మా వూరి సంగతులు – తెలుగు వాడి ఇక్కట్లు

తేది:July 12, 2008 వర్గం:అనుభవాలు రచన:చరసాల 2,628 views

అమెరికా నుండీ ఇండియాకు మా ప్రయాణం ఈసారి కువైట్ మీదుగా జరిగింది. ఈ ప్రయాణంలో మరియు తిరుగు ప్రయాణంలో నన్ను బాగా వ్యధకు గురిచేసిన అంశం ఒకటుంది.

వాషింగ్టన్ డల్లస్ విమానాశ్రయం నుండీ United Airlinesలో కువైట్‌కు ప్రయాణం. మామూలుగానే విమానంలో సూచనలన్నీ ఆంగ్లం మరియు అరబ్బీలలో చెప్పారు. అలాగే బయలుదేరే ప్రదేశలో మరియు వెళుతున్న ప్రదేశంలో స్థానిక సమయం, ఉష్ణోగ్రతా వివరాలు చెప్పారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిందీ చెప్పుకోదగ్గదీ ఏమీ లేదు.

అయితే అదే కువైట్ నుండీ హైదరాబాదు ప్రయాణం Kuwait Airlinesలో. సంప్రదాయం ప్రకారం అయితే బయలుదేరుతున్న ప్రదేశం మరియు గమ్యస్థానాల భాషలలో (అరబ్బీ మరియూ తెలుగులలో) సూచనలు ఇవ్వాలి. ఇంకో విధంగా చూసినా ఆ విమానంలో 80 శాతం మంది తెలుగు మాతృభాషగా వున్నవారే వున్నారు. ఆ విధంగా చూసినా తెలుగులో సూచనలు వుండాలి. వుహు, నా అంచనాలకు విరుద్దంగా ఆంగ్లం, అరబ్బీ మరియూ హిందీలలో సూచనలు ఇచ్చారు. సరే ఈ కువైటీలకు మన తెలుగు తెలిసి చావదులే అనుకొని సరిపెట్టుకున్నా.

ఇక నా తిరుగు ప్రయాణం కువైట్ మీదుగానే అయినా ఇది హైదరాబాదు నుండీ కువైట్‌కు  Air Indiaలో. ఇప్పుడు మాత్రం సూచనలు తెలుగు, అరబ్బీ, ఆంగ్లాలలో వుంటాయని ఆశించా. వుహు.. నేను పప్పులో కాలేశా. ఇప్పుడు కూడా ఆంగ్లం, హిందీ మరియూ అరబ్బీలలోనే వినిపించారు. నా పక్క సీట్లో ఓ ముసలాయన కూచున్నారు. కర్నూలు దగ్గర ఓ పల్లెట. కువైట్‌లో తన కూతురు దగ్గరకు వెళుతున్నానని చెప్పారు. ఆయనకు బహుశా ఈ విమాన ప్రయాణం మొదటిదిలా వుంది. ఈ మూడు బాషలూ ఆయనకు డబ్బాలో గుళకరాళ్ళ శబ్దంలా వుంది తప్ప ఏదీ అర్థం కావట్లేదు. నేను కాస్తా చొరవచేసి తెలుగులో మాట్లేడేసరికి ఆయన మహదానందపడిపోయి ఎడారిలో ఒయాసిస్సు దొరికినంత సంబరపడ్డాడు.

కువైట్ జనాభా ఇంచుమించు 30 లక్షలు. కువైట్ వైశాల్యం 17,818 sq km. మన రాష్ట్ర జనాభా 8 కోట్ల పైమాటేనా? మన రాష్ట్ర వైశాల్యం 2,76,754 sq km లట! అయినా తెలుగు మాత్రమే తెలిసిన మన తెలుగు వాడికీ దుర్గతి ఏమిటి?

అదేగాక హైదరాబులో దిగే ముందు కస్టమ్స్ వాళ్ళ declaration forms ఇచ్చారు. అవి ఆంగ్లం మరియు హిందీలలోనే వున్నాయి. ప్రయాణీకుల్లో తెలుగు రాయడం, చదవడం వచ్చినా అవి నింపడానికి నాలాంటి వాళ్ళను బ్రతిమాలుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళు నేర్చుకొనే పాఠమేమిటి? తమ పిల్లలకైనా హిందీనో, ఇంగ్లీషో నేర్పిస్తే ఈ యాచించే బాధ తప్పుతుందనేగా!

మరో అన్న మళ్ళీ రావాలి.

–ప్రసాద్

మా వూరి సంగతులు – ఎత్తుకు పోయే వాడొచ్చాడు!

తేది:July 11, 2008 వర్గం:అనుభవాలు రచన:చరసాల 2,122 views

మా వూరిలో జరిగిన ఓ తమాషా సంఘటన ఇది. అయితే ఇది పరస్పర మానవ నమ్మకాల్లో వున్న లోటును చెబుతుంది. ఓ అపరిచిత వ్యక్తి పల్లె పట్టుల్లో సంచరించడం ఎంత ప్రమాదకరమో కూడా చెబుతుంది.

మేము ఇండియా వెళ్ళాక మా తమ్ముడు దిలీపే కారు నడిపేవాడు. నాకు గేర్ల కారును నడిపిన అనుభవం లేదు. పైగా ఆ ట్రాఫిక్కును చూసి నడపాలన్న ఉత్సుకత నాకు లేకుండా పోయింది. అయితే ఓ వారం తర్వాత దిలీప్ చెన్నయ్ వెళ్ళిపోవడంతో కారును నడపడం నాకు తప్పలేదు. అసలు రోడ్లమీద నడిపే ముందు సంచారంలేని రోడ్డుమీద కాస్తా గేర్ల మీద పట్టు సాధిద్దామని కారు తీసుకొని మా పోలాల వైపు మట్టిరోడ్డు మీద వెళ్ళాను.

ఆ రోడ్డు తిన్నగా మా పొలాలని దాటి అడవివైపు దారితీసిందిగానీ, ఎక్కడా కారును సజావుగా వెనక్కి తిప్పుకోగలిగిన అనువైన స్థలం కనిపించలేదు. చివరికి ఓ చోట ఎలాగోలా వెనక్కు తిప్పుకొని వస్తుంటే, దారిలో భుజాన ఓ కర్ర పెట్టుకొని నడుస్తూ వస్తున్న మా వూరి పెద్ద సుబ్బరాయుడు కనబడ్డాడు. సరే ఎలాగూ వూరికే వెళ్తున్నాగదా అని కారు ఆపి, “అయ్యా, కూచో వెళదాం” అన్నా. ఆయన “నాకిక్కడ పనుంది, నేనిటు వెళ్ళాలి” అని చరచరా రోడ్డు దిగి మరోవైపుకి వెళ్ళిపోయాడు. “అబ్బీ నువ్వెవరు?” అనిగానీ, “ఎప్పుడొచ్చావు?” అనిగానీ ఏమీ అనకపోయినా, రాయలసీమ మాటా, మనసు తెలిసిన వాన్ని గనుక, చిన్నబుచ్చుకొన్న మనసును జోకొట్టి మామూలుగానే ఇంటికి వచ్చాను.

ఇంటికి వచ్చిన కాసేపట్లో వూర్లో పుకారు ఏమంటే “ఎవడో మనుషులను ఎత్తుకుపోవడానికి కారేసుకు తిరుగుతున్నాడనీ, పెద్ద సుబ్బరాయుడిని కారెక్కమంటే తనెలాగో తప్పించుకొని పొలాలమీద అడ్డదిడ్డంగా నడిచి వూరు చేరుకొన్నాడనీ.”

హతవిధీ! అది నేను పుట్టిపెరిగిన వూరు కాబట్టి సరిపోయింది. ఇంకా నన్నెరిగిన వాళ్ళు బ్రతికివున్నారు గనుక సరిపోయింది. ఈయన మాటలు విని నన్నెరగని వాళ్ళు నన్ను కిడ్నాపరని చితగ్గొట్టలేదు కాబట్టి బతికిపోయా!

బాబ్బాబూ, మీరెవరూ మీకు తెలియని పల్లెపట్టుల వైపు వెళ్ళకండి. పిల్లల కిడ్నాపర్లంటూ చితగ్గొట్టడమే కాదు చంపినా దిక్కులేదు. (కడప జిల్లా వార్తల్లో ఈ మధ్య ఇలాంటివి ఎక్కువయిపోయాయి.)

–ప్రసాద్

వూరెళ్ళి చేసిన పనులు

తేది:July 10, 2008 వర్గం:అనుభవాలు రచన:చరసాల 1,495 views

చేయాల్సిన పనులంటూ లిస్టు రాసుకున్నా చేసినవి చూసుకుంటే పదింటిలో రెండే చేయగలిగాను.

1) బావిలో పిల్లలతో కలిసి ఈత కొట్టాను.
2) అన్నం మెతుకులు వేసి దగ్గరికి వచ్చే చేప పిల్లలను కాదు గానీ, వేయకుండానే దగ్గరికి వచ్చిన చేప పిల్లలని చూపించాను. అయితే ఆనందిస్తుందేమో అనుకుంటే ఇక ఈదనే ఈదనని మంకు పట్టి కూర్చింది మా అమ్మాయి!
3)వెళ్ళింది వెన్నెల కురిసే సమయం కాదు కాబట్టి అంత వెన్నెలా లేదు, ఈత చాప అసలే లేదు. అయితే డాబా మీద చుక్కల పందిరి కింద పడుకుని నిద్రించే అదృష్టం మాత్రం దక్కింది. (దోమలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి పడుకోనిచ్చినందులకు)
4) పచ్చి శనక్కాయలు దొరకలేదు గానీ వుడకబెట్టిన పచ్చి అలసంద కాయలు (ఇతర ప్రాంతాల్లో వీటిని మరోలా పిలుస్తారనుకుంటా) తిన్నా.
5) వూరినీ, శివాలయాన్నీ, వూరిలో కడగొడుతున్న దీపాలనీ ఫోటోలయితే తీశాను గానీ వెంట తెచ్చుకోవడం మరిచాను.
6) పెద్ద గుండయితే ఎక్కాను గానీ, పాట పాడలేదు.

–ప్రసాద్

రామయ్య గారి పెద్దమ్మ

తేది:May 23, 2008 వర్గం:అనుభవాలు రచన:చరసాల 1,981 views

ఆమె అసలు పేరేంటో నాకు తెలియదు. నా చిన్నప్పటి నుండీ ఇతరులు “రామయ్యగారామె” అంటుంటే విన్నాను, నేను “పెద్దమ్మా” అని పిలిచాను. మా అమ్మ మేనమామ భార్య ఈమె. మొదట్నుంచీ ఈమె నాకు విలక్షణంగానే కనిపించేది. ఎక్కడా వూరి గొడవల్లో తలదూర్చగా నేను చూడలేదు, దూర్చిందని ఎవరైనా చెప్పగా నేను విననూ లేదు. ఆమె పనేదో ఆమె చూసుకొనేది. కొందరికామె తల పొగరుది గానో, గర్విష్టిగానో కనపడ్డా నాకామె తల వంచనిదిగా, ఆత్మబలం కలదిగా అనిపిస్తూ వచ్చింది.

మా రామయ్య పెద్దమ్మకి ఒక కూతురూ, ఒక కొడుకూ వుండేవారు. కూతురు కొంచం కచ్చదానిలా వుండేది. ఆమెని నాగయ్య అనే అతనికి ఇస్తే, అతను నాటుబాంబులు చుడుతూ, పొరపాట్న అవి పేలి ఆసుపత్రి పాలయి, ఆ తర్వాత జైలు పాలయ్యాడు. అందువల్ల కూతురు నాకు తెలిసి ఎప్పుడూ వీళ్ళ దగ్గరే వుండేది. ఆ కూతురికి ఒకే కూతురు, పేరు నాగ రత్నం. నాకంటే మూడు నాలుగేళ్ళు పెద్దదేమొ. చిన్నప్పుడు వీధుల్లో వెన్నెల్ల్లో ఆదుకునే పిల్లల గుంపులకు ఆమే నాయకత్వం వహించేది. మాట కొంచం కరుకు, రంగు బాగా నలుపు. అయినా మంచి మెరుపు వుండేది. వున్నంతలో నాగరత్నం అల్లారుముద్దుగానే పెరిగింది. నాగరత్నాన్ని ములకల చెరువు దగ్గర ఎవరికో ఇచ్చి పెళ్ళి చేశారు.

రామయ్య పెద్దమ్మ కూతురు (పేరు గుర్తు లేదు) ఒకరోజు పందిరికింద కూర్చుని బియ్యంలో రాళ్ళేరుతుంటే పందిరి వాసం ఒకటి జారి తలమీద పడి చచ్చిపోయింది. వాళ్ళమ్మ చచ్చిపోయాక నాగరత్నం మా వూరికి ఎప్పుడొగానీ రాలేదనుకుంటా! నాగరత్నం నాన్న జైలు నుంఛీ వచ్చాక ఎక్కడ వుండేవాడో గానీ మా వూరికి ఎప్పుడూ వచ్చినట్లు నేను వినలేదు.

ఇక రామయ్య పెద్దమ్మ కొడుకు, నరసయ్య విషయానికి వస్తే, చిన్నప్పటినుంచీ పెద్దగా కష్టపడిన రకం గాదు. పెద్దయ్యాక కొంచం తాగుడు అలవాటయ్యింది. తాగుడు ముదిరో, తాగింది వికటించో పెళ్ళయిన రెండేళ్ళకే చనిపోయాడు. నరసయ్య భార్య కొద్ది రోజులు ఏడ్చి, పెద్దలు మరో పెళ్ళికి వప్పిస్తే చేసుకొని వెళ్ళిపోయింది.

ఇలా కొడుకూ, కూతురూ తమ కళ్ళ ముందే చనిపోయినా ఎలాగో తమ బ్రతుకు బ్రతుకుతున్న పెద్దమ్మ భర్త వయసు మీదపడి, ఆయనా పోయాడు. తను ఒక్కర్తే అయ్యింది. మనుమరాలు నాగరత్నం దగ్గరికీ ఈమె వెళ్ళలేదు. ఎంత ముదిమి మీదపడ్డా ఎవరిదగ్గరా దేహీ అనలేదు. ధైర్యం సడలిపోలేదు. తనేం సంపాదించేదో, ఎలా వండుకొనేదో గానీ ఆ పూరింట్లో తనొక్కతే జీవించేది. ఎవరైనా దయతల్చి ఆమెకింత కూర ఇస్తే సరే, ఆమె మాత్రం కూర కావాలనో, అన్నం కావాలనో ఎవరింటికీ వచ్చి అడిగేది కాదు. ముఖ్యంగా మా యింటికయితే వచ్చేది గాదు.

ఈమెది మరీ ఛాదస్తం అనుకునే వాళ్ళం. మా అమ్మాయి పుట్టిన రోజు వేడుక వూర్లో జరుపుతూ వచ్చి భోజనం చేసివెళ్ళమంటే రాలేదు. అయితే మనం తీసికెళ్ళి ఇస్తే మట్టుకు తీసుకొనేది. నేను గానీ, అన్నయ్య గానీ, తమ్ముడు గానీ వూరికెళ్ళినపుడు పదో పాతికో చేతికిస్తే తీసుకొనేది.

నాకయితే ఇద్దరు పిల్లలని కని పెళ్ళిళ్ళు చేసి, మనవరాలిని పెంచి పెద్దచేసి పెళ్ళి చేసి, ఒక్కరొక్కరే తనకళ్ళ ముందే రాలిపోతుంటే, ఆమె మానసిక స్థితిని, ఒంటరితనాన్ని తలచుకొంటే బాధతో మనసు విలవిల్లాడుతుంది. తలచుకొనే నాకే ఆ స్థితి అంత దుర్భరమైతే ఆమెకు ఎలా వుంటుందో కదా అని ఎప్పుడూ నాకనిపిస్తూ వుంటుంది. ఇంటికి ఎప్పుడు ఫోను చేసినా ఆమె గురించి వాకబు చేసేవాన్ని.

కొద్ది రోజుల క్రితం మా తమ్ముడితో మాట్లాడుతూ రామయ్య గారి పెద్దమ్మ గురించి వాకబు చేస్తే గుండెను పిండే విషయం తెలిసింది. కొన్నాళ్ళ క్రితమే ఆమె మనుమరాలు నాగరత్నం కూడా ఏదో జబ్బు చేసి చనిపోయిందట! తనచేతుల మీద పెరిగిన తన కొడుకు, కూతురు చివరికి మనుమరాలు కూడా చనిపోయాక చిట్ట చివరిరోజువరకు అత్యంత ఆత్మనిబ్బరంతో స్వశక్తితో, ఎవరి సహాయం యాచించకుండా, ఆశించకుండా బతికిన మా రామయ్యగారి పెద్దమ్మ ఈ మధ్యనే చనిపోయిందని తెలిసి ఉద్వేగానికి లోనయ్యాను.

అంత ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో బతకడం ఎందరికి చేతనవుతుంది? పెద్దమ్మకి వందనాలు.
 

Dr. Seuss’ Horton Hears a Who – అనగా అనగా ఓ సినిమా

తేది:April 19, 2008 వర్గం:అనుభవాలు రచన:చరసాల 1,889 views

ఈస్టర్ ఆదివారం మాల్‌కు తీసికెళ్ళి ఈస్టర్ బన్నీ చూపెడతానని మా పిల్లలకు వాగ్దానం చేసివున్నా. ఆయితే తీరా మాల్‌కు వెళితే అది ఈస్టర్ సందర్భంగా మూసి వుంది. ఇకా మా అమ్మాయి గోల ఆపడం కోసం అయితే నేను మిమ్మలని ఓ మూవీకి తీసుకెళతా అన్నా, ఏదో ఒక పిల్లల సినిమా వుండక పోతుందా అని.

తీరా అక్కడికి వెళితే చిన్నపిల్లలు చూడగల సినిమా ఇది (Dr. Seuss’ Horton Hears a Who) ఒక్కటే.

చిన్న విషయాలకు వాగ్దానభంగం చేయటం నాకిష్టం వుండదు. ఆ సినిమా గురించి నాకేమీ తెలియక పోయినా ‘G’ rating చూసి వెళ్ళాం.

సినిమా మా పిల్లలకు అర్థమవకపోయినా ఆ ఏనుగు మాత్రం చాలా నచ్చింది. నాకు మాత్రం అది పిల్లలకంటే గూడా పెద్దలకు ప్రత్యేకించి నాలాంటి అవిశ్వాసకుల కొరకు తీశారా అన్న అనుమానం వచ్చింది.

ఎందుకంటే…
 నాకు ఆ ఏనుగు క్రీస్తులా, ఆ కనిపించని బుల్లి జీవులు మానవుల్లా, ఆ బుల్లి ప్రపంచం మేయరు భగవంతుని వునికిని తెలుసుకొన్నవాడిలా … అలా కనిపించారు.
ఈ సినిమాలో విలన్, కంగారూ “కంటికి కనిపించని, చెవులకు వినిపించని జీవి వుండి వుండటం అసంభవం” అంటుంది. ఈ వాదన “దేవుడు లేడనే” అవిశ్వాసుల వాదనను పోలివుంటుంది.

నిజంగా ఆ సినిమా వుద్దేశ్యం అదో కాదో తెలియదు కానీ నాకు మాత్రం ఆ సినిమా అలా క్రైస్తవ ప్రచారంలా అనిపించింది. లేక నేను గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుము కొన్నానో.

చివరి మాట: నిజానికి ఈ సినిమా ఈస్టర్ రోజున చూసిన వెంటనే నాలో రేగిన భావాల మూటనంతటినీ జారిపోకుండా బ్లాగులో సర్దుదామనుకున్నా… అదేమిటో ఇంట్లో గానీ బయట గానీ ఓ క్షణం తీరిక దొరకటం లేదు. ఏదో అరా కొరా సమయం చిక్కుతుంది కానీ నా మట్టుకు నాకు బ్లాగులో నా హృదయాన్ని ఆవిష్కరించాలంటే ఆ సమయం సరిపోదు. మనసులోని భావానికీ, కీబోర్డు మీది వేళ్లకీ మధ్య ఎలాంటి అడ్డంకి లేని ధార కుదిరినప్పుడే రాయగలుగుతాను. ఇదెందుకో ఈ మద్య కరువయ్యింది.

–ప్రసాద్