ని చేరదీసి అన్నం పెట్టాడు, ఇంకోకడు నీళ్ళిచ్చాడు. కానీ పిల్లవాడు ఏడుపు మానలేదు. అప్పుడు ఇంకొకడు వచ్చి అతని తల్లిదండ్రుల వద్దకు తీసుకపోయాడు. కావున తాత్కాలికంగా ఆకలి తీర్చడం, దారిద్య బాధ పోగొట్టడం తల్లిదండ్రులను చూపించకుండా అన్నం నీళ్ళు ఇచ్చినట్లుగా వుంటుంది. అది జీవుని బాధను పోగొట్టదు. కృష్న భక్తితో, చైతన్యంతో  వైకుంఠం చేరడం తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడంలాంటిది” అని. ఎంత పఠిష్టమైన వుదాహరణ చెప్పార్రా బాబూ అనుకొని “అయ్యా! నేను వైకుంఠమే తల్లిదండ్రులు అని ఎలా నమ్మాలి?” అన్నాను. నమ్మకమే ఏ భక్తికైనా పునాది కనుక నా ప్రశ్న అర్థం లేనిది అనిపించింది.
ఈసారి ఇంకొకాయన నావైపు వచ్చారు. “మానవ సేవ మాధవ సేవ కాదు మాధవ సేవే మానవ సేవ” అని వాకృచ్చారు. చచ్చినంత పనైంది నాకు. “అదేంటండీ అలాగంటారు ప్రతిజీవి లోనూ నిర్జీవి లోను భగవంతుడే కదా వ్యక్తమయ్యేది?” అన్నాను. “అహా! మరి పాములో కూడా భగవంతుడున్నాడా? మరి నువ్వు దానిదగ్గరికి వెళ్ళి కరిపించుకోగలవా?” అన్నారు. “నాలోనూ భగవంతుడే! దానిలోనూ భగవంతుడే!  కుట్టడమనేది మాయ! కుట్టకముందూ నేనున్నాను, కుట్టిన తర్వాతా నేనుంటాను” అన్నాను. ఆ తర్వాత ఆయనేమని చెప్పాడో నాకు అర్థం కాలేదు.
ఆ తర్వాత వీళ్ళ శాఖ గురించి మరింత విపులంగా చదివితే వీరు అద్వైత వాదులు కాదని, శుద్ద ద్వైతులని తెలిసింది. అన్నిటిలోనూ దేవుడుండడాన్ని వీళ్ళు నమ్మరు. అన్నీ భగవండుడిలో వుండి అన్నిటికీ అతీతంగా భగవంతుడనే ఒక మూర్తి వుంటాడని నమ్ముతారు.
కానీ నాకెప్పుడైతే “మానవ సేవ ఆకు మీద పోసిన నీళ్ళ చందంగా వృధా” అని ఎప్పుడన్నారో ఇలాంటి సత్సంగాలకు రావటం వృధా అనిపించింది.
–ప్రసాద్

విచలిత (అంపశయ్య నవీన్ నవల)

తేది:November 6, 2006 వర్గం:పుస్తకాలు రచన:charasala 2,689 views

తప్పు చేసిన యువకుణ్ణి మందలించి సరైన దారిలో పెట్టిన వైనం అదే తప్పు చేసిన స్త్రీని మాత్రం క్షమించకుండా జీవితాన్ని మోడును చేసిన సమాజం తీరును ఇందులో రచయిత “అంపశయ్య నవీన్” చక్కగా చిత్రీకరించారు.
అంతా చదివాక మనసు వికలమవుతుంది.
ఉపేందర్ లైంగిక వాక్షతో చదువు పాడుచేసుకొని ఇంటికి చేరతాడు. పల్లెలో ఇంటిదగ్గర కూడా చెడు సావాసాలతో చెడుతిరుగుళ్ళు చూసిన ఇంటి పెద్ద అన్నయ్య అతనికి పెళ్ళి చేయడమే విరుగుడు అని భావిస్తాడు. పేళ్ళి చేసుకున్నాక ఉపేందర్ భాద్యతతో ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకుంటాడు.
కానీ అతని భార్య శకుంతల తన కలలు తీరకపోవటం, పని ఒత్తిడిలో భర్త పట్టించు కోకపోవటం, అదే అదనులో జగన్నాధం అరచేతిలో వైకుంఠం చూపించి ఆమెను వశపరచుకోవటం జరుగుతుంది.
జగన్నాధంతో వుండగా చూసిన ఉపేందర్ అన్న రాఘవయ్య ఆమెను జగన్నాధంతో వెళ్ళడమో లేక పుట్టింటికి వెళ్ళడమో అన్న రెండే అవకాశాలు ఇస్తాడు.
చివరికి పుట్టింటికే వెళ్ళిన శకుంతల మొగుడు విడిచిన ఆడదిగా పలువురు చేత మోసగింపబడి చివరికి వేశ్యగా మారిపోతుంది.
రచయిత ఉపేందర్, రాఘవయ్య, శకుంతల, జగన్నాధం లాంటి పాత్రలను వారి వారి అన్ని కోణాలనుంచీ సమంగా పోషిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో శకుంతల తప్పు చేసిందో చాలా ప్రతిభావంతంగా వివరిస్తాడు.
–ప్రసాద్

కర్ణామృతం

తేది:November 4, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:charasala 1,456 views

మధురాంతకం రాజారాం కథల్లో ఏముందో గానీ మనసును అలా కట్టి పడేస్తాయి. తాతయ్య తన జీవితానుభవాలను కథల రూపంలో వర్ణిస్తున్నట్లే వుంటుంది. చదువుతూ వుంటే మనదో మన పక్కింటివాడిదో లేక మనకు తెలిసిన మితృడి మితృడిదో జరిగిన కథే అనిపిస్తుంది. ఈయన కథలు మనిషిని వున్నదున్నట్లుగా కాన్వాసుమీద చిత్రిస్తాయి. మచ్చుకు ఈ కథ చూద్దాం.  ఈయన కథలు చదువుతూ వుంటే నా చిన్నప్పుడు కడప రేడియో స్టేషనులో వచ్చిన ఈయన కథలను చదివిన కంఠమే గుర్తుకొస్తోంది. అది ఆయనదో కాదో నాకు తెలియదు.
****
ఏమండీ, కర్ణామృతమన్న మాట అందరూ విన్నదే కదా! ఏమిటది? వేణునాదమా? వీణాగానమా? కలకంటి కూజితమా? కాదు. వీటికి మించింది మరొకటి వుంది. అదేమిటో! తొందరపడకండి సార్! మనవి చేస్తున్నా!
“ఊడుముకేలరా ఊళ్ళో పెత్తనం అంటారు. నిజమే! ఊళ్ళోకి వచ్చేస్తే…ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడ తినాలి? ఏ విధంగా బయట పడాలి? ఇలా అన్నీ చిక్కులే దానికి! చిన్నాజీ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే అయిపోయింది. అతడు పుట్టి పెరిగింది అడవిలో చిన్న పల్లె. మనిషిన్నీ అడివిపువ్వులాంటివాడే! అయిదు మైళ్ళ దూరంలోని పేటకొండలో వున్న… చిన్న హైస్కూల్లో చేరడంతో ఆ అడవిపువ్వు గాలికి కొట్టుకొచ్చి నాగరికతా ప్రభంజనంలో పడిపోయినట్టయిపోయింది.
పులిమీద పుట్రలా… ముగ్గురు కూతుళ్ళున్న మేనమామ ఒకతను… కనీసం ఒక్క కూతురినైనా చౌకబేరంతో సాగలంపానడుకోవడం… చిన్నాజీ పాలిటికి పెద్ద కుట్రైపోయింది. ఆ మేనమామ అతన్ని తీసుకుపోయి ఇంటరులో చేర్పించాడు. అందులో గట్టెక్కగానే “చాల్లేరా అబ్బాయ్! ఎక్కువగా చదివితే అజీర్ణమే గదా! వుండు నేణు నిన్ను ప్రయోజకున్ని చేస్తానం”టూ బెంగుళూరు తీసుకెళ్ళి ఫ్రూట్ టెక్నాలజీలో డిప్లొమా చేయించాడు. ఆ కోర్సు పూర్తికాగానే మేనమామ కూతురికన్నా ముందుగా వుద్యోగమే అతన్ని వలచివచ్చింది.

ఫలవృక్షాల కేంద్రం కోడూరులో “పినాకినీ ఫ్రూట్ క్యానింగ్ ఇండస్ట్రీస్”లో టెక్నీషియన్‌గా చేరిపోయాడు.
జూన్‌తో అయిదు సంవత్సరాల కోర్సు పూర్తయింది.
ఎం.డిగారి దగ్గరనుంచి కబురొచ్చిందంటే… “ఏంఐందో ఏంపాడో! ఏం గత్రిరా దేవుడా! అనుకుంటూ బెంబేలు పడిపోయాడు. తీరా వెళ్ళి కలిశాక భయపడాల్సిన విషయమేమీ కాదని తెలిసింది. “చూడవయ్యా చిన్నాజీ! నువ్వు నాకు నచ్చావు. మన ఇండస్ట్రీకి అముల్యాభరణంగా కుదిరిపోయావు. నీకు మంచి భవిష్యత్తు వుంటుందని నా నమ్మకం. ఫృట్ తెక్నాలజీలో కొత్త కొత్త పద్దతులు కనిపెట్టడంలో ఆరితేరిపోయిన దేశం ఒకటుంది. మూడు నెలల “రిఫ్రెష్మెంట్”కోర్సు నిమిత్తం నిన్నక్కడికి పంపిస్తున్నాము. ఇండియానుండి వెళ్తున్న అయిదుగురు డెలిగేట్స్‌లో నువ్వొకడివి” అన్నారు ఎం.డి గారు. చిన్నాజీ ఆనంద సంభ్రమాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. “అడవిలో పల్లె” ఎక్కడ? ఆస్ట్రేలియా ఎక్కడ? చిన్నాజీకి విదేశీ ప్రయాణం అలా ఒనగూడింది.
కొత్తదేశం ఎలా వుంది? తిండి తిప్పలేమిటి? ఎదురైన పరిస్థితులేమిటి? స్వదేశానికి వెళ్ళాక… ఎవరైనా అడిగితే చెప్పాలిగదా! విశేష సంఘటనలను గూరించి విలక్షణ సన్నివేశాలను గురించి రాసి పెట్టదలచుకున్నాడు చిన్నాజీ. వెళ్ళినరోజు రాత్రి పడుకోవడానికి ముందుగా ఆ పనికి శ్రీకారం చుట్టాడు.

ఆగష్టు 7: మదరాసు నుంచి బయల్దేరి… మలేషియా…క్వీన్‌లాండ్‌ను చుట్టుకుని… మా విమానం సిడ్నీలో నేలను తాకేసరికి… భళ్ళున తెల్లారింది. రాంత్రంతా సరిగ్గా నిద్ర లేదనే చెప్పాలి. ముందు సీట్ల వరుసలో… నా పక్కన ఆంగ్ల దంపతులెవరో కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే పచ్చి కొబ్బరాకుతో పీకలు తయారుచేసి “పీ, పీ” అంటు ఊదినట్టే వుంది. వెనుకవైపు సీట్లను మలేషియా ముస్లింలు ఆక్రమించారు. వాళ్ళ పలుకుబడిలో అనునాసికాల రొద చెప్పదరం కాదు. ముక్కు మూసిపెడితే, నాలుకపైనుంచి ఒక్కపదమైనా ఊడిపడేట్టు తోచదు. ముందు వరసలో కూర్చున్న ఫిలిప్పైన్స్ బౌద్దులు, ఎన్నో కొన్ని శతాబ్దాల కిందట జన వ్యవహారం నుంచీ మాయమైపోయిన ఓ పాత భాషను, పునరుద్దరణ చేయడం కోసం… సాధన చేస్తున్నట్టున్నారు. వివిధ రకాల పాత్రల్లో గులకరాళ్ళు వేసి గిలకరించినట్టుందని చెప్పుకోవచ్చు. అంతేగానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పుకోవడానికి మనుసొప్పడంలేదు. ఎట్లాగో అర్దరాత్రి తరువాతెప్పుడో నిద్ర పట్టింది. సిడ్నీలో దిగేసరికి కింద భూమి, పైన ఆకాశం, చుట్టూరా దిక్కులూ తప్పితే పరిచితమైనవేవీ కనిపించలేదు. ఏరోడ్రోంలోంచీ నుంచీ బయటపడటం కోసం దూసుకెళ్తున్న జనసందోహంలో కానవచ్చిన జీవనోత్సాహమే నన్ను ముందుకు నెట్టుకుంటూ వెళ్ళింది. ఎగ్జిట్ ద్వారానికింక పదిబారల దూరం వుందనగా ఒక బ్యానర్‌పైన “ముర్రేఫ్రూట్ క్యానింగ్ అండ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, గ్రీన్ వ్యాలీ డౌన్స్” అన్న పేరు కనిపించేదాకా మనసులో దిగులు దిగులుగానే వుండిపోయింది. బ్యానర్ దగ్గర నించి ఇవతలికి వచ్చిన వ్యక్తులిద్దరు “ఆర్ యు ఎన్ ఇండియన్? యువర్ నేమ్ ప్లీజ్?” అని పలకరించారు. ఏం చెప్పాలో తటాలున తోచక “యస్ యస్ ఐయామ్ చిన్నాజీ!” అన్నాను. “ఇంతటితో నీ పని క్లోజ్ ఇక మా పని ప్రారంభం” అన్నట్టుగా వాళ్ళు చెరొక వైపు పట్టుకొని, నన్ను తీసుకెల్లి వ్యానులో పడేశారు. ఇంకా నగరం సరిగ్గా మేలుకోలేదు. భవనాలు, సౌధాలు, ప్రాసాదాలు అని చెప్పుకోదగ్గ జనావాసాల మధ్హ్యనుంచి విశాలమైన రోడ్లగుండా వాహనం పరుగిడుతోంది. శివార్లు దాటేటప్పటికి రెండు గంటలు పట్టింది. ఆ పైన దిక్కుల చివర్లద్వారా వ్యాపించిన గోధుమపొలాల గుండా మూడు గంటల ప్రయాణం. అక్కడి నుంచీ ఘాటు రోడ్డు మొదలు. ఎక్కి దిగేటప్పటికి కొత్తలోకాలలోకి ప్రవేశిస్తున్నట్లుగా పచ్చగా ఒకలోయ కానవచ్చింది. బహుశా “గ్రీన్ వ్యాలీ” అంటే ఇదేనేమొ! దృశ్యాలు కనుల నిండుగా వున్నమాట నిజమేగానీ, నన్ను రిసీవు చేసుకున్న యువకులు “బీర్ క్యాన్” ఒకటి తెరిచి పట్టుకొని, ఆన్‌చేసిన టేప్‌రికార్డరులో – కాళ్ళకు గజ్జలు కట్టుకున్న అస్థిపంజరాలు కొన్ని సల్పుతున్నట్టున్న వికట నాట్యానికి అనుగుణ్యంగా… భూతాలు పాడుతున్నాయి. ఉండివుండి ఉన్మాదులెవరో ముక్తాయింపులు గుప్పిస్తున్నారు. నాయనా, చెవిలో శూలాలు దిగేయడమంటే ఇదేనేమొ! శిక్షణాలయం చేరుకునేసరికి గంట పన్నెండు దాటింది. స్నానం చేసి దుస్తులు మార్చుకుని డైనింగ్ హాల్లోకి వెల్లాను. ప్రపంచమంతటి నుంచీ వచ్చిన అరవైమంది డెలిగేట్లు మాటల్ని తూటాల్లా విసురుతూ, తినుభండారాల్ని ఉండ్రాళ్ళకు మల్లే నోట్లోకి గిరాటు కొడుతున్నారు. భారతదేశపు డెలిగేట్లు నలుగురూ భోజనం కాగానే డైనింగ్ హాల్లోనే నన్ను సంధించేశారు. వరండలోకి తీసుకెళ్ళి పరామర్శించడానికి ప్రయత్నించారు. వాళ్ళల్లో శ్రావణ్ ముఖర్జీ, భలభద్రపాత్రోలకు బెంగాలీ, ఒరియాల్లో తప్పితే ఇంగ్లీషులో నాలాగే అంతంత మాత్రం పరిజ్ఞానం మాత్రం వున్నట్టు గమనించాను. మిగిలిన ఇద్దరూ ఉత్తరప్రదేశ్ నుంచీ వచ్చారు. వీళ్ళకు హిందీ కొట్టిన పిండి.

“ఆప్ కా శుభ్ నాం? ఆప్ కహాసే ఆయే హై? కహా నౌకరీ కరతే హై? ఆప్ కీ తరఫ్ క్యాక్యా ఫల్ మిలతే హై?” అంటూ ప్రశ్నలు రువ్వి చూశారు.చివరకు ఆశాభంగానికి గురైపోయి…పొసగని భార్యకు విడాకులిచ్చేసిన భర్తలకు మల్లే వాళ్ళ గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కొక్కరికి ఒక గది కేటాయించడం నా పాలిట పెద్ద వరమై పోయింది. చివరగా ఓ మాట చెప్పాలి. ఈరోజు జీవితంలో చూచి ఎరుగని ప్రదేశాలు చూశాను. పరమ రమణీయమైన ప్రకృతి విలాసాలను దర్శించాను. నిజానికెంతో ఆనందంగా వుండాల్సింది. కాని ఎందుకో, ఏమిటో ఉత్సాహంగా లేదు. ఏదో పోగొట్టుకున్నట్టుంది. ఏమిటది? ఏమైవుంటుంది?
ఆగష్టు 29: పోయిన వారాంతంలో మమ్మల్ని తోటలకు ప్రసిద్ది చెందిన ముర్రే పరివాహక ప్రదేశాలకు తీసుకెళ్ళారు. ఆఫ్రికా పీచ్, పియర్, యాపిల్, ద్రాక్ష… ఇంకా ఎన్నో రకాలు… గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతుంటే… ఎంత ముద్దొస్తున్నాయో! తోటల మధ్య ఓ హోటల్లో వెన్నతో మిళాయించిన ఫ్రీట్ సలాడ్ పెట్టించారు. “శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ” అన్నారు పోతన గారు. నన్నడిగితే ఆ ఫ్రూట్ సలాడ్‌ను రుచి చూసిన జిహ్వే జిహ్వంటాను. ఎడారులు భగవంతుని ఆగ్రహానికి గుర్తైతే, పండ్ల తోటలు ఆయన అనుగ్రహానికి గుర్తు అనుకున్నాను. బాగానే వుంది. కానీ మనసులో ఏదో వెలితిగానే వుందే! చేజారిపోయిందేదో దొరికి నట్టేలేదే! ఏమిటది? ఏమైవుంటుంది?

సెప్టెంభర్ 15: ముర్రే నదికి ఉపనది “రాడ్లింగ్”. దానిపైన అపురూప దృశ్యమేదో కానవస్తుందన్నారు. రెండువందల కిలోమీటర్ల బస్సు ప్రయాణం. ఎత్తైన కొండపేటు నుంచీ దూకే జలపాతం, “సిల్వర్ ఫాల్స్” అంటారట! ఫాల్స్ మాటకేంగాని దానికొక ఫర్లాంగ్ దూరంలో నదికడ్డంగా ఒక వంతెన నిర్మించారు. ఆ వంతెన పైన నిల్చుంటే ఎదురుగా జలపాతం. పైన ఆకాశం, క్రింద ప్రవాహం, చుట్టూరా నిమ్నోన్నతాలకు ఆచ్చాదనగా పచ్చని ప్రకృతి. ఆ మనోహర దృశ్యాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. కళ్ళు తరించినట్టయింది. తిరిగి వచ్చాక కూచున్నా, పడుకున్నా, కళ్ళు మూసినా, తెరిచినా ఆ దృశ్యమే మనో నేత్రాల్లో తాండవిస్తోంది. అయినా మళ్ళి ఏదో గుబులు. స్వదేశంలో వుండగా అనుభవానికి వచ్చింది కాదు. ఎందుకీ విషాదం? ఎందుకిలా మనసును తొలిచేస్తోంది? ఆలోచించాను, ఆలోచించాను.
స్పురించదే! ఏమిటది? ఏమైవుంటుందది?
అక్టోబర్ 22: ఈరోజు ఆదివారం. రాత్రివేళ. పది గంటలయింది. నా ఆస్ట్రేలియా మకాంలో ఇది మరపురాని రోజనుకోవాలి. దాదాపుగా ఖండానికంతా కేంద్ర స్థానంగా వున్న ఓ టూరింగ్ స్పాట్‌కు మమ్మల్ని విమానంపైన తీసుకెళ్ళారు. స్వదేశానికి వెళ్ళడానికున్న వ్యవధి కొద్దిరోజులే గదా! మేమందరమూ షాపింగ్ సెంటర్లోకి జొరబడ్డాము. మధ్యాహ్న భోజనానంతరం ఓ మ్యూజియం దర్షించాము. ఓ జూ అంతటా కలియ దిరిగాము. గంట నాలుగయ్యింది. అయిదింటికల్లా తిరుగుప్రయాణం కోసం విమానాశ్రయంలో వుండాలి. మృగశాల నుంచీ ఈవలికి వచ్చేసరికి ఓ గుట్టపైన తెల్లటి కట్టడం ఒకటి కనిపించింది. గోపురం, మండపం, ధ్వజస్థంభం, ఏమిటది? గుడి కాదుకదా! మా ఇంగితాన్ని గ్రహించినట్లుగా “ఎస్, దటీజ్ ఎ టెంపుల్! యు మే గో అండ్ సీ యిట్! బట్ యు షుడ్ రిటర్న్ ఇన్ 16 మినిట్స్” అన్నాడు గైడు. వంద మెట్లున్నాయేమొ, గబగబా ఎక్కిపోతున్నాను. స్వదేశీ నేస్తాలు నలుగురితో పాటు మరికొందరు విదేశీ డెలిగేట్లు కూడా నా వెంట వస్తున్నారు. పంచపైన బనీను తొడుక్కుని భుజాలపైనుంచి అంగవస్త్రం వేసుకున్న ఓ కుర్ర స్వామి మంత్రాలు చదువుకుంటు మండపంలో కానవచ్చాడు. గర్భగుడిలో నుంచీ పుష్పమాలాంకృతుడైన “బాలాజీ” దర్షనమిచ్చారు. ఒళ్ళు మైమరిచిపోయి “మీరు తెలుగువాళ్ళా స్వామీ?” అన్నాను. “మీరు ఆంధ్రా నుంచీ వస్తిరా? మాది తిరుపతి, మీవూరు?” అన్నాడు కుర్రస్వామి.

సెప్టెంభర్ 15: ముర్రే నదికి ఉపనది “రాడ్లింగ్”. దానిపైన అపురూప దృశ్యమేదో కానవస్తుందన్నారు. రెండువందల కిలోమీటర్ల బస్సు ప్రయాణం. ఎత్తైన కొండపేటు నుంచీ దూకే జలపాతం, “సిల్వర్ ఫాల్స్” అంటారట! ఫాల్స్ మాటకేంగాని దానికొక ఫర్లాంగ్ దూరంలో నదికడ్డంగా ఒక వంతెన నిర్మించారు. ఆ వంతెన పైన నిల్చుంటే ఎదురుగా జలపాతం. పైన ఆకాశం, క్రింద ప్రవాహం, చుట్టూరా నిమ్నోన్నతాలకు ఆచ్చాదనగా పచ్చని ప్రకృతి. ఆ మనోహర దృశ్యాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. కళ్ళు తరించినట్టయింది. తిరిగి వచ్చాక కూచున్నా, పడుకున్నా, కళ్ళు మూసినా, తెరిచినా ఆ దృశ్యమే మనో నేత్రాల్లో తాండవిస్తోంది. అయినా మళ్ళి ఏదో గుబులు. స్వదేశంలో వుండగా అనుభవానికి వచ్చింది కాదు. ఎందుకీ విషాదం? ఎందుకిలా మనసును తొలిచేస్తోంది? ఆలోచించాను, ఆలోచించాను.
స్పురించదే! ఏమిటది? ఏమైవుంటుందది?
“పాకాల, దామల్ చెరువు, వల్లివేడు..ఆ పేర్లు విన్నారా? ఆ ప్రాంతంలోనే మావూరు. “అడవిలో పల్లె”. చాలా దూర దేశం వచ్చేసినట్టనుకున్నా! ఇక్కడ ఈ గుడి, ఈ దేవుడి కైంకర్యంలో మీరు – ఇదంతా చూశాక మా అడవిలో పల్లెకు, ఆస్ట్రేలియాకు అట్టే దూరం లేదనిపించింది.
తిరుపతిలో మీ ఇల్లెక్కడ స్వామీ?”
“దిగువ తిరుపతిలో… గోవిందరాజ స్వామి గుడిదగ్గర… దక్షిణ మాడవీధి తెలుసునా? అక్కడ్నే మా ఇల్లు. నా పేరు పి.బి.వరదాచారి.”
“పి.బి. అంటే? ప్రతివాది భయంకర, కాదు గదా?”
“అదే మా ఇంటి పేరు. నీకెలా తెలుసు?”
దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళి మెట్లపైన కూర్చున్న తోటి శిక్షణార్థులు “ప్లీజ్, చిన్నాజీ! టైం ఈజ్ ఓవర్! హరీహప్” అని గొడవ చేస్తున్నారు.
నేను పట్టించుకోలేదు. “నాకెలా తెలుసునంటారా స్వామీ! ఇంటరులో మా తెలుగు లెక్చరర్ ప్రతివాద భయంకర భావనాచారి గారు, పి.బి.బి అనేవాళ్ళు. మేం మాత్రం, “పిల్లల్ని భయపెట్టే భల్లూకం” అనుకునే వాళ్ళం. పాపం శమించుగాక! చెంపలేసుకున్నాను. నాకు తెలుగులో నాకు ముక్కలొచ్చాయంటే అదంతా ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష.” “చిన్నాజీ! వుయ్ డోట్ బాదర్ అబవుట్ యూ! గోయింగ్ ఫ్రం దిస్ ప్లేస్! యు మే స్టే హియర్…” అల్టిమేటం జారీ చేసి మిత్రులు కొండ దిగిపోతున్నారు.
“ఆ ప్రతివాది భయంకర భావనాచారి గారు మా పెదనాన్న గారే! నేణాయన తమ్ముని కుమారున్ని.”
“అట్లాగా స్వామీ! మా భావనాచారి మేష్టరుగారు బాగున్నారా? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వారి తమ్ముడి కుమారుడైన మిమ్మల్ని, ఈ దేశంలో చూడగలగడం – ఎంత అదృష్టం?”
“చిన్నాజీ! ఇట్ ఈజ్ ఆల్‌రెడీ లేట్! యు ఆర్ వారండ్ తొ కం హియర్ ఎట్ వన్స్” మెగా ఫోనులోంచీ గైడు గొంతు చించుకుంటున్నాడు.
“స్వామీ! ఓ మంగళ హారతి యిప్పించరూ?”
“అంతకంటేనా, యిదిగో…మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయా, సార్వభౌమాయ మంగళం. పుంస్యాం మోహనరూపాయ, మేఘశ్యామల మూర్తయే.”
“సెలవు స్వామీ! నమస్కారం, వెళ్ళొస్తా! జ్ఞాపకం వుంచుకుంటారుగదూ! నా పేరు చిన్నాజీ. ఊరు ఆడవిలో పల్లె. తిరుపతి దగ్గరే…”
తిరిగొచ్చాక గదిలో కూర్చుని రాస్తున్నాను. గంట పదయింది. మంగళాకారుడైన స్వామి మంగళహారతి వెలుగుల్లో కనిపిస్తూనే వున్నాడు. మెట్లు దిగుతుండగా గుడిలో గంట మ్రోగడం వినిపిస్తూనే వుంది. శరత్కాలపు పండువెన్నెలలు పరవళ్ళు దొక్కినట్లుగా నా మనసంతా ఆనందమే విరిసిపోయింది. ఎందుకో చెప్పనా? చాలా రోజుల తర్వాత నేను.. మధురంగా, మార్దవంగా, మంజులంగా, మోహనంగా నా తల్లి పలుకు విన్నాను…
మీరూ విన్నారు గదండీ! వేణునాదానికి, వీణా గానానికి, కలకంఠి కూజితానికి మించి వీనుల విందైనదేమిటో తెలిసిపోయింది గదా! నమస్కారం!!

******

ఇది ప్రవాసులు కోల్పోయేది. త్నెందరి మద్య నున్నా, తన భాష మాట్లాడిన వారి మద్య పరాయి వాడే! తేనెలొలుకు తెలుగు పలుకు లేక కన్నతల్లి ఒడి లేనివాడే!

–ప్రసాద్

లగే రహో మున్నాభాయ్

తేది:November 1, 2006 వర్గం:వర్తమానం రచన:charasala 1,312 views

క్రితం వారాంతం DVD తెచ్చుకొని లగేరహో మున్నాభాయ్ చూశాను.
అర్థం పర్థం లేని ఎన్నో సినిమాలకన్నా ఇది ఎంతో బాగుంది. ముఖ్యంగా “గాంధిగిరి” ని ఈ తరానికి కొత్త గొంతుకతో నచ్చేలా వినిపించింది. అలానే ఒక మంచి స్పూర్తితో తీసిన స్టాలిన్ కంటె ఇది అనుకున్న పని దివ్యంగా నెరవేర్చింది. ఎక్కడా అతిశయోక్తులు లేవు. చిరంజీవిలా చేతుల్లో రెండు చువ్వలు పట్టుకొని అభిమన్యుడిలా చేసే యుద్దం లేదు. స్టాలిన్ ఇలాంటి అనవసర సన్నివేశాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించి తను పక్కదారి పట్టింది.
దీంట్లో ప్రేమ వున్నా అది శృతి మించకుండా వుంది. ప్రేమకథ అసలు కథలో ఇమిడి పోయింది. గాంధీ అంటే ఎవరో కూడా తెలియని వ్యక్తి ప్రేమకోసమై లైబ్రరీకెళ్ళి బాపూ గురించి తెలుసుకోవడం ఇప్పటి పరిస్థితులకు తగినట్టుగా వుంది.
ఇక సమస్యలకు గాంధీ చూపే మార్గము చాలా అలవోకగా చాలా సహజంగా వుంది. నాకు బాగా నచ్చిన ఒక సన్నివేశము, అతను ప్రొఫెసర్ కాదనే రహస్యాన్ని తన ప్రేమికిరాలికి విలన్ చెప్పేస్తాడే ఎలా అని మదనపడి బాపూను సలహా అడిగినప్పుడు అడిగినప్పుడు, బాపూ అంటాడు “నీవే అసలు నిజాన్ని చ్ప్పేయ్” అని ఎంతో నిమ్మళంగా. అది నాకు తెగ నచ్చేసింది. నిన్ను నమ్మాలంటే, విశ్వాసపాత్రుడివి కావాలంటే కల్లబొల్లి అడ్డదారులు లేవు సత్యము చెప్పడము తప్ప అని కుండ బద్దలు కొట్టకుండా, డంకా భజాయించకుండా నిమ్మళంగా ఎటువంటి భావాలూ ముఖంలో లేకుండా చెప్పడం నాకు బాగా నచ్చింది.
అతనికి గాంధీ కనపడటం అబద్దమే కావచ్చు. కానీ ఆలా ఈ సినిమా ప్రచారం చెయ్యగల్గిన గాంధీ సిద్దాంతము  ఇంకేవీ చెయ్యలేకపోయాయని చెప్పొచ్చు.
–ప్రసాద్