ముళ్ళపొదలు
ఇది అంపశయ్య నవీన్ మరో అంపశయ్య. నిజానికి ఇది అంపశయ్యకి పొడిగింపని చెప్పవచ్చు. అంపశయ్యలో వున్న పాత్రలే ఇందులోనూ కనిపిస్తారు. అంపశయ్య ఓ 14 గంటలలో నడిచిన విధ్యార్థి జీవితమైతే ఇది ఐదుగురు నిరుద్యోగుల 14 గంటల జీవితం.
ఇలాంటి అంతర్ముఖంగా మనసు పోయే పరిపరి దారులను పట్టివ్వడంలో నవీన్‌ది అందెవేసిన చెయ్యిలా వుంది. ఈయన మిగతా నవలల్లో కూడా ఈ శైలి కనిపిస్తూ వుంటుంది.
రవి, వేణు, నిధి, రమేష్, సాగర్ అనే అయిదుమంది నిరుద్యోగులు పొద్దున్నే నిద్దుర లేచి తమతమ విభిన్న వ్యాపకాలలో తిరిగి మళ్ళీ రాత్రి కలుసుకొనేదాక ఒక్కొక్కరి జీవితంలో జరిగిన సంఘటనలు, వారి అంతర్మధనం ఈ నవల.
ఒకడు ఒకామెను ప్రేమించడం, ఆమె ప్రేమకు సమ్మతించకపోవడం, లేదా వాళ్ళ ప్రేమకు దుర్మార్గుడైన ఆమె తండ్రి ఒప్పుకోకపోవడం ఇది కథైతే ఇలాంటి కథ ఇందులో లేదు. ఇందులో సాధారణ యువకుల ఒకరోజు జీవితం వుంది. ఆదర్శాలతో రాజీ పడేవాడు ఒకడైతే, ఆదర్శాలకోసం జైలు కెళ్ళినవాడు ఇంకొకడు. సిగరెట్టు ముక్కకై పీకలమీదకు తెచ్చుకున్నవాడు ఒకడైతే, వుద్యోగం వస్తుందనే ఆశతో తప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి సిద్దపడిన వాడు ఇంకొకడు.
ఇవన్నీ ఒక ఎత్తైతే అవినీతి రాజకీయాలు, దుర్మార్గులైన ప్రొఫెసర్లు ఇలా వివిధ రకాల పాత్రలు ఎలాంటి శషబిషలూ లేకుండా దర్షనమిస్తాయిందులో.
–ప్రసాద్