మా దీపావళి

తేది:October 19, 2017 వర్గం:అనుభవాలు, చరిత్ర రచన:చరసాల 3,093 views

దీపావళి సందర్భంగా మళ్ళీ నా కథ, మా కథ, మా వూరి కథ చెప్పక తప్పదు.

నిజం చెప్పాలంటే దీపావళి అన్నది ఓ పండుగ అనీ, నరకాసురుణ్ణి సత్యభామా దేవి చంపిన రోజు అనీ కేవలం పాఠ్య పుస్తకాల ద్వారా మాత్రమే నేను తెలుసుకున్నా. నేనేం పద్దెనిమిదో శతాబ్దం గురించో, పందొమ్మిదో శతాబ్దం గురించో చెప్పటం లేదు. డెబ్బై, ఎనబైవ దశాబ్దాల గురించి చెబుతున్నా. పోనీ మా వూరేమయినా అడవుల్లోని ఓ గిరిజన తండానా అంటే కాదు, అది కడప పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలోని వూరు. జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల లోపే! మా తాతకు గాంధీ గురించి తెలుసు. సహాయనిరాకరణ వుద్యమంలో (ఆయన చెప్పలేదు గానీ నేను వూహించుకున్నా) భాగంగా అటవీ అధికారులని ధిక్కరించి అడవులనుండీ కలప తెచ్చారట! అయితే ఆయనకు దీపావళీ తెలియదు. నరకాసురుడు అసలే తెలియదు. సత్యభామను కలలో కూడా వూహించి ఎరుగడు.
ఈ పండుగ వచ్చిందంటే నాకు పెద్ద దిగులుండేది. ఎందుకంటే బడి వుండదు గనుక. బడి లేని రోజు ఆవుల మేపడమో, ఎనుముల (గేదెలు/బర్రెలు) మేపడమో, అదీ కాదంటే ఎద్దుల మేపడమో చేయాలి. ఆవులనీ, గేదెలనీ మేపడం కంటే కాడెద్దులను గట్ల వెంబడీ మేపడం మాహా బోరైన పని. వాటి పగ్గాలను పట్టుకొని అవి గట్ల మీదే మేసేలా అదుపు చేస్తూ వుండాలి. ఓ క్షణం మనం ఏమారినామంటే అవి గబుక్కున పక్క పొలంలోని వేరుశనగో, వరినో తినేస్తాయి. అదే జరిగితే పెద్దోళ్ళతో తర్వాత నేను తిట్లు తినాల్సి వుంటుంది. గంటా, రెండుగంటలా.. అలా పూటంతా అవి మేస్తూ వుంటే వాటి పగ్గాలు పట్టుకొని వాటిని చూస్తూ నిలబడి వుండటం.. అంత నరకం మరొకటి లేదు. ఆ బోర్‌డం నుండి తప్పించుకునేందుకు రేడియో పట్టుకెళ్ళేవాన్ని.. నేను పట్టుకెళతానని తెలిసి యింట్లో మా చెల్లి దాన్ని ముందే దాచేసేది. వున్నది ఒక రేడియో.. తనకీ యింట్లో బోరే కదా! ఇక చదవడానికి పుస్తకాలా? గ్రంథాలయం అనేది ఒకటుంటుందనీ అందులో పుస్తకాలుంటాయనీ తెలిసిందే కడపలో కాలేజీ చేరాక. ఎలాగైనా ఓ పుస్తకమో, లేదా రేడియోనో దొరికిందంటే దీపావళే కానక్కర లేదు, ఆ రోజు నిజంగా పండగే! ఇదీ దీపావళి అనబడే పండుగ తెచ్చే తంటా!

ఆ తరువాత వచ్చే దసరా, దాని కోసం వచ్చే దసరా సెలవులు కూడా ఇంకా పెద్ద దిగులును తెచ్చేవి అంటే మీరు నమ్మక తప్పదు. దసరా అంటే నీలకంఠరావు పేటలో కోమట్లు వైభవంగా చేసే కన్యకాపరమేశ్వరి వూరేగింపు అని మాత్రమే తెలుసు. మా వూర్లో చాలామంది ఆ వూరేగింపు చూడటానికి ఆ వూరు వెళ్ళేవాళ్ళు. మా నాన్న చండశాసనుడు ఈ విషయాల్లో. ఆయన పంపడు, మేమెప్పుడూ అడగనూ లేదు.

పండుగంటే మాకు సంక్రాంతే! అసలు దానిపేరు సంక్రాంతి అనికూడా మాకు పుస్తకాల ద్వారానే తెలిసింది. పెద్దోళ్ళంతా దానిని కేవలం “పండుగ” అనేవారు. లేదూ “పెద్ద పండుగ” అనేవారు. “వచ్చే పండుగకు చూద్దాం లేరా” అంటే “వచ్చే సంక్రాంతికి దాని పని చూద్దాంలే” అని అర్థం. పండుగ నెలో, రెండు నెలలో వుందన్నప్పటినుండే జోరు మొదలయ్యేది. అప్పటికే పాడుబడిన పందిరిమీదనుండి ఎండిపోయిన ఈతాకును పీకి చలిమంటలకూ, పొయ్యిలోకీ వాడటం మొదలెట్టేస్తారు. మంచి ఆకున్న ఈతచెట్లను చూసి ఆకు మండలను కోసి, పరచి, మోపులు కట్టి వాటిమీద రాళ్ళను బరువుగా పెట్టేవాళ్ళం. కడప సున్నపు బట్టీలనుండీ సున్నం తెచ్చి పెద్ద తోట్లలో పోసి విరగనిచ్చేవాళ్ళం. ఎద్దులకు కావల్సిన గజ్జెల పట్టాలనూ, కాళ్ళకు కట్టే వెంట్రుకలతో చేసిన నల్లటి తాళ్ళను దుమ్ముదులిపి బాగుచేసుకువాళ్ళం. పండుగ కోసం నాన్న తెచ్చే బట్టలు ఓ పులకింత కలగజేసేవి. వాటిని టైలర్‌కు కుట్టడానికిచ్చి అవి అయ్యేవరకూ రోజులు లెక్కపెట్టుకోవడం! పండుగ దగ్గరయ్యేసరికి గోడలకు సున్నాలు కొట్టడం, ఎర్రమట్టి పూయడం పూర్తవ్వాలి. కోసిన పచ్చటి ఈతాకుతో పందిరి వేయడం అవ్వాలి. అదే సమయంలో కళ్ళంలో వేరుశనగ పనులు పూర్తవ్వాలి. వూరికి కొంచం దూరంలో విశాలమైన చెరువు మైదానంలో గుబురు పొదకింద నాలుగు రాళ్ళతో ఓ గుడి కట్టి, లోపల మరో రాయిని పెట్టి కాటమ రాజును సిద్దం చేయాలి. ఈ కాటమ రాజుకు ఎదురుగా కంపనో, కర్రలనో తెచ్చి పండుగరోజు మంట కోసం ఓ పెద్ద కుప్ప తయారుచేయాలి. ఇక పండుగ మూన్నాళ్ళూ సందడే సందడి. తిండేమి, కొత్త బట్టలేమి, ఎప్పుడోగాని కనపడని వూరి ఆడపడచులూ, అల్లుళ్ళేమి. దేవాలయం ముందున్న అల్లెరాయిని ఎత్తివేయడంలో పందాలేమి…అదీ పండగంటే! చెబుతూబోతే చాంతాడంత చెప్పొచ్చు.

ఈ సంక్రాంతికే పెద్దల సమాధులను చూసి అక్కడ దీపం వెలిగించి వారిని స్మరించుకోవడమూనూ. ఈ సంక్రాంతికే వూరిబయట పాతవూర్లో వున్న చింతచెట్లకింద దాసరోళ్ళు, జంగమోళ్ళు, గంగిరెద్దులోళ్ళు, బుడబుడకలోళ్ళు, మొండోళ్ళు.. వూరు సైజు పెరిగినట్టనిపించేది. వీళ్ళు కథలు చెబుతూ, పాటలు పాడుతూ వూర్లో తిరిగేవాళ్ళు. ఒక్క గంగిరెద్దులోళ్ళు మాత్రమే ఎద్దును రాముడనీ, ఆవును సీతమ్మనీ సంభోదిస్తూ వాటితో నమస్కారాలు పెట్టిస్తూ.. తిరిగేవారు గానీ, దాసరోళ్ళు గానీ, జంగమోళ్ళు గానీ, బుడబుడకలోళ్ళు గానీ రాముడి, కృష్ణుడి కథలనీ, భాగవత గాథల్నీ పాడినట్టు నాకు జ్ఞాపకం లేదు. మా వైపు హరిదాసులు అడుక్కోవడానికి వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ దశకర్మ రోజున హరిదాసును పిలిపించి ఏదైనా కథ చెప్పించేవాళ్ళు. ఇది ఖచ్చితంగా తర్వాతి పరిణామమేనని చెప్పవచ్చు. ఎందుకంటే హరికథ పుట్టిందే మన ఎరుకలో కదా! ఇక దాసరోళ్ళు అంటే నాకు వెంటనే ఒక మధ్యయస్కుడు రంగుల తలపాగా చుట్టి, ఎడమచేతి అయిదువేళ్ళకూ పెద్ద పెద్ద గజ్జెలతో వున్న రింగులు తొడిగి, రంగుల చేతిరుమాళ్ళాంటిది చిటికెనవేలికి వేలాడుతూ వుంటే వీణను పోలిన వాయిద్యం మీటుతూ పాడుతూ వుంటే, తనకు అటొక స్త్రీ, ఇటొక స్త్రీ తంబుర వాయిస్తూ అతనికి సహకరిస్తూ పాడుతూ వుంటారు. మామూలుగా వాళ్ళు అతని భార్యలైయుంటారు. వాళ్ళెప్పుడూ భాగవత కథలు పాడగా వినలేదు. వాళ్ళు యింటిముందుకొస్తే “అమ్మా, మీ నాన్నను పొగుడుతాం. ఓ చాటెడు వడ్లు పెట్టు” అని మా అమ్మను అడిగేవాళ్ళు. మా అమ్మ చాటెడు కాదు గానీ, చాటతో వడ్లు పోసి, పొగడమనేది. వాళ్ళిక ఆ పొగిడే పాట ఎత్తుకునేవాళ్ళు. అది దేవాలయంలో పూజారి మన పేరు గోత్రం అడిగి చేసే పూజలా వుండేది. పూజారి తను దేవుడికి చేసే విన్నపాలలో మన పేరు, గోత్రం చేర్చి అదే మంత్రమే అందరికీ చదివినట్లు, ఆ దాసరి తన పొగడ్త పాటలో మా తాత పేరు చేర్చి మిగిలిందంతా అలాగే పాడేవాడు. అందులో నాకు బాగా గుర్తున్నది “..బంగారు పళ్ళవాడా..” అన్నది. అసలు పళ్ళే లేని మా తాత గుర్తొచ్చి నాకు నవ్వు వస్తే.. చనిపోయిన వాళ్ళ నాన్నను తలచుకుంటూ, తలుపుచాటున మా అమ్మ పైటకొంగుతో కన్నీళ్ళు తుడుచుచుకుంటూ వుండేది. ఈ దాసరోళ్ళే రాత్రికి వూరు మధ్యలో కథ చెప్పడానికి సిద్దమయేవాళ్ళు. ఏ కథ కావాలని వూరి పెద్దలను అడిగితే ఆ కథల చాయిస్‌లో భాగవత కథలో, భారత కథలో వుండేవి కావు. కాటమ రాజు కథో, బాల నాగమ్మ కథో, ఇలాంటివే ఏవో కథలు వుండేవి. ఇక జంగమోళ్ళు అయితే ఏ తెల్లవారుఝామునో వచ్చేవాళ్ళు. ఏ యింటిముందో నిలబడి ఆ యింటికి జరగబోయే వుపద్రవాల గురించి భయపెట్టేవాళ్ళు. వాళ్ళు కూడా ఎప్పుడూ భాగవత, భారత కథలు చెప్పలేదు. ఇక మొండోడు అని వచ్చేవాడు. తనేం పాడేవాడూ తెలియదు కానీ, చేతిలో మొండికత్తి పట్టుకొని చేతికున్న యినుప కంకణం మీద కొట్టూకుంటూ అతను అడిగింది ఇచ్చేవరకూ యింటిముందు కూచుని వెళ్ళేవాడు కాదు. ఒక్కోసారి అడిగింది ఇవ్వకపోతే గాయాలు చేసుకునేవాడు.

ఇవన్నీ ఆ రోజులు గొప్పవనీ, ఆ కళలు గొప్పవనీ చెప్పడానికి ఏకరవు పెట్టటం లేదు. ఆనాటి కళల్లో, ప్రజల్లో ఎక్కడా భాగవతం, భారతం లేవని చెప్పడానికి చెబుతున్నాను. ఈ సంస్కృతీ, ఈ దేవుళ్ళూ, ఈ పండుగలూ మనకు పరాయివి. మళ్ళీ నన్ను దేశ సమగ్రతకు చేటుతెచ్చే మాటలన్నాను అంటే నేనేం చేయలేను గానీ.. ఇవన్నీ ఉత్తరాది నుండీ వచ్చిన పండుగలు. దీపావళి, దసరా, శ్రీరామనవమి, క్రిష్ణాష్టమి, హోళీ, వినాయక చవితి, ఈమధ్యనే అక్షయ తృతీయ.. దక్షణాదికి దిగుమతి అయ్యాయి కదా? కనీసం ఒక్క సంక్రాంతినైనా ఉత్తరాదికి ఎగబాకించకలిగామా! మరి ఐలయ్య అన్నాడు అంటే అనడా?

హిందుత్వంపై పోరాటం ఈనాటిదా?

తేది:September 21, 2017 వర్గం:నా ఏడుపు, వర్తమానం రచన:చరసాల 2,765 views

అధిపత్య హిందువుల నుండి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న.. “మీరు హిందూమతాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? క్రైస్తవుల పాపాలు కనపడవా? ముస్లిముల దురాగతాలు కనపడవా?” అని.

కానీ లెఫ్టిస్టులు లేదా వామపక్షవాదులు అని పిలవబడేదేదే వారు మైనారిటీల గురించి, మైనారిటీల హక్కుల గురించి మాట్లాడతారని. వాళ్ళు మతాన్ని బట్టి మైనారిటీలు అవ్వవచ్చు, కులాన్ని బట్టి అవ్వవచ్చు లేదా జీవిస్తున్న ప్రదేశాన్ని బట్టీ అవ్వవచ్చు. హిందూ మెజారిటీ దేశంలో ముస్లిముల హక్కుల గురించి పోటాడేది వాళ్ళే, ముస్లిము మెజారిటీ దేశంలో హిందూ హక్కుల గురించి పోట్లాడేది వాళ్ళే! ఇక్కడ హిందూ మతం మెజారిటీ ప్రజల మతంగా వుంది గనుక అది వామపక్షాల నుండీ, లౌకికవాదుల నుండీ, రాజ్యాంగవాదుల నుండీ ఎక్కువ విమర్షను, పోరాటాన్ని ఎదుర్కోవడం వింత కాదు, సహజాతి సహజం. అలాగని మిగిలిన మతాలను నెత్తికెత్తుకున్నట్టు కాదు, మిగిలిన మతాలను సమర్థించినట్లు కాదు. ఓ మతం వల్లో, కులం వల్లో మైనారిటీలుగా వివక్షను ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన మాట్లాడటం అంటే ఆ ప్రజల మతం పక్షాన మాట్లాడటం కాదు. ఇది ఎక్కువ మంది గ్రహించలేకపోతున్నారు.

హిందూ మతంలోని వివక్ష గురించీ, కుల మెట్ల గురించి మాట్లాడినప్పుడల్లా.. ఇదేదో మెకాలే చదువుల ఫలితమని..విదేశీ శక్తుల ప్రోద్భలమని..ఓ వైపు మాట్లాడేవాళ్ళను శత్రువుల్లా చిత్రించడమే గాకుండా..అసలు కులాలే హిందూ మతంలో లేవని, యివి ఆంగ్లేయులు భారత సమాజాన్ని చీల్చడానికి వేసిన ఎత్తులనీ కూడా అంటారు. ఈ మధ్యే ఒకాయన హిందూమతంపై విషం చిమ్మడం వందేళ్ళనుండే మొదలయింది అన్నాడు. నిజం కాదు. హిందూమతం ధర్మంగా స్థిరపడుతున్నప్పటినుండే దానిమీద నిరసనలూ, పోరాటాలూ కూడా ప్రారంబమయ్యాయి.

చార్వాకుడు లేదా లోకాయుత ధర్మం బహుశా వేదాలను, వేద ధర్మాన్ని వ్యతిరేకించిన తొలి నిరసన కావచ్చు.
రెండువేల సంవత్సరాల కంటే పూర్వమే బౌద్దాన్ని నెలకొల్పిన బుద్దుడిదీ హైందవం మీద నిరసనా, తిరుగుబాటే!
బుద్దిడి తర్వాత మరో వెయ్యేండ్లకు బసవ తత్వం నెలకొల్పిన బసవన్నదీ హైందవం మీది తిరుగుబాటే!
పధ్నాలుగు, పదిహేనో శతాబ్దాల్లో భక్తి వుద్యమాన్ని నడిపిన కబీరూ, తుకారాం, మీరా.. లాంటి కవులు హిందూమతంలోని అనాచారాల మీద గొంతెత్తినవారే!
పదిహేడో శతాబ్దపు మన వేమన చేసినదీ తిరుగుబాటే, నిరసనే!
యిక స్వాతంత్య్ర పోరాటం మొదలయ్యాక సామాజిక మార్పు కోసం, హిందూ కుల వివక్షల మీద పోరాటం చేసిన పూలే దంపతుల నుండీ..అంబేద్కర్ వరకూ ..

పోరాటం జరుగుతూనే వుంది. జరుగుతూనే వుంటుంది.

పోరాటం ఆగిపోవడం అనేది అన్యాయం ఆగిపోవడంతోనే సాధ్యం. ఒకరు చెబితేనో, ప్రోత్సహిస్తేనో జరిగే పోరాటం గుప్పున మండి ఆరిపోవచ్చేమో గానీ శతాబ్దాల తరబడి జరగదు. శతాబ్దాల తరబడీ పోరాటం జరుగుతోందంటే పోరాటం విఫలమయినట్లూ కాదు, అన్యాయం జరగనట్లూ కాదు.

పోరాటం జరుగుతుండటమే ఒక విజయం.

కోమటోళ్ళు

తేది:September 13, 2017 వర్గం:వర్తమానం రచన:చరసాల 1,858 views

మా వూరి విషయమే తీసుకుంటే .. బ్యాంకుల జాతీయకరణ జరిగేవరకు కోమటోళ్ళు రైతులను పీల్చి పిప్పి చేశారు.

ఎంత పేద కోమటి అయినా కోడిగుడ్డంత బంగారం వుంటుందట అనుకునేవారు మావూర్లో. మా వూరికి రెండు కిలోమీటర్ల దూరంలోని పెద్ద వూరు, నీలకంఠరావుపేట కోమట్ల స్థావరం. ఆ వూరి చుట్టు పక్కల పల్లెలన్నింటికీ అదే పెట్టుబడులు సమకూర్చేది. ఆ వూరి ప్రధాన వీధికి అటూ ఇటూ కోమటోళ్ళ ఇళ్ళే వుండేవి. ప్రతి యింటి ముందటి నడువాలో కిరాణా అంగడి వుండేది. ప్రతి రైతుకూ ఇంటి మాదిగ వున్నట్టే, ప్రతి రైతుకూ ఓ షావుకారి (కోమటి) వుండేవాడు. రైతుకు ఏమి అవసరం వచ్చినా ఆ సదరు కోమటి దగ్గరకే వెళ్ళేవాడు. ఈ రైతూ-కోమటి బాందవ్యం తరాలుగా సాగేది.

రైతుకు కావల్సిన ఉప్పూ, పప్పూ, చింతపండూ అన్నీ ఆ ఆస్తాన కోమటి అంగడిలోనే రైతు తెచ్చుకొనేవాడు. ప్రతి రైతుకూ కోమటి పద్దు రాసుకుంటాడు. ఇచ్చిన ప్రతిదీ రాసి పెట్టుకుంటాడు. చదువురాని రైతు నోటిలెక్కలు వేసుకుంటాడు.
వరి నాటాలన్నా, వేరుశనగ విత్తాలన్నా విత్తనం దగ్గరనుండి, ఎరువుల వరకూ సమస్తమూ రైతు కోమటి దగ్గర అప్పుచేసి తెచ్చుకోవలిసిందే! వర్షాలు కరుణించి పంటలు బాగా పండనూ వచ్చు, లేదా మొత్తం ఎండిపోనూ వచ్చు. ఎటుపోయినా నష్టపోయేది రైతే! పంట చేతికొచ్చిన రోజే కోమటి ఎద్దుల బండ్లతో, బండ్లనిండా గోతాములతో ప్రత్యక్షమయ్యేవాడు. ఆ కోమటి దగ్గర అప్పు తెచ్చుకున్నాడు గనుక, ఆ కోమటికీ-తనకూ తరాల స్వామిభక్తి గనుక తనను కాదని తన పంటను అమ్ముకోవడం రైతుకు కలలో కూడా తట్టని విషయం. పైగా అది అధర్మమని మనసారా నమ్ముతాడు కూడాను.

ధాన్యాన్ని కొలవటంలో కూడా కోమటే ముందుంటాడు. తనిస్తున్నా, తను తీసుకుంటున్నా కొలిచేది మాత్రం అతనే. అందులో కూడా “ఓం లాభం” అంటూ మొదటి శేరును లెక్కించడనుకుంటా!(సరిగ్గా గుర్తు లేదు). తూనికలూ, కొలతలూ, కాటాలూ తనవే. ధాన్యానికి ధర నిర్ణయించేదీ తనే! తీసుకున్న అప్పులెన్నో, వడ్డీ శాతమెంతో, అసలూ-వడ్డీ ఎంతయిందో లెక్కలు కట్టి తేల్చేది తనే! తనమాటే చివరి మాట. తప్పుచేసిన పిల్లాడు టీచర్ ముందు చేతులు కట్టుకు నిలుచున్నట్టు కోమటి ముందు నిలబడి, ఎంత అప్పు తేలుస్తాడొ..ఈసారైనా తనకేమైనా మిగిలిందంటాడో లేదో..ఈ పండుగకైనా అప్పు చేయకుండా తన పిల్లలకు బట్టలు కుట్టించగలనో లేదో అనే బెంగలో రైతుంటాడు.
వచ్చిన పంటను మొత్తం బళ్ళపై వేసుకొని అప్పులు వడ్డీతో సహా పోగా ఇంకా రైతు అప్పు ఎంతో, లేకుంటే రైతుకు రావల్సింది ఎంతో లెక్కలు గట్టి వెళతాడు కోమటి. అప్పు తీరినా, తీరకున్నా.. తన రోజువారీ ఉప్పుకూ, పప్పుకూ మరుసటిరోజు నుండీ మళ్ళీ కోమటి గుమ్మం ముందు వాలక తప్పదు రైతుకు.
ఈ చక్రం అలా అంతులేకుండా సాగుతూ వుంటుంది. ఆ అప్పులు పెరిగి పెరిగి రైతు చివరికి తన పొలాలనే ఆ కోమటికి తాకట్టు పెట్టి చివరికి రాసిచ్చేస్తాడు. అలా కోమట్లు కాజేసిన రైతు పొలాలు ఇప్పటికీ కొన్ని వాళ్ళ పేర్లమీదే వున్నాయి మా వూర్లో.

ఈ దరిద్రానికి ముగింపు నీలకంఠరావుపేటలో “రాయలసీమ గ్రామీణ బ్యాంకు” మొదలవటంతో ప్రారంభమయ్యింది. రైతులకు మొదటిసారిగా బ్యాంకు అన్నది పరిచయమయింది. విపి సింగ్ ప్రభుత్వ రైతుల ఋణమాఫీ వల్ల బ్యాంకుల్లో ఋణాలు తీసుకుంటే మాఫీ అయ్యే అవకాశమూ వుందనే ఆశ పుట్టింది. ఫలితంగా రైతులు ఋణాల కోసం బ్యాంకుల దగ్గరకు పోవడం మొదలు పెట్టారు.
ఈ మార్పులకు తోడు ఎప్పుడోగానీ వచ్చే వర్షాలను నమ్మలేక రైతులు పంటలు వేయడం మాని గల్ఫ్ చేరడం మొదలు పెట్టారు. ఈ రెండు మార్పులూ కోమట్ల ఏకచ్చత్రాధిపత్యానికి గండి కొట్టాయి. ఒకరి తర్వాత ఒకరు తమ కార్య క్షేత్రాలను పట్టణాలకూ, నగరాలకూ మార్చేశారు. ఒకప్పుడు నల్లటి బొజ్జలపై, తెల్లటి జంధ్యాలను నిమురుకుంటూ కూర్చున్న అంగళ్ళు వెలవెల పోయి..యిళ్ళు ఖాళీ అవుతుంటే.. వాటిని గల్ఫ్ డబ్బులతో కళకళలాడుతున్న ముస్లిములూ, యితర మధ్యతరగతి వారూ కొనుక్కుంటూ వచ్చారు.
అలా గత యిరవై ఏళ్ళలో నీలకంఠరావుపేట స్వరూపమే మారిపోయింది. వాళ్ళ దోపిడీ ఆగిపోయింది.

అమెరికాలో విగ్రహల తొలగింపు ఎందుకు?

తేది:August 18, 2017 వర్గం:వర్తమానం రచన:చరసాల 1,814 views

అమెరికాలో విగ్రహాల తొలగింపు మీద ఎటువంటి అవగహానా లేకుండా వార్తలు రాస్తున్న తెలుగు పత్రికల మీద జాలితో నాకు తెలిసింది రాద్దామని ఈ ప్రయత్నం.
________________________________________________

అమెరికాలో 1861లో మొదలయి 1865 వరకూ అంతర్యుద్దం నడిచింది. బానిసత్వం, రాష్ట్రాల హక్కులు, కేంద్ర ప్రభుత్వ హక్కులు మొదలైన వాటి మీద ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షణాది రాష్ట్రాలకు మధ్య అప్పటికే చాలా విభేదాలు వున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ది చెందగా, వాణిజ్య పంటలకు అనుకూలమైన వాతావరణంతో దక్షణాది రాష్ట్రాలు వ్యవసాయంపై ఆధారపడినాయి. కానీ వ్యవసాయానికి కావల్సిన శ్రామికులు చౌకగా లబించడానికి దక్షణాది రాష్ట్రాలకు బానిసలు కావాల్సి వచ్చింది. బానిసత్వమే తమ అర్థికపటిష్టతకు మూలమని ఎరిగిన దక్షణాదివారు బానిసత్వపు రద్దుకు ఒప్పుకోలేదు.

“బానిసత్వ రద్దు” నినాదం మీద లింకన్ అధ్యక్ష్యడుగా గెలవడంతో దక్షణాది రాష్ట్రాల వారు సంయుక్త రాష్ట్రాల నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా “Confederate States of America”గా ప్రకటించుకోవడంతో యుద్దం మొదలయింది. జెఫర్సన్ డేవిస్ Confederates అధ్యక్ష్యడుగా వ్యవహరించాడు. అలా యించుమించు అయిదేళ్ళు జరిగిన యుద్దంలో 6 లక్షల నుండి 7 లక్షల మంది మరణించారు. చివరికి యూనియన్ సైన్యాలే గెలుపొందడమూ, లింకన్ రెండోసారి అధ్యక్ష్యడుగా గెలవడమూ కూడా జరిగింది. తర్వాత దక్షణ రాష్ట్రాల సానుభుతిపరుడు జరిపిన కాల్పుల్లోనే లింకన్ మరణించాడు.

అంతర్యుద్దం ద్వారా బానిసత్వం రద్దు అయినా నల్లవారికీ, తెల్లవారికి మధ్య సమానత్వ హక్కులు రాలేదు. వివక్ష కొనసాగుతూనే వుండేది. ఇప్పటికీ కొనసాగుతూనే వుంది కూడా, స్థాయిలో తేడాలున్నా. అంతర్యుద్దం ముగిసాక ఆ యుద్దంలో పాల్గొన్న సైనికులకు, నాయకులకూ స్మారక చిహ్నాలు నిర్మించడం మొదలయ్యింది. అలా దక్షణ రాష్ట్రాల యూనియన్‌కు అధ్యక్ష్యడుగా వున్న జెఫర్సన్ డేవిస్, సైనిక నాయకత్వం వహించిన డేవిడ్ లీ మొదలగు వారి పేర్లతో వీధుల పేర్లు, పార్కుల పేర్లు, వారి విగ్రహాలు వెలిశాయి. దీనిమీద నిరసన వున్నా చాలా మంది వాటిని చరిత్రలో భాగంగా చూస్తూ అంతగా పట్టించుకోలేదు. కానీ రానూ రానూ confedearate చిహ్నాలు, విగ్రహాలూ, జెండా శ్వేతజాత్యహంకారులకు తమ ఔన్నత్యానికి చిహ్నాలుగా భావించడం మొదలయింది.

జూన్ 17, 2015న డిలాన్ రూఫ్ అనే జాత్యహంకారి నల్లవాళ్ళు వెళ్ళే చర్చిలోకి ప్రవేశించి ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపి తొమ్మిదిమందిని చంపడంతో దేశం వులిక్కిపడింది. ఆ తర్వాత చాలాచోట్ల పోలీసులు నిరయుధులుగా వున్న నల్లవాళ్ళని అనుమానించి కాల్చి చంపడం చాలా నగరాల్లో ఆందోళనలకు దారి తీసింది. పౌరహక్కుల మీద, జాతివివక్ష మీద ఎక్కువగా చర్చ మొదలయింది. జాత్యహంకార వాఖ్యలతో అమెరికా ప్రెసిడెంటుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడం పౌర హక్కులను ప్రేమించేవారిని, వివక్ష వ్యతిరేకులను ఒక షాక్‌కు గురిచెయ్యగా, అంతవరకు చాటుమాటుగా వ్యవహారాలు నడిపే తెల్లజాత్యహంకారులకు కొత్త శక్తిని, ప్రోద్భలాన్ని యిచ్చింది.

చర్చిలో షూటింగ్ జరిగిన తర్వాత confederate చిహ్నాలనీ, విగ్రహాలని, జెండాని తొలగించాలనే డిమాండ్ వూపందుకొనింది. అప్పట్నుండీ చాలా చోట్ల వాటిని తొలగించడం మొదలయింది. అలాగే వర్జీనియా రాష్ట్రంలో, చార్లస్‌టన్ అనే వూరులో కూడా లీ విగ్రహాన్ని తొలగించడానికి అక్కడి మేయర్, నగర కౌన్సిల్ తీర్మానించింది. అయితే దీన్ని వ్యతిరేకించడానికి దేశం నలుమూలల నుండి జాత్యహంకారులు వచ్చి కాగడాలతో, కొందరు సైనికుల్లా వెంట తుపాకులు తెచ్చుకొని మరీ ర్యాలీ జరపడంతో దాన్ని అడ్డుకొనెందుకు పౌరహక్కుల మద్దతుదారులు, వివక్షను నిరసించేవారు కూడా గుమిగూడారు. రెండు వర్గాల మధ్య తిట్టుకోవడం, తోపులాట జరిగి ఒకరిమీద మరొకరు పెప్పర్ స్ప్రే లాంటివి వుపయోగించడం జరిగింది.

పోలీసులు యిరువర్గాలను వేరు చేసి చెల్లాచెదురు చేశాక వెళ్ళిపోతున్న నిరసనకారుల గుంపులోకి ఒక తెల్లజాత్యహంకారి కారును నడపడంతో ఓ మహిళ చనిపోయింది, చాలా మంది గాయపడ్డారు.

ఈ దెబ్బతో confederate విగ్రహలను తొలగించడం ఇంకా వూపందుకుంది. బాల్టిమోర్‌లో వున్న విగ్రహాలను ఆగష్టు 16 అర్దరాత్రి తొలగించారు. ఇంకా చాలాచోట్ల తొలగించినట్లు వర్తలు వస్తూనే వున్నాయి.


ఆ రెండ్రోజుల్లో చార్లెస్‌టన్‌లో ఏమి జరిగిందో చెప్పే కథనం.

వలసపోయిన కులాలు

తేది:July 6, 2017 వర్గం:వర్గీకరింపబడనివి రచన:చరసాల 3,111 views

భూములున్న కులాలు కాక మరో నాలుగు కులాలుండేవి మావూర్లో. కంసలి, యానాది, చాకలి మరియు బ్రాహ్మణ.
జూన్ నెలలో తొలకరి వర్షాలు పడేలోపు రైతులు తమ నాగళ్ళను సరిచేసుకోడానికి, కొడవళ్ళనూ, తొవికలనూ, పారలనూ బాగు చేసుకోవడానికి, బళ్ళ చక్రాల కమ్మీలను బింగిచుకోవడానికీ వచ్చి వూర్లో వున్న కంసాలి వూపిరిని ఆడనిచ్చేవాళ్ళు కాదు. వూరికి కొద్ది దూరంలో చింతచెట్టుకింద రోజంతా మండే కొలిమీ, ఆడుతూ వుండే కొలిమి తిత్తులూ, అదో లయబద్దంగా పడే సమ్మెట దెబ్బలూ… అదో జాతరలా అనిపించేది. తమ తమ పనులు చేయించుకోవడానికి అక్కడకు వచ్చే వూరి పెద్దలు రాబోయే వర్షం దగ్గర నుండీ, కాబోయే ముఖ్యమంత్రి వరకూ రరకాల చర్చల్లో పాల్గొనేవారు. ఉదయాన్నే లేచింది మొదలు, రాత్రెప్పుడో చీకటి పడే వరకూ ఆ పని అలా నడుస్తూనే వుండేది. కంసాలి మల్లయ్య ఎర్రగా కాలిన యినుమును కుడి చెతిలోని పటకారుతో పొయ్యిలోంచి బయటకి లాగి, యినప మొద్దుపై పెట్టి, ఎడమ చేత్తో చిన్నటి సుత్తితో కొడితే…ఒకరూ, యిద్దరూ ఒక్కోసారి ముగ్గురూ తమ తమ పెద్ద సమ్మెటలతో క్రమబద్దంగా ఆ కాలిన యినుముపై పోట్లు వేసేవారు. ఏవరు తప్పుచేసినా, లయ తప్పినా ఎర్రటి యినుప బద్ద ఎంతటి ప్రమాదం చేయగలదో తలచుకుంటే భయమేస్తుంది. ఆయన భార్యో, పిల్లలో గాలి తిత్తులను ఆడించేవారు.

వూరికి వుత్తరంగా చివరి యింట్లో యానాది కుటుంబం కాపురం వుండేది. వూర్లో ప్రతి కుటుంభానికీ ఒకట్నుండీ, పదీ పదిహేను వరకూ ఆవులుండేవి. యానాది పని వుదయం పదింటిలోపు వూరందరి ఆవులనూ మేపుకురావడానికి అడవికి తోలుకెళ్ళడం మళ్ళి సాయంత్రం చిరు సంధ్యలు అలుముకునేవేళకు వూరికి తోలుకొనిరావడం. ఆ పనికి తోడు తను కొన్ని పందులనూ పెంచేవాడు. యింట్లో పిల్లలు కూలీ పనులతో పాటు, ఈ పందులను చూసుకునేవారు.

బ్రాహ్మణ కుటుంబం వూరి మధ్య రామాలయం పక్కనే వుండేది. నాకు వూహ తెలిసేటప్పటికే అమ్మయ్య ఒక్కతే వుండేది ఆ యింట్లో. పెద్ద కొడుకు కాపురం పొరుగూరిలో అయినా మావూరి పోస్టుమాస్టర్ ఆయనే కావడంతో ప్రతిరోజూ మా వూరికి వచ్చి పోస్టుతో పాటు వూరి వాళ్ళతో వూరి విషయాలు తెలుసుకొనేవాడు. పేర్లు పెట్టడాలు, వాస్తు చూడటాలు, ముహూర్తాలు నిర్ణయించడం, పెళ్ళిళ్ళు తదితరాలు చేయడం చేస్తుండేవాడు. అమ్మయ్య పోయాక, పెద్ద కొడుకు రామయ్య స్వామీ పోయాక ఇక వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. పొలాలు అమ్మేసి, వూర్లో యిల్లు కూడా ఎవరికో అమ్మేయడంతో ఇక మావూర్లో బ్రాహ్మణ కులం మాయం అయింది. యిప్పుడు పూజా క్రతువులకు పొరుగూరి స్వామిని పిలిపించుకుంటున్నారు.

ఇక చాకలి కుటుంబం. నాకు వూహ తెలిసినప్పటి నుండీ ఆమె చాకలమ్మగానే తెలుసు. ఆమె భర్త అప్పటికే చనిపోయాడు. తన ఒకే కొడుకు తోడుగా వూరంతటి బట్టలూ ఆమె ఒక్కతే వుతికేది. వూరును భాగాలుగా చేసి ఒక్కోరోజు ఒక్కో భాగంవారి బట్టలు వుతికేది. ఆమె వస్తున్నదన్న రోజు యింట్లో మాసిన, మైలపడిన బట్టలన్నీ యింటి ముందు వేసేవారు. ఆమె అన్నింటినీ మూటగట్టుకొని చెరువులోనో, ఏ బావిలోనో వాటిని నాన బెట్టి, పెద్ద కాగులో వాటిని వుడకబెట్టి, రాతి బండకేసి కొట్టీ తెల్లగా చేసి మళ్ళీ అందులో తెల్లటి వాటికి నీలం కలిపి..ఆరబెట్టి, మళ్ళీ ముటలుగా కట్టుకొని వచ్చి సాయంత్రం అందరూ యిళ్ళు చేరేసమయానికి ఎవరి బట్టలు వాళ్ళింటికి చేర్చేది. మాది యిది కాదు అనో, మా పంచె ఒకటి తక్కువైందనో, ఓ చీర చిరిగిందనో లేక మైల పోలేదనో ఎదో ఒకటి అంటూ వుండేవాళ్ళు. కొడుకు పెద్దవాడయి, ఓ యింటి వాడయి తను అత్తగారింటికో, వుద్యోగం కోసం గల్ఫ్ దేశాలకో వెళ్ళినా, ఈ చాకలమ్మ ఎంత ముసలి అయినా తన ధర్మాన్ని వీడేది కాదు. ఈమె ముసలిది అయిపోయింది, ఇక బట్టలు వుతకలేదు అని వూర్లోవాళ్ళు మరో చాకలి కుటుంబాన్ని వూరికి తెస్తే వాళ్ళను, తిట్టీ, తిట్టీ వూర్లో వుండనీయలేదట!

ఈ కులాలేవీ యిప్పుడు వూర్లో లేవు. భుక్తి వెతుక్కుంటూ వూరొదిలి వెళ్ళిపోయారు. వర్షాలు తగ్గాయి, పంటలు వేయడం తగ్గింది. చదువుకున్న వారు ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతే, కొందరు గల్ఫ్ దేశాల్లో పనివారుగా వెళ్ళి పోయారు. పొలాలూ, పొలాల్లో పనీ లేకపోతే యిక కంసలి దేనిమీద ఆధారపడి వూర్లో బతగ్గలడు? వూర్లో ఎవరింట్లోనూ ఆవులే లేకుంటే యానాది దేన్ని మేపి తన పొట్ట పోషించుకుంటాడు? ఆ చాకలి కుటుంబమూ ఆ చాకలమ్మతోనే సరి అనుకుంటా.

యిదంతా ఎందుకు చెబుతున్నానంటే… ఏ కులమైతే భూమి మీద పరోక్షంగా ఆధారపడిందో అది మారిన పరిస్థితుల్లో జీవనోపాధి లేక వలసపోయింది. ఏ కులమైతే భూమిమీద ప్రత్యక్షంగా ఆధారపడిందో అది నిలదొక్కుకుంది. ఇందులో ఒక కులానిది ప్రతిభ, మరో కులానిది కాదు అని ఎలా అనగలరు? వూరందరికీ రకరకాల పనిముట్లని చేసిన కంసాలిదీ, ఏడాది పొడుగునా బట్టలుతికిన చాకలిదీ, ఆవులు కాచిన యానాదిదిదీ కష్టం కాకుండా ఎట్లా అవుతుంది? కానీ భూమిమీద ప్రత్యక్ష హక్కులేని వాళ్ళు వెనుకబడ్డ కులాలు అయ్యారు. భూమి మీద ప్రత్యక్ష హక్కు వుండిన కులాలు అభివృద్ది చెందిన కులాలు అయ్యారు. ఈ అసమానతల సృష్టి వాళ్ళు తెలిసీ కోరుకున్నది కాదు కదా? వాళ్ళను తమ కాళ్ళ మీద నిలబెట్టడానికి “రిజర్వేషన్” పేరుతో కాసింత సహాయం అందిస్తే అది ప్రతిభకెట్లా అన్యాయం చేసినట్లు?