కిం కర్తవ్యం
నక్సలైట్లు ఇప్పుడేం చేస్తున్నారు? ప్రభుత్వ బలం ముందు మోకరిల్లినట్లే అనిపిస్తోంది. మొదట్లో ఇది నాకు బాగానే నచ్చింది. కానీ ఇప్పుడిప్పుడే నాకు ఇంకోలా అర్థమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరిమీద ఇంకొకరికి బలాబలాల సమతుల్యత వుండాలి. కార్యనిర్వాహక, న్యాయ, చట్ట సభల మద్య ఇలాంటి బలాబలాల సమతుల్యత అవసరం. అలానే ఏ ఇతర వ్యవస్థలోనైనా ఇలాంటి సమతులనం దెబ్బతింటే ఏదో ఒక వర్గం అలవిగాని బలమైపోతుంది.
అన్యాయం ప్రబలమైన చోట న్యాయం కోసం పోరాటం వుంటుంది. రోగం వున్నచోటే నిరోధక వ్యవస్థ ఏర్పడుతుంది. పోలీసు అకృత్యాలైతేనేమి, “స్టేట్” చేసే అరాచకమైతేనేమి అదెక్కడుంటుందో దానికి వ్యతిరేకంగా పోరాటం కూడా అక్కడ వుంటుంది.
మన దగ్గర నక్సలైట్లు వున్నారంటే దానర్థం మనదగ్గర భూస్వామ్య దోపిడీ వుందని. నక్సలైట్లు అప్రతిహత రాజ్య అధికారానికి, అహంకారానికి ప్రతిపక్షంలా వ్యవహరించాలి. ఆవిధంగా బలాబలాల సామ్యం ఏర్పడాలి. కానీ నక్సలైట్ల పోరాటం వాళ్ళ సిద్దాంతానికి కాకుండా ఇతరుల సిద్దాంతాన్ని వ్యతిరేకించడానికో లేక పోలీసుల మీద వ్యక్తిగత పోరాటంగానో పరిణమించింది. ఈ దారితప్పిన పోరాటంలో వాళ్ళు ఎవరికోసమని తుపాకులు పట్టారో వాళ్ళ మీదనే అవి ప్రయోగిస్తున్నారు. ఇన్ఫార్మర్లనో ఇంకొకటో ముద్ర వేసి అచ్చం పోలిసుల మాదిరే వాళ్ళూ ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు సిద్దాంతపరంగా పోరాటం చేసినన్నాల్లూ వారికి ప్రజల మద్దతు దొరుకుతుంది గానీ స్వార్థపూరితంగా పోరాటం చేస్తే ప్రజల మద్దతు ఎలా వస్తుంది?
నిజానికి ప్రజల మద్దతు పొందాలంటే వాళ్ళు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికై పోరాటం చేయాలి. ఠాగూర్ లాంటి చిత్రాలే ప్రజలని అంతగా కదిలించగలుగుతూ వుంటే అలాంటి పనిచేసి నక్సలైట్లు మాత్రం ఎందుకు పేరు తెచ్చుకోకూడదూ? ఇన్ఫార్మర్ అని ఒక పేదవాన్ని చంపేబదులో లేక హత్యకు హత్య బదులని ప్రభుత్వం ఒకన్ని చంపితే వీళ్ళు ఇంకొకన్ని చంపేబదులు ఆ “ఆకుల రాజయ్య”నో లేక అవినీతితో కోట్లు కూడబెట్టిన ఇంకో వుద్యోగినో భయపెట్టో, హతమార్చో న్యాయం కోసం ధర్మం కోసం ప్రజల్లో భీతి కల్పించవచ్చు కదా? సినిమాల్లో వీరోచిత కార్యాలు చేసి న్యాయం పక్షాన నిలబడే హీరోనే ముఖ్యమంత్రిని చేయగా లేంది ఇలాంటి పనులు నిజ జీవితంలో చేస్తే అధికారంలోకి రావడం నక్సలైట్లకైనా ఇంకో గ్రూపుకైనా ఎంతసేపు?
నాకెందుకో ఈ నక్సలైట్లు అధికారానికి ఇలాంటి రాచమార్గము వుండగా అరాచకమార్గాన్ని ఎన్నుకున్నారనిపిస్తోంది. వీళ్ళు తలుచుకుంటే కాంట్రాక్టర్లని ఇసుక కట్టడాలు నిర్మించకుండా అడ్డుకోవచ్చు. రాజకీయనాయకులు చేసిన వాగ్దానాలను అమలు చేసేటట్లు నిర్బందించవచ్చు. అధికారులను అవినీతిని చేయకుండా ఆపవచ్చు.
ఇదంతా నా అత్యాశేమొ!
–ప్రసాద్









