అక్రమంలో క్రమం

తేది:November 8, 2006 వర్గం:ఆధ్యాత్మికం రచన:charasala 3,495 views

అద్వితీయ శక్తులున్న భగవంతుడున్నారనే వాళ్ళందరూ ఒక వుదాహరణ తప్పకుండా చూపుతారు. దేవుడే లేకుంటే ఈ భూమి క్రమం తప్పకుండా ఎలా తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది? ఇన్ని గ్రహాలు, నక్షత్ర మండలాలూ దేవుడి నిర్దేశం లేకపోతే ఎలా తమ తమ కక్ష్యల్లో అంత క్రమంగా తిరుగుతాయి?
నిజానికి ఇవన్నీ క్రమంలోనే వున్నాయా? ఈ సూర్యచంద్రులున్నంత వరకూ అని ఎప్పటికీ వుండాటాన్ని పోల్చుతామే ఈ సూర్యచంద్రులు ఎప్పటికీ అవిచ్చన్నంగా వుంటారా? ఈ గ్రహాలన్నీ తమతమ కక్ష్యల్లో క్రమం తప్పకుండానే తిరుగుతున్నాయా? క్రమంలో అక్రమం వుందా? లేక అక్రమంలో క్రమం వుందా?
నాకైతే అక్రమంగా వున్న ఈ అనంత విశ్వంలో తాత్కాలికమైన క్రమమే ఈ సూర్యమండలము అనిపిస్తూంది. నాసా వాళ్ళు రోజుకొకటి చూపే “సూపర్‌నోవా” లను చూసినప్పుడు, కరిగే కొవ్వొత్తిలా తరిగిపోతున్న సూర్యున్ని చూసినప్పుడూ, చెప్పా పెట్టకుండా వచ్చే తుఫానులూ, భూకంపాలూ, సునామీలు చూసినప్పుడూ నాకు ఏది క్రమంగా వుంది అనిపిస్తుంది. నిత్యమూ మార్పు చెందడమొక్కటే సత్యము! రోజురోజుకీ తనను మండిచుకుంటూ నిన్నలేని మారిన సూర్యుడే ఈరోజు వున్నాడు. నిన్నటి సూర్యుడే ఈరోజు సత్యం కానప్పుడు నిన్నటంత కాలమే భూమి ఈరోజు కూడా తిరిగిందంటే ఎలా నమ్మడం! ఈ భూమి వయసు కోటానుకోట్ల సంవత్సరాలైతే, ఈ ఓ చిన్న రోజులో ఏర్పడిన వేగంలోని వ్యత్యాసాన్ని దేనితో కొలవగలం? ప్రతిదీ మార్పు చెందుతూ వుంది, వున్నది మరోదానిగా మరోటి ఇంకో దానిలా! అయితే ఇదైనా క్రమంగా జరుగూతూ వుందా? ఈ మొత్తం మానవ సృష్టిలో ఒకరిని పోలిన మనిషి ఇంకోసారి జన్మించాడా? ప్రతిదీ మార్పు చెందుతూ వుండే క్రమంలో ప్రతిసారీ కొత్తదానిలా మార్పు జరుగుతూ వుందే తప్ప, నిర్మింపబడిన దానిలా మళ్ళీ ఏదీ నిర్మింపబడటం లేదే? మరి ఏది క్రమం? క్రమపద్దతి లేకపోవడమనే క్రమం ఒక్కటే నిజం.
కొన్ని కోట్లకోట్లకోట్ల…సంవత్సరాల ఈ విశ్వంలో ఈ సూర్యుడి వయస్సెంత? ఈ భూమి వయస్సెంత? అందులో మనిషి జీవితమెంత? అదేదో నాలుగు లక్షల సంవత్సరాలు పెద్ద కాలమైనట్లు, మనిషి సృష్టే శాశ్వతమనుకునుటెట్ల? ఆ సుదీర్ఘమైన విశ్వ సృష్టిలో ఈ సూర్యకుటుంబము జీవితమెంత? ఓ నలుసు కాదూ? ఇలాంటి ఎన్ని సూర్యుల్లు ఉద్భవించాయో, ఎన్ని సూర్యుల్లు పతనమయ్యాయో ఈ అనంత విశ్వంలో! ఈ అతి స్వల్ప సూర్యకుటుంబం జీవితంలో అత్యంత అల్పమైన రోజును చూసుకొని అంతా క్రమంగా వుందని అనుకోవడం మన వెర్రి భ్రమ కదా! అదెట్లంటే సెకనుకు 30 మైళ్ళ వేగంతో ప్రయానిస్తున్న భూమి మీద వుండికూడా నిలకడగా వున్నట్లు అనుకోవటంలా! గుండ్రంగా వున్న భూమి మీద నిలబడి అంతా బల్లపరుపుగా వుందనుకోవటంలా!
బొంగరం తిప్పినపుడు అది మొదట్లో బాగానే స్థిరవేగంతో తిరుగుతున్నట్లు అనిపించినా క్రమక్రమంగా దాని వేగాన్ని పోగొట్టుకొని చివరికి పడిపోతుంది. అది తిరిగిన మొత్తం కాలంలో ఒక చిన్న డెల్టాX కాలం లో అది స్థిరవేగంతో తిరిగినట్లే అనిపిస్తుంది అంతమాత్రాన అది ఎప్పటికీ స్థిరవేగంతో తిరిగినట్లు కాదుకదా! అలానే ఓ పెద్ద వృత్తం మీద ఓ అతి చిన్న భాగాన్ని పరిశీలిస్తే అది సరళరేఖలా కనిపిస్తుంది కదా! కానీ అది సరళ రేఖా? పెద్ద సుడిగాలిలో ఓ చిన్న భాగాన్ని పరికిస్తే ఒక్కో అణువు పక్క అణువుతో స్థిర వేగంతో పయనిస్తూ అంతా సవ్యంగా వున్నట్లే అనిపిస్తుంది కానీ సవ్యం కాదు కదా?
మరి అనంత విశ్వంలో చిన్న రేణువైన సూర్యకుటుంబం అందులో మరింత చిన్నదైన భూమి దాని వేగం దాని మీద ఏర్పడే రోజులూ, ఋతువులూ అన్నీ సక్రమంగా వున్నట్లు ఎలా అనుకోవాలి? అతిపెద్దదైన అక్రమంలో ఇది మన కంటికి కనపడే ఓ చిన్న క్రమం.

–ప్రసాద్

ఇస్కాన్ (ISKCON)

తేది:November 7, 2006 వర్గం:ఆధ్యాత్మికం రచన:charasala 2,394 views

భక్తితో కాదు గానీ ప్రకృతి సౌందర్యం చూడటానికి, తల్లిదండ్రులకు ఇక్కడి హిందూ దేవాలయాలు చూపించటానికి వెస్ట్ వర్జీనియాలోని ఇస్కాన్ క్రిష్న దేవాలయం రెండు సార్లు చూడటమయ్యింది. ఎవరి వేదాంతం వాళ్ళది అని వాళ్ళ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను గానీ నాకు మాత్రం నమ్మకం లేదు.
మొన్న శనివారం రోజు ఒక మిత్రుడి ఆహ్వానం మీద ఒక ఇస్కాన్ సత్సంగానికి హాజరయ్యాను. ఒక పండుటాకు లాంటి పెద్దాయన వచ్చారు. భవద్గీత చాప్టరు 9 తో తన ప్రవచనం మొదలుపెట్టారు ఫ్ఫ్ట్ సహాయముతో.
ఒక ఫలము, పుష్పము లేదా పత్రము ఏదైనా నిండు మనస్సుతో నాకు అర్పిస్తే అది నేను స్వీకరిస్తున్నాను” అన్న కృష్నుడి శ్లోకానికి చాలా సేపు భాష్యము చెపుతూ భక్తి శ్రద్దలతో కృష్నున్ని ధ్యానం చేయడం చెప్పారు. దానికి కొనసాగింపుగా ఒక వుదాహరణ ఇలా చెప్పారు.
వృక్షానికి వేర్లమీద పోసేనీరు వృక్షానికంతా ఎలా వుపయోగపడుతుందో మోక్షమార్గానికి కృష్నుడి సేవ అలా వుపయోగపడుతుంది. వృక్షము యొక్క ఇంకే ఇతర భాగాల మీద నీరు పోసినా వృక్షానికి అందనట్లే ఇంకే ఇతర పద్దతుల ద్వారా కూడా వైకుంఠ సిద్ది కలగదు” ఇలా అంతా చెప్పాక ఎవరికైనా ప్రశ్నలుంటే అడగండి అన్నారు.
అప్పుడు వుండబట్టలేక నేనన్నాను “స్వామీ మోక్షమార్గానికి మీరు చెప్పిన అన్ని మార్గాలూ బాగానే వున్నాయి కానీ ‘మానవ సేవే మాధవ సేవ’ అన్నారు కదా! మరి మోక్షమార్గాల్లో పీడితుల, బాధితుల సేవ కూడా ఒక మార్గమని ఎందుకు చెప్పట్లేదు స్వామీ?” అని. దానికి స్వామి ఠక్కున “మానవ సేవే మాధవ సేవ అని గీతలో ఎక్కడ వుంది?” అన్నారు. నాకింకేమనాలో తోచ లేదు, ‘గీతలో లేక పోయినా ఉతృష్కఠమైన ధర్మమని నా నమ్మకం’ అన్నాను. కానీ అందుకు చాలా సేపు స్వామి చెప్పిన తాత్పర్యము ఏమంటే “భక్తి అనేది వృక్షము యొక్క వేరు, మిగతా ధర్మాలన్నీ దాని ఆకులు, కొమ్మల వంటివి వాటి మీద పోసే నీరు వృధా అవుతుంది. అదే నీవు కృష్న భక్తి అనే వేర్ల మీద పోస్తే నీకు తెలియకుండానే మానవసేవ అనే కొమ్మ కూడా అభివృద్ది అవుతుంది” అని.
నాకైతే మానవ సేవ ఆకుల మీద పోసే నీరు లాంటిది అని చెప్పడం ససేమిరా నచ్చలేదు.
ఆ తర్వాత స్వామి గీతలో వున్న శ్లోకాలకయితేనే సమాధానం చెబుతారేమొననుకొని, “స్వామీ, కృష్నుడు నిష్కామ కర్మ చెయ్య మన్నాడు కదా!  కానీ చివరిలో మనిషికి కలిగే వైకుంఠ భోగాన్ని ఎరగా వేస్తున్నారే! అదికూడా ‘కోరికే’ కదా?“అన్నాను. దీనికి స్వామి “కృష్నుడు చెప్పిన ‘కామ’ అనేది స్వార్థ చింతన,  వైకుంఠ ప్రాప్తి కావాలనుకోవడం పరమాత్మ చింతన, అది భగవంతుడి కోరిక , మన కోరిక కాదు” అన్నారు. ఇది నాకు నిజమే అనిపించింది.
ఇక కార్యక్రమం తర్వాత స్వామి భక్తులు నా అజ్ఞానానికి జాలిపడుతూ నా వివరాలడగడం ప్రారంభించారు. ఒకాయన అన్నారు “ఒక పిల్లవాడు జాతరలో తప్పిపోయాడనుకుందాం. ఒకతను ఆ పిల్లవాన్ని చేరదీసి అన్నం పెట్టాడు, ఇంకోకడు నీళ్ళిచ్చాడు. కానీ పిల్లవాడు ఏడుపు మానలేదు. అప్పుడు ఇంకొకడు వచ్చి అతని తల్లిదండ్రుల వద్దకు తీసుకపోయాడు. కావున తాత్కాలికంగా ఆకలి తీర్చడం, దారిద్య బాధ పోగొట్టడం తల్లిదండ్రులను చూపించకుండా అన్నం నీళ్ళు ఇచ్చినట్లుగా వుంటుంది. అది జీవుని బాధను పోగొట్టదు. కృష్న భక్తితో, చైతన్యంతో  వైకుంఠం చేరడం తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడంలాంటిది” అని. ఎంత పఠిష్టమైన వుదాహరణ చెప్పార్రా బాబూ అనుకొని “అయ్యా! నేను వైకుంఠమే తల్లిదండ్రులు అని ఎలా నమ్మాలి?” అన్నాను. నమ్మకమే ఏ భక్తికైనా పునాది కనుక నా ప్రశ్న అర్థం లేనిది అనిపించింది.
ఈసారి ఇంకొకాయన నావైపు వచ్చారు. “మానవ సేవ మాధవ సేవ కాదు మాధవ సేవే మానవ సేవ” అని వాకృచ్చారు. చచ్చినంత పనైంది నాకు. “అదేంటండీ అలాగంటారు ప్రతిజీవి లోనూ నిర్జీవి లోను భగవంతుడే కదా వ్యక్తమయ్యేది?” అన్నాను. “అహా! మరి పాములో కూడా భగవంతుడున్నాడా? మరి నువ్వు దానిదగ్గరికి వెళ్ళి కరిపించుకోగలవా?” అన్నారు. “నాలోనూ భగవంతుడే! దానిలోనూ భగవంతుడే!  కుట్టడమనేది మాయ! కుట్టకముందూ నేనున్నాను, కుట్టిన తర్వాతా నేనుంటాను” అన్నాను. ఆ తర్వాత ఆయనేమని చెప్పాడో నాకు అర్థం కాలేదు.
ఆ తర్వాత వీళ్ళ శాఖ గురించి మరింత విపులంగా చదివితే వీరు అద్వైత వాదులు కాదని, శుద్ద ద్వైతులని తెలిసింది. అన్నిటిలోనూ దేవుడుండడాన్ని వీళ్ళు నమ్మరు. అన్నీ భగవండుడిలో వుండి అన్నిటికీ అతీతంగా భగవంతుడనే ఒక మూర్తి వుంటాడని నమ్ముతారు.
కానీ నాకెప్పుడైతే “మానవ సేవ ఆకు మీద పోసిన నీళ్ళ చందంగా వృధా” అని ఎప్పుడన్నారో ఇలాంటి సత్సంగాలకు రావటం వృధా అనిపించింది.
–ప్రసాద్

బళ్ళు X గుళ్ళు

తేది:October 5, 2006 వర్గం:ఆధ్యాత్మికం రచన:charasala 1,659 views

రామాలయం లేని వూర్లెన్ని? బళ్ళులేని గ్రామాలెన్ని?
సత్రాలు కట్టించారని విన్నాం. అశోకుడు రోడ్ల పక్క చెట్లు నాటించెను, బావులు తవ్వించెను అని చదువుకున్నాం. కాకతీయులు, విజయ నగర రాజులు చెరువులు తవ్వించారని విన్నాం. పండితులకు అగ్రహారాల్ని దానం చేశారు. దేవాలయాలు కట్టించారు వాటి నిర్వహణకు మాన్యాల్ని దానం చేశారు.
కానీ బడులు కట్టించారని ఏ చరిత్రా చెప్పదేం? బడులు కట్టి వాటి నిర్వహణకు భూములు దానమిచ్చిన సంఘటనలు లేవేం? అప్పుడెప్పుడో గురుకులాశ్రమాలు వున్నప్పుడు రాజులు వాటికి ఏమైనా ఇచ్చేవారేమొ! లేకుంటే ఆ ఆశ్రమవాసులు అడవిలో దొరికే కందమూలాలు తిని మాత్రమే బతికే వాళ్ళేమొ!
మనమంతా ఆదర్శరాజ్యమనుకొనే రామరాజ్యములో కూడా బడులు వున్నట్లు తెలియదు.
ఈ ఆధునిక కాలంలోనూ ఆ పంధా మారుతున్నట్లు లేదు. గుడి కట్టడానికి చూపే వుత్సాహంలో పది శాతం కూడా బడి కట్టడానికి వుండదు. గుడి లేకుంటే ప్రజలే చందాలు వేసుకొని కట్టుకుంటారు, బడి లేకుంటే మాత్రం ప్రభుత్వం కట్టించలేదని విసుక్కుంటారు!
ఇప్పుడు చూడు తి.తి.దే కూడా ఒక్క తిరుపతి మినహాయించి ఎన్ని వూర్లలో బడులు పెట్టింది? ఎన్ని వూర్లలో కళ్యాణమండపాలు కట్టించింది? కళ్యాణమండపాలు ఏవిధంగా హిందూ దర్మప్రచారానికి వుపయోగపడతాయో నాకు మాత్రం తెలియదు.
ఇప్పుడు క్విటాలు బంగారంతో పెళ్ళిబొట్లు తయారుచేసి పెళ్ళిల్లు చేస్తారట! మనకింత కంటె మంచి ఆలోచనలు రావెందుకు?
ఎన్నో వూర్లకు బడులు లేవు, వుంటే మరుగు దొడ్లు లేవు, వంట గదులు లేవు. ఆసుపత్రులు లేవు, అవి వుంటే మందులు లేవు.
లక్షలకు లక్షలు ఖర్చు చేస్తాం వజ్ర కిరీటాలకు, భుజ కీర్తులకు. దేవుడి మీద వుండే భక్తి మనిషి మీద లేదు. భూమిని వదిలేసి స్వర్గంలో విహరించడానికి ఇష్టపడతాం! కళ్ళముందు కనిపించేది మాయ అంటూ మాయాలోకం సృష్టించుకొని అదే నిజమంటాం!

–ప్రసాద్

దేవుడి పుట్టుక

తేది:August 31, 2006 వర్గం:ఆధ్యాత్మికం రచన:charasala 2,573 views

రావు గారు నన్ను దేవుడి పుట్టుక, రూపం, అంచెలంచెలుగా ఎదిగిన వైనం గురించి రాయమన్నారు.
నేను పురాణాల్లో చెప్పబడిన దేవున్ని, గుడిలో దేవున్ని నమ్మను. ఇకా నేను నమ్మే దేవుడెవరంటే ఈ సృష్టి, ఈ శక్తి. ఈ గ్రహాలూ, నక్షత్రాలూ, జీవులూ అన్నిటిలోనూ చోదక శక్తిగా వున్న శక్తిని దేవుడంటాను. సైన్సు చెప్పే ప్రాధమిక సూత్రాలన్నీ దేవుడి లక్షణాలంటాను. దేవుడి గుణాలయినా, లక్షణాలయినా స్థిరమయినవి. అవి నీతిమంతుడికి, నేరస్తుడికి ఒకేలా వర్తిస్తాయి. నీరు ఒకేలా దప్పిక తీర్చినట్లు, నీడ ఒకేలా చల్లదనాన్ని ఇచ్చినట్లు. ఆ శక్తికి మంచి, చెడ్డా విచక్షణ తెలియదు. పసి పాపకి, వృద్దుడికి తేడా తెలియదు. ఈ విశ్వమంతా కొన్ని భౌతికసూత్రాలమీద ఆధారపడి వుంది. ఆ సూత్రాలే దేవుడనుకొంటాను.
ఇప్పుడు ఆ దేవుడి పుట్టుక ఎప్పుడు అంటే ఏమనాలి? దేవుడికి పుట్టుక లేదు. ఆది అంతాలు లేవు. ఈ దేవుడు ఎప్పుడూ వున్నాడు, కాలం ఎప్పుడూ వున్నట్లు. దేవుడిని నీవు గుర్తించినా గుర్తించకున్నా దేవుడున్నాడు. నీవు గుర్తించిన రోజు దేవుడు పుట్టినట్లు కాదు. న్యూటన్ కనుక్కోక ముందూ గురుత్వాకర్షణ వుంది తర్వాతా వుంది. అది కనుక్కోబడిందే కానీ తయారుకాబడలేదు, సృష్టింపబడలేదు. దానికి పుట్టుక లేదు. అలాగే అంతమూ లేదు. రేపు మానవ జాతి అంతా అంతమైనా అది వుంటుంది. దాన్నే సత్యము అని కూడ అనొచ్చు. ఏది మార్పు చెందదో, ఎప్పటికీ నిలిచి వుంటుందో అది సత్యము. దానికి ఆది అంతాలు లేవు. వేదాలు గురించి ఇలాగే అంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది రాయబడిన వాటి గురించి కాదు ప్రవచించబడిన ధర్మాల గురించి. ధర్మము ఎప్పుడూ ధర్మమే మనిషి పుట్టకముందునుంచీ, మనిషి నశించి పోయాక కూడా!

ఇక రూపము! నా దేవుడికి రూపం లేదు. అయినా ప్రతి దానిలోనూ చోడొచ్చు. శక్తి కనపడదు, దాన్ని అనుభవించాల్సిందే! గాలిని స్పర్షాజ్ఞానముతో తెలుసుకున్నట్లు. ప్రతి శక్తీ దేవుడే, ప్రతి జీవీ దేవుడే. ఈ సకల చరాచరాలలోనూ దేన్నీ అతన్నుంచీ మినహాయించలేము. జలచరాలన్నీ ఎలా సముద్రంలోనే వుండి సముద్రం రూపాన్ని చూడలేవో అలానే మనమూ దేవుడిలోనే వుండి అతని రూపాన్ని చూడలేము. ఎల్లలు లేని రూపాన్ని, ఊహకు కూడా అందని దూరాన్ని ఎలా అదిగమించి రూపాన్ని చూడగలం! అయిటే ఈ కనిపించేదీ, కనిపించనిదీ, నేను, నువ్వూ అందరం దేవుడిలో భాగమే! ఎక్కడయితే ప్రాధమిక భౌతిక సూత్రాలు న్యాయమౌతున్నాయో అవన్నీ కూడా దేవునిలో భాగమే! రెండు రెళ్ళు నాలుగయ్యే ప్రతిచోటూ దేవుడే!

ఇక అంచెలంచెలుగా ఎదగడానికేముంది. సర్వ వ్యాపితమైనవాడు, పుట్టుక, నశింపు లేనివాడు ఇక పెరిగేదెలా? పెరగడానికి ఇంకేం మిగిలివుంది? పుట్టడం, పెరగడం, నశింపచడం నిర్దేశించే దేవుడికే పుట్టుక వుంటే, పెరుగుదల వుంటే మరి ఆ దేవుడి పుట్టుకకు ముందు ఏమున్నట్లు? వుందడం, వుండకపోవడమనేవి రెండూ దేవుడి భిన్న పార్శ్వాలే అయితే ఇక దేవుడు సృష్టికి ముందూ వున్నట్లే కదా!

– ప్రసాద్

భక్తి అంతా మూర్ఖత్వమేనా?

తేది:August 31, 2006 వర్గం:ఆధ్యాత్మికం రచన:charasala 1,595 views

నాగరాజా గారి “భక్తి అంతా మూర్ఖత్వమేనా?” అన్న ప్రశ్నకు సమాధానంగా.

నాగరాజా గారూ, నా దృష్టిలో పరులకు వుపయోగపడని భక్తి ఖచ్చితంగా మూర్ఖత్వమే! “మానవ సేవే మాధవ సేవ”; భగవంతుడు జీవులన్నింటిలోనూ వ్యవస్థితమైవున్నప్పుడు జీవిని వదిలేసి రాయిని పూజించడం మూర్ఖత్వము కాక మరేమిటి? దేవుడి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోవటానికి అవి పనిముట్లు మాత్రమే, అవే దేవుళ్ళని నానా యాగీ చేయడం ఖచ్చితంగా మూర్ఖత్వమే! జెమిని టివి లో ఏ ఉదయం చూసినా అయ్యప్ప స్వామిని పూనకంతో పూజించేవాళ్ళను చూడవచ్చు. కాసేపు అయ్యప్ప స్వామి మీద భయాన్ని, భక్తినీ వదిలేసి ఆలోచించండి అది మూర్ఖంగా అనిపించట్లేదా? అంబనాధ్ అన్నట్లు (ఆయన భారతీయత గురించి అన్నారులెండి) మనం చిన్నప్పట్నుంచి ఆ మాటకొస్తే తరతరాల్నుండి అలా condition చేయబడ్డాం. ఆ నెల దీక్ష ఏదో పది మందికి వుపయోగపడేలా వుండవచ్చు కదా?
ఇక సతసాయి, అమృతానందమయి లాంటి వాళ్ళు చేస్తున్న సమాజసేవ నాకు తెలుసు. అందుకే వాళ్ళు చేస్తుంది మాయా, మంత్రమా నాకనవసరం. వాళ్ళు దేవుళ్ళా అంటే అవును దేవుళ్ళే అనాలి. అయితే దివ్యాంశాలుండే దేవుడు కాదు, దివ్యాంశలే వున్నట్లయితే అంత ఖర్చు పెట్టి ఆ ఆసుపత్రి ఎందుకే ఆయన తదిమిందే తడవుగా రోగాలు మాయమవచ్చు కదా! పకృతి సూత్రాలకు విరుద్దంగా ప్రవర్తించడం ఎవరికీ సాధ్యం కాదు, గొంతులోంచి లింగం తీసే దాంతో సహా! కానీ ఇంతకుముందు “పూజలు యజ్ఞాలు అవసరమా” అనే ప్రశ్నకు నేను రాసిన బ్లాగులో చెప్పిన తొండ కథలా, ఎదో విధంగా మనిషిలో నమ్మకం కలిగించాలి, నమ్మకం వున్నంతవరకే ఆయన చెప్పినది సత్యమని నమ్ముతారు. అయితే తొండ కథలోలా నమ్మకం ఎలా కలిగించాడు అనేదానికంటే రోగం కుదిర్చాడా లేదా అన్నదే ముఖ్యం.
ఆ విధంగా చూస్తే ఆయన సాధించినవి అద్బుత విషయాలే! ఎడారి జిల్లాలో ఒక కుగ్రామాన్ని పట్టణం చేయగలిగాడు, ఎందరో పేదలకు వైద్యసౌకర్యం కలిగించగలిగాడు, ఎన్నో పల్లెలకు నీటి సౌకర్యం కలిగించగలిగాడు. ఇంకా ఆయన భక్తులు భక్తులు ప్రపంచమంతా ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు.
నేను చెప్పొచ్చేదేమిటంటే మంచికార్యాలు చేయడం ద్వారానే మనం దేవుడి అభిమానాన్ని సంపాదించుకోగలం (మీరు దేవుని నమ్ముతున్నట్లయితే) అతని చుట్టు భజన చేసి, దండకాలు పఠించి, కాకా పట్టడం వల్ల కాదు.
ఒక మంచి యజమాని దగ్గర అతనికి నచ్చినట్లుగా పనిచేయడం వల్ల అతని ప్రీతి పొందగలము కానీ అతని వెనకాల వుండి వందిమాగధునిలా పొగడడం వల్ల కాదు. ఈ భూమి, విశ్వం, వున్నదీ లేనిదీ, చెట్టూ పుట్టా అన్నీ అన్నీకూడా ఆయన పెరడు, ఆయన ఆటస్థలం, నాటక స్థలం. ఈ జీవులన్నీ కూడా ఆయన పుత్రులో పౌత్రులో లేదా ఆయన అంశలో. వీటికి సేవ చేయడం ద్వారా, ఈ ఆటస్థలాన్ని శుబ్రంగా వుంచటం ద్వారా, జీవులన్నీ పరస్పర సహకారముతో జీవించడం ద్వారా కదా ఆయన అభిమానాన్ని పొందగలం! అది వదిలేసి అతని చుట్టుచేరి లేదా ఆయన ఫోటోనో, ప్రతిమనో పెట్టి పూజించి డప్పులు కొట్టి, అలంకారాలు చేసి, నినాదాలు చేసి (రాజకీయనాయకులకు జిందాబద్‌లు కొట్టినట్లు.) …. ఇదా నిజంగా సత్యవంతుడైన, నిజాయితీ గల దేవున్ని తృప్తిపరిచే మార్గం?
రాజుకు వందిమాగధులు చేసే పనా మనం చేయాల్సింది?
మూర్ఖత్వం కాదా యిది?

– ప్రసాద్