నమ్మకం

తేది:August 20, 2007 వర్గం:ఆధ్యాత్మికం రచన:చరసాల 909 views

ఆ శక్తి దృష్టిలో మనందరమూ ఒకటే నిప్పు ఎవ్వరినైనా కాలుస్తుంది, నీరు ఎవ్వరినైనా తడుపుతుంది. ఇదీ అంతే ఆ శక్తి దృష్టిలో నమ్మేవాడు ఎంతో నమ్మని వాడూ అంతే. దానికి నా వాడు నీ వాడు అనే విచక్షణ లేదు.

ప్రకృతి X మనిషి

తేది:July 20, 2007 వర్గం:ఆధ్యాత్మికం రచన:చరసాల 819 views

ఒక నిర్జన ప్రదేశంలో ఎలా చేరుకొన్నారో గానీ ఓ పదిమంది వున్నారు. వాళ్ళంతా ఆకలి దప్పులతో వున్నారు. అందులో కొందరు తెలివైన వారు, కొందరు మూర్ఖులు, కొందరు పనిచేయగలవారు, కొందరు చేయలేని వారు. ఆకలి అందరినీ సమానంగా వేధిస్తోంది. అలా ఆహారం కోసం వెతుకుతూ వుంటే ఓ పెద్ద చెట్టు నిండా పళ్ళతో వున్నది కనిపించింది. అందరికీ ఆకలి తీర్చేటన్ని పళ్ళు అక్కడ వున్నాయి.

“నేను” అనగా…

తేది:February 21, 2007 వర్గం:ఆధ్యాత్మికం రచన:చరసాల 11,210 views

కాలేజీ రోజుల్లో ఎందుకో గానీ అధ్యాత్మిక ధ్యాస మరీ ఎక్కువై పోయింది. హైస్కూలు రోజుల్లోనే ఒకానొక క్రిస్టియన్ ఉపాధ్యాయుడు వల్ల బైబిల్ చదివే అవకాశం కలిగింది. చిన్నప్పుడు ఘంటసాల నోటినుండి వచ్చిన గీతే కాకుండా ఎవరెవరో రాసిన గీత వాఖ్యానాలు చదవడమూ అయ్యింది. ఇంచుమించు నాలుగవ తరగతిలో వున్నప్పుడే మా వూరి ఒక ముసలామె (రాసమ్మ గారామె) తన దగ్గర వున్న బ్రహ్మం గారి జీవిత చరిత్ర తెచ్చి నాతో చదివించుకొనేది. అందులో సిద్దయ్య వేసిన యోగాసన చిత్రాలు చూసి నేనూ అలా చేయడానికి ప్రయత్నించేవాన్ని.
ఇక కాలేజీ రోజుల్లో తెలుగులో వున్న ఖురాను దొరకబుచ్చుకోవడానికి నా ప్రయత్నం చాలానే చేశాను గానీ ఫలించలేదు. ఇప్పటికీ చదవాలన్న కోరిక వుంది. కానీ తెలుగులొ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. బ్రహ్మకుమారీ సమాజానికీ వెళ్ళాను. అక్కడ వారు దేవునికి రూపం కల్పించడం నాకు నచ్చలేదు. ఇక గణపతి సచ్చిదానంద సమావేశాలకు వెళ్ళాను. ఆయన చేసే యజ్ఞాలమీద నాకసలు నమ్మకం కలుగలేదు. ఎంతో భక్తితో మిత్రులతో కలిసి ప్రతి శనివారం సాయంత్రం వేంకటేశ్వరుని గుడికి వెళ్ళేవాన్ని..రాతి విగ్రహం కనిపించేదే గానీ, దేవుడు కనిపించేవాడు కాదు.

ఎన్ని చోట్లకు వెళ్ళినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎందరి వుపన్యాసాలు విన్నా దేనిమీదా గురి కలగలేదు. కానీ, నిన్నా మొన్నటి వరకూ (నాలుగేళ్ళ క్రితం వరకూ) ఆత్మ, పరమాత్మ వున్నాయని నమ్మకముండేది. ఎంతు లోతుకు వెళ్ళినా “ఎలా” జరుగుతున్నదో చెప్పే సైన్సు, “ఎందుకు” జరుగుతుందో చెప్పలేక పోయినప్పుడు అదే పరమాత్మ లీల అనుకునే వాన్ని. అయితే ఒకానొక దుస్సంఘటన వల్ల నాలోని నమ్మకాలు పటాపంచలు అయ్యాయి. కొందరు సనాతన వాదులు, ఆస్తిక వాదులు ఏమంటారంటే అలాంటి దుర్ఘటనలు మనిషిని దేవుడిమీద నమ్మకాన్ని పోగొడతాయి అంటారు. అయితే కానివ్వు, చీకటిలో నడుస్తున్నప్పుడు కాలికి రాయి తగులుతుంది. అది తగిలినప్పుడే కదా అక్కడ రాయి వుందని భోధపడుతుంది? రాయి తగలడం వల్ల నిజం (జ్ఞానమ్) తెలుస్తుంటే రాయినెందుకు తప్పుపట్టాలి? నిజం అలా తెలుసుకోవడం బాధాకరమైందే అయినా లోపభూయిష్టమయిందైతే కాదు కదా? నాకూ ఈ ఆత్మ, పరమాత్మ, పూర్వ జన్మ, మలి జన్మ అన్న సిద్దాంతాలన్నీ కారుమబ్బుల్లా విడిపోయి స్పష్టంగా నిజం (సత్యం) (నేను నిజమనుకున్నది మీకు కాకపోవచ్చు) భోధపడింది. నేనీ సత్యాన్ని తెలుసుకోవడం నా సొంత జిజ్ఞాస ద్వారానే కానీ, హేతు వాద పుస్తకాలు గానీ, వాదనలు కానీ చదవడం వల్ల కాదు. అయితే ఈ మద్య కొడవగంటి రోహిణీ ప్రసాద్ బ్లాగు చూశాక నా నమ్మకానికి మరింత బలం వచ్చింది.

ఇంతకీ “నేను” అంటే ఎవరు? ఇదే ప్రశ్న ఈశ్వరీయ బ్రహ్మకుమారీలు కుడా మొదటిరోజు అడిగారు. సనాతనుల దృష్టిలో “నేను” అంటే “ఆత్మ”. అది జరామరణములు లేనిది, ఆద్యంతాలు లేనిది. దాన్ని నీరు తడుప జాలదు, అగ్ని మండింపజాలదు. నేనూ దీనిని నమ్మేరోజులలో ఆలోచనలు, జాగృతి లాంటివి ఆత్మ కలుగజేస్తున్నది అనుకున్నాను. భయం, ప్రీతి ఇలాంటివివి మనసుకు అంటే ఆత్మకు సంబందించినవి అనుకున్నాను. ఆత్మకు, మనసుకు తేడా వుంటుందేమొ, అయితే నేను చెప్పదలుచుకున్నది ఏమంటే మన ఆలోచనలు, చేష్టలు, అనుభవాలు అన్నీకూడా భౌతికమైన ఈ దేహానివే కానీ, ఆత్మ గీత్మ అనే మరో అభేద్యమయిన అర్థం కాని దానివి కాదు అని.

నాకీ మద్య ఎలాంటి విషాద వార్త చూసినా నా ప్రమేయం లేకుండానే కళ్ళంబట నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ఒక పసివాడి గుండె రంధ్రాన్నో, దిక్కులేని ముసలమ్మ యాతనో చూస్తే ఎక్కడ లేని బాధ కలుగుతుంది. ఒక్కోసారి వెక్కిళ్ళు కూడా వస్తాయి (నమ్మండి నమ్మకపొండి నిజం). చిన్నప్పటినుండి నన్ను సున్నితమనస్కుడనే అంటారు కానీ ఇప్పటి సున్నితత్వం మరీ ఎక్కువగా వుందని అనిపించింది. దానికి తోడు బరువు తగ్గడం లాంటి సమస్యలుంటే ఏమవుతుందో నాకని డాక్టరు దగ్గరికెళ్ళా. తేలిందేమిటంటే నాకు థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్‌ను ఎక్కువగా విడుదల చేస్తున్నది. దానివల్ల మెటబాలిజం ఎక్కువయి బరువు తగ్గడం, స్నో పడుతున్న వేళలో కూడా చెమటలు రావడం … ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. థైరాయిడ్ ఎక్కువయితే కోపం, చిరాకు కూడా వుంటాయిట! ఎందుకో నాకు లేవు.

ఇప్పుడు నా అనుమానము ఏమిటంటే ఈ థైరాయిడ్ వల్ల నా హృదయం ద్రవించి నేనేదైయినా సహాయం చేస్తే ఆ పుణ్యం నా ఆత్మకు దక్కాలా? థైరాయిడ్ గ్రంధికి దక్కాలా? దాని ప్రభావం వల్ల కోపంలో నేను ఏదైనా చేయరాని పని చేస్తే ఆ కర్మఫలం నా ఆత్మనంటిపెట్టుకొని మరు జన్మకు ప్రయాణిస్తుందా? నా ఆత్మ ప్రమేయము లేకుండా నా దేహంలో జరుగుతున్న రసాయినక ద్రవాల వల్ల జరిగే అనర్థాలకు నేనెలా (నా ఆత్మ) కారణం? పుట్టిన బిడ్డమీద తల్లి చూపే అవ్యాజప్రేమకు, యువతీయువకుల మద్య జనించే వ్యామోహానికి కారణం దేహములోని కొన్ని రసాయనాల వల్ల అయితే, దేహాన్ని ఆశ్రయించుకొన్న ఆత్మకు ఏ విధంగా సంబందం?

ఇప్పుడు చెప్పండి నేనంటే నా దేహమా? నా ఆత్మా?

–ప్రసాద్

అంతరాత్మ

తేది:December 27, 2006 వర్గం:ఆధ్యాత్మికం రచన:charasala 558 views

చాలా మంది అంటుంటారు “అంతరాత్మ చెప్పినట్లు వినాల”ని. అంతరాత్మ మనలో దేవుడు పెట్టిన పోలీసని, ఇలా ఇంకా ఎన్నో! కానీ నిజానికి అంతరాత్మ ఎప్పుడూ ధర్మబద్దంగానే ఆలోచిస్తుందా? అంతరాత్మకు కాలానికి అతీతంగా ధర్మమేంటో తెలుసా?
మనకు తెలియందేదీ అంతరాత్మకూ తెలియదనే చెప్పాలి. మంచేదో చెడేదో మనకే ఎక్కడో మారుమూలల్లో దాగివున్నప్పుడే ఆ అంతరాత్మ అనేది పైకి వస్తుంది.
ఒక జంతువును దేవునికి బలి ఇచ్చే అజ్ఞానికి తను చేస్తుంది తప్పని అంతరాత్మ హెచ్చరించడం కాదు కదా మొక్కిన మొక్కు తీర్చకపోవడం మాత్రమే తప్పని ఘోషిస్తూ వుంటుంది. మనమంతా పొగిడే రామ రాజ్యంలో కూడా నాలుగు వర్ణాలూ వారి వారి ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించడమే నీతి, ధర్మమూ! దానికి విరుద్దంగా నడిచినప్పుడే అంతరాత్మ వాళ్ళకి ఎదురు తిరిగేది.
మనకు తెలిసిన ధర్మమే అంతరాత్మకూ తెలుసు. కాకపోతే మనకు తెలియనట్లు నటిస్తున్నప్పుడు మనకు తెలుసుననే జాగృతి మనల్ని హెచ్చరిస్తూ వుంటుంది, అదే అంతరాత్మ.
–ప్రసాద్

అక్రమంలో క్రమం

తేది:November 8, 2006 వర్గం:ఆధ్యాత్మికం రచన:charasala 782 views

అద్వితీయ శక్తులున్న భగవంతుడున్నారనే వాళ్ళందరూ ఒక వుదాహరణ తప్పకుండా చూపుతారు. దేవుడే లేకుంటే ఈ భూమి క్రమం తప్పకుండా ఎలా తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది? ఇన్ని గ్రహాలు, నక్షత్ర మండలాలూ దేవుడి నిర్దేశం లేకపోతే ఎలా తమ తమ కక్ష్యల్లో అంత క్రమంగా తిరుగుతాయి?
నిజానికి ఇవన్నీ క్రమంలోనే వున్నాయా? ఈ సూర్యచంద్రులున్నంత వరకూ అని ఎప్పటికీ వుండాటాన్ని పోల్చుతామే ఈ సూర్యచంద్రులు ఎప్పటికీ అవిచ్చన్నంగా వుంటారా? ఈ గ్రహాలన్నీ తమతమ కక్ష్యల్లో క్రమం తప్పకుండానే తిరుగుతున్నాయా? క్రమంలో అక్రమం వుందా? లేక అక్రమంలో క్రమం వుందా?
నాకైతే అక్రమంగా వున్న ఈ అనంత విశ్వంలో తాత్కాలికమైన క్రమమే ఈ సూర్యమండలము అనిపిస్తూంది. నాసా వాళ్ళు రోజుకొకటి చూపే “సూపర్‌నోవా” లను చూసినప్పుడు, కరిగే కొవ్వొత్తిలా తరిగిపోతున్న సూర్యున్ని చూసినప్పుడూ, చెప్పా పెట్టకుండా వచ్చే తుఫానులూ, భూకంపాలూ, సునామీలు చూసినప్పుడూ నాకు ఏది క్రమంగా వుంది అనిపిస్తుంది. నిత్యమూ మార్పు చెందడమొక్కటే సత్యము! రోజురోజుకీ తనను మండిచుకుంటూ నిన్నలేని మారిన సూర్యుడే ఈరోజు వున్నాడు. నిన్నటి సూర్యుడే ఈరోజు సత్యం కానప్పుడు నిన్నటంత కాలమే భూమి ఈరోజు కూడా తిరిగిందంటే ఎలా నమ్మడం! ఈ భూమి వయసు కోటానుకోట్ల సంవత్సరాలైతే, ఈ ఓ చిన్న రోజులో ఏర్పడిన వేగంలోని వ్యత్యాసాన్ని దేనితో కొలవగలం? ప్రతిదీ మార్పు చెందుతూ వుంది, వున్నది మరోదానిగా మరోటి ఇంకో దానిలా! అయితే ఇదైనా క్రమంగా జరుగూతూ వుందా? ఈ మొత్తం మానవ సృష్టిలో ఒకరిని పోలిన మనిషి ఇంకోసారి జన్మించాడా? ప్రతిదీ మార్పు చెందుతూ వుండే క్రమంలో ప్రతిసారీ కొత్తదానిలా మార్పు జరుగుతూ వుందే తప్ప, నిర్మింపబడిన దానిలా మళ్ళీ ఏదీ నిర్మింపబడటం లేదే? మరి ఏది క్రమం? క్రమపద్దతి లేకపోవడమనే క్రమం ఒక్కటే నిజం.
కొన్ని కోట్లకోట్లకోట్ల…సంవత్సరాల ఈ విశ్వంలో ఈ సూర్యుడి వయస్సెంత? ఈ భూమి వయస్సెంత? అందులో మనిషి జీవితమెంత? అదేదో నాలుగు లక్షల సంవత్సరాలు పెద్ద కాలమైనట్లు, మనిషి సృష్టే శాశ్వతమనుకునుటెట్ల? ఆ సుదీర్ఘమైన విశ్వ సృష్టిలో ఈ సూర్యకుటుంబము జీవితమెంత? ఓ నలుసు కాదూ? ఇలాంటి ఎన్ని సూర్యుల్లు ఉద్భవించాయో, ఎన్ని సూర్యుల్లు పతనమయ్యాయో ఈ అనంత విశ్వంలో! ఈ అతి స్వల్ప సూర్యకుటుంబం జీవితంలో అత్యంత అల్పమైన రోజును చూసుకొని అంతా క్రమంగా వుందని అనుకోవడం మన వెర్రి భ్రమ కదా! అదెట్లంటే సెకనుకు 30 మైళ్ళ వేగంతో ప్రయానిస్తున్న భూమి మీద వుండికూడా నిలకడగా వున్నట్లు అనుకోవటంలా! గుండ్రంగా వున్న భూమి మీద నిలబడి అంతా బల్లపరుపుగా వుందనుకోవటంలా!
బొంగరం తిప్పినపుడు అది మొదట్లో బాగానే స్థిరవేగంతో తిరుగుతున్నట్లు అనిపించినా క్రమక్రమంగా దాని వేగాన్ని పోగొట్టుకొని చివరికి పడిపోతుంది. అది తిరిగిన మొత్తం కాలంలో ఒక చిన్న డెల్టాX కాలం లో అది స్థిరవేగంతో తిరిగినట్లే అనిపిస్తుంది అంతమాత్రాన అది ఎప్పటికీ స్థిరవేగంతో తిరిగినట్లు కాదుకదా! అలానే ఓ పెద్ద వృత్తం మీద ఓ అతి చిన్న భాగాన్ని పరిశీలిస్తే అది సరళరేఖలా కనిపిస్తుంది కదా! కానీ అది సరళ రేఖా? పెద్ద సుడిగాలిలో ఓ చిన్న భాగాన్ని పరికిస్తే ఒక్కో అణువు పక్క అణువుతో స్థిర వేగంతో పయనిస్తూ అంతా సవ్యంగా వున్నట్లే అనిపిస్తుంది కానీ సవ్యం కాదు కదా?
మరి అనంత విశ్వంలో చిన్న రేణువైన సూర్యకుటుంబం అందులో మరింత చిన్నదైన భూమి దాని వేగం దాని మీద ఏర్పడే రోజులూ, ఋతువులూ అన్నీ సక్రమంగా వున్నట్లు ఎలా అనుకోవాలి? అతిపెద్దదైన అక్రమంలో ఇది మన కంటికి కనపడే ఓ చిన్న క్రమం.

–ప్రసాద్