ఇప్పుడు ప్రజా ప్రథినిధులనిపించారు!

తేది:December 12, 2009 వర్గం:వర్తమానం రచన:చరసాల 783 views

మొన్న రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ నేను మన ప్రజాస్వామ్యానికి అర్థం వెతుకుతూనే వున్నాను. మెజారిటీ ప్రజల అభీష్టం, రాజ్యాంగ విలువలు వగైరా అన్నీ కూడా నేతిబీరకాయ లోని నెయ్యి చందమని పూర్తిగా అర్థమయ్యింది. ఇక్కడ నా అయిష్టం రోశయ్య ముఖ్యమంత్రి అవ్వడం మీద కాదు, అయిన విధానం మీద. ఈ తతంగం అంతటిలోనూ ప్రజల విశ్వాసాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పుడెప్పుడో రాజు చనిపోయి, తనకు వారసులెవ్వరూ లేకపోతే ఆస్థాన ఏనుగు ఎవరో ఒకరి మెడలో మాల వేసి రాజును చేసేదట! అది కథేనో లేక నిజమో తెలియదు గానీ, ఇప్పుడు జరిగింది అంతకంటే భిన్నంగా లేదు. కాకపోతే ఇక్కడ ఏనుగుకి బదులు సోనియా గాంధీ ఆ పని చేశారు.

ఈ పరిణామాలు, నాయకుల బహిరంగ వాఖ్యానాలూ ఎలా వున్నాయంటే ప్రజల ప్రాపు కోసం ఎవ్వరూ ప్రాకులాడక్కర లేదు, అధినేత్రి కరణ కురిస్తే చాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకూ వెళుతోందంటే ప్రజాస్వామ్యపు మూలాన్నే కూలగొట్టేవరకు! నిజానికి తన నియోజక వర్గపు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ఆ నియోజక వర్గ ప్రథినిధి మోయాలి. తన పార్టీ మెజారిటీ ప్రథినిధుల అభిప్రాయాన్ని ఆ పార్టీ అనుసరించాలి. కానీ అంతా తల్లకిందులు! చివరికి ఇప్పటి తరం ఈ తల్లకిందుల ఎవ్వారమే అసలైనదిగా భావించేటట్లు ఇది ముదిరిపోయింది.

ప్రజల అవసరాలు ఏ మంత్రికీ పట్టడం లేదు. రోశయ్య మాట మాటకీ తను ప్రజలకు బాద్యత వహిస్తున్నానే మాటే మరచిఫొయి, అమ్మ ఆజ్ఞ ఏదైయితే అది పాటిస్తా అంటూ పదే పదే వల్లె వేయడం ఏమాత్రం రుచికరంగా లేదు. ఇలా తను ఏదంటే అదే నోరెత్తకుండా వినే ఆంధ్ర ఎంపీలంటే ప్రధానికైనా, అమ్మకైనా ఎంతో ప్రేమ! వాళ్ళేం చెప్పినా చెల్లుతుందనే ధీమా జగన్ తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కోవటంతో బాగా పెరిగినట్లుంది. అందువల్లనే కేవలం ఒకటి రెండు రోజుల కంటితుడుపు కసరత్తుతో తెలంగాణాకు అనుకూల ప్రకటన చేసేశారు. మనకు ఎదురేంటి అనే బలుపు కనిపిస్తోంది ఆ ప్రకటన వెనుకాల. కాకపోతే కేసీయార్ నెల ముందునుంచే ధీక్ష గురించి చెప్పినా చెవికెక్కలేదు. దీక్ష మొదలయ్యాకా చీమకుట్టినట్లు లేదు. తీరా అతని ఆరోగ్యం బాగా క్షీణించాక, విధ్యార్థుల ఆగ్రహం పెరిగాక అప్పుడు హడావుడిగా ఇక్కడో గంటా, అక్కడో గంటా చర్చించి ఆనక నిర్ణయం చెప్పడం! ఇందులో ఎక్కడా ప్రజల మాట గురించి పల్లెత్తు మాట లేదు.

హమ్మయ్య, ఇప్పుడు ఎమ్మెల్యేల రాజీనామాలు చూశాక నాకు కాస్తా తృప్తిగా వుంది. నా తృప్తి సమైఖ్యాంద్ర వుద్యమం గురించి, అది బలపడటం గురించి కాదు. కనీసం ఈ ఒక్క విశయంలోనైనా తమ రాజీనామా నిర్ణయం తమ పార్టీ నాయకుణ్ణి బట్టో లేక అధిష్టానాన్ని బట్టో గాక ప్రజల నాడిని బట్టి తీసుకున్నందుకు!

ఇది కాంగ్రెస్ స్వంత వ్యవహారమా?

తేది:September 30, 2009 వర్గం:వర్తమానం రచన:చరసాల 620 views

 ఒక నల్లవాడు అమెరికా అధ్యక్షుడైనా, అకస్మాత్తుగా వైస్సార్ గల్లంతైనా చలించని నేను ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ తంతు చూస్తుంటే మాత్రం స్పందించకుండా అదే నా ఏడుపు ఏడవకుండా వుండలేకున్నాను.

నేను కాంగ్రెసు పక్షపాతినసలే కాదు. అయితే మాత్రం ఈ రాజ్యాంగభంగాన్ని సహించాల్సిందేనా? తెలుగువాడికి జరిగే అవమానాన్ని భరించాల్సిందేనా? ఎవరెన్ని చెప్పినా రాజశేఖర రెడ్డి లేనిదే కేవలం సోనియా బొమ్మ చూసి రాష్ట్ర ఓటర్లు కాంగ్రెసును మళ్ళీ అధికారంలోకి తెచ్చారంటే నేను నమ్మను. తను ఒంటిచేత్తో అటు మూకుమ్మడిగా కట్టగట్టిన మహాకూటమిని ఇటు స్వంత పక్షంలోని అస్మదీయులనీ ఎదుర్కొని విజయం సాధించాడు. అలాగని ఆయన కొడుకు ముఖ్యమంత్రి పదవికి అర్హుడని నేననను. ఇందిరా గాంధీ చనిపోతే రాజీవ్‌కున్న అర్హతే జగన్‌కూ వుంది. అందుకో, ఇందుకో ఎందుకో అధిక శాసనసభ్యుల మద్దతూ వుంది. అది చాలు కదా రాంజ్యాంగ నిభందనలను సంతృప్తి పరచడానికి.

మన ప్రజాస్వామ్యంలో మెజారిటీ భావన నేతిబీరకాయలో నెయ్యి లాంటిదేనని అందరికీ తెలిసిందే. ఇక కాంగ్రెసులోనయితే మరీను. అక్కడ పైవాడి ఒక్క ఓటు ప్రజలందరి ఓటుతో సమానం. మన్మోహన్ సింగ్ ఆ ఒక్క ఓటుతోనే ప్రధాని అయ్యుండవచ్చు. రాజసేఖర రెడ్డీ అలానే అయ్యుండవచ్చు. అయితే కనీసం రాజ్యాంగ బద్దం అనిపించడానికి “మమ” అనే తంతు జరగాలిగా, మనందరికీ అది తంతేనని తెలిసినా! రాష్ట్రపతికి సోనియా మద్దతు లేఖ ఒకటే సరిపోతుందా మన్మోహన్ ప్రధాని కావడానికి? మెజారిటీ MPల మద్దతు వుందని చూపక్కరలేదా? అలానే ఎంత రోశయ్యను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నా, శంఖంలో పోసిందే తీర్థమయినట్లు మెజారిటీ ఎమ్మెల్యేలతో చెప్పిస్తేనేగదా ముఖ్యమంత్రి అయ్యేది.

 ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూస్తే “ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు?” అన్న ప్రశ్నకి “సోనియా గాంధీ” అని విధ్యార్థులు సమాధానం రాసినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే మన కాంగ్రెసోళ్ళు ఉపాద్యాయులైతే అదే సత్యమంటారు.

ఇంతకు ముందు అధిష్టానం నుండి ఓ దూత రహస్య సందేశం తెచ్చేవాడు. ఆ సందేశం ప్రకారం ఇక్కడ ఎమ్మెల్యేలు తమ నాయకున్ని ఎన్నుకునేవారు. ఛ ఛ అంత రహస్యం ఎందుకనుకున్నారో ఏమో గానీ ఇప్పుడదే సంప్రదాయమయిపోయింది. ముంఖ్యమంత్రి చనిపోయి నెలవుతున్నా CLP సమావేశం గానీ దాని వూసు గానీ లేకుండా రోశయ్యే CLP నాయకుడని చెప్పేవాళ్ళకి బుర్రలో గుజ్జు వుందా? లేకుంటే మనమేం చెప్పినా వినే తెగులున్నవాళ్ళే తెలుగువాళ్ళు అన్న నిశ్చయానికి డిల్లీ పెద్దలు వచ్చారా?

ఏదేమయినా ఇది కాంగ్రెసు స్వంత వ్యవహారం కాదు. రాజ్యాంగ సూత్రాలకు అవమానం. పదవిలో వుండి మరణించిన తెలుగు నాయకుడికీ, ప్రజలకూ అవమానం.

వివాహ మహోత్సవ ఆహ్వానం

తేది:August 3, 2008 వర్గం:వర్తమానం రచన:చరసాల 1,810 views

శ్రేయోభిలాషులందరికీ మా తమ్ముడు దిలీప్ పెళ్ళికి బ్లాగ్ముఖ ఆహ్వానపత్రం.

పెళ్ళి పత్రిక

అణు రాజకీయం

తేది:July 11, 2008 వర్గం:వర్తమానం రచన:చరసాల 714 views

ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలనూ అందునా అణు ఒప్పందం పేరుతో నడుస్తున్న రాజకీయాలనూ చూస్తే మరింత ఏవగింపు కలుగుతుంది.

ఒప్పందం చేసుకు తీరాలంటున్న కాంగ్రెసునూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వమంటున్న వామ పక్షాలనూ మినహాయిస్తే, ఇక ఏ ఇతర రాజకీయ పక్షానికీ దేశహితం కాక స్వలాభం కోసం తహతహలాడుతున్నాయి.

అణు ఒప్పందం దేశానికి మంచిదా కాదా అన్న చర్చను పక్కన బెడితే రేపు జరగబోయే పాలక పక్షపు బలపరీక్షలో ఏ పక్షం ఎటు మొగ్గుతుందన్నది పూర్తిగా స్వలాభం బేరీజు మీదే అధారపడబోతున్నదని వింటే మనసునిండా ఆవేదన కలుగుతోంది.

అణు ఒప్పందం భాజపా తదితర ఎన్డీయే పక్షాలకు సమ్మతమే అయినా కాంగ్రెసు ప్రభుత్వ పతనాన్ని చూడాలని వువ్విళ్ళూరుతూ తమాషా చూస్తున్నాయి.

అణు ఒప్పందం చేసుకుంటున్నది తన జన్మ విరోధి అయిన కాంగ్రెసు గనుక తెలుగుదేశం వ్యతిరేకిస్తోంది గానీ (ఇంక రాబోయే ఎన్నికల్లో వామపక్షాల మైత్రిని ఆశించీ) మరో పార్టీ అయిటే దానికి అభ్యంతరం వుండి వుండకపోను.

నిన్న మొన్నటి దాకా కాంగ్రెసు మీద కక్ష గట్టిన సమాజవాదీకి ఇప్పుడు కలాం వుద్భోధ పనిచేసిందో, రాబోయే ఎన్నికల్లో మాయావతి మీద దాడికి కావల్సిన ఆయుధాలు అవసరమయ్యో గానీ అణుఒప్పందానికి అనుకూలంగా మారిపోయింది. అదీ తన స్నేహితులతో మాటమాత్రం చెప్పకుండా. అదే మాయావతి గనుక కాంగ్రెసు పంచన ముందే చేరివుంటే ఇదే ఒప్పందం ఈయనకు ముస్లిములకు వ్యతిరేకంగా కనపడి వుండేది.

ఇక తెరాసను చూస్తే సందట్లో సడేమియాగా తన పని అవుతుందేమో అని కాచుక్కూచున్నది. అణు ఒప్పందానికీ, తెలంగాణాకి అసలు సంభందం లేకపోయినా దానికి లంకె పెట్టి కూర్చున్నది. అయితే తెరాస సమస్యను సానుభూతితో అర్థం చేసుకోవచ్చు.

మాయావతి అయితే ములాయం బొమ్మయితే నేను బొరుసు అంటుంది. అతను ఆ పక్షం గనుక నేను ఈ పక్షం. సొంత తీరు, మార్గం అంటూ ఏమీ లేవు. “నువ్వన్నదానికి వ్యతిరేకంగా అనడమే నా సిద్దాంతం” అన్నది ఈమె సిద్దాంతం.

ఇలా ఏ పార్టీని చూసినా దేశ ప్రయోజనాలు గానీ, అణు ఒప్పందంలో ఏమున్నదని గానీ అవసరం లేదు. వారికి కావలిసింది ఎదుటి పక్షాన్ని ఇరకాటంలో పెట్టడం లేదా స్వలాభం చూసుకోవడం.

దేవుడా (వుంటే) కాపాడు నా దేశాన్ని.
–ప్రసాద్

వూరెళ్ళాక చేయాల్సిన పనులు

తేది:June 8, 2008 వర్గం:వర్తమానం రచన:చరసాల 1,220 views

1. చద్దన్నంలో గడ్డ పెరుగు (గేదె పెరుగు) వేసుకొని, వుల్లిపాయ నంజుకొని తినడం.
2. మధ్యాహ్నం మండుటెండలో చెట్టుకిందో, పందిరి కిందో నులక మంచంపైన కునుకు తీయడం.
3. కానబావిలోనో, గదగుండ్ల బావిలోనో ఈత కొట్టడం.
4. బావిలో అన్నం మెతుకులు వేస్తే అన్నివైపుల నుండీ పరుగెత్తుకు వచ్చే చేప పిల్లల్నీ మా పిల్లలకి చూపించడం.
5. అందరూ ఇళ్ళకెళ్ళాక పెద్ద గుండెక్కి గొంతు చించుకొని పాట పాడటం. (ఇందుకోసం ఏదైనా పాట నేర్చుకోవాలి.)
6. ఆరుబయట వెన్నెల్లో ఈతచాప పరుచుకొని అన్నం తినడం.
7. పచ్చి శెనక్కాయల సమయం కాదు గావున కాల్చిన పచ్చి శెనక్కాయలు తినే యోగం లేదు. వుందేమో కనుక్కోవడం.
8. వర్షాలు పడి దుక్కిళ్ళు చేసే అవకాశం వుంటే మేడి పట్టి కోండ్ర వేయడం.
9. నీళ్ళు తోడే మోటారు పంపుకు మూతి ఆన్చి నీళ్ళు తాగడం.
10. వీలయినన్ని మిగిలి వున్న జ్ఞాపకాలను కెమారాలో పట్టి బందించడం.

–ప్రసాద్