మొసలి కన్నీరు

తేది:August 1, 2008 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 1,463 views

మనది కర్మ భూమి. “ఇది మన కర్మ, ఎవరిని నిందించి ఏమి ప్రయోజనం?”, “ఎప్పుడో చేసుకున్న పాప ఫలం ఇప్పుడు ఇలా అనుభవించాడు(రు).” ఇలా అనుకునే జనాలు, ఇలాంటి తలాతోకా లేని వాజమ్మ సిద్దాంతాలూ నమ్మే వారూ, వాటిని పకడ్బందీగా ప్రచారం చేసే ఉద్దండ పండితులూ వున్నంత కాలం, కాకతీయ ఎక్స్‌ప్రెస్ కాలుతుంది, గౌతమి మండుతుంది, బెంగుళూరు పేలుతుంది, అహ్మదాబాదు హాహాకారాలు చేస్తుంది.

ఎన్ని జరిగినా మనకు కానీ మన నాయకులక్కానీ చీమకుట్టినట్లుండదు. ఇవన్నీ కంటి తుడుపు మాటలు. నోట్లోంచీ వూడిపడేవే, గుండెలోతుల్లోంచీ వచ్చేవి కావు. తన ప్రాణం తప్ప ఏ ఇతర ప్రాణమూ మనకు తీపి కాదు. ఏ అమ్మకూ తన బిడ్డల ప్రాణం తప్ప మరే బిడ్డ ప్రాణమూ ముఖ్యం కాదు. అదేమంటే ఇలా ప్రమాదం జరిగీ జరగ్గానే అలా “చింతిస్తారు” లేదా “ప్రాణాలకు వెల కడతారు.” ఎంత సిగ్గులేని బ్రతుకులు!

బస్సులూ, రైల్లూ ఈ రోజే కొత్తగా పుట్టలేదు. వాటిల్లో క్షేమంగా ప్రయాణించడమెలాగో ఈరోజు మనమే ఓ కమిటీ వేసి తేల్చాల్సిన పని లేదు. ఈ పాట్లు అన్నీ పడి, అనుభవంతో సమస్య పరిష్కారాలు కనుక్కున్న వారిని చూసి మనం నేర్చుకుంటే చాలు. అది చూసి వస్తాం, ఇది చూసి వస్తాం అంటూ పెద్ద దేశాలకు ప్రయాణాలు కట్టే ఈ వంచకులు నిజంగా ఏమైనా చూసి నేర్చుకుంటారో లేక యాత్రా విహారాలు చేస్తారో గానీ… రైలు బోగీ నిర్మాణం ఎలా వుండాలో వీరికి తెలియదనుకోవాలా?

ఉదాహరణకు ఇక్కడి మార్క్ రైలులో వున్న సదుపాయాలు చూద్దాం. ప్రతి బోగీలోనూ ఆ చివరా ఈ చివరా ఓ గొడ్డలి, ఱంపమూ కనిపించేలా ఓ గ్లాస్ డోర్ వెనుకాల వుంటాయి. మామూలుగా ఆ తలుపుకు తాళం వేసి వుంటుంది. అయితే ఆ అద్దం మీద “అత్యవసర సమయాలలో పగుల గొట్టండి.” అని వ్రాసి వుంటుంది. అలాగే ఆ చివరా, ఈ చివరా మంటల నార్పడానికి వుపయోగించే అగ్ని నిరోధక సాధనం వుంటుంది. దానిని క్రితం సారి ఎప్పుడు తనిఖీ చేశారో, మళ్ళీ తనిఖీ ఎప్పటిలోగా చేయాలో వ్రాసి వుంటుంది. ఇక అన్నిటినీ మించి ఇంచుమించు ప్రతి కిటికీ అత్యవసర సమయాలలో నిష్క్రమణ ద్వారంగా పనిచేసేలా రూపొందిస్తారు. అత్యవసర సమయాలలో ఆ కిటికీని ఎలా తెరవాలో స్పష్టంగా ప్రతి చోటా అక్షరాలలోనూ, బ్రెయిలీలోనూ వ్రాసి బొమ్మలతో సూచిస్తారు. భోగీ లోపల ఏ కిటికీ నిష్క్రమణ ద్వారంగా మార గలదో భోగీ వెలుపల కూడా సూచిస్తారు. (బహుశా బయటి వారు సహాయ పడలనుకునే సందర్భాలలో వుపయోగ పడుతుందనేమొ!)

వీటిల్లో ఏ ఒక్కటైనా గౌతమిలో వుండి వుంటే ఈ ప్రమాదంలో ఇంత మంది చనిపోయేవారా? ఖచ్చితంగా కాదు. మన అధికారులకు, నాయకులకు ఇలా ఒకన్ని చూసి నేర్చుకునే అలవాటు లేదు. తమకుగా తెలుసుకోరు.

ఇక ప్రజలా దున్నపోతులు. “మన కర్మ” అనే దళసరి చర్మం కప్పుకున్న స్పందన రహితులు. ఈ “కర్మ సిద్దాంతమే” మనకు బలం, బలహీనతా.

రోజూ ఇక్కడ లిప్ట్ ఎక్కినప్పుడల్లా హైదరాబాదులో ఎక్కిన లిప్టులు గుర్తుకు వచ్చి మనస్సు చివుక్కు మంటుంది. ఇక్కడి లిప్టులకు ఆటోమాటిక్‌గా మూసుకునే దళసరి ద్వారం వుంటే, అక్కడి వాటికి చాలా మట్టుకు “గ్రిల్” వుంటుంది. గ్రిల్ మూశాక చిన్న పిల్లలు పొరపాటున ఆ గ్రిల్‌లో చేతులు పెడితే ఏమవుతుంది? ఇలాంటి చిన్న ప్రమాదాలనీ నివారించలేని అశక్తులమా మనం? పోనీ అక్కడి లిప్టులు తయారుచేసే కంపెనీలకు ఈ విషయం తెలియదనుకోవాలా? కానే కాదు. అవి చేసే వారే ఇక్కడా చేస్తున్నారు.

అలాగే మా వూరిలో మా యింటితో సహా గమనించిందేమంటే, డాబా మీద పిట్ట గోడకు (రక్షణ గోడ) అమర్చిన గ్రిల్. ఇక్కడెక్కడా నిలువు వూచలే తప్ప అడ్డు వూచలున్న గ్రిల్ చూడలేదు. కానీ అక్కడ మా యింటితో సహా అడ్డమూ, నిలువూ వూచలున్నాయి. అడ్డంగా నిచ్చెనలా వుంటే పిల్లలకు ఎంత సులభం వాటిని ఎక్కి ఆడుకోవడం? అలా పైపైకి వెళ్ళి కిందికి చూసేటప్పుడు పొరబాటు జరిగితే ఎంత ప్రమాదం?

వుహు. మన దళసరి చర్మానికి ప్రమాదం జరిగాక ఏడవడమే గానీ ముందుగా అది జరగ్గుండా ఏమి చేయాలన్న ఆలోచనే రాదు. పోనీ పక్కవాన్ని చూసి నేర్చుకుంటామా అంటే అదీ లేదు.

మనం కర్మను నమ్ముకున్నన్నాళ్ళూ మన కర్మ ఇంతే!

–ప్రసాద్

మా వూరి సంగతులు – ఎవరికి పిచ్చి?

తేది:July 15, 2008 వర్గం:అనుభవాలు, నా ఏడుపు రచన:చరసాల 1,277 views

పిచ్చిఆ అమ్మాయి నా కంటే నాలుగైదేళ్ళు చిన్నదేమొ. పేరు మల్లినో, నాగమల్లినో సరిగ్గా నాకు తెలియదు. ప్రస్తుతానికి మల్లి అంటాను. వరసకి అత్త కూతురవుతుంది. ఆమెకు ఓ అక్క, ఓ సోమరిపోతు అన్న వున్నారు. అప్పుడే ఆ అన్న వూర్లో వుండక పట్టణాలు పట్టుకు తిరిగేవాడు. ఇప్పుడూ అంతే. అక్కకు పెళ్ళై మరో వూరెళ్ళిపోయింది. చిన్నప్పుడు ఈమె సిగ్గరి, అక్కలా ఎదుటపడి మాట్లాడేది కాదు. వీళ్ళమ్మకు మేమంటే చాలా అభిమానం. నేనెప్పుడు వూరొచ్చినా నన్ను చూడటానికి తప్పక ఇంటికి వచ్చేది అవసానదశలో మంచం మీద వున్నప్పుడు తప్ప.

మల్లికి పెళ్ళయింది కానీ కొన్ని రోజులకే ఏ కారణం వల్లనో భర్త వదిలేశాడు. వూరికయితే వచ్చింది గానీ, అమ్మ లేదు, నాన్న లేడు. అక్కదీ, అన్నదీ ఎవరి దారి వారిది. వూరిలో ఆ పనీ ఈ పనీ చేసుకొని పొట్ట నింపుకొని, ఏ చూరుకిందో, అరుగు మిదో పడుకొని కాలం వెళ్ళదీస్తుండేది. సరైన తిండిలేక నీరసించిన మల్లికి ఎయిడ్స్ వుందేమోనన్న అనుమానం ఎవరికో వచ్చింది. ఇంకేం ఎవరూ గడప దొక్కనీయలేదు. బక్క ప్రాణం మరింత బక్కదయింది. ఈమె దుస్థితి చూసి చలించిన మా తమ్ముడు దిలీప్ ఆమెను కడపకు తీసుకెళ్ళి వైద్యులకు చూపించి, రక్త హీనతకు మందులిప్పించి, తన స్నేహితులతో రక్తం ఇప్పించి ఆమెను మళ్ళీ మమూలు స్థితికి తెచ్చాడు. ఆ పరీక్షల్లో ఆమెకు ఎయిడ్సూ లేదు ఏ రోగమూ లేదు పోషకాహార లోపం తప్ప అని తేలింది.

బహుశా అప్పటికే ఆమెకు మతి చలించిందనుకుంటాను. ఎప్పుడూ సరిగ్గా మాట్లాడని ఆమె గలగలా మాట్లాడటం, ఏదేదో గొణగడం మొదలెట్టింది. ఇప్పుడు తను శారీరకంగా ఆరోగ్యంగా వున్నా మానసికంగా పిచ్చిదయింది. తనకు పెట్టిన అన్నాన్ని కుక్కలకు వేస్తుందిట. ఎందుకలా వేస్తున్నావు అంటే “నాకూ పుణ్యం రావాలిగా” అంటుందట. తనకు కట్టుకోమని బట్టలిస్తే అవి ఎవరికైనా ఇచ్చేస్తుందట. ఇంక వేదాంతం మాట్లాడటం, ఏదో దీర్ఘాలోచనలో వుండటం ఇలా వుంది వరస.

నేనూ, దిలీప్ వూరిలో తిరుగుతుంటే ఓ చోట గోడను ఆనుకొని అటేటో చూస్తూ వుంది. “ఏమ్మ్యా ఎలా వున్నావ్? నేనెవరో గుర్తు పట్టావా?” అని పలకరించా. అప్పుడు మా వైపు తిరిగి “దిలీపు సామీ నువ్వా!” అని రెండు చేతులెత్తి దండం పెట్టింది. “దిలీపు సరేగానీ నేనెవరో చెప్పు” అన్నా. “ఎవరో సామీ.. నేనింకా దొగలేమోనని, ఎట్ట సేయాల బగవంతుడా అని, ఇట్ట మల్లుకోనున్నా..” అన్నది. దిలీపును గుర్తు పట్టావే, దిలీపు అన్నలెవరు అంటే చెప్పింది. ఆ ప్రసాదును నేనే అంటే “ఎన్నెన్ని రోజులకు చూస్తిని సామీ” అంటూ తెగ సంతోషం ప్రకటించింది. ఆ ముందురాత్రి పడిన వర్షంలో బట్టలన్నీ తడిసిపోయాయట. ఎవరూ తమ తమ పంచల్లో పడుకోనివ్వలేదట! రాముడి గుడిలో పడుకుంటోందని గుడికి తాళాలు వేశారట! తడిసిన బట్టల్తో రాత్రంతా అలానే వున్నానని చెబుతుంటే గుండె చెరువయి కళ్ళల్లో ధార కడుతుంటే ఆపుకోవడానికి నానా కష్టాలూ పడ్డా. ఎప్పుడయినా సరే మా యింటికి వచ్చి తిను, అక్కడే పడుకో అని చెప్పి ఓ వందరూపాయలు చేతిలో పెట్టి అక్కడినుండీ భారంగా కదిలా.

ఆ మరుసటి వుదయం అన్నం కోసం ఇంటికి వచ్చినపుడు చెబుతోంది, “సామీ దొంగలున్నారంటే మీరు వింటిరా.. రాత్రి నా తలమీద గుండేస్తానని వాడెవడో దొంగ వచ్చి నీవిచ్చిన నూర్రూపాయాలూ లాక్కెళ్ళాడు.” అని.

ఇంతకూ నాకు తేలనిది ఏమిటంటే పిచ్చి ఆమెకా? వర్షం రాత్రి ఓ ఆడబిడ్డని ఏ పంచనా పడుకోనివ్వని వూరికా? చివరికి తన ఆలయంలోనూ చోటివ్వని దేవుడికా? అమాయకురాలి చేతిలోని డబ్బు భయపెట్టి లాక్కున్న మనిషికా? పిచ్చెవరికి?

–ప్రసాద్

చివరకు మిగిలేది…

తేది:April 29, 2008 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 795 views

ఎంత సంపాదించినా, ఏమి చేసినా చివరకు నీకంటూ మిగిలేది ఏముంది అని అనడం తరచుగా వింటూ వుంటాం. అయితే మనం వెళుతూ వెళుతూ ఏమీ తీసుకుపోము గానీ, వదిలి మాత్రం వెళతాం.

ఉదయం లేచింది మొదలు రాత్రి విశ్రమించేవరకూ చేసే ప్రతిపనిలో కొంత చెత్తను తయారు చేస్తున్నాం. అమెరికాలో రోజుకు ఒక్కో వ్యక్తి నాలుగు పౌండ్ల చెత్తను తయారుచేస్తున్నాడట! అంటే అమెరికా ఒక్కటే రోజుకు ఆరు లక్షల తన్నుల చెత్తను తయారు చేస్తోంది.బహుశా అధిక చెత్తను తయౄ చేయడం అభివృద్దికి కొలబద్దగా చెప్పుకోవచ్చేమొ! పళ్ళుతోముకునేందుకు, పళ్ళు కుట్టుకునేందుకు, ముడ్డి తుడుచుకునేందుకు చెత్త తయారుచేయడంతో మొదలెట్టి, కాగితం కప్పులో కాఫీ, పేపరులో చుట్టిన బ్రెద్దూ, ప్లాస్తిక్ డబ్బాలో నీళ్ళు లేదా అల్యూమినియం క్యాన్‌లో కోక్ …  ఇలా చెప్పుకుంటూ పోతే ఉపయోగించేది పాతిక, చెత్తగా మార్చేది ముప్పాతికా అనిపిస్తుంది.

ఈ దృక్కోణంలో చూడటం మొదలెట్టాక ఏ దుకాణం కెళ్ళినా నాకు చెత్తే కనిపిస్తోంది. బాటిల్‌లో నీళ్ళకు బదులు బాటిల్ చెత్తరూపం కనిపిస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ వెనుకాల, దాని చెత్త స్వరూపం కనిపిస్తోంది.

పునర్వినియోగం చేయగలిగిన వస్తువులను కూడా బాధ్యతారహితంగా చెత్తలో వేయడం వల్ల, అవి చివరికి దిబ్బలకు(landfills) చేరిపోతున్నాయి. అలా దిబ్బలకు చేరిన చెత్త ఇక ఎప్పటికీ అలానే వుండి పోతుంది. ఈ వ్యర్థాలు మన బాధ్యతారాహిత్యాన్ని మన వారసులకు గుర్తు చేస్తూనే వుంటాయి.

చెత్త తయారు చేయడం తగ్గించడానికి ఎవరికి వీలయినంతలో వారు పాటు పడాలి. వీలయినంతవరకూ వాడివదిలించుకొనే (usethrow) పద్దతి మానుకోవాలి. ఇళ్ళల్లో పార్టీలకు కాగితపు కప్పులు, కంచాలూ, ప్లాస్టిక్ స్పూన్లు గట్రా వాడటం మానివేయాలి. చిన్న చిన్న వాటర్ బాటిళ్ళూ, కోక్ డబ్బాల స్తానంలో పెద్ద పెద్ద బాటిల్లూ లేదంటే పూర్తిగా మానివేయడమో చేయాలి. చేతులు తుడుచుకోవడానికి మన పద్దతిలోలా నీళ్ళు వుపయోగించి, పొడి టవల్‌తో తుడుచుకోవాలి.

మన భావి తరాలకు అందమైన భూగోళాన్ని ఇవ్వకపోయినా ఫర్వాలేది, చెత్త నింపిన, దుర్గంధ భూయిష్టం, ప్రమాదకారి అయిన భూగోళాన్ని వదిలిపెట్టక పోతే చాలు.

మీరే వాడే ప్రతి వస్తువు వెనకాలా చెత్తను గూర్చి ఆలోచించండి. మీరు వేసే ప్రతి అడుగు మీ పిల్లలకు మడుగు కాకుండా చూడండి.

శ్రీనివాస్ గారు ఇచ్చిన ఈ లంకెలోని వీడియో మీరు చూసి తీరాలి.
–ప్రసాద్

భిక్షకుల బాల్టిమోర్

తేది:January 11, 2008 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 930 views

ఈ పదేళ్ళ అమెరికా జీవితంలో తూర్పుతీరాన్ని ఈ కొసనుండీ ఆ కొసకు చూశాను, కానీ ఈ బాల్టిమోర్ నగరంలో కనిపించినంత మంది భిక్షకులు నాకు మరెక్కడా కానరాలేదు.

ఈ చలిని ఎముకలు కొరికే చలి అంటే చాలదు. ప్రాణాలు తీసే చలి. పైగా ఆఫీసు గడప దాటింది మొదలు సవాలక్ష పనులతో, కాలంతో పోటీపడుతూ కార్లను పరుగెత్తించే జనాల మధ్య “ఇల్లు లేదు. ఆకలిగా వుంది. దానం చెయ్యండి. దేవుడు మిమ్మలని దీవించు గాక!” అని భిక్షమెత్తుకునే అభాగ్య జీవులు బాల్టిమోర్‌లో బోలెడుమంది కనిపిస్తున్నారు.

ఇంట్లోంఛి పది అడుగుల దూరంలో వున్న కారును చేరాలంటేనే ఈ చలిలో నరాలు ఉగ్గబట్టుకోవాలే! అయ్యో వీళ్ళెలా వుంటారో గదా? ఈ దేశం అన్నిటికంటే సంపన్నమైనది. వీళ్ళు చేసే దానధర్మాలు ఇంకెవ్వరికంటే కూడా ఎక్కువే. వీళ్ళు యుద్దాల మీద చేసే వ్యయమూ ఎవ్వరికంటే కూడా ఎక్కువే. ఎన్ని పాలుపోసి ఎత్తుకోగలిగే రహదారులుంటే మాత్రమెందుకు? వాటి వెంబడి భిక్షమెత్తుకునే మనిషి ఒకడున్నంత వరకూ? ఇక్కడి వార్తా ఛానళ్ళకు ప్రపంచంలోని ఎక్కెడెక్కడి వివరాలూ కావాలి. లేదా బ్రిట్నీ స్పియర్స్ చేసుకున్న గుండు గురించి వివరాలు కావాలి. కానీ ఎక్కడా ఎప్పుడూ ఈ సంపన్న దేశంలో భిక్షగాళ్ళ గురించి వివరించిన ధాఖలా కనపడటం లేదు. లేక నాకు తెలియదో!

ప్రతిరోజూ ఎర్రలైటు దగ్గర ఆగాలంటే సిగ్గు. ఆకలిగొన్న వాని ఎదుట విదారగిస్తున్నవాడిలా, హృదయంలోపలి నుండీ తన్నుకొచ్చే లజ్జ.

–ప్రసాద్

సహనశీలతా? చేతగానితనమా?

తేది:August 28, 2007 వర్గం:నా ఏడుపు, వర్తమానం రచన:చరసాల 1,091 views

గుండెల మీద చెయ్యేసి చెప్పండి మనది సహనశీలతా? గుండె నిబ్బరమా? చేతగాని తనమా?

ఖచ్చితంగా చేతగాని తనమే. ఇందుకు బోలెడన్ని ఋజువులు. నీవు తన్నగలిగిన వాడివై వుండికుడా తన్నలేదంటే అది సహనం. తన్నలేక శాంతి గురించి మాట్లాడితే అది బలహీనత. అప్పుడెప్పుడో అశోకుడు పటించింది అసలుసిసలు శాంతి మంత్రం.

వాడెవ్వడో వచ్చి 18 సార్లు దండెత్తితే 17 సార్లు గెలిచామని చెప్పుకోవడం కాదు వాజమ్మల్లాగా, అసలు వాన్ని రెండోసారి మళ్ళి ఎలా తొంగిచూడనిచ్చామనేది అసలు ప్రశ్న. ఒక్కరా ఇద్దరా… రాజన్న ప్రతివాడికీ లోకువయ్యాం. అప్పుడూ అటువైపు నుండే దాడులు… ఇప్పుడు అటువైపు నుండే దాడులు. అప్పుడంటే నూటొన్నొక్క విడివిడి రాజ్యాలుగా వున్న భరత ఖండం ఒక్కటై ఎదుర్కోలేక పోయింది అనుకున్నా, మరిప్పుడు మనకు లోటేమిటి?

ఒకటే లోటు. నాకెందుకు అనే నిర్లిప్తత! రాసి పెట్టి వుంటే జరగకపోతుందా అనే బుద్దిమాలిన కర్మ సిద్దాంతం. పక్కిల్లు కాలుతుంటే మనంటిమీద నీళ్ళు చల్లుకునే స్వార్థ చింతన. ఇవే మన అద్బుతమైన బలాలు. ఒక్కోసారి నాకనిపిస్తుంది ఇవేనా మనలని ఒక్క భారతదేశంగా వుంచుతున్నది అని. లోపల్లోపల అరవోడు అంటే తెలుగోడికి గిట్టదు. తెలుగోడంటే కన్నడిగుడికి గిట్టదు. వీళ్ళంటే ఎవరో హిందీ వోడికి తెలవదు. ఆ హిందీవోడంటే అస్సామీయుడికి గిట్టదు. అయితే ఇన్ని భిన్నత్వాల మధ్యా మనం ఒకదేశంగా వున్నామంటే నిజంగానే మొన్న అరవై వసంతాల స్వాతంత్ర్యదినం నాడు అనుకొన్నట్లు ఏదో బ్రహ్మ పదార్థం అనే దారం మనలని కలిపి వుంచుతోందా? నాకయితే ఆ బ్రహ్మ పదార్థం పైన చెప్పిన నిర్లిప్తత, స్వార్థం, చేతగానితనం కాదుగదా అనిపిస్తుంది.

బాంబుదాడుల్లో యాబై మంది చచ్చినా అది వారి ప్రారబ్దం అనుకుంటాం. మన ఆత్మను తృప్తి పరచడానికి పూలగుచ్చాలు పెడతాం, క్రొవ్వొత్తులు వెలిగిస్తాం, సర్వ మత ప్రార్థనలు చేస్తాం. ఇవి చనిపోయిన వారి ఆత్మను ఏమోగాని బతికివున్న వారి ఆత్మను సంతోషపర్చడానికే. ఈ చేతగానిపనుల వల్ల ఒనగూడేదేమీ లేదు, ఆ దుర్ఘటనని మరిచిపోవడానికి వుపకరించడం తప్ప. మనకు కావలిసింది మరచిపోవడం కాదు. గుర్తుంచుకోవడం. మనం దీన్ని మరవకూడదు. ఆ బాంబులు మన గుండెల్లో రోజూ బ్రద్దలవ్వాలి. ఆ ఆక్రందనలు ప్రతి క్షణమూ మన చెవుల్లో మ్రోగుతూ మనలని నిరంతరం జాగృతులుగా వుంచుతూనే వుండాలి. మన ప్రజాస్వామ్య విలువల వలువలు ఎవరొలుస్తున్నారో వారి తోలు వలవాలి. అది నిర్లక్ష్యపు పౌరుడు కావచ్చు, అవినీతి అధికారి కావచ్చు, నిజాయితీలేని రాజకీయుడు కావచ్చు, ఒక మతం పేరుతో మరో మత వర్గీయుల మీదకి వేట కుక్కలని వుసిగొలిపే థాకరే గావచ్చు లేక మసీదు లోగిలి నుండీ మరణ శాసనాలు రాసే ఇమాం కావచ్చు.

మన ప్రభుత్వాలు చేతగానివైతే మనమైనా చేవవున్నవాళ్ళమని నిరూపించాలి.

–ప్రసాద్