అంతర్జాలంలో తెలుగు వెలుగు: తెలుగునాడి సంపాదకీయం

తేది:May 3, 2008 వర్గం:నా భాష రచన:చరసాల 3,325 views

        ( ఏప్రిల్ నెల తెలుగునాడి సంపాదకీయం సంపాదకుల అనుమతితో ఇక్కడ పునర్ముద్రించడం జరిగింది. )

         1993లో మొదటిసారి నేను ఇంటర్‌నెట్‌లో (ఇప్పుడు అంతర్జాలం అని కొంతమంది తెలుగులో పిలుస్తున్నారు) తెలుగుని మొదటిసారిగా soc.culture.indian.telugu (SCIT) అనే యూజ్‌నెట్ గ్రూపులో చూశాను. అంతకు ఏడాది ముందే మొదలైన ఈ బృందం అప్పటికే మూడు పూవులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతూ ఉంది. యూనివర్సిటీలు, కంప్యూటర్ కంపెనీలతో సంభంధాలు వున్నవాళ్ళే ఎక్కువగా సభ్యులుగా ఉండేవారు. యూజ్‌నెట్ చూడలేని వారికోసం ప్రతిరోజు పోస్టులన్నీ కలిపి వరల్డ్ తెలుగు డైజెస్ట్ అనే పేరుతో ఒక ఈమెయిల్ ముందు కేటీ నారాయణ. ఆ తరువాత సీతంరాజు ఉదయభస్కర శర్మ సంపాదకత్వంలో వచ్చేది. అప్పుడు రైస్ యూనివర్సిటీలో కంప్యూటర్ డిపార్ట్‌మెంట్ విధ్యార్థులుగా వున్న కన్నెగంటి రామారావు, ఆనందకిశోర్ తెలుగుని ఇంగ్లీషులో మామూలు కీబోర్డుతో టైపుచేసే పద్దతి (RTS-Rice Transliteration Scheme) ప్రవేశపెట్టి ప్రాచుర్యంలోకి తెచ్చారు. అట్లా టైపు చేసి ఇంగ్లీషు తెలుగుని ప్రొఫెసర్ హార్డ్, ముక్కవల్లిలు తయారుచేసిన తెలుగు ఫాంట్లతో ముద్రించి తెలుగులో చూసుకొని చదువుకొనే సదుపాయం కూడా కలిగించడంతో వాళ్ళు ఆ గ్రూప్‌లో పెద్ద హీరోలైపోయారు.

        ఆ రోజుల్లో వివిధ విషయాల మీద ఘాటు ఘాటు చర్చలు వేడివేడిగా (అప్పుడప్పుడూ ఆకాశరామన్నలు వాడిన అచ్చమైన సంస్కృతంతో సహా) జరుగుతూ వుండేవి. నన్నెచోడుడి తెలుగు దగ్గర నుంచి నాగార్జున సినిమాల వరకూ, కూచిపూడి నృత్యం నుండీ పెసర పప్పు పాయసం వరకూ కాదేదీ చర్చ కనర్హం అన్నట్లుగా వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి. రాజకీయాలు, సినిమాల విశేషాలు ఏరోజు కారోజే- కొండొకచో వెనువెంటనే- తెలుసుకోగలగడం మంచి థ్రిల్లింగ్‌గా వుండేది. ఆ తరువాత వచ్చిన తెలుసా, రచ్చబండ చర్చావేదికలకు మూలాలు SCITలోనే నేను తెలుసుకున్నాను. అమెరికాలోనూ, యూరప్‌లోనూ ఉన్న తెలుగు సాహిత్యాభిమానులు చాలామంది నాకు ఆ రోజుల్లో SCITలోనే పరిచయమై మంచి మితృలయ్యారు.


        ఆ తర్వాత కొన్నాళ్ళకు వరల్డ్‌వైడ్‌వెబ్, మొజాయిక్, నెట్‌స్కేప్ బ్రౌజర్లు ప్రాచుర్యంలోకి రావడంతో మిగతా ఇంటర్‌నెట్ స్వభావంతో పాటు, తెలుగు కూడళ్ళ స్వరూ స్వభావాలు కూడా మారిపోయాయి. శ్రీనివాస్ శిరిగిన, పద్మ ఇంద్రగంటి, మరిద్దరు కలిసి మొదటి ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైటు సృష్టించడం ఆ రోజుల్లో గొప్ప కలకలం. సిటి కేబుల్‌వారు (ప్రస్తుతం టీవీ9లో వున్న) రవి ప్రకాశ్ నిర్వహణలో మొదటి తెలుగు పోర్టల్‌ని తీసుకువచ్చారు. ఆ తరువాత కొన్ని వార్తా పత్రికలు తమ పత్రికలకు వెబ్ ఎడిషన్లు మొదలు పెట్టాయి. తెలుగు సినిమా డాట్‌కామ్‌తో మొదలైన చలన చిత్రాల సైట్లు, ఈమాటతో మొదలైన తెలుగు వెబ్‌జీన్లూ ఇంటర్‌నెట్‌లో తెలుగు వాడకాన్ని విస్తృతంగా పెంఛాయి. ఇప్పుడు అమెరికాలో చాలా తెలుగు ఇళ్ళలోనూ, దాదాపు అన్ని కంప్యూటర్ కంపెనీల్లోనూ, యూనివర్సిటీలలోనూ, వ్యాపారసంస్థల్లోనూ తెలుగు వార్తాపత్రికల వెబ్‌సైట్లు తెరవకుండా రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు.

        ఇవన్నీ కూడా గతకాలపు కబుర్లు. ఇప్పుడు ఇంతర్‌నెట్‌లో మరెన్నో కొత్త పోకడలొచ్చేశాయి. బ్లాగులు, యూట్యూబ్ వైరల్ వీడియోలు, వికీపీడియాలు ఇంటర్‌నెట్‌ని కొత్త దిశకు తీసుకుపోతున్నాయి. యూనికోడ్ విస్తృతంగా వాడటం మొదలుపెడితే కానీ ఈ ఫలితాన్ని తెలుగులో పూర్తిగా అనుభవించలేమని గుర్తించిన ఒక కొత్త తరం, దీనిని ఒక ఉద్యమంగా చేపట్టి, చొరవగా సాంకేతిక ఇబ్బందుల్ని అధిగమించి, కొత్త శిఖరాలను అధిష్టిస్తోంది. భారత భాషలన్నింటిలోకీ వికీపీడియాలో తెలుగుదే అగ్రస్థానం కావటం వెనుక ఈ తరం కృషి, దీక్ష వున్నాయి.

        తెలుగు కంప్యూటరీకరణ కొత్త మార్గాలను తొక్కినప్పుడల్లా, దాన్ని నడిపించింది ప్రభుత్వ సంస్థలూ, విశ్వవిద్యాలయాలూ, అకాడెమీలూ, తెలుగు సంస్థలూ కాదు. భాష మీద ప్రేమతో, సంస్కృతి చరిత్రలపై మక్కువతో నిస్వార్థంగా తమ మేధనీ, శ్రమనీ, సమయాన్నీ, సంపాదననీ లెక్క పెట్టకుండా ఖర్చు చేస్తున్న స్వచ్చంద సేవకులే. వారికి వందన సూచకంగా, మా కృతజ్ఞలతో ఈ నేల ప్రత్యేక వ్యాసం ప్రచురిస్తున్నాము.


        తెలుగు చలన చిత్ర జగత్తులో కొన్ని దశాబ్దాల పాటు బహు శోభనంగా ప్రకాశించిన సోగ్గాడు శోభన్‌బాబు అకస్మాత్తుగా మరణించడం విషాదం. ఆయన కుటుంబానికి, అభిమానులకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ ఈ సంచికలో నివాళి అర్పిస్తున్నాము.


        ఈ సర్వధారి నామ సంవత్సరం మీకు సర్వ శుభాలూ కలుగజేయాలని ఈ ఉగాది సందర్భంగా ఆశిస్తూ…

జంపాల చౌదరి

నేను (బహుశా మీరు కూడా) మరిచిపోతున్న తెలుగు పదాలు:

తేది:June 7, 2006 వర్గం:నా భాష రచన:charasala 6,853 views

చట్టి : మట్టీతో చేసిన చిన్న పాత్ర. కూరలు చేయడానికి ఉపయోగిస్తారు.మూకుడు: చట్టీ లేదా కుండ మీద మూయడానికి ఉపయోగించే మట్టితో చేసిన వృత్తాకారపు పాత్ర.

ఉట్టి: (బహుశా కృష్నాష్టమి పుణ్యమా అని ఇది మాత్రం గుర్తుండవచ్చు) తాళ్ళతో తయారుచేసిన వలలాంటి వస్తువు. దీన్ని ఇంటిలో పైన కర్రలకు వేలాడదీస్తారు. పిల్లులనుండీ, చీమల నుండీ, చిన్న పిల్లల నుండీ వంటలను కాపాడడనికి ఉపయోగిస్తారు. గోపికలు వెన్నని కృష్నుడికి అందకుండా వీటిమీద దాచేవారు. వాడుకలోని సామెత: ఉట్టికి ఎక్కలేని వాడు స్వర్గానికి ఎక్కునా?

పొంత: పొయ్యిలో మూడవ రాయికి బదులుగా ఉపయోగించబడే నీళ్ళతో నింపిన కుండ. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే వంట అయేసరికి కుండలోని నీళ్ళుకూడా కాగి స్నానానికి ఉపయోగపడతాయి.

ముంత: మట్టితో చేయబడిన చిన్న పాత్ర, నీళ్ళు, మజ్జిగ, కల్లు లాంటి ద్రవాలు త్రాగడానికి ఉపయోగించేది.

తలుగు: ఆవును లేదా గేదెను కట్టివేయడానికి వాడే తాడు.

చూరు: కర్రలతో కప్పబడిన ఇంటికి గోడ దాటి బయటకు వచ్చిన కప్పుభాగము. వాడుక సామెత: కాళ్ళు పట్టి లాగితే చూరు పట్టుకు వేలాడినట్లు.

వాసము: ఇంటి పైకప్పుకు వాడే పొడవాటి బలమైన కర్ర.

దూలము: ఇంటి రెండు గోడలను కలుపుతూ పైకప్పుకు ఆధారమైన పెద్ద బలమైన కర్ర.

నిట్రాయి: చుట్టిల్లుకు ఇంటి మద్యలో నాటబడి పైకప్పును మోసే పెద్ద దూలము.

చుట్టిల్లు: వృత్తాకారములో కట్టబడిన ఇల్లు.

నులక: కర్ర మంచాన్ని అల్లడానికి ఉపయోగించే సన్నటి తాడు.

నులక మంచము: నులకతో అల్లబడిన మంచము.

మంచంకోళ్ళు: మంచము యొక్క నాలుగు కాళ్ళు.

జాలాడు: స్నానం చేసే దొడ్డి.

పంచ: ఇంటి ద్వారము బయట ఇరువైపులా ఉన్న ప్రదేశము. సాధారణంగా ఈ ప్రదేశములో అరుగులు ఉంటాయి.

చటాకు: పావులో సగము. 0.125

బాన: పెద్ద కుండ.

దొంతి: కుండ మీద కుండ పెట్టి ఏర్పరిచిన కుండల వరస. కింద పెద్ద కుండ దానిమీద కొంచము చిన్నకుండ అలా పెట్టుకుంటూ పోతారు.

గుంజ: ఆవును లేదా గేదెను కట్టివేయడానికి పాతిపెట్టబడిన కర్ర. పందిరికి ఆధారంగా పాతిన కర్ర.

ఎనుము: రాయలసీమలో గేదెను ఎనుము అంటారు.

పడ్డ: ఇంకా ఈనని వయసులో ఉన్న పడచు గేదె.

పరాందం కాయ: బొప్పాయి పండు.

కపిల: ఎద్దులు, బొక్కెన సహయముతో వ్యవసాయానికి బావి లోంచి నీళ్ళను తోడే పద్దతి.

బొక్కెన: ఎద్దుల సహాయముతో బావిలోంచి నీళ్ళను తోడటానికి ఉపయోగించే పెద్ద తోలు సంచి.

మోకు: బొక్కెన లాగడానికి ఉపయోగించే పొడవైన, లావైన తాడు.

కాడి: రెండు ఎద్దుల మెడ మీద ఉంచే కర్ర. దీనికి ఎద్దుల మెడకు కట్టాడనికి కావలిసిన పట్టెడలు ఉంటాయి.

పట్టెడ: తాళ్ళతో తయరి చేసిన బెత్తెడు వెడల్పు, మూరడు పొడవుండి కాడికి ఎద్దులను కట్టివేడానికి ఉపయోగించేది.

కుప్పె: ఎద్దు కొమ్ముల చివర్లకు తొడిగే లొహంతో చేసిన అలంకార వస్తువు. (ఎద్దు వాడైన కొమ్ముల నుండీ రక్షణ కొరకూ కూడా)

గాడి: ఎద్దులకు మేత వేయుటకు చుట్టూరా రాతి బండలతో గాని, కర్రలతో గాని ఏర్పరిచిన ప్రదేశము.

కుడితి: గేదెలు తాగే తవుడు, అన్నము, గంజి కలిపిన నీళ్ళు.

చిక్కము: ఎద్దులు పంటను తినకుండా మూతులకు కట్టే, తీగలతో చేసిన వస్తువు.

– ఇంక గుర్తు రావటం లేదు. ఈ పదాలు కడప జిల్లా, రామాపురం మరియు లక్కిరెడ్డి పల్లె ప్రాంతాలలో వాడె పదాలు. మీకు తెలిసినవి కూడ ఇందులో చేర్చండి. వీలైనప్పుడల్ల విటిని వాడండి. లేకపొతే కొన్నాళ్ళకు చాలా పదాలు మనకు కనపడకుండ పొయే ప్రమాదం ఉంది.

– ప్రసాద్