కోటేశ్వరవ్వ “నిర్జన వారధి”

తేది:October 8, 2012 వర్గం:వర్గీకరింపబడనివి రచన:చరసాల 2,632 views

అయింష్టంగానైనా కొండపల్లి కోటేశ్వరమ్మని కొండపల్లి సీతారామయ్య భార్యగా పరిచయం చేయాల్సి వస్తోంది. ఎందుకంటే నాలాంటి వారికి ఆమె తెలియదు. ఆమె స్వీయ కథ, నిర్జన వారధిని చదివే ఆసక్తి కలగడానికి ఆమె సీతారామయ్య భార్య కావడమే కారణం. కానీ చదవడం మొదలెట్టాకా చివరికంటా చదవడానికి కారణం మాత్రం కోటేశ్వరమ్మే కాదు కాదు కోటేశ్వరవ్వే! ఆమె నడుస్తున్న చరిత్ర. తనకు తాను దీపపు వత్తియై, తన్ను తాను వెలిగించు కొని, నమ్మిన సిద్దాంతం కొరకు జీవితాన్ని, పిల్లలనీ, తల్లినీ, తననూ, తన ఆస్తినీ సర్వస్వాన్నీ ధారపోసి, ధారపోసే వారుంటారా అన్న సందేహానికి కోటేశ్వరవ్వ ఒక నిలువెత్తు సాక్ష్యం.

ఆమె ఆమెగానే సర్వ స్వతంత్రంగా బ్రతికిన కోటేశ్వరవ్వని ఇంకొకరి భార్యగా పరిచయం చేయాల్సి రావడం దురదృష్టమనే వుద్దేశ్యంతో నేను అయిష్టమన్నాను. నిజానికి కమ్యూనిస్టు వుద్యమానికి పరిచయం చెయ్యడమే సీతారామయ్య ఈ అమ్మకు చేసిన ఉపకారం(?). కమ్యూనిస్టు వుద్యమంలో దిగిన రోజునుండి ఈమె తన సర్వస్వాన్నీ పార్టీకి, వుద్యమానికే అర్పించింది.

ఈ కథ రాసిన తీరు, అవ్వ మన పక్కన కూర్చుని తన కథ చెబుతున్నట్లే వుంటుంది. చివరి వరకూ ఎక్కడా ఆత్మస్తుతీ, పరనిందా కనిపించవు. అలా అని తనతో వుద్యమంలో కలిసి నడిచిన వారి త్యాగాలని ఎక్కడా మెచ్చకుండా వుండదు. అప్పట్లో ఇంత మంచివారు వుండేవారా అని ఆశ్చర్యమనిపిస్తుంది.

అజ్ఞాతంలో వున్నపుడు పార్టీ నిర్ణయానుసారం గర్భస్రావం చేయించుకోవడం, అదీ మోటుపద్దతుల్లో, సరైన వైద్యసౌకర్యం లేక ప్రాణాలమీదకి తెచ్చుకోవడం… గుండెని మెలిపెడుతుంది. ఒక ద్యేయాన్ని, ఆశయాన్ని ఇంత భయంకరంగా నమ్ముతారా అనిపిస్తుంది.

భర్త తన్ను విడిచి వెళ్ళడం, కొడుకు నక్సలైటు వుద్యమంలో చేరి చివరికి మాయమైపోవడం, వడదెబ్బతో అల్లుడు, ఆ భాధతో కూతురూ అంతకు మునుపే జీవితమంతా తోడుగా నిలిచిన తల్లీ చనిపోవడం చదువుతుంటే వంటిలో వున్న కన్నీరంతా ఆవిరౌతుంది.

కానీ అవ్వ చెప్పిందంతా తన మొత్తం కథలో పైపై విషయాలేనేమొ అనిపిస్తుంది. తను పాల్గొన్న ప్రతి వేదికా, పోరాటం గురించి చెబితే పెద్ద గ్రంధమౌతుందేమొ!

కోటేశ్వరవ్వ జీవితంలో అన్ని పాత్రలలోకీ నన్ను బాగా ఆకర్శించింది, కోటేశ్వరమ్మకి త్యాగంలో ధీటుగా నిలిచింది ఆమె అమ్మగారు. ఆమె కూడా తన జీవితాన్ని కర్పూరంలా వెలిగించింది. ఏ వుద్యమ ప్రభావం ఆమె మీద లేకున్నా అప్పట్లోనే తన కూతురికి వితంతు వివాహం చేయడానికి పోరాడుతుంది. ఆ తర్వాత కూతురివెంటే వుంటూ వుద్యమానికి తనదైన సహాయం చేస్తూ వచ్చింది. చివరికి తను చనిపోబోయేముందు తను దాచుకున్న రెండువేల రూపాయల్లో ఊభయ కమ్యూనిస్టుపార్టీలకీ చెరో వెయ్యి విరాళం ఇమ్మని చెప్పడం గుండెని కరిగించేస్తుంది. నాకైతే ఏడుపులో వెక్కిళ్ళు రాకుండా ఆపుకోవడం కష్టమయిపోయింది.

చివరిగా నాకు శిఖరసమానమైన కోటేశ్వరవ్వ వ్యక్తిత్వంలో పలుకురాయిల అనిపించింది, సీతారామయ్య చివరిరోజుల్లో అతన్ని చూడ నిరాకరించడం, చివరివరకూ తనని క్షమించకపోవడం. సీతారామయ్య ఒక భర్తగా తనకి తీరని అన్యాయం చేసి వుండవచ్చు అయినా గానీ తను కూడా ఈమె లాగానే పార్టీని దాని ఆదర్షాన్ని శ్వాసగా చేసుకున్నవాడే! ఒక సహాధ్యాయికి మల్లే తను చేయగలిగిన సేవలు చేయకుండా పార్టీకి మల్లేనే తనూ వదిలేసి వృద్దాశ్రమంలో చేరడం ఆయనమీద ఆమెకి తీరని కోపమేమొ!

ఓ వంద పైచిలుకు పుటల్లో రాసిన ఓ వండేళ్ళ చరిత్ర “నిర్జన వారధి”!

    చివరి మాట

కినిగె” ముందటిరోజుల్లో ఏదైనా ఓ పుస్తకాన్ని చదవాలంటే avkf.org లాంటి సైట్లమీదో మితృల మీదో ఆధారపడి పుస్తకాలని తెప్పించుకోవాల్సి వచ్చేది. లేదా ఇండియా వెళ్ళినపుడు లేని సమయంలో, దుకాణాల వెంట తిరిగి తీరా పెద్ద పెద్ద సంచుల్లో పచ్చడి జాడీలతో పోటీ పెట్టి తెచ్చుకోవాల్సివచ్చేది. అంటే ఓ పుస్తకం చదవాలి అనుకున్నప్పటినుండీ చదివే రోజుకు మధ్య వారాలు లేదా నెలలు వుండేది.
ఇప్పుడు ఏ పుస్తకమైనా కినిగేలో వుంటే మాత్రం అది మన వళ్ళో వున్నట్లే! iPad లాంటి tablets వుంటే అది అక్షరాలా నిజం!
పుస్తకాలు చదవడాన్ని ఇంత సులభతరం చేసిన కినిగె వారికి కృతజ్ఞతలు.

రెంటాల కల్పన గారి “తన్హాయి”

తేది:October 3, 2012 వర్గం:వర్గీకరింపబడనివి రచన:చరసాల 1,991 views

ఎంచుకొన్న అంశమే సాహసోపేతమయింది. పెళ్ళి తర్వాత పెళ్ళికి బయట ప్రేమ అనేది సాధ్యమే, అది అన్నింటా వున్నదే అని బహిరంగంగా అంగీకరించలేని సమాజంలో కల్హార పాత్ర ద్వారా అది ఎంత సహజమో నిరూపించే ప్రయత్నం సఫలమయిందనే అనాలి. అలాంటి సందర్భాలలో ఎలాంటి భావ సంఘర్షణకు లోనవుతారో చక్కగా చూపించారు.
వ్యక్తి స్వేచ్చా, ఇచ్చా ముఖ్యమా సమాజ హితం ముఖ్యమా? అనేది అంత సులబంగా తేలే వ్యవహారం కాదు. కల్హార ఎంతగా వ్యక్తి స్వేచ్చను వెనుకేసుకొచ్చినా చివరికి సమాజ బంధానికే విలువ నివ్వడం, సమాజ హితమే ముఖ్యమన్న భావన ఎంతలా మనల్లో పాతుకు పోయిందో చెబుతోంది.
ఒక తల్లి ఇద్దరు పిల్లలని ప్రేమించగలిగినపుడు, చివరికి ఒక మగాడు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను ప్రేమించగలిగినపుడు, ఆడది మాత్రం ఒక మగాన్నే ఎందుకు ప్రేమించాలి? అది మాత్రమే సమాజ హితం ఎలా అవుతుంది అన్నదానికి ఎవరైనా సమాధానం చెప్పగలరా? బహుశా సమాజానికున్న అభ్యంతరం ప్రేమించడం కాదేమో! సంసారం చేయడమేమొ!
ఎందుకంటే ఈ సంఘర్షణలో కల్హార, కౌశిక్‌లు కలిసి బ్రతకాడినికి వారికి ముఖ్యంగా అడ్డుతగిలింది పిల్లలే! ఇందులో ఏ పాపం తెలియని పిల్లలు ఎందుకు బలవ్వాలన్న సాధారణ లాజిక్ వారిని వారి వారి వాంక్షలను చంపుకునేలా చేసింది.
హ్‌మ్ … అన్నీ ప్రశ్నలే చదువుతున్నంతసేపూ, చదివాకా…

నేను iTunes version చదివాను. బహుశా ప్రింటులో లేవేమో గానీ ఇందులో చాలా అక్షర దోశాలు వున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీషు పదాలని తెలుగులిపిలో చూపించినపుడు అది చదవలేని విధంగా అయింది. ఇందులోని ముఖ్య పాత్రలు నాలుగూ బహు మంచి పాత్రలు గావడం అంత సహజంగా వున్నట్లనిపించ లేదు. మధ్యలో రాజీవ్ ప్రస్తావన తెచ్చి అర్ధాంతరంగా ఆపేసినట్లు అనిపించింది. కాలేజీ రోజుల్లో రాజీవ్‌ను ప్రోత్సహించి (లేదా అతన్ని మొదట్లోనే అడ్డుకోకుండా) చివరలో అతన్ని తిరస్కరించింది అన్న కథనం కల్హార మీద అంతవరకూ వున్న గౌరవం పాఠకుడికి తగ్గేలా వుంది. ఇక నావరకూ కొన్ని చోట్ల కల్హార అంతఃసంఘర్షణ పునరుక్తిగా అనిపించి పేజీలూ గబగబా తిప్పేద్దామా అనిపించింది.

మొత్తం మీద ప్రేమను ఓ కొత్త కోణంలో చూపించిన ఈ రచన తప్పక చదవతగ్గది.

http://www.amazon.com/dp/0984576215/ref=rdr_ext_tmb

నా గుండెను తాకిన ఉత్తరం

తేది:May 25, 2011 వర్గం:వర్గీకరింపబడనివి రచన:చరసాల 3,286 views

గత సంవత్సరం మా అమ్మాయి 1st grade లో వుండగా తన టీచర్ report cardతో పాతే ఈ క్రింది ఉత్తరమూ జత చేసింది. ఇదెక్కడో ఈ అంత్ర్జాలంలో వుండే వుంటుంది.

పిల్లలకు మంచి మార్కులు రాలేదని వచ్చిన పొరుగింటి పిల్లలతో పోల్చిచూపి తము వేదనకు గురవుతూ తమ పిల్లలని కించపరచే తల్లిదండ్రులకు ఇది ఉపయోగపడుతుందని, నాక్కూడా మళ్ళీ మళ్ళీ చదువువుకోవడానికి వీలుగా వుంటుందని బ్లాగులో పెట్టాలని ఏడాదిగా అనుకుంటున్నా. చివరికి ఇప్పుడు.

**********
Dear Mom & Dad,
Here is my report card. This report card is my teacher’s attempt to describe my actions and accomplishments at school during the past weeks. As you read the card, please remember that my teacher is describing someone near and dear to you, so please don’t get “uptight” if you see a blemish. I hope you will accept me as I am.

Remember that all children do not learn to walk and talk at the same age, nor do they learn math or reading at the same rate. Please do not compare me to my brothers, sisters or friends because I am unique to this world. Be realistic in setting my goals. I need to be challenged, but not to be pushed beyond my ability. I need to taste success and I need time to “smell the flowers” while I am still a child.

Please understand that my report card is a picture of me at school. It is a whole different world from the one at home. Can you imagine having 25 children my age at the dinner table tonight, or 200 children in our backyard playing? Don’t be surprised to find that I respond in a different manner at school.

My teacher knows me as I am in school. You know me as I am at home. The “real me” may be somewhere in between. When these two images are blended with sufficient understanding, acceptance, and love, I hope you will see an unique individual who can make you proud and bring you much happiness.

Love,
Pranathi

జగన్ చేసిందే సరైన పని!

తేది:December 8, 2010 వర్గం:వర్గీకరింపబడనివి రచన:చరసాల 3,223 views

జగన్ ఎలాంటివాడు అనేదాని మీద ఆధారపడి అతని చర్యలని అంచనా వేయకుండా, అతను చేసింది సరైందేనా (అదే కాంగ్రెసు నుండి విడివడి సొంత ఖాతా తెరవడం) అంటే ముమ్మాటికీ సరైందే అని నేనంటాను.

మన దేశంలో ప్రజాస్వామ్యం తలకిందులుగా నడుస్తుందెందుకో! ఇక్కడ అమెరికాలో “టీ పార్టీ” అంటూ రిపబ్లికన్లకు ముచ్చెమటలు పట్టింఛారు ప్రజలు. అలాగని ఇక్కడ ప్రజాస్వామ్యం నీటారుగా రెండు కాళ్ళ మీద నడుస్తోందని కాదు గానీ, మన దగ్గర మాత్రం పూర్తిగా తలకిందులయ్యింది.

ఇప్పుడు చూడండి, ఆ కికురె ముఖ్యమంత్రి అయ్యాక, పదవులు రాలేదనీ, వచ్చినా సరైన శాఖలు దక్కలేదని ఆ ఏడుపులు చూడండి. వెదవలు వీళ్ళు మాత్రమే వాళ్ళ వాళ్ళ వర్గానికీ, కులానికీ అసలు సిసలు ప్రతినిధులైనట్లు, మంత్రి అయితే సరే లేకుంటే తను కాదు తన కులాన్ని మొత్తం అవమానించినట్లు అంటాడు.

పదవి రానివాడూ, రావాలనుకున్న వాడూ “అమ్మా” అని తప్పితే “ఓటరూ” అని ఎవడైనా కేకేస్తున్నాడా? వోటరుదేముందీ కాసిన్ని డబ్బులు వెనకేసుకుంటే ఇంత విదిల్చి గెలవొచ్చు, కానీ పదవి ప్రాప్తించాలంటే అమ్మ కరుణే కావాలి. పదవి కావాలంటే అమ్మ, పైకి రావాలంటే అమ్మ. అమ్మ దయ వుంటే ముఖ్యమంత్రే ఏం ఖర్మ రాష్త్రపతీ, ప్రధాన మంత్రే అయిపోవచ్చు. వెధవది ప్రజలని నమ్ముకుంటే ఏముంది మహా అయితే ఎమ్మెల్యే కావచ్చు.

ఈ కిటుకు తెలుసును గనుకే ప్రజా ప్రతినిధులమన్న మాటను మరచి అమ్మ ప్రతినిధులయిపోయారు. అందరూ దిగుమతి అయి ప్రజల మీద రుద్దబడుతున్నారే కానీ, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వాలనీ, దాని చేతలనీ ప్రభావితం చేయలేకున్నారు.

అదే జగన్‌ను చూడండి. మీ అత్త పోతే ఏ హక్కుతో ఆ కుర్చీని మీ ఆయన కిచ్చారో, ఆర్నెళ్ళ ప్రాధమిక సబ్యత్వంతోనే వందేళ్ళ కాంగ్రెసు అధ్యక్ష పదవి మీఎలా వచ్చిందో, మీ తర్వాత మీ వారసుడిగా రాహుల్ ఎదగ్గా లేంది, మా నాయన కాళ్ళరిగేలా తిరిగి సంపాదించిన కుర్చీని నేనడిగితే తప్పేంటి అన్నాడు.

తను అడగాలి, ఈయన వినాలి గానీ, ఈయన ఆమెను, అమ్మను, రెండుసార్లు ప్రధాని పదవిని త్యజించిన త్యాగమయిని అడగడమేంటి? అవ్వ ఎంత అప్రజాస్వామికం? “ఇలా అడగడమే నీకున్న అనర్హత. గుమ్మం దగ్గర కాచుకొని ఎదురుచూడగల ఓపిక వుండాలి. కుక్కకున్న విశ్వాసముండాలి. కుక్కలా ప్రశ్నించకుండా ఎంతకాలమైనా ముద్ద కోసం ఎదురుచూడాలే గానీ, అరవకూడదు.” అంది అమ్మ.

కానీ జగన్ కుక్కలా ఎదురు చూడదల్చుకోలేదు. తనకు ప్రజల దగ్గర పలుకుబడి వుందనుకున్నాడు. (తోడు నాన్న హయాంలో సంపాదించిన సంపదలూ వున్నాయి). నాకు అమ్మ దయ కాదు, మీ దయ చాలన్నాడు. పార్టీ పెడుతున్నాడు. నిజానికి ప్రజాస్వామ్యంలో ఇదే జరగాలి. తనకు అన్యాయం జరిగిందనుకుంటే ప్రజల దగ్గరికే వేళ్ళాలి కానీ అమ్మ దగ్గరికి కాదు. ఆ విధంగా ప్రజలకే అంత్యధికారం ఇచ్చినట్లవుతుంది.

ఇది ఒక కాంగ్రెసులో వున్నదే కాదు. ఏ పార్టీ అయినా అంతే! ఇక్కడ అమ్మ అయితే అక్కడ మరో అమ్మ లేదా అయ్య.

వికీలీక్స్ చర్యలు ఆమోదనీయమేనా?

తేది:December 8, 2010 వర్గం:వర్గీకరింపబడనివి రచన:చరసాల 2,286 views

వారం పైగా ప్రతి నిత్యం వికీలీక్స్ మరియు దాని అధినేత అసాంజీ వార్తల్లో నానుతున్నారు. ప్రభుత్వాల మధ్య, ప్రభుత్వ విభాగాల మధ్య జరిగిన సున్నిత సమాచార మార్పిడిని ఈ సంస్థ అంతర్జాల మీడియా ద్వారా బహిరంగ పరుస్తోంది.

ఈ విశయం చిలికి చిలికి గాలి వాన కాగానే వికీలీక్స్ మద్దతుదారులకు, వ్యతిరేకులకు సైబర్‌వార్ నడుస్తోంది. మొదట వికిలీక్స్ వెబ్‌సైట్‌ను హోస్ట్ చేసిన EveryDNS.net చేతులెత్తేసి, తమమీద సైబర్ దాడులు జరిగే అవకాశముందంటూ వికీలీక్స్‌ను తమ సర్వర్ల నుండి తొలగించింది. అదే దారిలో నడుస్తూ Amazon, Paypal తమ సేవలు నిరాకరించాయి. ఇప్పుడు VISA మరియు Master Card కంపెనీలు విలీలీక్స్‌కు తమ సేవలను నిరాకరించాయి.

ఈ నిరాకరణతో మరింత రెచ్చిపోయిన వికీలీక్స్ మద్దతుదారులు ఆయా కంపెనీల మీద సైబర్ దాదులతో విరుచుకు పడ్డారు. వారి దెబ్బకు ఈ వుదయం Master Card కార్యకలాపాలు స్థంబించాయని వార్త!

ఈ తతంగమంతా చూస్తుంటే అసలు సమాచార స్వేచ్చ పేరుతో వికీలీక్స్ చేస్తున్న పనులు సమ్మతమేనా అన్న అనుమానం వచ్చింది. ఓ మనిషికి వ్యక్తిగతం వున్నట్లే దేశాలకీ, ప్రభుత్వాలకీ వుంటుంది. దేశాల మధ్య మితృత్వాలూ, శతృత్వాలూ, రహస్యాలు, ప్రణాళికలు, తంత్రాలు వుంటాయి. ఈ సున్నిత సమాచారం బహిర్గితం కావడమంటే దేశాల సార్వభౌమత్వ హక్కుకు భంగం కలగడమే కాకుండా, ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెరిగి అవ్యవస్థ తయారుగావచ్చు. ఇలాంటి సమాచరం బయటకు తేవడం వల్ల సామాన్యుడికి కలిగే వుపయోగమేమిటో నాకెంతకూ తోచడం లేదు.

అలాగని వికీలీక్స్‌ను న్యాయబద్దంగా ఎదుర్కోకుండా, ఇలా ఈ సైబర్ యుగంలో అత్యవసరాలనదగ్గ సర్వీసులని నిరాకరించడం ప్రజాస్వమ్యబద్దంగా లేదు. ఈ వుదంతంతో ఈ కంపెనీలు చివరగా తమ విధేయతను ఎవరికి చూపిస్తాయో తెలిసిపోతోంది.