సమాచార హక్కు చట్టము (RTI Act)

తేది:September 21, 2007 వర్గం:సేవ రచన:చరసాల 4,051 views

ఈ పేరు ఇప్పుడు చాలా మంది నోటిలో నాటుతున్న పదం. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటె ప్రజల చేతిలో ఇది బ్రంహ్మాస్త్రం కాగలదని నిపుణులు చెబుతున్నారు.

తలసేమియా (జన్యు పరమైన జబ్బు):Thalassemia

తేది:January 23, 2007 వర్గం:సేవ రచన:చరసాల 8,739 views

దీని గురించి విన్నా గానీ ఎప్పుడూ సీరియస్‌గా ఆలోచించలేదు. MAD( To Make a Difference)లో సభ్యున్నయ్యాక ప్రశాంతి మొదలైనవారు దీన్ని పదేపదే ప్రస్తావిస్తూ వుంటే, ఇదేదో సీరియస్ జబ్బు అనుకున్నా. దీని గురించి అవగాహన ముందు నేను కల్పించుకోవాలని గూగుల్ చేస్తే చాలా విషయాలు తెలిశాయి.
తలసేమియా అనేది అనువంశకంగా వచ్చే రక్త వ్యాధి. ఇది అంటుకోవడం ద్వారానో, ఎంగిలి అవడం ద్వారానో, సంభోగం ద్వారానో సంక్రమించదు.
ఇక వివరాల్లోకి వెళితే దేహంలోని వివిధ భాగాలకి సక్రమంగా ప్రాణ వాయువు అందాలంటే రక్తంలో హెమోగ్లోబిన్ అనే ప్రోటీన్ అవసరం. ఈ హెమోగ్లోబిన్ ప్రోటీను ఊపిరితిత్తుల నుండీ ప్రాణవాయువును గ్రహించి, రక్తంలో ప్రవహించి కాలేయము మొదలగు భాగాలకు కావాల్సిన ప్రాణవాయువును అందిస్తుంది. హెమోగ్లోబిన్ ప్రోటీన్ మళ్ళీ ఆల్ఫా, బీటా అనే రెండు రకాల ప్రోటీన్ భాగాలతో నిర్మితమవుతుంది. అయితే ఈ ఆల్ఫా, బీటా ప్రోటీను భాగాల వుత్పత్తికి కావాల్సిన ప్రోగ్రాం (script) జన్యువుల్లో వుంటుంది. ఒక్కో క్రోమోజోముకి ఒక జత ఆల్ఫా జన్యువులు, ఒక బీటా జన్యువు వుంటాయి. అండ ఫలదీకరణ సమయంలో ఒక క్రోమోజోము తల్లి నుంచీ, ఇంకొకటి తండ్రి నుంచీ వస్తాయి. అంటే ప్రతి ఒక్కరికీ రెండు ఆల్ఫా జన్యువులు, ఒక బీటా జన్యువు తల్లి నుంచీ, రెండు ఆల్ఫా జన్యువులు, ఒక బీటా జన్యువు తండ్రి నుంచీ సంక్రమిస్తాయి. అంటే ప్రతి ఒక్కరిలో నాలుగు ఆల్ఫా జన్యువులు, రెండు బీటా జన్యువులు వుంటాయి. ఆల్ఫా జన్యువులు ఆల్ఫా ప్రోటీను వృద్దికి కారణమైతే, బీటా జన్యువులు బీటా ప్రోటీను వుత్పత్తికి కారణమౌతాయి.
రెండు జతల ఆల్ఫా జన్యువులు, ఒక జత బీటా జన్యువులు అయినప్పటికి ఇవి సరి సమాన మొత్తాలలోనే ఆల్ఫా, బీటా ప్రోటీను విడిభాగాలను తయారు చేస్తాయి.
ఈ జన్యువుల ఆరోగ్యం బాగున్నంత వరకూ ఫరవాలేదు. అయితే మార్పు చెందడమే సృష్టి ధర్మం కనుక ఒకానొక పరివర్తనలో (mutation) ఈ జన్యువులు అనారోగ్యం పాలయి ప్రోటీను వుత్పత్తిని తగ్గించడమో, నిలిపివేయడమో చేస్తాయి. అప్పుడు ప్రాణవాయువును సరఫరా చేయాల్సిన హెమోగ్లోబిన్ వుత్పత్తి సరిగ్గా జరగక ప్రాణానికే ప్రమాదం వస్తుంది.
తలసేమియా రెండు రకాలు. ఆల్ఫా తలసేమియా మరియు బీటా తలసేమియా.
ఆల్ఫా తలసేమియా: ఆల్ఫా జన్యువులు సక్రమంగా పనిచేయక ఆల్ఫా ప్రోటీను వుత్పత్తి జరగక పోతే ఆల్ఫా తలసేమియా అంటారు.
బీటా తలసేమియా: బీటా జన్యువులు సక్రమంగా పనిచేయక బీటా ప్రోటీనుల వుత్పత్తి జరగక పోతే బీటా తలసేమియా అంటారు.
కనీసం రెండు ఆల్ఫా జన్యువులు, ఒక బీటా జన్యువు వున్నా జీవితాన్ని నెట్టుకు రావచ్చు. ప్రాణానికి వచ్చిన అత్యవసర ప్రమాదమేదీ లేదు. పైగా ఆధునిక పద్దతుల్లో పరీక్ష చేస్తే తప్ప ఒకనిలో జన్యులోపముందని కనిపెట్టలేం. అయితే వచ్చే చిక్కల్లా అలాంటి వ్యక్తికి పుట్టే బిడ్డలతోనే!
వుదాహరణకు తండ్రి రెండు ఆల్ఫా జన్యువులు లేని/పనిచేయని క్రోమోజోము, తల్లి రెండు ఆల్ఫా జన్యువులు లేని/పనిచేయని క్రోమోజోము కలిశాయి అనుకోండి. అప్పుడు వాళ్ళకు పుట్టిన బిడ్డకు వుండాల్సిన నాలుగు ఆల్ఫా జన్యువులు మిస్సవుతాయి. అలాంటి బిడ్డ పుట్టిన వెంటనే మరణించడమో, బతికినా జీవితాంతమూ రక్తమార్పిడి చేయాల్సి రావడమో జరుగుతుంది. అంటే ఈ వుదాహరణలో తండ్రికీ, తల్లికీ ఏ బాధా లేకపోయినా వారిద్దరూ బిడ్డలకు తలసేమియా రావడానికి వాహకులు/కారకులు అయ్యారు.

Thalassemia
అలాగే సరిగ్గా పని చేయని బీటా జన్యువు వున్న రెండు క్రోమోజోములు కలిస్తే బీటా తలసేమియాతో బిడ్డ పుడతాడు.
(కడుపులోనే పిండము ఎందుకు చనిపోదు అంటే పిండము గాలి పీల్చదు గనుక ఊపిరితిత్తుల నుండి ఆక్సిజను తీసుకెళ్ళాల్సిన అవసరము లేదు. తల్లి ప్రేవు నుండి ఆక్సిజను సరఫరా చేయడానికి గామా జన్యువు గామా ప్రోటీను వుత్పత్తి చేస్తుంది.)
దీని ప్రకారము మనము తెలుసుకోవలిసింది ఏమిటి అంటే పెళ్ళికి ముందే, లేదా కనీసం పిల్లల కనటానికి ముందే తలసేమియా వాహకాలుగా వున్నామేమొ పరీక్ష చేయించు కోవాలి. ఒకవేళ వున్నట్లయితే కనీసం మన భాగస్వామి వాహకుడు/వాహకురాలు కాకుండా వుండేలా జాగ్రత్త పడాలి.
ంఆడ్ ఈ విషయమై అవిరళ కృషి చేస్తూ వుంది. ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడానికి క్యాంపులు, సెమినార్‌లు నిర్వహిస్తూ వుంది.
మీరు కూడా దీనిని నిర్లక్షము చేయకండి. పిల్లలు కనే యోచన వున్నట్లయితే రక్త కణాల శాతము మరీ తక్కువగా వుందేమొ చూడండి. అందుకు అచేతనంగా వున్న తలసేమియా కారణమేమొ పరీక్షించుకోండి.
దీనికి చికిత్స మరియు మరిన్ని వివరాలు కావాలంటే డాక్టర్ ఇస్మాయిల్ గారి బ్లాగు సందర్శించాల్సిందే!
–ప్రసాద్

To Make a Difference (MAD) ఏం చేస్తోంది?

తేది:January 16, 2007 వర్గం:సేవ రచన:charasala 3,311 views

గత సంవత్సరంలో తెలుగు బ్లాగుల పరిచయం ఓ వరమయితే, MAD పరిచయం, అందులో పాల్పంచుకునే భాగ్యం కలగడం మరో వరం.
అది మన వల్ల కాదు అనో, అది చేయాల్సింది మనం కాదు అనో, వ్యవస్థే అలా వుందనో నిట్టూరుస్తూ కూర్చోవడమో చేయకుండా, “నేనూ ఓ సమిధనవుతాను..” అంటూ ప్రతి ఒక్కరూ చేయివేస్తే అది తప్పకుండా Make a Differece.
కొత్త సంవత్సరం ఏ పార్టీ ఎలా చేయాలి? ఎవరెవరిని పిలవాలి? ఏఏ వంటలు తినాలి? ఏ సినిమాకు వెళ్ళాలి అనే ప్రశ్నలు వేసుకోకుండా MAD సభ్యులు చలికి రోడ్లపక్కన కప్పుకోవడానికి కూడాలేకుండా వున్న నిరుపేదలకు ఏమి చేయగలం అని ఆలోచించారు. కొత్త సంవత్సరపు తొలిరోజుని పొద్దు పొడవక ముందే దుప్పట్ల పంపిణీతో ప్రారంబించారు.

కొన్ని దుప్పట్ల పంపిణీ ఫోటోలు

అసలైన హీరో
అసలైన హీరో
అసలైన హీరో
అసలైన హీరో
మరిన్ని ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

మొదటి విడతలో వచ్చిన అనూహ్య స్పందనకు, బాధితుల అగచాట్లకు స్పందించి మరో విడత పంపిణీకి సిద్దమవుతున్నారు.
కడపలో ఒక సామాన్యుడి మూడునెలల బాబుకి అసామాన్యమైన జబ్బు వచ్చిందని ఈనాడు ద్వారా తెలుసుకొని, ఆ ఇంటిలో బాదను తనింటిలో బాదగా చూసుకొని మీకు మేమున్నాం అంటూ ముందుకురికారు. బాబు తల్లిదండ్రులను బెంగళూరులో రిసీవ్ చేసుకొనే దగ్గర నుండీ, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ తో మాట్ళాడే వరకూ, బాబు తల్లిదండ్రులకు వసతి కల్పించే దగ్గరినుండీ, వివిధ స్వచ్చంద సంస్థలతో మాట్లాడి కావలిసిన ఆర్థిక వనరులు సమకూర్చడం దగ్గర వరకూ ఒక్కొక్క సభ్యుడూ/సభ్యురాలు అవిరామర కృషి చేశారు.
ప్రస్తుతం ఆ మూడునెలల బాబు శస్త్ర చికిత్స అనంతరం ICUలో కోలుకుంటున్నాడు. 

సామాన్యుల ఇళ్ళల్లో MAD పూయిస్తున్న ఈ పూలు మరింతమందికి ఉత్ప్రేరకము అవ్వాలని, MADకు మరింత మందిని ఆదుకొనే శక్తి కలగాలని కోరుకుంటూ..

(మీకూ ఆసక్తిగా వుందా? అయితే ఆలస్యమెందుకు? MADలో చేరండి.)

Subscribe to tomakeadifference

–ప్రసాద్

To Make a Difference

తేది:October 5, 2006 వర్గం:సేవ రచన:charasala 3,128 views

 

 

Click here to join tomakeadifference
Click to join tomakeadifference
వ్యవస్థను తిడుతూ కూర్చొనే వాళ్ళు ఎంతోమంది, దాన్ని మారుద్దామని ప్రయత్నించే వాళ్ళు కొద్దిమంది. ఉప్పలపాటి ప్రశాంతి వాళ్ళలో ఒకరు. నా మట్టుకు నేను కూడా రోజూ చింతించేవాన్నే, వ్యవస్థను నిందించేవాన్నే. ఈనాడులో వచ్చే “ఈ చిన్నారి గుండెను ఆగనివ్వకండి”, “ఈ సరస్వతీ పుత్రికకు సాయం చెయ్యండి” లాంటివి చదివి కంటనీరు పెట్టుకొని పదో, పరకో డబ్బు పంపి అంతటిదో నా పని అయిపోయింది అని తృప్తి పడేవాన్నే.   

కానీ ఈ అమ్మాయిని చూసి సిగ్గుపడాలి. ఈమె To Make a Difference యాహూ గ్రూప్ తో అవసరంలో వున్నవారిని ఆదుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికి ఈ గుంపులో 104 మంది సభ్యులున్నారు. ఒక్కొక్కరు తమకు తోచినంత, చేతనయినంత సహాయము చేస్తున్నారు. గుండె ఆపరేషన్లకు, పిల్లల చదువులకు సహాయ పడుతున్నారు. తను చేయడమే గాక మరికొందరిని పురిగొల్పడం అంటే మాటలు కాదు కదా!

సహాయం చేయాలని చాలామందికి వుంటుంది. కానీ కొందరికి దారి తెలియదు, ఎవరిని నమ్మాలో  తెలియదు. చెక్కు రాసి చిరునామా కనుక్కొని పొస్టు చేయాలంటే కొందరికి బద్దకము.
ఇంకొంతమంది అంతా మోసమని, అవసరమయిన వాడికి అందించక మద్యలో దళారులు తినేస్తారని సాకులు చెప్తారు. పోనీ ఆ అందించే బాద్యతను తీసుకుంటారా, అదీ లేదు. ఇది పలాయనవాదం. మన చుట్టూ వున్న వ్యవస్థను మనమే మార్చాలి దానికి మనమే కారణం. మనం చేసే దానంలో అవినీతికీ, మోసానికి బలయినా కొంత మొత్తమయినా అందవల్సిన వాళ్ళకు అందదా?
ఆ మద్యన మా మిత్రుడొకాయనకు ఇలా స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సహాయం గురించి చెప్పితే, “అదంతా మోసమండీ, మద్యలో వాళ్ళే అంతా తినేస్తారు” అని తేల్చి పారేశారు. పోనీ మీకు తెలిసిన మిత్రుల ద్వారానో, బందువుల ద్వారానే చెయ్యొచ్చు కదా అంటే “ఎందుకండీ మనమే ఇండియా వెళ్ళినప్పుడు పాత చొక్కాలు, పాంటులు ఇస్తే సరిపోతుంది” అన్నాడు. దానం అనేది మనకు పనికిరాని వస్తువును ఇవ్వడం కాదు, వాడికి పనికి వచ్చేది ఇవ్వడం. ఇది ఒక option కాకూడదు, ఒక ద్యేయం కావాలి. ఇంకా ఆయనే అన్నాడు “మేము న్యూజెర్సీలో కట్టిన టెంపుల్ కి బాగానే సహాయం చేశాము, అది రేపు మన పిల్లలకి వుపయోగపడుతుందని”. మనం కూడబెట్టేదీ పిల్లల కోసమే, దానమిచ్చేదీ పిల్లల కోసమేనా? ప్రతిదీ స్వార్థంతో ఆలోచించడమేనా? దేవుడికి కొట్టే కొబ్బరికాయ నుంచీ ఏదో రావాలి, పిల్లల పెంపకము నుండీ ఏదో రావాలి, దానం నుండీ కూడా ఏదో రావాలి.

పేపర్ నిండా తిరుమల గుడిలో పాము కనబడింది ఈ విషయాన్ని 100 పేపర్లు రాసి పంచితే లాటరీ తగిలింది అని రాస్తే వెంటానే ఏ పుట్టలో ఏ పాముందో అని చేసేస్తాం. అదే ముగ్గురికి సహాయం చేయి అంటే నాకంత సమయమెక్కడిదీ అంటాం.

మనసుండాలే గానీ మార్గముండకపోతుందా? ఎన్నో స్వంత పనులకు దొరికిన సమయం దురదృష్టవంతులకు, అభాగ్యులకు, విధి వంచితులకూ కేటాయించలేమా? మానవత్వపు పరిమళాన్ని పంచలేమా?

కాస్తా మీ సమయాన్ని సేవకై వుపయోగించండి, మీరు కూడా మార్పుకై వుద్యమించండి. మీరూ To Make a  Difference లో సభ్యులై మార్పును తెండి.

Subscribe to tomakeadifference

–ప్రసాద్

స్టాలిన్

తేది:October 5, 2006 వర్గం:సేవ రచన:charasala 3,141 views

మొత్తానికి మా పిల్లలతో ఆడుకొనే గొప్ప క్షణాల్ని త్యాగం చేసి స్టాలిన్ చూశాను. నేను ఏ నటుడికీ అభిమానిని కాను. నాకు నచ్చిన సినిమాలో ఏ హీరో వున్నా నాకనవసరము. ఈ pay it forward పద్దతి గురించి ఈ సినిమా అనేసరికి నాకు తెలిసిన వాళ్ళు అది ఎంత చెత్తగా వుందని చెప్పినా వినకుండా వెళ్ళాను. సినిమాకు వెళ్ళడానికి నాకున్న కారణాలు రెండు.

 • అంత మంచి concept ని ఎలా మలిచాడో చూడాలనే తహ తహ
 • అంత మంచి concept తో వున్న సినిమా గనుక అలాంటి సినిమాలను ప్రోత్సహించాలనే దీక్ష.
 • మొత్తం సినిమా చూశాక క్లాస్‌ని మాస్‌ని తృప్తిపరచబోయి దేనికి కాకుండా అయ్యిందనిపించింది. అసలు ఈ pay it forward ని ముందుకు తీసుకుపోదలిస్తే త్రిష ఈ సినిమాకి అవసరమా అనిపించింది. అసలు ఎందుకూ పనికిరాని కారక్టర్ త్రిషదేనేమొ!
  చెప్పాల్సిన మాటను మూడుముక్కల్లో చెప్పేసి మిగతా అంతా పాటలు, ఫైటులు అన్నట్టు అనిపించింది.
  ఒక్క చేతులు లేని అమ్మాయి వృత్తాంతము తప్పితే మనసుల్ని మెలేయటానికి ఇంకెన్ని వుదాహరణలు చెప్పించకూడదు అనిపించింది. చెప్పగలిగింది చెప్పినా ప్రతిభావంతంగా, మనసుకు హత్తుకునే విధంగా చెప్పలేదనిపించింది.
  ఏదైతే ఏం ఒక మంచి పాఠాన్ని ప్రజలకు అందించడానికి ప్రయత్నమయితే జరిగింది కదా. అందుకు సినిమా నిర్మాతలకూ, దర్శకులకూ, చిరంజీవికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
  ఈ సినిమా ద్వారా పదిమంది వుత్తేజితులై ముప్పై మందికి సహాయం చేసినా “it makes a difference” కదా!  

  –ప్రసాద్