అమ్మే చంపేసిందట!

తేది:October 18, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:charasala 1,387 views

ఈనాడులో ఈ వార్త (http://eenadu.net/story.asp?qry1=18reccount=22) చదివి కాసేపు అచేతునున్ని అయ్యాను. ఎన్నో భవిశ్యత్ పరిణామాల్ని వూహించిన బ్రంహ్మంగారు కూడా తల్లి తన పిల్లలని తన సుఖ వాంచలకోసం చంపుకుంటుందని వూహించలేకపోయాడనుకుంటా!
ఎంత దుర్మార్గము! 11 ఏళ్ళ పిల్లను పట్టుకుని బలవంతంగా చంపడానికి అది మనిషా, పిశాచమా! ఆవూరి వాళ్ళు ఇంకా ఆమెను ఎలా బతకనిచ్చారు?

–ప్రసాద్

గన్యా.. డెంగీ

తేది:October 16, 2006 వర్గం:నా ఏడుపు రచన:charasala 2,544 views

ప్రభుత్వం ఏమీ చేయటం లేదని గింజుకోవటమే గానీ మనం ఏమి చేస్తున్నామని ప్రశ్నించుకుంటే జవాబు “గుడ్‌నైట్ కొంటున్నామనో”, “దోమతెరలు వాడుతున్నామనో” సమాధానం వస్తుందనుకుంటా! చుట్టూ మురికి ఏర్పరచుకొని దాన్నుండీ పారిపోవాలని చూస్తామే తప్ప దాన్ని వదిలించుకొనే ప్రయత్నమే మనం చెయ్యం.
మొన్న శనివారం నాడు జెమినిలో “నీ మనసు నాకు తెలుసు” సినిమా అనుకుంటా చూస్తున్నాను. అందులో తరుణ్ తను తాగిన నీళ్ళ బాటిల్, తిన్న తర్వాత చిప్స్ పాకెట్ రైల్లో ప్రయాణిస్తూ అలా కిటికీలోంచి విసిరేస్తాడు. నాకయితే ఒళ్ళంతా జెర్రులు పాకినట్లనిపించింది దాన్ని చూస్తుంటే! ఆ మద్య ఇండియా వచ్చినప్పుడు చూశాను టీ తాగే చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పులు, వాటిని కప్పులు అనడం కంటె ఏవో సీసా మూతలు అనడం మేలు. అంత చిన్నగా వుంటాయి..వాటితో నీళ్ళయితే ఖచ్చితంగా ఒక గుక్క కంటె ఎక్కువ తాగలేం. ఎక్కడ చూసినా అవే. తాగడంతో బాద్యత అయిపోయిందనుకుంటారు అలా దాన్ని గాలికి వదిలేస్తారు.
ఇంకా ఇప్పుడెలా వున్నాయో తెలియదు గానీ 96, 97 లో హైదరాబాద్ లో ఏ చిన్న ఆఫీసు భవనం మెట్లు ఎక్కుతున్నా ప్రతి మెట్ల మూలా ఎర్రటి పాన్ ఊసిన రంగే. దానికి పరిష్కారంగా అన్ని మతాల దేవుళ్ళ బొమ్మలూ మద్యలో అతికించబడి వుంటాయి.
కొద్దిగా చాటుగా వున్న ఏ ప్రహరీగోడ చూసినా మూత్రపు వాసనలు, దాని చారికలు రోడ్డుమీద వరకూ!
చేసుకున్న పాపాలు వూరికే పోతాయా? నేనిదివరకే చెప్పినట్లు ఏ పాప పలితం ఆ జన్మలోనే అనుభవించాలి. ఆ పాప ఫలితమే ఈ గున్యాలూ, డెంగూలూ!
ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూడకుండా కనీసం ఎవ్వరి ఇంటి పరిధిలో వాళ్ళు పరిసరాల్ని శుభ్రంగా వుంచుకున్నా ఇలాంటి విషజ్వరాలు అంతగా రాకపోవును.

–ప్రసాద్

సరదాల సమయం…సేవకే అంకితం…

తేది:October 16, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:charasala 1,310 views

ఈనాడు “ఈతరం” ప్రత్యేక పేజీల నుండి యూనికోడ్ లోకి తర్జుమా చేసి ప్రచురించడమైనది.
మూలం యొక్క లంకె “http://eenadu.net/specialpages/sp-etarammain.asp?qry=sp-etaram1“.)
‘సమాజానికి ఏదైనా చేయాలి’ ఒక్కరికొచ్చిందీ ఆలోచన.. ఏడుగురు మిత్రులు సై అన్నారు.. డెబ్భైమంది చేతులు కలిపారు.. అందరూ వేలకు వేలు సంపాదించుకుంటున్న యువతీయువకులే! మరి సరదాల సమయాన్ని మిగిల్చి వాళ్ళు సాధించేమిటి?
ఇరవైల్లో సరదాలు. అరవై వచ్చాక సమాజం గురించిన ఆలోచనలు. చాలామంది చేసేదిదే! ‘భూమి’ సభ్యులకు మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే వాళ్లంతా యువతీయువకులు. వయసు పాతికకు అటూఇటూగా ఉంటుందంతే! బాగా చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లనుకొంటే జీవితం మూడు పార్టీలు, ఆరు షికార్లే! కానీ వారి ధ్యాస అటు లేదు. అవకాశాల్లేక, ఏ సాయం అందక సమస్యలతో బతుకుతున్న వారికి ఆసరా అవాలనుకున్నారు.
ఆలోచన బాగుంది కానీ ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? వారిలోని తపనే దారి చూపించింది. మెగసెసే అవార్డు గ్రహీత శాంతాసిన్హాను కలిశారు. ఆలోచనకు రూపంగా ‘భూమి’ అనే సంస్థను స్థాపించారు. హైదరాబాద్ నడిబొడ్డునున్న రసూల్‌పురా ఇప్పుడు వారి కార్యక్షేత్రం. తలపెట్టిన ప్రతి పనికీ ప్రణాళిక, ఖర్చు చేసే ప్రతి పైసాకీ లెక్క- ఇదీ వారి సిద్ధాంతం. చిన్న అడుగులతో మొదలైనా, పెద్ద ఆశయంతో సాగుతున్న ఈ నవతరం ప్రతినిధులకు ముందు ముందు ఏం చేయాలో స్పష్టంగానే తెలుసు.

ఆలోచన వచ్చిందిలా…
ఆపన్నులకు అండగా నిలవాలన్న ఆలోచన, అలాగే రసూల్‌పురా ఎంపికా – చిత్రంగా జరిగాయి! ‘భూమి’ అధ్యక్షుడు ముజీబ్ మాట్లాడుతూ ”విద్యా సంస్థల్లో రిజర్వేషన్లపై ఈ మధ్య ప్రదర్శనలు జరగడం తెలిసిందేగా! అప్పుడొచ్చిందీ ఆలోచన. గ్రామాలు, బస్తీల్లోని వారికి చదువుకొనే స్తోమతుండదు. వసతులుండవు. ఆదుకొనే వారూ ఉండరు. ఆ స్థితి నుంచి పైకెదిగి ఉన్నత విద్యకు వచ్చేదెంతమంది? పోటీపడి అవకాశాలు పొందేది ఎంతమంది? వీటికి మేం అనుకొన్న పరిష్కారం ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలని. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని.”

ఇక్కడే చేయొచ్చు కదా!
ఎవరో వచ్చి చేస్తారని ఎదురుచూడటం కన్నా ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని చేతనైన సాయం అందించడమే మంచిదనుకొన్నారు. అంతకుముందు అనాధ శరణాలయాలకు వెళ్లి సాయపడడం వీరికి అలవాటే. కానీ ఇదో పెద్ద ప్రాజెక్టు. అందుకే శాంతాసిన్హాను వెళ్లి కలిశారు. ఓ వెనుకబడ్డ గ్రామాన్ని సూచించమన్నారు. ”ఎక్కడో గ్రామం ఎందుకు? మన రాజధానిలోనే ఎన్నో మురికివాడలున్నాయి. బేగంపేట దగ్గరున్న రసూల్‌పురాలో చదువుకొనే వయసున్న 20వేల మంది పిల్లలున్నారు. స్కూళ్లకు వెళ్లడం లేదు. అక్కడ మీ కార్యక్రమాలు ఆరంభించవచ్చు కదా” అన్నారామె. నిజమే అనుకొన్నారు. ఆలస్యం చేయకుండా ఆచరణకు దిగారు.

60 శాతం గైర్హాజరు…
రసూల్‌పురాకు వచ్చారు. గల్లీగల్లీ తిరిగారు. అడుగడుగునా అపరిశుభ్రత. ఆరోగ్య పరిస్థితులు అంతంతమాత్రం. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చూస్తే నమోదైన పిల్లల సంఖ్య ఏడొందలు. వచ్చే వారు మూడొందలు. అంతా చూశాక విద్య, ఆరోగ్యం, పర్యావరణం, వసతుల కల్పన.. నాలుగు అంశాల్లో కృషి చేయాలని నిర్ణయించుకొన్నారు. ”ఇంటింటికీ తిరిగి పిల్లల్ని స్కూలుకు పంపమని అడగాలనుకొన్నాం. కానీ స్కూలు పరిస్థితి బాలేదు. పిల్లలు బయట కూర్చొని చదవాలి. 700 మంది వస్తే అస్సలు సరిపోదు. అందుకే సదుపాయాలు మెరుగుదలపై దృష్టిపెట్టాం” అన్నారు భూమి సభ్యురాలు, ఎన్‌డీటీవీ రిపోర్టర్‌గా పని చేస్తున్న తేజస్వి. వారికున్న పరిచయాలతో మిత్రుల్ని, సన్నిహితుల్ని సాయమడిగారు. స్కూలు ఆవరణలో మూడు గదులు కట్టారు. తొమ్మిది మంది విద్యా వాలంటీర్లను నియమించి జీతమిస్తున్నారు.

వసతుల కల్పనకూ మేమున్నాం…
అక్కడ చిన్నపిల్లలున్నారు. జ్వరపీడితులున్నారు. వీరి కోసం ప్రతి ఆదివారం ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నారు. స్కూలు చుట్టుపక్కల చెత్త కుప్పలున్నాయి. వాటిని రోజూ తీసి వేసేందుకు రెండు రిక్షాలను, ఇద్దరు కార్మికులను ఏర్పాటు చేస్తున్నారు. ”నీటి వసతి విషయంలోనూ మేం గట్టిగా కృషి చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ గ్రౌండ్ వాటర్ శాంప్లింగ్ చేయించాం. ఇంజనీర్ల సాయంతో భవిష్యత్తులో మంచినీరు వచ్చేలా చూస్తాం” అన్నారు తేజస్వి. స్కూలు ఆవరణను విస్తరించి, ఇంకా తరగతి గదులనూ నిర్మించాలన్న ప్రతిపాదనలున్నాయి.

ఆలోచనలు, ఆచరణ భేష్! ఇబ్బందులేమైనా?
పెద్దగా లేవు. మా కార్యక్రమాలు చూసి చాలామంది మిత్రులు కలిసి వచ్చారు. ప్రస్తుతం మేం 70 మంది. 70 శాతం మంది ఉద్యోగులం. అంకిత భావంతో చేసుకుంటూ పోతాం. మొన్న స్కూలు గదుల నిర్మాణం అప్పుడు మేమే తలో చేయి వేద్దాం అనుకొన్నాం. కానీ సమయానికి ఆర్థిక సహకారం అందింది.

ఆరోగ్య శిబిరాల గురించి?
నేనూ అదే చెప్పాలనుకున్నా. ఒక్కో శిబిరం నిర్వహణకు రెండు వేల ఖర్చు వస్తోంది. చర్మ సంబంధ వ్యాధులు, కంటి సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భవతులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వీరికి నిపుణుల అవసరం ఉంది. డాక్టర్లు ముందుకొచ్చి సేవలందిస్తే, దాతలెవరైనా మందులు సమకూరిస్తే మా పని సులువవుతుంది. ఎక్కువమందికి ప్రయోజనం చేకూరుతుంది.

వీటి కోసం సమయం వెచ్చిస్తుంటే ఇంట్లో ఏమనడం లేదా?
పది నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేస్తున్నాం. ఉదయం మూడుగంటలు, వీకెండ్స్‌లో వీటికోసం సమయం కేటాయిస్తున్నాం. ఆఫీసులో మా పని, పెర్ఫార్మెన్స్ బావుంది. ఇంట్లో వాళ్లు ఇంకేమంటారు? వీకెండ్స్‌లో మామూలుగానైనా, ఫ్రెండ్స్‌తో తిరగడమేగా! ఇక్కడ కలిసి పనిచేసేది కూడా వారితోనే కదా! హ్యాపీ!

సమాజ సేవనీ వ్యాపారం చేస్తున్న ఈ రోజుల్లో…?
ఆగండాగండి… మీ భావం అర్థమైంది. కానీ దీన్ని మేం సమాజ సేవగా భావించట్లేదు. అలాగని ఎవరికీ చెప్పలేదు. మేమేం త్యాగాలు కూడా చెయ్యట్లేదు. ఇది మా బాధ్యత అనుకొన్నాం. మొదలుపెట్టాం. మేం ‘భూమి’ని రిజిస్టర్ చేశాం. కచ్చితమైన జమాఖర్చులు నిర్వహిస్తున్నాం. ఒక్క రూపాయి విరాళం ఇచ్చినా రసీదు ఇస్తాం.

కార్యక్రమాల్ని విస్తరిస్తారా? సభ్యులుగా చేరాలనుకుంటే?
ఏం చేసినా ఇక్కడే చేస్తాం. అనేక చోట్ల మొదలుపెట్టి ఆర్భాటం చెయ్యం. ఐదేళ్లపాటు మా శక్తియుక్తులన్నీ ఇక్కడే పెడతాం. ఫలితాలు రాబడతాం. కలిసి పని చేయాలనుకునే వారికి ఆహ్వానం.

అవునూ… ‘భూమి’ అనే పేరెందుకు?
అదా! మన మట్టి. మన ప్రజలు. వారి కోసం ఏదైనా చేయాలన్న ఫీలింగ్… అందుకే.

–ప్రసాద్

నన్ను విమర్షించే హక్కు నీకు లేదు

తేది:October 13, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:charasala 1,320 views

ఇది రాజకీయుల ఊత పదం. అందరూ ఆ తానులోని ముక్కలే. వాడిననే హక్కు వీడికి లేదు, వీడిననే హక్కు వాడికి లేదు. ఎవడన్నా అననీ అది సత్యమా, అసత్యమా అనేది చూడాలి గానీ, అనే హక్కు నీకు లేకు లేదంటే నీకు లేదు అని దుమ్మెత్తిపోసుకోవడమే!
పోనీ అనే హక్కు పత్రికలకు వుందా అంటే అలానూ లేదు. ఏదైనా అందీ అంటే దాన్ని తగులబెట్టడాలూ, ప్రకటనలు ఇవ్వక పోవడాలూ, తెహల్కా లాంటి చిన్న వాళ్ళైతే ఎదురు కేసులూ. హిందూ ఎడిటర్ కే తప్పలేదు అరెస్టు నుండీ తప్పించుకోవడానికి నానా అగచాట్లు.
సామాన్యులా విమర్షించ లేరు. వాడి పాపానికి వాడే పోతాడు అని ఊరుకునే వాళ్ళే ఈ కర్మభూమిలో ఎక్కువ.
మరి వీళ్ళ పాపాలని ఎవడు ప్రశ్నించాలి? బయట పడుతున్నవి కొన్ని, మరి బయటకు రానివి ఎన్ని?

–ప్రసాద్

లోక్ సత్తా

తేది:October 13, 2006 వర్గం:వర్తమానం రచన:charasala 1,302 views

మంది మార్పును కోరుకుంటున్నారు. ఈ కుంబకోణాల్ని, బందు ప్రీతిని ఏమాత్రం సహించలేకున్నారు. డబ్బుతో ఓట్లు కొనడం, కులాన్ని బట్టి మంత్రి పదవులివ్వడం, జలయజ్ఞం పనుల్లో అవినీతిని చీదరించుకుంటున్నారు.
ఇదంతా నిజమే అయితే ప్రజల్లో నిజంగా మార్పు పట్ల నిబద్దతే వుంటే మరి లోక్‌సత్తా బహిరంగ సభ విజయవంతం కావాలి. చాలా మందికి లోక్‌సత్తా నిబద్దత మీద, జయప్రకాశ్ నిజాయితీ మీద అనుమానం వుంది. ఆయనకీ వుద్దేశ్యం వుండబట్టే ముందునుంచీ పావులు కదిపాడని కొంతమంది శంకిస్తున్నారు. కానీ నమ్మక చెడిపోవడం కంటే నమ్మి చెడిపోవడం మంచిది కదా! అయితే బొమ్మ లేకుంటే బొరుసులా ఇటు కాంగ్రెసునో, అటు తెలుగుదేశంనో ఎప్పుడూ గెలిపించేకంటే వీళ్ళిద్దరికంటే భిన్నంగా మనం కోరుకుంటున్న మార్పును తెస్తానంటున్న జెపి కి ఓ ఐదేళ్ళపాటు అధికారం అప్పగిస్తే మాత్రం మునిగేదేముంటుంది. ప్రయత్నించడంలో ఖచ్చితంగా తప్పు లేదు. ఈయన్నీ ఒకసారి చూస్తే అసలు రంగు (వేరే వుంటే) తెలిసిపోతుంది.
కానీ ప్రజలు ఆ పని చేస్తారా?
నిజాయితీ పరులకోసమే గానీ నా కోసం కాదనుకొనే అత్యధిక సామాన్య ప్రజలకు ఈ నీతి సూత్రాలు రుచిస్తాయా? కండక్టర్ అడక్కుంటే పిలిచి టికెట్ తీసుకునే వాళ్ళెందరు? ఇన్‌విజిలేటర్ లేకుండా పరీక్షలు రాయమంటే కాపీలు కొట్టకుండా పరీక్షలు రాసేదెందరు? అన్నో, తమ్ముడో, బావో, బావమరిదో అధికారంలో వుంటే దాన్ని వాడుకోకుండా పని జరిపించుకొనేదెందరు? పోలీసు లేడంటే స్కూటర్‌పై ముగ్గుర్ని ఎక్కించుకోనిదెందరు?
ప్రతి ఒక్కరిలోనూ అవకాశవాదం, స్వార్థం ఉగ్గపాలతోనే వచ్చేశాయి. జనం ఎక్కువైనప్పుడు పోటీ తప్పదు, పోటీ ఎక్కువైనప్పుడు అవినీతీ తప్పదు. ఇలాంటప్పుడు మన ప్రమేయం లేకుండానే ఒక నీతిమంతమైన ప్రభుత్వం వస్తే బాగుండుననుకుంటాం. జేబులోంచి ఒక చిల్లిగవ్వ ఖర్చు కాకుండానే లోక్‌సత్తా సభ విజయవంత మైతే బాగుండుననుకొనే వాళ్ళే ఎక్కువమంది. మరి తమ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ సభకు వస్తారంటే అనుమానమే.
కులాభిమానాన్నో, మతాభిమానాన్నో అదీ కాకుంటే ప్రాంతియాభిమానాన్నో రెచ్చగొట్టకుండా, వోటుకు డబ్బూ ఇవ్వకుండా, సారా పొయ్యకుండా, వెంట తిరిగే జనాలకి చికెన్ బిర్యానీలు వడ్డించకుండా, ఊరికే నా వెంట తిరుగు, నాకు ఓటెయ్యి, ఖర్చు మాత్రం నీదే అంటే ప్రజలు పిచ్చివాన్ని చూసినట్లు చూడరూ!
జెపి కలల్లో విహరిస్తున్నట్లు వున్నారు. నీతి, నిజాయితీలు మంచి పేరు తెస్తాయేమొగాని ఓట్లు తేవు. మంచి మాటలకు చప్పట్లు కొడతారుగానీ నోట్లు ఖర్చుపెడతారా, ఓట్లు రాలుస్తారా?
అయితే గియితే ఆ సభ హైదరాబాదీలతో నిండాల్సిందే, అంతే గాని ప్రయాణపు ఖర్చులు పెట్టుకొని రాష్ట్రమంతటినుంచీ జనాలు వస్తారనుకుంటే అంతకు మించిన వింత మరోటి వుండదు.

–ప్రసాద్