మా దీపావళి

తేది:October 19, 2017 వర్గం:అనుభవాలు, చరిత్ర రచన:చరసాల 3,056 views

దీపావళి సందర్భంగా మళ్ళీ నా కథ, మా కథ, మా వూరి కథ చెప్పక తప్పదు.

నిజం చెప్పాలంటే దీపావళి అన్నది ఓ పండుగ అనీ, నరకాసురుణ్ణి సత్యభామా దేవి చంపిన రోజు అనీ కేవలం పాఠ్య పుస్తకాల ద్వారా మాత్రమే నేను తెలుసుకున్నా. నేనేం పద్దెనిమిదో శతాబ్దం గురించో, పందొమ్మిదో శతాబ్దం గురించో చెప్పటం లేదు. డెబ్బై, ఎనబైవ దశాబ్దాల గురించి చెబుతున్నా. పోనీ మా వూరేమయినా అడవుల్లోని ఓ గిరిజన తండానా అంటే కాదు, అది కడప పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలోని వూరు. జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల లోపే! మా తాతకు గాంధీ గురించి తెలుసు. సహాయనిరాకరణ వుద్యమంలో (ఆయన చెప్పలేదు గానీ నేను వూహించుకున్నా) భాగంగా అటవీ అధికారులని ధిక్కరించి అడవులనుండీ కలప తెచ్చారట! అయితే ఆయనకు దీపావళీ తెలియదు. నరకాసురుడు అసలే తెలియదు. సత్యభామను కలలో కూడా వూహించి ఎరుగడు.
ఈ పండుగ వచ్చిందంటే నాకు పెద్ద దిగులుండేది. ఎందుకంటే బడి వుండదు గనుక. బడి లేని రోజు ఆవుల మేపడమో, ఎనుముల (గేదెలు/బర్రెలు) మేపడమో, అదీ కాదంటే ఎద్దుల మేపడమో చేయాలి. ఆవులనీ, గేదెలనీ మేపడం కంటే కాడెద్దులను గట్ల వెంబడీ మేపడం మాహా బోరైన పని. వాటి పగ్గాలను పట్టుకొని అవి గట్ల మీదే మేసేలా అదుపు చేస్తూ వుండాలి. ఓ క్షణం మనం ఏమారినామంటే అవి గబుక్కున పక్క పొలంలోని వేరుశనగో, వరినో తినేస్తాయి. అదే జరిగితే పెద్దోళ్ళతో తర్వాత నేను తిట్లు తినాల్సి వుంటుంది. గంటా, రెండుగంటలా.. అలా పూటంతా అవి మేస్తూ వుంటే వాటి పగ్గాలు పట్టుకొని వాటిని చూస్తూ నిలబడి వుండటం.. అంత నరకం మరొకటి లేదు. ఆ బోర్‌డం నుండి తప్పించుకునేందుకు రేడియో పట్టుకెళ్ళేవాన్ని.. నేను పట్టుకెళతానని తెలిసి యింట్లో మా చెల్లి దాన్ని ముందే దాచేసేది. వున్నది ఒక రేడియో.. తనకీ యింట్లో బోరే కదా! ఇక చదవడానికి పుస్తకాలా? గ్రంథాలయం అనేది ఒకటుంటుందనీ అందులో పుస్తకాలుంటాయనీ తెలిసిందే కడపలో కాలేజీ చేరాక. ఎలాగైనా ఓ పుస్తకమో, లేదా రేడియోనో దొరికిందంటే దీపావళే కానక్కర లేదు, ఆ రోజు నిజంగా పండగే! ఇదీ దీపావళి అనబడే పండుగ తెచ్చే తంటా!

ఆ తరువాత వచ్చే దసరా, దాని కోసం వచ్చే దసరా సెలవులు కూడా ఇంకా పెద్ద దిగులును తెచ్చేవి అంటే మీరు నమ్మక తప్పదు. దసరా అంటే నీలకంఠరావు పేటలో కోమట్లు వైభవంగా చేసే కన్యకాపరమేశ్వరి వూరేగింపు అని మాత్రమే తెలుసు. మా వూర్లో చాలామంది ఆ వూరేగింపు చూడటానికి ఆ వూరు వెళ్ళేవాళ్ళు. మా నాన్న చండశాసనుడు ఈ విషయాల్లో. ఆయన పంపడు, మేమెప్పుడూ అడగనూ లేదు.

పండుగంటే మాకు సంక్రాంతే! అసలు దానిపేరు సంక్రాంతి అనికూడా మాకు పుస్తకాల ద్వారానే తెలిసింది. పెద్దోళ్ళంతా దానిని కేవలం “పండుగ” అనేవారు. లేదూ “పెద్ద పండుగ” అనేవారు. “వచ్చే పండుగకు చూద్దాం లేరా” అంటే “వచ్చే సంక్రాంతికి దాని పని చూద్దాంలే” అని అర్థం. పండుగ నెలో, రెండు నెలలో వుందన్నప్పటినుండే జోరు మొదలయ్యేది. అప్పటికే పాడుబడిన పందిరిమీదనుండి ఎండిపోయిన ఈతాకును పీకి చలిమంటలకూ, పొయ్యిలోకీ వాడటం మొదలెట్టేస్తారు. మంచి ఆకున్న ఈతచెట్లను చూసి ఆకు మండలను కోసి, పరచి, మోపులు కట్టి వాటిమీద రాళ్ళను బరువుగా పెట్టేవాళ్ళం. కడప సున్నపు బట్టీలనుండీ సున్నం తెచ్చి పెద్ద తోట్లలో పోసి విరగనిచ్చేవాళ్ళం. ఎద్దులకు కావల్సిన గజ్జెల పట్టాలనూ, కాళ్ళకు కట్టే వెంట్రుకలతో చేసిన నల్లటి తాళ్ళను దుమ్ముదులిపి బాగుచేసుకువాళ్ళం. పండుగ కోసం నాన్న తెచ్చే బట్టలు ఓ పులకింత కలగజేసేవి. వాటిని టైలర్‌కు కుట్టడానికిచ్చి అవి అయ్యేవరకూ రోజులు లెక్కపెట్టుకోవడం! పండుగ దగ్గరయ్యేసరికి గోడలకు సున్నాలు కొట్టడం, ఎర్రమట్టి పూయడం పూర్తవ్వాలి. కోసిన పచ్చటి ఈతాకుతో పందిరి వేయడం అవ్వాలి. అదే సమయంలో కళ్ళంలో వేరుశనగ పనులు పూర్తవ్వాలి. వూరికి కొంచం దూరంలో విశాలమైన చెరువు మైదానంలో గుబురు పొదకింద నాలుగు రాళ్ళతో ఓ గుడి కట్టి, లోపల మరో రాయిని పెట్టి కాటమ రాజును సిద్దం చేయాలి. ఈ కాటమ రాజుకు ఎదురుగా కంపనో, కర్రలనో తెచ్చి పండుగరోజు మంట కోసం ఓ పెద్ద కుప్ప తయారుచేయాలి. ఇక పండుగ మూన్నాళ్ళూ సందడే సందడి. తిండేమి, కొత్త బట్టలేమి, ఎప్పుడోగాని కనపడని వూరి ఆడపడచులూ, అల్లుళ్ళేమి. దేవాలయం ముందున్న అల్లెరాయిని ఎత్తివేయడంలో పందాలేమి…అదీ పండగంటే! చెబుతూబోతే చాంతాడంత చెప్పొచ్చు.

ఈ సంక్రాంతికే పెద్దల సమాధులను చూసి అక్కడ దీపం వెలిగించి వారిని స్మరించుకోవడమూనూ. ఈ సంక్రాంతికే వూరిబయట పాతవూర్లో వున్న చింతచెట్లకింద దాసరోళ్ళు, జంగమోళ్ళు, గంగిరెద్దులోళ్ళు, బుడబుడకలోళ్ళు, మొండోళ్ళు.. వూరు సైజు పెరిగినట్టనిపించేది. వీళ్ళు కథలు చెబుతూ, పాటలు పాడుతూ వూర్లో తిరిగేవాళ్ళు. ఒక్క గంగిరెద్దులోళ్ళు మాత్రమే ఎద్దును రాముడనీ, ఆవును సీతమ్మనీ సంభోదిస్తూ వాటితో నమస్కారాలు పెట్టిస్తూ.. తిరిగేవారు గానీ, దాసరోళ్ళు గానీ, జంగమోళ్ళు గానీ, బుడబుడకలోళ్ళు గానీ రాముడి, కృష్ణుడి కథలనీ, భాగవత గాథల్నీ పాడినట్టు నాకు జ్ఞాపకం లేదు. మా వైపు హరిదాసులు అడుక్కోవడానికి వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ దశకర్మ రోజున హరిదాసును పిలిపించి ఏదైనా కథ చెప్పించేవాళ్ళు. ఇది ఖచ్చితంగా తర్వాతి పరిణామమేనని చెప్పవచ్చు. ఎందుకంటే హరికథ పుట్టిందే మన ఎరుకలో కదా! ఇక దాసరోళ్ళు అంటే నాకు వెంటనే ఒక మధ్యయస్కుడు రంగుల తలపాగా చుట్టి, ఎడమచేతి అయిదువేళ్ళకూ పెద్ద పెద్ద గజ్జెలతో వున్న రింగులు తొడిగి, రంగుల చేతిరుమాళ్ళాంటిది చిటికెనవేలికి వేలాడుతూ వుంటే వీణను పోలిన వాయిద్యం మీటుతూ పాడుతూ వుంటే, తనకు అటొక స్త్రీ, ఇటొక స్త్రీ తంబుర వాయిస్తూ అతనికి సహకరిస్తూ పాడుతూ వుంటారు. మామూలుగా వాళ్ళు అతని భార్యలైయుంటారు. వాళ్ళెప్పుడూ భాగవత కథలు పాడగా వినలేదు. వాళ్ళు యింటిముందుకొస్తే “అమ్మా, మీ నాన్నను పొగుడుతాం. ఓ చాటెడు వడ్లు పెట్టు” అని మా అమ్మను అడిగేవాళ్ళు. మా అమ్మ చాటెడు కాదు గానీ, చాటతో వడ్లు పోసి, పొగడమనేది. వాళ్ళిక ఆ పొగిడే పాట ఎత్తుకునేవాళ్ళు. అది దేవాలయంలో పూజారి మన పేరు గోత్రం అడిగి చేసే పూజలా వుండేది. పూజారి తను దేవుడికి చేసే విన్నపాలలో మన పేరు, గోత్రం చేర్చి అదే మంత్రమే అందరికీ చదివినట్లు, ఆ దాసరి తన పొగడ్త పాటలో మా తాత పేరు చేర్చి మిగిలిందంతా అలాగే పాడేవాడు. అందులో నాకు బాగా గుర్తున్నది “..బంగారు పళ్ళవాడా..” అన్నది. అసలు పళ్ళే లేని మా తాత గుర్తొచ్చి నాకు నవ్వు వస్తే.. చనిపోయిన వాళ్ళ నాన్నను తలచుకుంటూ, తలుపుచాటున మా అమ్మ పైటకొంగుతో కన్నీళ్ళు తుడుచుచుకుంటూ వుండేది. ఈ దాసరోళ్ళే రాత్రికి వూరు మధ్యలో కథ చెప్పడానికి సిద్దమయేవాళ్ళు. ఏ కథ కావాలని వూరి పెద్దలను అడిగితే ఆ కథల చాయిస్‌లో భాగవత కథలో, భారత కథలో వుండేవి కావు. కాటమ రాజు కథో, బాల నాగమ్మ కథో, ఇలాంటివే ఏవో కథలు వుండేవి. ఇక జంగమోళ్ళు అయితే ఏ తెల్లవారుఝామునో వచ్చేవాళ్ళు. ఏ యింటిముందో నిలబడి ఆ యింటికి జరగబోయే వుపద్రవాల గురించి భయపెట్టేవాళ్ళు. వాళ్ళు కూడా ఎప్పుడూ భాగవత, భారత కథలు చెప్పలేదు. ఇక మొండోడు అని వచ్చేవాడు. తనేం పాడేవాడూ తెలియదు కానీ, చేతిలో మొండికత్తి పట్టుకొని చేతికున్న యినుప కంకణం మీద కొట్టూకుంటూ అతను అడిగింది ఇచ్చేవరకూ యింటిముందు కూచుని వెళ్ళేవాడు కాదు. ఒక్కోసారి అడిగింది ఇవ్వకపోతే గాయాలు చేసుకునేవాడు.

ఇవన్నీ ఆ రోజులు గొప్పవనీ, ఆ కళలు గొప్పవనీ చెప్పడానికి ఏకరవు పెట్టటం లేదు. ఆనాటి కళల్లో, ప్రజల్లో ఎక్కడా భాగవతం, భారతం లేవని చెప్పడానికి చెబుతున్నాను. ఈ సంస్కృతీ, ఈ దేవుళ్ళూ, ఈ పండుగలూ మనకు పరాయివి. మళ్ళీ నన్ను దేశ సమగ్రతకు చేటుతెచ్చే మాటలన్నాను అంటే నేనేం చేయలేను గానీ.. ఇవన్నీ ఉత్తరాది నుండీ వచ్చిన పండుగలు. దీపావళి, దసరా, శ్రీరామనవమి, క్రిష్ణాష్టమి, హోళీ, వినాయక చవితి, ఈమధ్యనే అక్షయ తృతీయ.. దక్షణాదికి దిగుమతి అయ్యాయి కదా? కనీసం ఒక్క సంక్రాంతినైనా ఉత్తరాదికి ఎగబాకించకలిగామా! మరి ఐలయ్య అన్నాడు అంటే అనడా?

నా చిన్ని సంబరం

తేది:December 24, 2012 వర్గం:అనుభవాలు రచన:చరసాల 2,980 views

మొన్న ఓ సెలవురోజు, రోజులా పరుగెత్తాల్సిన పనిలేదుకదా అని రాత్రెప్పుడో పడుకొని నిద్రలేచేప్పటికి ఎనిమిదిన్నర! మా అమ్మాయి నాకు మల్లే రాత్రి త్వరగా పడుకోదు పొద్దున త్వరగా లేయదు. కానీ మా అబ్బాయి కోడి, రాత్రి పడుకోవడం ఆలస్యమయినా సరే పొద్దున్నే మాత్రం లేచిపోతాడు. అయితే మంచం దిగని బద్దకం వాడిది.

నేను లేచిన తర్వాత ఎలాగూ వాడు లేచి వుంటాడు కదా అని వాడి గదికి వెళ్ళాను. తలుపు చప్పుడుకు ముసుగు మరింత తన్ని నిద్ర నటిస్తున్నాడు. కళ్ళు మూసి నిద్ర నటించగలిగాడు గానీ సంతోషం నిండిన మొహంలోని వెలుగును మూయలేకపోయాడు. అప్పుడు నాకు గాథా సప్తశతిలోని ఈ కవిత గుర్తుకు వచ్చింది.

వాణ్ణి చూసినపుడు
రెండు చేతుల్తో రెండు కళ్ళను
మూసికోగలను గానీ
ఒళ్ళంతా కడిమి చెట్టు పూచినట్లు
మొలకెత్తిన పులకరింతల్ని
ఎలా కప్పగలను?

ఓ పది క్షణాలు నేనేమీ అనకుండా మౌనంగా అలా నిలబడ్డా! నా వునికి వాడికి తెలుసు, ఆ కపట నిద్ర వాడెక్కువ సేపు పోలేడు.

కళ్ళు తెరిచి “what?” అన్నాడు.
లేపి పళ్ళు తోమమంటానేమొ అని వాడి దిగులు!
ఓ ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతానన్నాను.
నా మోటుగడ్డపు వెట్రుకలతో ముద్దంటే వాడికి చక్కిలిగింత! పెట్టనివ్వడు.
వద్దు వద్దంటూ దుప్పటి ముసుగేసుకొని దాక్కున్నాడు.
వదిలిపెట్టకుండా నేనూ దుప్పట్లోకి దూరి ముద్దు పెట్టే ప్రయత్నంలో నేను, గిలిగింతలతో నవ్వుతూ నన్ను తోసేసే ప్రయత్నంలో వాడు.
మొత్తంమీద నా శైలిలో వాడి పొట్టమీద ఓ ముద్దు పెట్టి దుప్పటిలోనుండి బయటకొచ్చాను.

వాడు నవ్వాపుకొని “Is your neck OK?” అన్నాడు.
బాగానే వుంది అని అటూ, ఇటూ తిప్పి చూపి, ఏం ఎందుకలా అడుగుతున్నావ్? అన్నా!

“నీవు ముద్దు పెడుతుంటే నీ తలను గట్టిగా తోసేశాను గదా, నీకు దెబ్బ తగిలిందేమొనని!” అన్నాడు.

పుత్రవాత్సల్యం మరింత పొంగి మళ్ళీ ముద్దు పెడదామన్న కోరికను బలవంతంగా ఆపుకొని, “ఫర్వాలేదు నా కొడుకు పెరిగాక మనిషే అవుతాడు, ఎదుటివాడి నొప్పి గురించి ఆలోచించాడంటే!” అని సంబరపడ్డా!

నా రైలు ప్రయాణం

తేది:November 13, 2012 వర్గం:అనుభవాలు రచన:చరసాల 3,223 views

ఇవాళ ఫేస్‌బుక్‌లో తెలుగు పుస్తకం గుంపులో ఓ చర్చ గత డిసెంబరులో ఇండియా వచ్చినపుడు జరిగిన ఓ సంగతిని గుర్తుచేసింది.

అదేంటంటే నేను, మా ఆవిడ మరియు మా పిల్లలూ అందరం రాయలసీమలో తిరుపతి నుండీ కడపకు వెళ్ళాలి. అంతకు ముందే మేము బెంగళూరు నుండీ తిరుపతికి రైలులో చేసిన ప్రయాణం మా పిల్లలు బాగా ఇష్టపడటంతో ఇప్పుడు కూడా రైలులోనే ప్రయాణించాలని నిర్ణయించుకొన్నాం. అయితే సమయం తక్కువగా వుండటం వల్ల మాకందరికీ శీతల పెట్టెలో(AC) టికెట్లు దొరకలేదు. అంతకు ముందు బెంగుళూరునుండి వచ్చినపుడు కూడా దొరకకపోతే మూడు AC టికెట్లు ఒక మొదటి తరగతి టికెట్టు కొన్నాం. TC వచ్చినపుడు ఆ విశయమే చెప్పి ఆ వ్యత్యాసాన్ని చెల్లింఛాం.

ఇప్పుడేం చేశాం అంటే దొరికిన మూడు AC టికెట్లు తీసుకొని, మా ప్రథంకు మాత్రం తీసుకోలేదు. పూర్వానుభవాన్ని బట్టీ నాకున్న ధైర్యం ఏమిటంటే TC వచ్చినపుడు విశయం చెప్పి ఆ నాలుగో టికెట్టు తీసుకోవచ్చని. మా ప్రథంకు అప్పుడు ఆరేళ్ళు. మాకు బెర్తులు కేటాయించిన చోట ఒకావిడ హైదరాబాదుకు వెళుతున్నది మిగతావన్నీ ఖాళీనే! మా పిల్లలిద్దరూ పైకీ కిందకీ ఎక్కీ దిగీ కాసేపట్లో అలసిపోయి పై బెర్తుల్లో నిద్రపోయారు. మా ఆవిడా ఓ కింది బెర్తులో నిద్ర పోయింది. నేను నాకెదురుగా వున్న ఆ హైదరాబాదెళ్ళే ఆవిడతో మాట్లాడుతున్నాను.

TC వచ్చాడు. టికెట్లు మూడూ చూపించాను. ఎవెరెవరన్నాడు. అక్కడ పడుకున్నావిడ, నేనూ, ఈ పైన పడుకున్నది మా అమ్మాయి, అక్కడ పైన వున్నది మా అబ్బాయి వాడికి టికెట్టు లేదన్నాను. టికెట్టు లేకుండా ఎలా ఎక్కారు అన్నాడు. దొరకలేదు, మీ దగ్గర కొనచ్చు కదా ఫైను కట్టి అన్నాను. అతను ఆశ్చ్యర్యంతో ఏదో తరగతి టికెట్టు వుంటే వ్యత్యాసం కడితే సరిపోతుంది కానీ టికెట్టే లేకుంటే ఫైను చాలా ఎక్కువ అన్నాడు. ఫరవాలేదు కడతా అన్నాను. మా వాడు చాలా చిన్నగా కనిపించడంతో అవసరం లేదు వాడికి ఎవరైనా అడిగితే నాలుగేళ్ళని చెప్పమన్నాడు. అమ్మో అది కానిపని, మా పిల్లల ఎదురుగా అలా అబద్దం చెప్పడం కుదరదన్నాను. అయితే ఓ పని చెయ్యి, కడపలో దిగాక ముఖ్య ద్వారంగుండా వెళ్ళకుండా ప్లాట్‌ఫాం చివరికెళ్ళి అట్నుంచి వెళ్ళిపొండి అన్నాడు. అదీ కుదరదు ఫైనే కడతాను అన్నాను.

ఇప్పుడు బహుశా అతను నేనేదో గ్రహాంతరజీవిని అనుకున్నట్టున్నాడు. సరే అయితే నీ నిజాయితీకి నాకు ఫైను రాయబుద్దేయట్లేదు. ఇంకోమాట చెబుతాను. అక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళకి పోన్ చేసి ఒక ప్లాట్‌ఫాం టికెట్టు అదనంగా కొనమనిచెప్పు అని చక్కా వెళ్ళి పోయాడు.

నేనున్న పరిస్థితిలో ఫైనూ వేసి లంచమూ అడుగుతాడేమో అనుకున్నా! ఉ హూ! ఏమీ అడగకుండా వెళ్ళి పోయాడు.

తరువాయి భాగం …

ఆయనెళ్ళి పోయాక మా ఆవిడ లేచింది. నా ఎదురుగ్గా వున్నావిడ విశయమంతా చెప్పింది. ఇంకో గంట నా లీల చెప్పుకొని నన్నో పరమానందయ్య శిష్యున్ని చేసి బాగా నవ్వుకున్నారు.

PS: పోన్ చేసి అదనపు ప్లాట్‌ఫాం టికెట్టు తెప్పించా! అవినీతిలో నాకూ భాగముంది.

నటనైనా అవసరం

తేది:September 30, 2009 వర్గం:అనుభవాలు రచన:చరసాల 4,115 views

బ్లాగ్లోకానికి దూరమై ఏడాదిపైన అయింది. మొన్న జరిగిన ఓ ఘటన మదిలో తొలిచేస్తూ ఏదోవిధంగా బయటపడాలని చూస్తోంది. కనీసం బ్లాగితేనయినా ఆ బాధ తగ్గుతుందేమోనని ఇలా కీబోర్డు పట్టాను.

గత శుక్రవారం (సెప్టంబరు 25) ఇక్కడ గాయని సునీత కార్యక్రమం వుండింది. అందుకు సంబందించిన ప్రకటన ఇక్కడ చూడండి. అందులో “శ్రియ” కనిపిస్తుందని పెద్దగానే ప్రకటించారు.  

Sunitha

నాకు సునీత పాటలను వినాలనే ఆశ కొంతైంతే శ్రియనూ చూడాలన్నదీ కొంత. మా ఇంటినుండీ ఈ కార్యక్రమం జరిగే ప్రదేశం గంటకు పైనే దూరం. అయినా టైర్లీడ్చుకుంటూ అంతాదాకా వెళ్ళి గంటన్నర ఆలస్యంగా మొదలైన ప్రోగ్రాంని కళ్ళూ, చెవులూ అప్పగించి చూస్తే తీరా శ్రియ గురించిన వూసే లేదు.

కార్యక్రమం మధ్యలో విరామ సమయంలో ఆయనెవరో నిర్వాహకుడు గాయకులనీ, వాద్యకారులనీ పరిచయం చేస్తుంటే “శ్రియ” “శ్రియ” అని జనాలు కేకలేస్తుంటే, ఆ నిర్వాహకుడు పొరపాటున కూడా శ్రియ గురించి మాట్లాడలేదు. పైగా “మా మాట నమ్మి వచ్చిన మీరంతా వెర్రి వెధవాయిలు” అనుకుంటున్నట్లు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

శ్రియ వస్తుందని ప్రకటనలో చెప్పిన నేరానికి కనీసం ప్రేక్షకులకి క్షమాపణో, సంజాయిషీనో ఇవ్వాల్సిన అవసరం వున్నట్లు ఆ పెద్ద మనిషికి గానీ ఇతర పెద్ద మనుషులకుగానీ తోచలేదు. తోచే వుంటుంది, వచ్చిన వారు వాళ్ళకి వెధవల్లా కనపడ్డప్పుడు బాధ పడుతున్నట్లు నటించడం కూడా శుద్ద దండగ అనుకుని వుంటారు.

మా వూరి సంగతులు – ఎవరికి పిచ్చి?

తేది:July 15, 2008 వర్గం:అనుభవాలు, నా ఏడుపు రచన:చరసాల 5,430 views

పిచ్చిఆ అమ్మాయి నా కంటే నాలుగైదేళ్ళు చిన్నదేమొ. పేరు మల్లినో, నాగమల్లినో సరిగ్గా నాకు తెలియదు. ప్రస్తుతానికి మల్లి అంటాను. వరసకి అత్త కూతురవుతుంది. ఆమెకు ఓ అక్క, ఓ సోమరిపోతు అన్న వున్నారు. అప్పుడే ఆ అన్న వూర్లో వుండక పట్టణాలు పట్టుకు తిరిగేవాడు. ఇప్పుడూ అంతే. అక్కకు పెళ్ళై మరో వూరెళ్ళిపోయింది. చిన్నప్పుడు ఈమె సిగ్గరి, అక్కలా ఎదుటపడి మాట్లాడేది కాదు. వీళ్ళమ్మకు మేమంటే చాలా అభిమానం. నేనెప్పుడు వూరొచ్చినా నన్ను చూడటానికి తప్పక ఇంటికి వచ్చేది అవసానదశలో మంచం మీద వున్నప్పుడు తప్ప.

మల్లికి పెళ్ళయింది కానీ కొన్ని రోజులకే ఏ కారణం వల్లనో భర్త వదిలేశాడు. వూరికయితే వచ్చింది గానీ, అమ్మ లేదు, నాన్న లేడు. అక్కదీ, అన్నదీ ఎవరి దారి వారిది. వూరిలో ఆ పనీ ఈ పనీ చేసుకొని పొట్ట నింపుకొని, ఏ చూరుకిందో, అరుగు మిదో పడుకొని కాలం వెళ్ళదీస్తుండేది. సరైన తిండిలేక నీరసించిన మల్లికి ఎయిడ్స్ వుందేమోనన్న అనుమానం ఎవరికో వచ్చింది. ఇంకేం ఎవరూ గడప దొక్కనీయలేదు. బక్క ప్రాణం మరింత బక్కదయింది. ఈమె దుస్థితి చూసి చలించిన మా తమ్ముడు దిలీప్ ఆమెను కడపకు తీసుకెళ్ళి వైద్యులకు చూపించి, రక్త హీనతకు మందులిప్పించి, తన స్నేహితులతో రక్తం ఇప్పించి ఆమెను మళ్ళీ మమూలు స్థితికి తెచ్చాడు. ఆ పరీక్షల్లో ఆమెకు ఎయిడ్సూ లేదు ఏ రోగమూ లేదు పోషకాహార లోపం తప్ప అని తేలింది.

బహుశా అప్పటికే ఆమెకు మతి చలించిందనుకుంటాను. ఎప్పుడూ సరిగ్గా మాట్లాడని ఆమె గలగలా మాట్లాడటం, ఏదేదో గొణగడం మొదలెట్టింది. ఇప్పుడు తను శారీరకంగా ఆరోగ్యంగా వున్నా మానసికంగా పిచ్చిదయింది. తనకు పెట్టిన అన్నాన్ని కుక్కలకు వేస్తుందిట. ఎందుకలా వేస్తున్నావు అంటే “నాకూ పుణ్యం రావాలిగా” అంటుందట. తనకు కట్టుకోమని బట్టలిస్తే అవి ఎవరికైనా ఇచ్చేస్తుందట. ఇంక వేదాంతం మాట్లాడటం, ఏదో దీర్ఘాలోచనలో వుండటం ఇలా వుంది వరస.

నేనూ, దిలీప్ వూరిలో తిరుగుతుంటే ఓ చోట గోడను ఆనుకొని అటేటో చూస్తూ వుంది. “ఏమ్మ్యా ఎలా వున్నావ్? నేనెవరో గుర్తు పట్టావా?” అని పలకరించా. అప్పుడు మా వైపు తిరిగి “దిలీపు సామీ నువ్వా!” అని రెండు చేతులెత్తి దండం పెట్టింది. “దిలీపు సరేగానీ నేనెవరో చెప్పు” అన్నా. “ఎవరో సామీ.. నేనింకా దొగలేమోనని, ఎట్ట సేయాల బగవంతుడా అని, ఇట్ట మల్లుకోనున్నా..” అన్నది. దిలీపును గుర్తు పట్టావే, దిలీపు అన్నలెవరు అంటే చెప్పింది. ఆ ప్రసాదును నేనే అంటే “ఎన్నెన్ని రోజులకు చూస్తిని సామీ” అంటూ తెగ సంతోషం ప్రకటించింది. ఆ ముందురాత్రి పడిన వర్షంలో బట్టలన్నీ తడిసిపోయాయట. ఎవరూ తమ తమ పంచల్లో పడుకోనివ్వలేదట! రాముడి గుడిలో పడుకుంటోందని గుడికి తాళాలు వేశారట! తడిసిన బట్టల్తో రాత్రంతా అలానే వున్నానని చెబుతుంటే గుండె చెరువయి కళ్ళల్లో ధార కడుతుంటే ఆపుకోవడానికి నానా కష్టాలూ పడ్డా. ఎప్పుడయినా సరే మా యింటికి వచ్చి తిను, అక్కడే పడుకో అని చెప్పి ఓ వందరూపాయలు చేతిలో పెట్టి అక్కడినుండీ భారంగా కదిలా.

ఆ మరుసటి వుదయం అన్నం కోసం ఇంటికి వచ్చినపుడు చెబుతోంది, “సామీ దొంగలున్నారంటే మీరు వింటిరా.. రాత్రి నా తలమీద గుండేస్తానని వాడెవడో దొంగ వచ్చి నీవిచ్చిన నూర్రూపాయాలూ లాక్కెళ్ళాడు.” అని.

ఇంతకూ నాకు తేలనిది ఏమిటంటే పిచ్చి ఆమెకా? వర్షం రాత్రి ఓ ఆడబిడ్డని ఏ పంచనా పడుకోనివ్వని వూరికా? చివరికి తన ఆలయంలోనూ చోటివ్వని దేవుడికా? అమాయకురాలి చేతిలోని డబ్బు భయపెట్టి లాక్కున్న మనిషికా? పిచ్చెవరికి?

–ప్రసాద్