డబ్బు మీది, పందెం నాది

తేది:September 28, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:charasala 2,163 views

మన ప్రజాస్వామ్యం పదికాలాల పాటు వర్దిల్లు గాక!
“రెండు రూపాయలకు కిలో బియ్యము” అని అన్న అధికారానికి వస్తే పొయ్యేది ఎవరి సొమ్ము అని మనం ఆలోచించామా?
“రైతులు తీసుకున్న ఋణాలు మాఫీ” అని వి.పి.సింగు ప్రకటిస్తే మన సొమ్మేం పొయ్యిందని ఊర్కోలేదా?
“ఉచిత విద్యుత్తు, కరెంటు బకాయిలు చెల్లించకండి” అని రాజశేఖరుడు ఊరిస్తే అతనికి అధికారం పళ్ళెంలో పెట్టి ఇచ్చి వెర్రి మొగాలేసుకొని చూడటం లేదా?
ఇక అన్నిటికీ పరాకాష్ట, “ఇంటింటికీ ఉచిత టివి” అని కరుణానిధి ప్రకతించి అధికారానికి వస్తే ముక్కున వేలేసుకోలేదా?
అయినా ఎలక్షను కమీషను స్వంత డబ్బుతో ప్రలోభ పెట్టొద్దంది గానీ ప్రజల సొమ్ముతో ప్రలోభపెట్టొద్దు అనలేదుగా?
ఇక ఇప్పుడు తన కండబలం చూపించుకోవటం కోసం ఒకడు రాజీనామా అంటే ఇంకొకడు తన నోటి దురద కోసం అన్నాడు. ఈ పరస్పరము దురద గోక్కోవుడేదో చాలా బాగుంది అని నవ్వుకుంటుంటే, చివరికి కెసిఆర్ ఆ దురద ప్రజలకు అంటించాడు. ఆయనదేం పోయింది ఆత్మగౌరవమూ పెరిగింది, బలం పెరిగింది. అయితే గియితే రేపు ఆయనే గెలుస్తాడు, ఇంకా బలం పెరుగుతుంది అప్పుడు మరిన్ని పందేలు మరింత ఉత్సాహంతో కట్టవచ్చు.
ప్రజలు డబ్బు పెడుతున్నంత సేపూ మనం జూదం ఎందుకాడకూడదూ?

నాకూ అనిపిస్తున్నద్ ఇప్పుడు, పదవి సంపాదించడం చాలా సులభం అని.
హైదరాబాదు చుట్టుపక్కల వున్నాళ్ళందరికీ హైదరాబాదులో ఒక ఫ్లాటు ఇస్తామంటే MPని గాలేనా?
ఇంటింటికీ టివి అంటే కరుణానిధిని కాపి కొట్టినట్టు వుంటుందిగానీ ఇంటింటికీ ఓ ఫ్రిజ్జు అంటే నాకు ముఖ్యమంత్రి పదవి రాదా?
తిరుమల దేవస్థానం వారు ఇక మీదట సంవత్సారానికి క్వింటాలు బంగారంతో మంగళసూత్రాలు చేయించి పెళ్ళిల్లు చేస్తారట. అలా మేమూ చేయిస్తామంటే ఆడపిల్లల తల్లిదండ్రులందరూ మనకే ఓట్లు వేయరా?

అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని ప్రజల సొమ్ము ఉపయోగించి అధికారం ఎలా దక్కించుకుంటున్నారో చూడండి!

–ప్రసాద్

రిజర్వేషన్ హక్కు – దేశం తుక్కు తుక్కు

తేది:September 22, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:charasala 5,195 views

తాడేపల్లి సుబ్రమణ్యం గారూ,

అవునండీ రిజర్వేషన్ల మూలంగానే దేశం బ్రష్టుపట్టిపోతోంది. ఈ దేశంలో ముఖ్యమంత్రులూ, ప్రధాన మంత్రులూ, ఇతర మత్రిపదవులన్నీ అగ్రకులాలమని చెప్పుకునే జాతులకి రిజర్వ్ చేయబడ్డాయి. డొనేషన్లు కట్టగలిగి, లంచాలు  మేపగలిగిన బడాబాబులకి పెద్ద పెద్ద కళాశాలల్లో సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. డబ్బున్న వాడికీ, పెద్ద కులమున్న వాడికే ప్రభుత్వపు ప్రతి సేవా రిజర్వ్ చేయబడ్డది. అనాది నుంచి ఆర్యమతమంటూ, మనువు సూత్రమంటూ చెప్పులు కుట్టే వృత్తి మాదిగలకీ, చేతి గోళ్ళు తీసే వృత్తి మంగలోళ్ళకీ, అంటు గుడ్డలు వుతికే వృత్తి చాకలోల్లకీ రిజర్వ్ చేయబడ్డాయి. వంట చేయడం, ఇంటిల్లిపాదినీ సుఖపెట్టడం స్త్రీకి రిజర్వ్ చేయబడింది. ఈ విధంగా దేశ జనాభాలో అధిక శాతం మందిని అణగదొక్కి మేము అగ్రకులమని, పండితులమనీ అతికొద్దిమంది ఈ రాజ్యాన్ని పాడుచేసి, చివరికి పిరికి పందల్లా విదేశీయులకు రాజ్యాన్ని గుత్తగా అప్పగించేశారు! అప్పుడేమయ్యింది వీరి అగ్రకుల అధికత్వం? అప్పుడేమయ్యింది వీరి పోరాటపఠుత్వం? ప్రజల్లో 80 శాతం మందిని ఇలా నిర్వీర్యం చేయకుండా వుండివుంటే (కుల రిజర్వేషన్ల పేరుతో), వాళ్ళను బానిస ప్రవృత్తికి అలవాటు చేయకుండా వుండివున్నట్లయితే మన దేశం అన్నినాళ్ళు పరాయి పాలనలో మగ్గాల్సి వుండేదా?
ఒక్క అగ్రకులాలే మనకు ఒక ఆర్యబట్టుని, ఒక రామానుజాన్ని, ఒక ఠాగూర్ని, ఒక గాంధీని అందించగలిగితే ఇక అన్ని కులాలకీ, సమస్త భారత ప్రజలకీ అలాంటి అవకాశాలే వుండివుంటే మరెంత మంది వేద వ్యాసులు, వాల్మీకులు, ఏకలవ్యులు అందివచ్చేవారు. ఈ కుల వృత్తుల రిజర్వేషన్లే లేకుంటే?

అవును మీరన్నట్లే ఈ రిజర్వేషన్ల మీద వచ్చిన వారిని ఏమనలేం! ఈ నిమ్న కులాల వాళ్ళు తరతరాలుగా “సుబ్బిగా”, “లచ్చిగా”, “ఏమే” అని పిలిపించుకున్నవాళ్ళు, మనము ఎదురు పడితే కాళ్ళ చెప్పులు, భుజం మీది కండువా చేతిలో పట్టుకొని వినయంగా దారి పక్కన నిలుచుని దారిచ్చిన వాళ్ళు, “అయ్యా”, “స్వామీ”, “రెడ్డీ”, “పటేలూ”, “కాల్మొక్కుత”, “నీ బాంచెను దొరా!” అంటూ మన దయాధర్మాల మీద బతికిన వాళ్ళు, వీళ్ళకెంత పొగరు? “ఓ మాదిగోడా” అని పిలిస్తే నా కులం పేరు పెట్టి దూశించాడు అంటాడా? వాడి తాతముత్తాతలు మా తాత ముత్తాతల దగ్గర్నుండీ అలా పిలిపించుకోలేదా? ఇప్పుడెందుకు రావాలి రోషం? అయినా ఈ జూనియర్ కాలేజీలో అధ్యాపక వృత్తులన్నీ ఈ అలగా జనానికి రిజర్వ్ చేయబడ్డాయని నాకు తెలియదే? ఒక వేళ చేయబడ్డా అందులో ప్రిన్సిపాలో, డిపార్ట్‌మెంటు హెడ్డో అగ్ర కులపోడే అవ్వాలే! అలా కాకుండా ఈ చెప్పులు కుట్టుకునే వాళ్ళనీ, జుట్టు కత్తిరించేవాళ్ళనీ తెచ్చి ఇలా ఉపాద్యాయ వృత్తిలో కూర్చోబెడితే ఏం జరుగుతుంది? కాలేజీలు మూసేయడం మినహా! మరి ముఖ్యమంత్రుల పోస్టులన్నీ ఈ అగ్రజాతులకి రిజర్వ్ చేయబడ్డా రాష్టానికి, దేశానికీ ఏమీ దుర్గతి? అద్యాత్మికత, పూజలూ, దర్మ ప్రచారమూ తరతరాలుగా బ్రాహ్మణ కులానికి రిజర్వ్ చేయబడ్డా ఇంకా ఎందుకీ మతమార్పిడులూ, అధర్మ వ్యాప్తి?అనాదినుండీ క్షత్రియ కులానికే రాజ్యాధికారము అప్పజెప్పినా ఎందుకు మనం చెంఘిజ్ ఖాన్ మొదలుకొని పరాయి రాజుల పాలబడి ధన, మాన, ప్రాణాలను పోగొట్టుకున్నాం? వైశ్యులే వ్యాపార దక్షులైతే మరెందుకు మనం నిన్నా మొన్నటి వరకు కనీసం న్యూయార్క్ ఎక్సేంజ్ లో నమోదుకాలేక పోయాం? అన్నిటికీ కిఆరణం మన దేశ దుర్గతికి కారణం రిజర్వేషన్ళే! వీసమెత్తు అనుమానం లేదు.

మాదిగైనా, మాలైనా అర్చక వృత్తిని నిర్వహించనీయండి.

బ్రామ్హణుడైనా, క్షత్రియుడైనా చెప్పులు కుట్టనీవండి.

ఏ వృత్తి ఎవరైనా వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి చేయనీవండి.

అన్ని వృత్తి నైపుణ్యాలనూ అందరికి అందించే విధంగా సమానావకాశాలను కల్పించండి.
ఆమెవరో ఫీజు కట్టలేక డాక్టరు కోర్సు చేయటానికి అర్హత వున్నా చేరలేక పోయిందట!

వాడెవడో ఇంటర్ రెండు సార్లు ఫెయిల్ అయినా డబ్బు పెట్టి సీటు కొని MBBS చేస్తున్నాడట!

అందరి ముందూ అందమైన అమ్మాయిని బీరుపోయలేదని కాల్చి చంపి, డబ్బూ, అధికారం ముసుగేసుకొని చట్టాన్ని తనింటి కాపలాకుక్కలా చూస్తున్నాడట!

తన తాత, తండ్రీ పదవుల్లో వున్నారు గనుక ఆ మంత్రి పదవి తనకే రిజర్వ్ చేయాలంటున్నాడట!
తక్కువ జాతి వాళ్ళు చిన్న చిన్న నేరాలు చేస్తే, పెద్ద జాతి వాళ్ళు పెద్ద నేరాలు చేస్తున్నారు! తక్కువ జాతి వాళ్ళు జేబు కొట్టేస్తే, పెద్ద జాతి వాళ్ళు దేశ ఖజానానే కొట్టేస్తున్నారు.

తక్కువ జాతివాళ్ళు తప్పు చేస్తే శిక్షించడానికి ముందుండే చట్టం, అధికారం, డబ్బూ వున్న వాళ్ళ పెరట్లోకి కూడా వెళ్ళలేక పోతోంది.
ఇన్ని రకాల రిజర్వేషన్లు మన సమాజాన్ని వేల ఏళ్ళ తరబడి పీల్చి పిప్పిచేస్తున్నా ఎందుకండి ఇప్పుడు మాత్రమే రిజర్వేషన్లు తప్పంటూ వీధుల కెక్కుతున్నారు? అగ్రకులపు చేద బావి నీరు పెద్ద కులపోళ్ళకే ఎందుకు రిజర్వ్ అయ్యింది? నిమ్న్ కులాల వాళ్ళు దాని దరిదాపులకైనా ఎందుకు రాలేకున్నారని మీరెప్పుడైనా ప్రశ్నించారా? వీధుల కెక్కి ధర్నాలు చేశారా?

పల్లకీ మోసేవాళ్ళెపుడూ బడుగు జీవులే ఎందుకవ్వాలి, మనం ఎందుక్కాకూడదని ఎప్పుడైనా గొంతు చించుకొని అరిచారా?

వూరి చివర వున్న టీ కొట్టు చూరులో పెట్టిన సత్తు గిన్నె మాదిగ వాళ్ళకే ఎందుకు రిజర్వ్ అయ్యిందని ఎన్నడైనా రాగాలు తీశారా?

వూరుమ్మడి ఆస్తిగా జోగినీ అవతారాలు మాదిగ బిడ్డలకే ఎందుకు రిజర్వ్ అయ్యాయని కాసింత విచారించారా?

రాత్రయితే మాలామాదిగ పూరిగుడిసేలో దూరే వాడు కూడా, మాలామాదిగకు చెంబెత్తి నీళ్ళేందుకు పోస్తాడని మీరెప్పుడయినా నిలదీశారా?

పిల్లీ, కుక్కా తిరిగే ఇంటిలోకి కూడా మాదిగెందుకు వెళ్ళడని మీకనిపించలేదా?

గర్బగుడి పూజారికే ఎందుకు రిజర్వ్ అయ్యిందని మీకెప్పుడు ఆందోళన చెయ్యాలనిపించలేదా?
ఆ పదివేల మందిలో 60 శాతం రిజర్వేషదారులుంటారని లెక్క తేల్చారే, రెకమండేషన్ల మీద, డబ్బులు పెట్టి, కులం పేరు చెప్పి ఉద్యోగం కాజెయ్యాలనే ప్రబుద్దుల్లో ఎంత శాతం మంది వుంటారు రిజర్వేషదారులు? వుద్యోగం రాకుంటే ఇక బతకలేని వాడు, లక్షలు వెచ్చించి అమెరికా పోలేని వాడు, ఇన్‌ఫ్లుయెన్సు చేయగలిగన ఒక్క బందువైనా అధికార హోదాలో లేని వాడూ ఇంకేం చేయగలడు? తనకు దొరికిన దొడ్డిదారి చూచుకోక? వీళ్ళనయితే పట్టుకోవచ్చు మరి తమకున్న పలుకుబడి, డబ్బు, అధికార బలంతో వెయ్యికి పైగా పెట్రోలు బంకులని బందువులకీ, అయిన వాళ్ళకీ దారాదత్తం చేసిన వాళ్ళకి శిక్ష ఏదీ?
కాలిన కడుపుతో నేరం చేసిన వాడి కంటే నిండిన కడుపుతో నేరం చేసిన వాడూ ఎక్కువ నేరస్తుడు కాదా?
“బ్రిటీషువారి కాలం దాకా అద్భుతంగా పనిచేసిన సర్కారీ విద్యాసంస్థలు తర్వాతి కాలంలో ఇలా నీచాతినీచంగా భ్రష్టుపట్టిపోవడానికి వేరే కారణం ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా బోధపడదు- రిజర్వేషన్లు తప్ప. రిజర్వేషను సదరు వర్గాలకి రాజ్యాంగ ప్రసాదితమైన హక్కుట. నిజానికి అవి ఆనాటి రాజ్యాంగ సభా సభ్యులైన అగ్రకులాలవారి దయాధర్మభిక్షం.”

రిజర్వేషన్లు తప్ప మీకెంతకూ ఇంకో కారణం కనపడకపోవడం ఆశ్చర్యం. లంచగొండితనం, అవినీతి, బందు ప్రీతి, దురాశ కాదా? ప్రభుత్వానికి డబ్బు కట్టకుండా గనులు తవ్వుకుంటున్నది ఎవరు రిజర్వేషదారులా? పెన్నా నదిలో ఇసుకను తలిస్తున్నది ఎవరు రిజర్వేషదారులా? ఈ వేసవిలో వేసిన రోడ్లు వచ్చే వర్షాకాలానికి పాడయ్యేది ఎవరివల్ల,  రిజర్వేషదారుల వల్లనా? కారంచేడు ఊచకోత రిజర్వేషదారుల వల్లనేనా?

రాంజ్యాంగ సభలోని కొద్దిమంది అగ్రకులాల ధర్మ బిక్ష

కాదు రిజర్వేషన్లు. అప్పటికే అంబేద్కర్ నాయకత్వాన జరిగిన దళితోద్యమ ఫలాలవి. ఒకవేళ రాజ్యాంగమే వాటిని ఇవ్వకపోయి వుంటే, తరతరాలుగా వేదాల పేరు చెప్పో, మనుస్మృతి పేరు చెప్పో ఇంకా అణగదొక్కి వుంచాలనుకొంటే అది ఇప్పటి ఇన్‌ఫర్‌మేషన్ యుగంలో సాధ్యం కాదు. నిమ్న జాతులొక్కటై అగ్రకులాల అహంకారానికి ఎసరు పెట్టి మరీ తమ హక్కుల్ని సాధించుకొనే వారు. అణగ దొక్కే కొద్దీ పడి వుండి పురాణాలని,  అగ్రకులాల వేదాంతాన్ని నమ్మటానికి ఇది ఇంకా వేద కాలం కాదు సుబ్రమణ్యం గారూ!

–ప్రసాద్

‌సొంత గూటికి చేరుకున్నా!

తేది:September 14, 2006 వర్గం:వర్గీకరింపబడనివి రచన:charasala 3,158 views

Wordpress ను install చేయడం ఎంత సులభం!
దేవుడు Wordpress ను దీవించుగాక.

– ప్రసాద్

కొడుకా, కూతురా!

తేది:September 12, 2006 వర్గం:నా ఏడుపు రచన:charasala 2,788 views

 ఏదో సందర్బంలో యండమూరి అంటాడు ‘ప్రతి సంబందమూ చివరికి ఆర్థిక సంబందమే’నని. ఆది ఏదో కొన్ని సందర్భాల్లొ తప్పు కావచ్చేమొ గానీ చాలా సందర్బాల్లో నిజమే! పిల్లల నుండి రేపేదో ఆశిస్తూ ఈరోజు వారిమీద ఖర్చు చేయడాన్ని పెట్టుబడిలా భావించడం ఫంక్తు వ్యాపారి లక్షణం! కొడుకైతే రేపేదో వుద్దరిస్తాడని, వంశాన్ని నిలుపుతాడనీ, పున్నామ నరకం నుండీ తప్పిస్తాడనీ కొడుకు కావాలనుకోవడం, కూతురి మీదకంటే కొడుకుమీద అధిక ప్రేమ చూపించడం అనాగరికం, అవలక్షణం. నిజం చెప్పాలంటే కొడుకు దగ్గరికంటే కూతురి దగ్గరే అధిక ప్రేమ లభిస్తుంది. అదేదో సామెత కూడా వుంది ..’కొడుకు బందువులైతే వాకిట్లోదాకా..కోడలి బందువులైతే వంటింట్లో దాకా’ అని. కోడలు నడిపే కొడుకు సంసారంలో కంటే కూతురు నడిపే సంసారంలో స్వాతంత్రం ఎక్కువ వుంటుంది. తల్లిదండ్రుల మనసు వీధులు పట్టుకు తిరిగే కొడుకు కంటే ఇంటిపట్టున వుండే కూతురికే ఎక్కువ తెలుస్తుంది. బాధలైనా కొడుకు దగ్గర చెప్పుకోవాలంటే నామోషీ పడే తల్లి కూతురి దగ్గర స్వేక్షగా చెపుతుంది. అన్నెందుకు అన్న దగ్గరకంటే అక్క దగ్గరే చనువూ, స్వాతంత్రమూనూ! ఏ విధంగా చూసినా స్త్రీ (అక్కగా, చెల్లిగా, తల్లిగా, కూతురిగా, బార్యగా) ఇచ్చే శాంతి, సుఖము ఇంకెవరిస్తారు?
మన సుఖసంతోషాల కోణం నుండీ కాకుండా పిల్లల సుఖసంతోషాల కోణం నుండీ చూస్తే కొడుకు మీద కంటే కూతురు మీదే ఎక్కువ శ్రద్ద చూపించాల్సి వుంటుంది. feminists ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడది అబలే. ఒక్క ఇందిరా గాంధీ, మార్గరెట్ థాచర్, బండరు నాయకే లను చూపించి ఆడది అబల కాదు అంటే ఎలా కుదురుతుంది? మగాళ్ళలో బలహీనులున్నట్లే ఆడవాళ్ళలో బలవంతులూ వుంటారు. అందం, సుకుమారం, సౌశీల్యం ఆడవాళ్ళ లక్షణాలు. వీటిని బట్టి చూస్తే కొడుక్కివ్వాల్సిన దానికంటే కూతురికి ఎక్కువ రక్షణ అవసరం. కొడుక్కి నేర్పించాల్సిన విద్య కంటే తన కాళ్ళపై తను నిలబడేలా శిక్షణ కూతురికే అవసరం. కూతురికి ఏ విద్యా నేర్పక మరింత బలహీనురాల్ని చేసి, ఇంకో మగాడికి అంటగట్టి, అతడి చెప్పుకింద రాయిలా అణిగిమణిగి వుండమనడం స్వంత బిడ్డకు తండ్రే చేస్తున్న అపచారం!
తల్లిదండ్రులుగా మనం పెట్టే ఖర్చు మన పిల్లల్ని తమ సొంత కాళ్ళమీద నిలబెట్టేందుకు వుపయోగపడాలిగానీ ముసలిదశలో మనకాళ్ళు నిలవటానికి కాదు.
ఇక వంశం ప్రకారంగా చూసినా కూతురే మన వాంశం నిలిపే గ్యారంటీ వారసురాలు. “తండ్రి నమ్మకం, తల్లి నిజం” అనెక్కడో చదివాను. కాబట్టి మన లక్షణాలను ఖచ్చితంగా తర్వాతి తరానికి మోసుకుపోయేది తల్లిగా కూతురే గానీ కొడుకు కాదు.
ఇక కట్నం విషయానికి వస్తే, కట్నం అనేది ఒక Status symbol అయిపోయింది. కట్నం తక్కువంటే నన్ను తక్కువవాడు గా జమకడతారేమొ అని పెళ్ళికొడుకు అనుకుంటాడు. అంతెందుకు మా అక్కకిచ్చినంత కట్నము నాకెందుకివ్వవని అడిగే కూతుర్లూ తయారయ్యారు. ఎంత ఇచ్చాం అనేది పెళ్ళికూతురు వైపు వాళ్ళకీ ఎంత తీసుకున్నాం అనేది పెళ్ళికొడుకు వైపు వాళ్ళకీ వాళ్ళవాళ్ళ మర్యాద/పరువు విషయమై పోయింది. ఇలా ఎవరిస్తోమతుకు తగ్గట్లు వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే సమస్యలేదు గానీ వచ్చిన చిక్కల్లా కొడుకుని అమూల్యమైన వస్తువుగా భావించి దాని విలువకు సరిపడా కట్నం తేలేదని కోడళ్ళని రాచిరంపాన పెట్టడం అసలు సమస్య! ఇంకా తమ కొడుకు qualifications వున్న ఎదురింటి కుర్రాడు తమకంటే ఎక్కువ కట్నం తీసుకున్నాడని తెలిస్తే తము మోసపోయినట్లుగా భావించి తమ కోడలి వల్లే తమకు అన్యాయం జరిగిందని ఆడిపోసుకోవడం మరో అత్యాశ లక్షణం!
ఎన్నో నేరాలకు అత్యాశ, దురాశ, డబ్బు ప్రధాన కారణాలయినట్లే కట్నానికీ అవే కారణాలు. ఇవి బరితెగించి కొడుకులే కావాలి కూతుర్లు వద్దు అని బ్రూణహత్యలకు పాల్పడటం, అమ్మాయిలని అమ్మేసుకోవటం రాక్షస లక్షణం. రాక్షసులూ ఇలా చేసినట్లు ఏ పురాణంలోనూ కనపడదు. అంబనాధ్ అన్నట్లు ఇదేమాదిరి ఆడపిల్లల నిష్పత్తి తగిపోతే విపరిణామాలు తప్పవు. బహుశా అప్పుడు మళ్ళీ వ్యాపారప్రపంచపు డిమాండ్, సప్లై సూత్రం వర్తించి మళ్ళీ కన్యాశుల్కము విజృంబించి reverse trend మొదలవుతుందేమొ!
–ప్రసాద్

ఎందుకీ బానిసబుద్ది!

తేది:September 11, 2006 వర్గం:వర్తమానం రచన:charasala 2,416 views

మన నరనరాల్లో బానిసబుద్ది జీర్ణించుకుపోయింది. జీ హుజూర్, బాంచెన్ కాల్మొక్త! అనేవి మన రక్తంలోనే వున్నాయి. ఎవడో ఒకడికి మనల్ని మనం అర్పించుకొంటేనే గానీ ముక్తి రాదనే భ్రమలో కూరుకుపోయాం. మనకు వాడూ గొప్ప అని మనం ఎదుటి వాన్ని పొగిడి, ఆరాధించి, కొలిచి సంతృప్తి పడాలని పిస్తుంది. “మా కాలంలో ఆ జమిందారు…ఆయన సోయగం… ఆ రాచటీవి …” ఇలా మన పూర్వపు జమిందారుల వైభవాన్ని, రాజుల గొప్పదనాన్ని నోరార చెప్పుకొంటేగానీ మనకు కడుపు నిండదు.

ఈ విశ్వాసంతో బతకడం చాకలి దగ్గర గాడిదలా, రైతు దగ్గర కుక్కలా అంటే మనకు భారతీయులకు అందునా తెలుగు వాళ్ళకు మహా ప్రీతి.
నాకు కె.విశ్వనాథ్ సినిమాలంటే చాలా ప్రీతి. కానీ శుభసంకల్పం చూడండి. అందులో కమల్‌హాసన్ పాత్ర చూడండి. ఆ విశ్వాసం చూస్తే నాకు ఎగటు పుట్టింది. మీలో చాలా మంది నాతో ఏకీభవించకపోవచ్చు. కానీ నాకెందుకో ఆ అతి వినయం, అతి విశ్వాసం, రాజ భక్తి నాకు నచ్చ లేదు. నాకైతే అది కుక్కలా పడి వుండే విశ్వాసం అంపించింది.

ఇప్పుడు ఈ రాజశేఖరుని చూడండి. ఎంత వల్లమాలిన ప్రేమ వుంటే మాత్రం అవకాశం దొరికితే ఆంద్రప్రదేశ్‌ని ‘ఇందిరాప్రధేశ్’ గానో ‘రాజీవ్‌ప్రధేశ్’ గానో పేరు మార్చేట్లున్నాడు. నిన్ను నీవు గౌరవించుకోలేనప్పుడు వాడెవడో మనల్ని గౌరవిస్తాడనుకోవడం ఒట్టి భ్రమ.
నిన్న జెమినిలో ‘బంగారం మీకోసం’లో ఒక ప్రశ్న. “మేఘమధనం’ ప్రాజెక్టు పేరేమిటి అని. దాని పేరే మేఘమధనం కదా ఇంకా పేరేమిటబ్బా అనుకొని, ఇంకేమయ్యుంటుంది ‘ఇందిరా మేఘమధనమో’ రాజీవ్ మేఘమధనమో’ అనుకున్నాను లోలోపల. అంతే నేననుకున్నదే సరైనది. జవాబు “ఇందిరా మేఘమధనము”.
నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మనకింతకంటే మహామహులు లేరా? ఆయనకున్న రాజభక్తిలో మనమందరం కూడా మునిగితేలాలా? రాజీవ్ విమానాశ్రయం, ఇందిరమ్మ పధకం, రాజీవ్ గడ్డి తినే పధకం, ఇందిరా గోళ్ళు కొరుక్కునే పధకం.. ఇంకేం పేర్లు లేవా? తెలుగు దేశం వాళ్ళు ఎంత నయం, అన్న గారు సంస్కృతాంద్రం లో పేర్లు పెడితే బాబు ‘వెలుగూ, ‘దీపం’, ‘జన్మ భూమి, ఇలా అచ్చ తెలుగు పదాల్లో పధకాల పేర్లు పెట్టాడు.

ఈ కాంగిరేసొల్లకి ప్రజలమీద భక్తి కంటే రాచరికభక్తి ఎక్కువ, సేవలో తరించిపోదామనే ఆర్తి ఎక్కువ! అమ్మా సోనియా నీ పాదధూళి సోకినా మా జన్మ ధన్యం అంటూ సాగిలపడతారు. ఆ మధ్య పంచాయితీ ఎన్నికలయ్యాక సర్పంచులు ముఖ్యమంత్రిని కలిసే సీను చూశాను. చిన్నా పెద్దా అని వయసు తేడా కూడా చూడకుండా కాళ్ళమీద సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేయడం చూసి నివ్వెరపోయా! ఎంత ప్రజాస్వామ్యదేశమైనా యుగాల రాచరిక వాసనలు ఎలా వదుల్తాయి అంత గమ్మున? ఎంత ప్రభుభక్తి! ప్రజలమీద నమ్మకమున్నవాడు అలా సాగిలపడి నమస్కరించాల్సిన అవసరముందా?

ఇక పోనీలే ఎవడి పిచ్చి వాడిది, ఎవడి భక్తి వాడిది అని వొదిలేద్దామంటే పుట్టపర్తి విగ్రహం తీసేసి ఇందిరమ్మ విగ్రహం, వేమన విగ్రహం తీసేసి రాజీవ్ విగ్రహం పెట్టేస్తే ఎలా? రేపు హైదరాబాద్ పేరు కూడా ఇందిరా నగర్ అని పెట్టేస్తే చూస్తూ ఊరుకోవాలా? ఎవడి పిచ్చి వాడితో వుంటే ప్రమాదం లేదు కానీ ఆ పిచ్చితో మనల్ని కరిస్తే మాత్రం ప్రమాదమే!

– ప్రసాద్